శాపం
వంటరిగా లాన్ లో కూర్చుని ఉన్నాను.
ఆవాళ పోస్టులో వచ్చిన ఉత్తరాలన్నీ టీపాయి మీద ఉన్నాయి. నా చూపు ఫ్రమ్ ఎడ్రసు లేని ఓ కవరుమీద పడింది. కవరు చించి చదవటం మొదలుపెట్టాను.
"రచయిత గార్కి, అనేక నమస్కారములు.
జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి జవాబు నాకైతే శూన్యమే ననిపించింది. అసలు ఎందుకు బ్రతకాలి? ఏది సాధించాలని? నాది అనేది ఏదీ మిగలదు. గుర్తు తెచ్చుకుని ఆనందించే మధుర క్షణాలు ఉండనే ఉండవు. మరెందుకు జీవితం?
ఏమిటీ పిచ్చి రాతలనుకునేరు. అంతా తికమకగా ఉంది కదూ! ఏదోరాయాలని కాగితం తీసుకుంటే ఇలా వెళుతున్నాయి నా భావాలు. ఎంతయినా నేను మీలా రచయితను కాదుగా! ఎలా అయినా మీరు నాభావాల్ని అర్ధం చేసుకోగలరు రచయిత గనుక.
ఆస్తీ అంతస్తు లున్నాయి. తల్లి తండ్రి ఉన్నారు. చిన్నతనం నుంచి నాకు ఈ జీవితం మీద విరక్తి. నాకు అన్నీ ఉన్నా ఏదీ లేదనే నిరాశావాదిని నేను. అందరిలా నేనూ చదువుకున్నాను. ఎందుకీ చదువు అనిపించింది.
పెద్దలు పెళ్ళి చేసుకోమన్నారు. జీవితానికి పెళ్ళి తప్పనిసరా అన్పించింది. ఈ ఆలోచనలతో పిచ్చివాడ్ని అవుతానేమోనని భయపడేవాడిని.
ఓనాడు ఆమెను చూశాను. తొలిసారిగా జీవితం గురించి ఆశలు రేకెత్తించిందామె. ఇన్నాళ్ళ నావైరాగ్యానికి కారణం తెలుసుకో గలిగాను. నాలో ప్రశ్నలకి జవాబుగా నవ్వుకున్నాను.
ఈ జీవితం విచిత్రమైన దనిపించింది. ఆలోచనల తుఫానులో కొట్టుమిట్టాడుతున్న నా జీవితనౌకను ఒడ్డుకు చేర్చే నావికురాలు లభించింది. ఒడ్డుకు చేరటానికి నావకి చుక్కాని ఎంత అవసరమో జీవించటానికి ఆశ కూడా అంతే అవసరమనిపించింది. ఆశ ఆశగానే మిగల కూడదనుకున్నాను. నా ఆశ ఆ రూపం దాల్చింది. ప్రతి రోజు నా కళ్ళు ఆమె రాకకోసం ఎదురుచూసేవి.
ప్రేమకి భాష అవసరం లేదేమో! మా కళ్ళు మాట లాడుకునేవి, ఆమెను చూడందే నా మనసుకి శాంతి ఉండేది కాదు. గుండె బరువు తగ్గేదికాదు. నా దిన చర్యలో భాగమయ్యింది ఆమెని చూడటం.
ఇదంతా నా పిచ్చ భ్రమేనేమో! నిజంగా ఆమె నన్ను ప్రేమిస్తోందా? ఆమె లేనిదే నేను లేను. అయితే ఆమె నా ప్రేమ కాదన్ననాడు జీవించగలనా?
నా మనసు నన్ను మోసగించదు. నా దేవి నా ప్రేమ కాదనదని తెలుసు.
ఆరోజు నేనింకా మర్చిపోలేదు. నా దేవి నన్ను వోరకంట చూసి నవ్విన రోజు అది. ప్రపంచం జయించినంత ఆనందించాను. గాలిలో తేలిపోయాను.
మా ప్రేమ సామ్రాజ్యానికి మేమిద్దరం రాజు, రాణి అనుకున్నాను. ఆమె పరిచయంతో నా హృదయం పులకరించింది. మనసులు కలిశాక మేమిద్దరం చేరువయ్యాం. భావిజీవితం గురించి ఎన్నెన్నో కలలుకన్నాం. ఉరకలు వేసే యవ్వనానికి ఆనకట్ట ఇంకెంతకాలమని. ఆవిషయం ఆమెకు చెబుదామని ఎంతో ఆత్రంతో ఆమెకోసం ఎదురు చూశాను.
ఆరోజుని మర్చిపోదామన్నా గుర్తు వస్తూనే ఉంది. ఆ రోజు భూకంపం వచ్చి అందులో నేను సమాధై పోయివుంటే బాగుండేది. నా నవనాడులూ చిట్లిపోయి నాగుండె స్తంభించిపోయివుంటే బావుండేది.
కాని అవేమీ జరగలేదు. ఆరోజునే ఆమె రాలేదు. ఆమెకు బదులు ఆమె స్నేహితురాలు వచ్చింది. నేను పలకరించే లోగా ఆమె నన్ను పలకరించింది.
ఇక నుంచి "నా దేవతని" మర్చి పొమ్మని చెప్పిందామె. నాకు కుల మతాల పట్టింపు లేక పోయినా నా దేవికి ఉందట, తరతరాలుగా వస్తున్న వాటిని తను కాదనలేదట. అందుకే తనని మర్చిపోవటం మంచిదని తను చెప్పలేక ఆమెచేత చెప్పించింది. నా దేవత అలా అందంటే నేను నమ్మలేక పోయాను. కాని నమ్మక తప్పలేదు.
ఒక్కసారి నా దేవితో మాట్లాడే అవకాశం కలిగించమని ఆమెను ప్రాధేయపడ్డాను. అదే జరిగితే తన శవం మిగులుతుందని నాదేవి చెప్పమన్నట్టు, ఆమె చెప్పింది. నా గొంతు నొక్కుకుపోయింది. చివరికి నాదేవితో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. ఆమె వెళ్ళిపోయింది.
తుఫాను సంభవించే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, కాని నా అంతరంగంలో చెలరేగిన తుఫానుకి ముందు వెనుకలు లేవు. నా మనసంతా కల్లకల్లోలం అయింది.
సార్.....జీవితాలన్నీ కథలు కాకపోవచ్చు. కథలన్నీ దుఃఖాంతం మాత్రం కాదు.
ఆత్మహత్య మహాపాతకమని తెలుసు. కాని ఈ మానసిక అశాంతికన్నా మరణమే సుఖమనిపిస్తుంది. పుట్టిన వాడు గిట్టక మానడు. కాకపోతే కొన్నేళ్ళ ముందూ వెనుక పోతుంటారు.