సత్యమూర్తి సంకటంలో పడినట్లయింది. ఒకక్షణం ఏమిచెయ్యాలో, ఎట్లా మాట్లాడాలో పాలుపోలేదు. ఎలాగో తేరుకుని "లోపలకురండి" అన్నాడు మర్యాదగా.
"ఎందుకు లేండి? యిక్కడే నిలబడతాను" అన్నది సుధ పూడిపోతున్న కంఠంతో, సంకోచం ముప్పిరి కొనగా.
అతను చిన్నగా నవ్వుతూ "ఎంతసేపని బయట నిలబడి వుంటారు? మీ గదులంత బాగుండకపోయినా మాది కూడా ఏదో భరించవచ్చుననుకుంటాను" అన్నాడు.
ఆమె ముఖంమీద ఓ ఎరుపు జీర కదిలిపోగా "అబ్బే. అదేంకాదు...పదండి" అంటూ అతని వెనకగా నడిచి గదిలోకి వచ్చింది.
"కూర్చోండి"
ఆమె కూర్చుని నాలుగువైపులా పరిశీలిస్తాంది.
అతనికి ఆమె తమయింటికి రావటం చిత్రంగా తోచింది. సత్యానందం గారు భారీ ఎత్తున వ్యాపారం సాగించే వ్యవహారజ్ఞాని. ఆయనకూ తన తండ్రికీ మంచి స్నేహం వుంది. ఆయన తమ యింటికి రావటం తన తండ్రి వాళ్ళ యింటికి పోవటం పరిపాటి. తండ్రితో పాటు అనేక సందర్భాలలో వాళ్ళ యింటికి వెళ్ళాడు. అప్పుడు సుధని చూశాడు. కాని అతనికి తెలిసినంతవరకూ ఆమె తమ యింటికి రావటం యిదే మొదటి పర్యాయం. ప్రధమ పరిచయం కూడా యిదే.
"నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి" ఆలోచనలతో వున్న అతనికి సుధ కంఠం, యీ అభ్యర్ధన వినబడి ఉలికిపడి చూశాడు.
ఆమె ముఖం అతి దీనంగా వున్నది. పశ్చాత్తాప భావము గోచరిస్తోంది నేత్రాలలో. అది: జబ్బుతోవున్న మనుషుల్ని పలకరించటము, పరామర్స నేను చాలా డెలికేట్ గా ఫీలవుతానండీ. అలాంటి వాటికి నేను పనికిరాను. వొట్టి అసమర్ధురాలిని అన్యధా ఎంచారు కదూ?"
ఆమె భయం, అమాయకత్వం చూసి అతను విభ్రాంతుడయ్యాడు, చలించాడు ఆమెను ఓదార్చాలన్న కాంక్ష అతనిలో బలంగా కలిగింది. "బలేవారే. ఏమీ జరక్కుండానే ఎందుకంత బాధపడిపోతారు? ఆమాటకొస్తే ఇలాంటి సంఘటనలు నేనూ తట్టుకోలేను. టెలిగ్రాం చూసి పరిగెత్తుకయితే వచ్చాను గాని నేనూ ఆయన శరీర స్థితిని గురించి ఏమీ మాట్లాడలేకపోయాను" అంటూంటే అతనికి తన చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకువచ్చి ఎంత అణచుకుందామన్నా వీలుగాక ఓ చిరునవ్వు అతని పెదాల మధ్య లాస్యం చేసింది.
"ఎందుకు నవ్వుతున్నా?" అనడిగింది సుధ.
"పరామర్శ గురించి బాల్యస్మృతి ఒకటి మెదిలింది."
"ఏమిటి?" అనడిగిందామె కుతూహలంగా.
అతను పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయస్సులో వుండగా-అంటే అతను స్కూల్ ఫైనల్ చదువుతూన్న రోజుల్లో బలరామయ్యగారి ఆప్తులలో ఒకాయనకు జబ్బుచేసి మృత్యువు ఆసన్నమయిన స్థితిలో వున్నాడు. బాలరామయ్యగారు చూడటానికి వెళ్ళటానికి బయల్దేరి కూడా-అంతలో అనుకోకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి రావటంతో, సత్యమూర్తిని కేకేసి "ఒకసారి వెళ్ళి చూసిరా బాగుండదు" అని బయటకు వెళ్ళిపోయాడు సత్యమూర్తి అనుకోకుండా మీదపడిన యీ బాధ్యతకు కంగారుపడి, ఎలాగైతేనేం తేరుకుని బయల్దేరాడు. అతను వెళ్ళేసరికి రోగి చుట్టూ అయినవాళ్ళంతా గుమిగూడి వున్నారు. సత్యమూర్తి వెంటనే కర్తవ్యం ఏమిటో బోధపడక, కాస్త ఆలోచించి కృత నిశ్చయుడై గబగబ వాళ్ళందరినీ తోసుకుని మంచందగ్గరకు వెళ్ళి రోగి ముఖంలో ముఖంపెట్టి చూస్తున్నాడు. ప్రక్కనున్న ఓ వృద్దు "ఏమిటి నాయనా చూస్తున్నావు?" అని అడిగాడు పరిస్థితి గమనించి, "సీరియస్ గా. మా నాన్నగారు చూసి రమ్మన్నారు" అని చెప్పాడు. "ఓహో! అదా! అయితే ఇలారా చెబుతాను" అని ఆ వృద్దుడు అతన్ని చెయ్యి పుచ్చుకుని మృదువుగా అవతలకు తీసుకుపోయి "దాని కలా కాదు నాయనా యిదుగో ఇదీ పద్దతి" అని ఏమేమి అడగాలో, ఎట్లా పరామర్శించాలా బోధించాడట.
ఈ అనుభవాన్ని సత్యమూర్తి చెబుతుండగా విని సుధ నవ్వు ఆపుకోలేకపోయింది. చేతి రుమాలు నోటికద్దు పెట్టుకుని అవస్థ పడసాగింది.
అనుకొని పద్దతిని, యీ విధంగా చనువు ఏర్పడ్డాక అతను ఆమె చదువు వివరాలు-ఏ గ్రూపో అవన్నీ అడిగి తెలుసుకున్నాడు.
"ఇది అయినాక ఏం చదువుతారు?"
"ముందు యిది అవనీండి. తర్వాత సంగతి చూద్దాం"
"అవకేం చేస్తుంది? మహారాజులా అవుతుంది..."
"మీరేం చేస్తారు? ఫారిన్ వెడతారా?"
"ఫారినే" అని సత్యమూర్తి ఆశ్చర్యము ప్రదర్శించాడు. మానాన్న గారి గురించి వినే వుంటారు. అలాంటిది పూర్తిగా అసంభవము. మెరిట్ చూద్దామన్న అలాంటిది అసలే..."