"వూ అయితే ఈ గురువుకి కావల్సింది హోంవర్కు యెగ్గొట్టి నమస్కారాలు కాదు చెయ్యవలసింది. ఇదిగో మాలా. ఈ రోజునించీ గట్టిగా చెప్తున్నాను. గుర్తు వుంచుకో. యే రోజు వర్కు ఆ రోజు చెయ్యకపోయవంటే గోడకుర్చీ తప్పదు. తెలిసిందా?" గాంభీర్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు.
మాల కళ్ళ చుట్టూ వెతికాయి. "గోడే లేదుగా ఇంక గోడకుర్చీ శిక్ష ఎలా వేస్తారూ" అన్నట్లు చూస్తుంది.
"సిమెంటు బెంచీ వున్నది గుర్తువుంచుకో" అన్నట్లు చూశాడు మాల ఆలోచన పసికట్టి.
"అబ్బ మహా కాఠిన్యం బాబూ "అనుకుంటూ విన్న తనుచేస్తూ సగంలో విడిచేసిన వర్కు చూపిస్తుంటే వీరభద్రం మళ్ళీ గుర్తు చేశాడు. "సార్" అంటూ.
"అరే నువ్వు వెళ్ళిపోలేదూ. నేను వస్తా నన్నా కదూ, ఈ రోజు ఇక్కడే చాలా టైము అయ్యేటట్లు వుంది. భద్రం యేం అనుకోకు మరో సారి తప్పకుండా వస్తానన్నానని అమ్మగార్కి చెప్పు. నా నమస్కారాలన్నానని కూడా చెప్పు. ఇంక వెళ్ళు" అంటూ తిరిగి మాల పుస్తకాలు చూడడంలో నిమగ్నమయినాడు.
వీరభద్రం వెళ్ళిపోయాడు. లోపల సంతోషంగా వున్నా పైకిమాత్రం మాష్టారు రానన్నం దుకు చాలా బాధపడుతున్నట్లు ముఖం పెట్టి.
"మాలా ఇలా సగంసగం వర్కుచేసి వదలటంలో నీ ఉద్దేశ్యం? నన్ను పూర్తి చెయ్యమనా! ఇలా చదివావంటే సెప్టెంబరుకి కాదు మార్చికి కూడా వెళ్ళలేవు." విసుక్కుంటూ నోట్సు దిద్దుతున్న వాసునే చూస్తూ వుండిపోయింది మాల.
"ఆ భద్రం చూడు. ఎంత సిన్సియర్ గా వర్కు చేస్తాడు. చదువుతాడు. నీకు చెప్పీ చెప్పీ విసుగెత్తుతోంది. ఈ హోం వర్కు అంతా నాచేత పూర్తి చేయిస్తున్న నీవు రేపు పరీక్షకూడా నా చేత రాయించేటట్లున్నావ్? 'కోపం తెచ్చుకుంటూ తలయెత్తి చూశాడు వాసు.
తలంటుకున్న జుత్తు గాలికి చెదిరి ముఖం మీద పడుతోంది. కుడిచేతి మీద జాకెట్టు చిరుగు పైకి కన్పిస్తూంటే పమిటని వెనక్కి తిప్పి కప్పుకుంది. సరీగ్గా మరో చిరుగు గుండె దగ్గరకి వస్తూంటే ఆ రెండూ కన్పించకుండా వుండాలని సతమత మవుతూ మధ్యమధ్య "హచ్చి" అంటూ ఒకటే తుమ్ములు తుమ్ముతోంది. ఏకాగ్రతగా దిద్దుతున్న వాసుకి ఇవన్నీ ఆటంకం కల్గిస్తూంటే తలయెత్త కుండానే "ఏం జలుబు చేసిందా" అంటూ నోట్సు పక్కనపెట్టి హిస్టరీ బుక్ తెరిచాడు.
మాల ఈ రోజు ప్రతిరోజులా లేదు. ఏదోలా వున్నది అన్నది. ఇప్పటికి గ్రహించి తెరచిన పుస్తకం మూసేస్తూ.
"ఈ రోజు ఎందుకు ఎలాగో వున్నావు?" అడిగాడు మాలని పరీక్షగా చూస్తూ.
"జవాబివ్వలేకపోయింది"
"నాన్న కెలా వుంది?"
"ఫర్వాలేదు"
"నువ్వు పని మానేశావా లేదా?"
"........."
"జవాబివ్వు మాలా .....ఏం జరిగింది... విషయం చెప్పకుండా నీలో నువ్వు బాధపడవద్దని చెప్పానుగా.....మరి..."
"ఏం లేదు వాసుబాబూ మీరింత శ్రద్దగా చెప్తున్నారు. నేనూ బాగా చదువుకుని పరీక్షరాయాలనే యెంతో ప్రయత్నిస్తున్నాను. భద్రంలా నేనూ ఎందుకు చదవలేకుండా వున్నానో నాకు ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. చదువుదామంటే యేకాగ్రత కుదరటమే లేదు. యేంచెయ్యను. మిమ్మల్ని వేధిస్తున్నాను కదూ!
మాల ఇలా మాట్లాడినప్పుడెల్లా వాసు మనసు ద్రవించిపోతుంది. తెచ్చిపెట్టుకున్న కాఠిన్యాన్ని గాలికి వదిలేసి మామూలుగా మాట్లాడుతూ.
"ఇంకా అదే అలోచిస్తున్నావా! పిచ్చిదానా నువ్వు ఎందుకు చదవలేక పోతున్నావో నాకు తెలుసు. ఒకవైపు ఆర్ధిక ఇబ్బందులు! మరో వైపు తండ్రి అనారోగ్యం . నౌకరీ చేసేచోట పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, ఇలాంటప్పుడు యే ఆడపిల్లా ఏకాగ్రతతో చదవలేదు కాని నీ భవష్యత్తు ఆలోచించి నేను మందలిస్తూ వుంటాను మరోలా అనుకోవు కదూ"
మాలవైపు వాత్సల్యంగా చూస్తూ అన్నాడు.
"మిమ్మల్ని......మిమ్మల్ని......అపార్ధం చేసుకోవటమా... వాసు బాబూ. అలాంటిది ఎప్పుడూ జరగదు. మా తండ్రి తర్వాత మీరే నా శ్రేయోభిలాషులూ గౌరవనీయులూ. ఇది నాకు బాగా తెలుసు.
"అబ్బ యెంత విశ్వాసం.....సంతృప్తిగా అన్పించింది మాల అలా అనడం. "ఈ రోజు ఓ ఫ్రెండ్ "బర్త్ డే" పార్టీకి పిలుపు వచ్చింది. అందుకని రాకూడదు అనుకున్నాను."
"అలాగా...... వెళ్ళి రావల్సింది."
"మరి నువ్వు ఎదురు చూడవూ!"
"దీనికేం! ప్రతి రోజూ వున్నదేగా. పుట్టిన రోజంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రోజు. పుట్టిన రోజంటే నాకు చాలా ఇష్టం జరిగి పోయినవి గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తు కొరకు యెన్నో కలలు కంటూ"
ఎటో చూస్తూ ఆవేశంగా మాట్లాడుతోంది మాల.
"అయితే నీ పుట్టిన రోజు యెప్పుడు! కాస్త ముందుగా చెప్పు. అసలే పేదవాడిని" నవ్వుతూ అన్నాడు వాసు.
క్షణం చలించింది మాల.
ఎందుకు ముందుగా చెప్పటం? కాన్కలు తేవటానికా? మీ పేదరికం అడ్డు రాకుంటే ఈ రోజే నా పుట్టిన దినం."
నిర్లిప్తంగా అన్నది మాల.
"అరే.... నిజంగానే....? మరి ఇందాకటి నించీ చెప్పనే లేదేం?" ఏం చేస్తే బాగుంటుందీ అని ఆలోచిస్తూ అన్నాడు.
"ఈ రోజు మిమ్మల్ని పిల్చి కాఫీ అయినా ఇవ్వాలనుకున్నాను.
ప్రతి సంవత్సరం యెంతో గొప్పగా చేసే నాన్నకి పరిస్థితులు మారటంతో ఈ రోజు విషయం ఆయనకి గుర్తేలేదు. నేను యెవరికి చెప్పుకోను వాసుబాబూ మీరైనా వున్నారు నా గోడు వినటానికి. ఎంతో తృప్తిగా వుంది. నాకీ అదృష్టం చాలు. ఇప్పటికి ఇరవై రెండు పుట్టిన దినాలు గడిచిపోయినాయి. ఇప్పటికి యేం సాధించాను! ఇకముందు యేం సాధిస్తాను? అసలు యేం సాధించాలి? ఏమిటో...."
వేదాంతిలా నవ్వింది మాల.
వాసు జేబు తడుముకున్నాడు.
చేతికి రెండురూపాయల నోటూ కాస్త చిల్లరా తగిలింది. ముందే తెలిసి వుంటే యెంత బాగుండేదీ!
"మాలా! పద "స్వీటు" తినిపిస్తాను"
"నాకా. వద్దు .. వద్దు" వారించింది మాల.
ఇక్కడే హోటల్ వుంది. పద ఇద్దరం వెడదాం. కాన్కలు యేవీ ఇవ్వలేకున్నా నా కష్టార్జితంతో నీకు స్వీటు ఇప్పిస్తాను. పదా"
తొందర పెట్టాడు వాసు.
"ఆవేశంలో అంతస్తులు మరుస్తున్నారు. నాతో మీరు హోటల్ కి వస్తారా వద్దు వాసుబాబూ మన పరిచయం అందరి దృష్టిని పడనీయటం యేమంత మంచిదికాదు మీకు. సమాజంలో మీ గౌరవానికి భంగం కల్గితే నేను భరించలేను.
చూడండి. నేను కోరేదీ.... మీరు ఇవ్వవలసిందీ ఇంతకుమించి మరోటి లేదు." అంటూ వంగి అతని పాదాలని కళ్ళకు అద్దుకుంది మాల.
చలించిపోయాడు. రెండు చేతులతోనూ లేవ నెత్తి "ఆశీస్సులు ఇవ్వగలిగిన శక్తి నాకే వుంటే? నేను మనస్ఫూర్తిగా యేం కోరుకుంటున్నానో అదే ఆ దేవదేవుడు తప్పక గ్రహిస్తాడమ్మా!
ప్రేమగా మాల తల నిమురుతుంటే ఆనందంతో మాల కళ్ళు తళతళా మెరిశాయి.
"ఇక్కడే వుండు మాలా! ఇప్పుడే వస్తాను....అయిదు నిముషాల్లో వచ్చేస్తాను"
అంటూ హోటల్లోకి వెళ్ళి స్వీట్లు కొనుక్కుని వచ్చి "మాలా" అంటూ పిల్చాడు. పార్కు అంతా గాలించాడు. మాల జాడలేదు.
"ఏం జరిగింది ఎందుకు వెళ్ళిపోయి వుంటుంది."
అయ్యో...కనీసం ఇదయినా ఇవ్వలేక పోయాను అనుకుని బాధపడుతూ.... పార్కు గేటుదాటి మరోసారి చుట్టూచూశాడు. తనకి కావలసి మాల ఎంత వెతికినా మరి కన్పించలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
"చదువు! చదువు అన్న గొడవలోపడి మాలకి బట్టలు చిరిగిపోయయన్న సంగతికూడా తను గ్రహించలేదు. ఎలాగైనాసరే రెండు చీరెలు కొని ఇవ్వాలి.....అవును ఇవ్వాలి"
నడుస్తున్న వాసుపక్కన చర్రున వచ్చి ఆగింది ఓ ఫియట్ కారు. "కళ్ళు మూసుకొని పోయి మనుషుల మీదకి కారుని యెక్కిస్తున్న దెవరు" అనే కోపంతో ముఖం చిట్లించిచూశాడు.
"సలాంసాబ్" వైదేహి కారుడ్రైవరు వినయంగా సలాం చేసి నిల్చున్నాడు. అమ్మగారు మీరు ఎక్కడున్నా "పట్టుకు" రమ్మన్నారు. ఇంటికి వెడితే మీ వదనమ్మగారు మీరు లేరని చెప్పారు. యెక్కడెక్కడో తిరిగాను. "రండి పోదాం" అంటూ డోర్ తెరిచిపట్టుకున్నాడు.
"అర్జెంట్ పని వుంది. ఇప్పుడు వీలుకాదు, రేపు ఫోనులో మాట్లాడుతాను" తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు వాసు.
అసలు అక్కడికి వెళ్ళటానికి ఇష్టంలేదు.
"అమ్మగారు మిమ్మల్ని తీసుకు వెళ్ళకుండా వెడితే వూరుకోరు బాబూ అర్జెంటు పనివుంటే నేను కారులో దించేస్తాను. రండిబాబూ. మిమ్మల్ని వెతికి వెతికీ ప్రాణం బేజారుపడింది. రానంటే ఎట్టా"
కాస్త ఆలస్యం చేస్తే కారులోకి బలవంతంగాతోసి తలుపువేసి తీసుకువెళ్ళేటట్లున్నాడు.
ఇంక లాభంలేదు ఇతను వదలడు. అనుకొని కారులో కూర్చున్నాడు. తను ఆ రోజు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అప్పుడు చూసుకున్నాడు.
షర్టు బాగా మాసిపోయినట్లే వుంది.
పార్కులో కర్చీఫ్ పరుచుకు కూర్చున్నా పాంటు నలిగిపోయింది.
పోనీ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెడదామంటే అసలు ఇష్టంలేదు. టైము యెనిమిది దాటి వుంటుంది.
అతిథులు అందరూ వెళ్ళిపోయి వుంటారేమో! అలాగే తేనన్నా బాగుండు. వైదేహిమీద చెప్పలేనంత కోపం వచ్చేస్తోంది.
ఆ రోజు హోటల్లో జేబులో డబ్బులేని సమయంలో వచ్చి ఆదుకుందనే కృతజ్ఞతతో కాస్త యెక్కువగా మాట్లాడినందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు.
అనుకుంటుండగానే వైదేహి ఇల్లు రానే వచ్చింది.
అప్పుడే స్కూటర్ లో వెళ్ళిపోతున్న వ్యక్తి వీపు మాత్రం కన్పించింది.
ఇదేమి టి అన్నయ్య కాదుగదా....ఇక్కడికి ఎలా వస్తాడు! ఎందుకు వస్తాడు. అసంభవం. అన్నయ్యకాదు మరెవ్వరో అచ్చంగా అన్నయ్యలా వున్నాడు.
చేతిలో స్వీటు పాకెట్టు వున్న సంగతి అప్పటికి గుర్తు వచ్చింది. దూరంగా విసిరేసేందుకు కూడా వీలులేకుండా అయింది.
ఎలాగో ఆ పాకెట్టుని పాంటుజేబులో దూర్చేసి మేడమేట్లు యెక్కుతూంటే వైదేహి పినతండ్రి వచ్చి సాదరంగా ఆహ్వానించాడు.
ఈయనకి నేనంటే కోపం లేదూ! వీళ్ళు మనుష్యులు కాదా. కోపతాపాలు లేనంత సంస్కారమా! యేమిటో చాల విచిత్ర పరిస్థితి.