తోట ఇప్పుడు మంచి అభివృద్ధి లో ఉంది. పోతరాజు ఎక్కడా నేల వృధాగా మిగిలిపోకుండా గడ్డిని కూడా సొమ్ము చేస్తున్నాడు. ఏనాడో నిర్లక్ష్యంగా వదిలేసిన చెట్లు కూడా అతనికి అంతో, ఇంతో ఆదాయాన్నిస్తున్నాయి. అతను పాలికాపు కావడం వల్ల అతని పాలు మాత్రమే అతనికి పోతుంది.
గిరిధారి రోజూ తోటకు స్నానానికి వెళ్ళడానికి బద్దకిస్తున్నాడు. అప్పుడప్పుడు వెళుతూ ఉన్నాడు.
ఆరోజు అతను వెళ్ళేసరికి మంగాలు మూలుగుతూ ఆరు బయట కూర్చుని ఉప్పు కాపడం [పెట్టుకుంటుంది.
"ఏమైందమ్మా?' అంటూ పలకరించాడు.
"బడితే పూజ అయ్యింది, అయ్యగారూ!" అన్నది దీనంగా నవ్వుతూ.
ఆమెకు నెలలు నిండాయి. గిరిధారికి కోపం వచ్చింది.
"ఎందుకలా చేశాడో కనుక్కుంటాను." అన్నాడు.
"ఆ పని మాత్రం చెయ్యకండయ్య ! నా తప్పుంది."
"తప్పుంటే మాత్రం? నీవు వట్టి మనిషివి కూడా కాదు. తగలరాని చోట తగిలితే---"
"నా ఖర్మ అనుకోక తప్పదు."
"నిన్నేమీ అనడులే-- చెప్పే తీరున చెప్పి మందలిస్తాను."
"మీకు దండం పెడతాను. ఆ పని చెయ్యకండయ్యా! వాడు నన్నేమిటో అంటాడని కాదు."
"మరి దేనికి?"
మంగాలు క్షణం ఆగి , "మీరు దేవుని లాంటోరు? మీ ముందు గుట్టేమిటి? నా నడత మంచిది కాదని వాడి అనుమానం" అన్నది.
"మరి నమ్మించలేకపోయావా?"
"ఎట్టా నమ్మించను? నాలో మచ్చ ఉన్నప్పుడు --"
గిరిధారి ఆశ్చర్యపోయాడు. అదేమిటని తరిచి అడగటానికి కూడా అభిమానం అడ్డు వచ్చింది. మాటలు ఇంతవరకూ నడిచాక ఆమెను నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళలేక పోయాడు. అందులో తన తప్పును సిగ్గు విడిచి దైర్యంగా ఒప్పుకొంటుందామె. తనను దైవ సమానంగా భావిస్తూ ఆత్మ నివేదన చేసుకుంటున్నది.
"మీరు నించునే ఉన్నారు. మిమ్మల్ని కూచోపెడదామన్నా తగిందేమీ లేదు. మీరు ఎప్పుడూ కూచునే తావుకు ఎల్లండి! అడ కూచోండి. నేను వచ్చి అంతా సేప్పుతాను. అనక మీరు నన్ను సీ కొట్టినా సరే, సెప్పుతో కొట్టినా సరే! అంతా ఇనాలి."
"సరే!" అంటూ వెళ్ళాడతను.
మంగాలుకు కూడా ఓక గత చరిత్ర , అందులో ఒక మచ్చ. తను అనుభవించే శిక్ష. న్యాయమైనదేనని నిర్ణయించుకో గల వికాశం ఉందన్న మాట. హటాత్తుగా ఆమె మారు మనువన్న విషయం గుర్తు వచ్చింది. మాట ప్రకారం వచ్చింది మంగాలు.
ఎలా మొదలు పెట్టాలో తెలియలేదేమో కొంతసేపు మౌనంగా తల వంచుకుని కూర్చుంది.
చివరకు -- "నా తోలి పెనిమిటి పోయాక ఆరేళ్ళ పాటు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పటి నుంచీ నాకీ సంగీతం పంతులు గారు తెలుసు!" అన్నది.
గిరిధారి ఉలిక్కి పడ్డాడు. "నాకు ఇక్కడ శాంతిగా ఉంటుంది. నా మనసుకు నచ్చిన తావు ఇది" అని అనాడాయన అన్న మాటలు తలపుకోచ్చాయి. ఇదన్న మాట అంతరార్ధం.
"నా కిట్టా మారు మనువు తోసుకొచ్చుద్దని కలనైనా అనుకోలేదు. మా అయ్యకు అరునూర్ల అప్పుంది. మా ఇంట్లో కుసేలా సంతానం. అరునూర్లు తీరకపోగా అసలు వడ్డీ కలిసి కోటప్ప కొండలా పెద్దదై పోతూ ఉంది. అట్టాంటి అదునులో మా అయ్య అప్పు తీరిసి నన్ను ఖాయపరుసుకున్నాక మా ఇంటి కొచ్చాడు పోతరాజు. నేను అళ్ళీద్దరి మీద ఇంతెత్తున ఎగిరాను. ఏం లాభం? సమయం మించిపోయింది. అయ్య శోకాలూ, పోతరాజు గదమాయింపులూ. చివరకు మనువు ఒగ్గక తప్పలేదు నాకు! నేను మాత్తరం పోతరాజు దగ్గర గుట్టు దాచలేదు. 'ఇదుగో -- పంతులుకూ నాకూ మద్దె నున్న ఎవ్వారం ఇది! అనక నీ ఇట్టం' అని తెగేసి చెప్పాను. మేమిద్దరం ఒకర్నిడిసి ఒకరం ఉండాలేమని కూడా సెప్పి ఏడిచాను. 'అదంతా నే సూసుకుంటాలే' అన్నాడు. అప్పుడీ 'రాగాలయ్య ' ఊళ్ళో లేడు ఈ పోతరాజు మా అయ్యకు గట్టిగా సేప్పాడు-- 'నా ఉనికి చెప్పొద్దని. ఏం లాభం? పంతులు పదూళ్ళు గాలించి నన్ను పట్టాడు. ఇగ నా మొగుడు నన్ను తన్ని గాని , ఆయన్ని బెదిరించి గాని ఇడదియ్య లేకపోయాడు. 'మా ఇద్దరినీ ఒక్క కత్తితో నరుకు' అన్నాడు పంతులు. నేనూ అదే సెయ్యమన్నాను. ఇట్టా రోజూ గొడవ చేస్తే ఏ నూతిలో నన్నా దూకి చస్తా నన్నాను. చివరికి పోతరాజు లొంగి రాక తప్పలేదు. ఊళ్ళో ఉంటె సాటి కులంలో పేరు సెడుతుందని నన్ను తీసుకుని ఈ తోటలో కాపరం పెట్టాడు. మా రాగాలయ్య కూడా ఇక్కడికే చేరాడు. ఎంతైనా మొగుడాయే! ఒక్కొక్కప్పుడు నన్ను ఒళ్ళు వాయగోడతాడు. తప్పదు. ఆ అధికారం ఉందాడికి--"
"మరి పోతరాజు నీ కిష్టమైన గాడిదను కొట్టటమేమిటి?"
మంగాలు పెదవి విరిచింది. "అదొక అడ్డం! అసలు సంగతిది" అన్నది.
"మీ అయ్య అప్పు తీర్చాడనేనా నువ్వు పోతరాజుకు లొంగి ఉండటం?"
"ముందంతే! కాని వాడి పెద్ద మనుసు చూశాక నా మనసు మారింది. నా అసలైన బతుకు నా తోలి మొగుడి తోనే సెల్లిపోయింది. పంతులయ్యను చూసి జాలితో చేరదీశాను. పోతరాజు అలివయ్యాను. ఆడి నిజాయితీకి లొంగిపోయాను. నా బతుకుతాడు చెరో కొస చేతి కిచ్చాను. ఆ ఉచ్చులో నా గుండె బక్కిపోయింది. నానాటికీ బగుస్తా ఉందది. ఆఖరు కే మయిద్దో--"
"అంతా సర్దుకుంటుంది, మంగాలూ-- నీ బ్రతుకు గుట్టుగా వెళ్ళమారిపోవాలని దేవుణ్ణి కోరుకుంటాను."
మంగాలు విరక్తిగా నవ్వింది.
"ఎట్టా సర్దుకుంటుంది, అయ్యగారూ! నా కడుపులో పిల్లాడికి తండ్రి తనే అనుకుంటాడు నా మొగుడు. 'కరెంటు మిసను బట్ట లుతికేది పెట్టెస్తనే వాడితో" అని మురుస్తడు. ఇటు పంతులయ్య -- 'ఆడు నా కొడుకే-- అదేదీ లేడియోలో పాడిస్తానే ఆడితో" అంటాడు. ఇంతకూ ఆడేవరి కొడుకో నాకే తెల్దు. కానుపులో ఏ పెద్ద రోగమో వచ్చి నన్నూ, అడినీ మింగితే తమరనట్టు నా బతుకు గుట్టుగా వెళ్ళమారినట్టు! లేకపోతె -- ఏం సేప్పనింక!" అన్నది.
గిరిధారి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది.
"అయ్యగారూ! ఇది మీకు తెలిసినట్టు ఇద్దరిలో ఎవరితోనూ అనమాకండి! పోతరాజు నన్ను చంపినా ఈ రహశ్యం మీలోనే ఇగిరిపోవాలి" అన్నది మంగాలు.
"అలాగే. కానీ ఆరోజు రాకూడదు."
"ఎల్తాన్నా, అయ్యగారూ! అమ్మయ్య! ఎంతో గుండె బరువు తగ్గినట్టుండా డిప్పుడు! అయ్యగారూ , ఓ పాలి మీ కాళ్ళకి మొక్కాలనుంది. నన్ను తాకనిత్తారా?"
"అదేం కోరికే పిచ్చిదానా! సరే! నీ మాటెందుకు క్కాదనాలి.!"
మంగాలు వచ్చి అతని కాళ్ళు పట్టుకుని కళ్ళ కద్దుకుని తల కాళ్ళ కానించింది. "పోతరాజు , రాగాలయ్య కాక నా మనసుకు తమరూ ఒక సాచ్చి" అంటూ నవ్వింది మంగాలు. ఆ నవ్వు మనసులో నవ్వింది. ఎంతో నిర్మలంగా ఉంది. గుండెల్లో అగ్నిపర్వతాన్ని మించిన అయోమయావస్థ దాచుకుని ఇదింత హాయిగా ఎలా నవ్వగలుగుతుంది అనిపించిందతనికి.
మంగాలు వెళ్ళిపోయాక స్నానం చేసి వచ్చేశాడు.
21
అతని అంతర్యం మళ్ళీ ఆలోచనలకు నిలయమైంది. సమాజం హర్షించని రహస్యాలు అందులోనే ఎన్నో దాగి ఉన్నాయి. అవి చట్టానికందవు. సాంఘిక నియమాల కతీతమైనవి. వాటికి కేవలం మానవత్వమే ప్రాతిపదిక! ఎవరి మనస్సు వారికి సాక్షి!
కాంతమ్మగారు....ఆమె మనసు నిండిన మధుర మూర్తి ఛాయలో ఆ మూర్తి ఈ లోకంలో లేకపోయినా కేవలం అనుభూతితో జీవిస్తుంది. అవమానాన్ని భరిస్తూ అభిమానానికి క్షణ క్షణం ప్రాణం పోసుకుంటుంది. నిజాని కామె జీవితం ఒక ఎడారి. అయినా అలా అనుకోవటం లేదు.
కస్తూరి .....ఆమె దొక కధ ఆమె నిరీక్షణకు ముగింపు తెలియదు. ఆమె తన పిచ్చిలో తాను జీవిస్తుంది.
మంగాలు మరీ విచిత్ర వ్యక్తీ! ఒక ఒరలో రెండు కత్తులను దాచింది. రెండూ కావాలామేకు. భయంకర విషాదాన్ని అంతరాత్మ సూచించినా దైవం మీద భారం వేసి నిండు హృదయంతో నిశ్చింతగా నవ్వగలదు.
ఇన్ని రహస్యాలను మనస్సులోనే సమాధి చేసిన పోతరాజు.
అంతో, ఇంతో సంస్కారమూ , కళా హృదయమూ ఉండి కూడా మంగాలు జీవితంలో నుంచి తప్పుకోలేని ఆ సంగీతం మాస్టారు.
కృష్ణ దృష్టిలో ప్రత్యేకత కోసం, ఇంట్లో తమ ఆధిపత్యం కోసం పోటాపోటీలు పడి ఇప్పుడు తమ స్థితి అయోమయం చేసుకున్న కాంతమ్మగారూ, అపర్ణ.
తల్లి పోయినా తండ్రిని ప్రేమించిన నేరానికి అయన పోయాక కూడా కాంతమ్మ గారిని సవతి తల్లిలా చూసే అపర్ణా! తన చెల్లెలు ద్వేషించే వ్యక్తిలో మాతృత్వాన్ని చవి జూసిన కృష్ణ.
అన్నీ వెనకా ముందూ అయిన వ్యక్తుల జీవితాల కలగలుపులు! గిరిధారి ఆలోచనలిలా సాగిపోతున్నాయి.
* * * *
సునీలకు చేతికి తగిన కాలక్షేపం లేదు. మేడ మీద గదులు తయారయ్యాక భార్యాభర్తలది మరో ప్రపంచమైంది. కృష్ణ తనని తాను పూర్తిగా భార్యకు అర్పించుకున్నాడు. అలా అనటం కన్నా సునీల భర్త దృష్టిలో తన విలువనూ, ఆధిక్యాన్ని పెంపొందించుకుందనటం న్యాయం.
భర్తకు భోజనం కూడా పైకి పట్టుకు వెళుతుంది సునీల. ఒక వంటకాల పుస్తకం తెప్పించింది. అందులో శాంపిల్ గా రోజు కోక వంటకం తయారు చేసి భర్తకు తినిపించి రుచి అడుగుతుంది. చాలా తక్కువగా , ఇద్దరికే సరిపడేలా , ఎక్కువ చేసి తీరా చెడిపోతే పదార్ధాలు వృధా అవుతాయన్నట్టు పొదుపు చేస్తుంది. అపర్ణ మేడమీదికి వస్తే ఏం పని మీద వచ్చిందో మర్యాదగా అడిగి అయిదు నిమిషాలు దాటకుండా ఆ పని పూర్తీ చేసి పంపిస్తుంది.
వంట ఇల్లు కాంతమ్మ గారిది! "మీ అబ్బాయి చెయ్యమన్నా" రంటూ రేపు చెయ్యవలసిన కూర లేమిటో ఈరోజే చెబుతుందామేకు. పాపం! కాంతమ్మ గారు కృష్ణ కు తన చేతుల మీదుగా తినిపించి ఎన్నాళ్ళో అయింది.
అపర్ణ తనను పలకరిస్తే ముందు సునీల వంక చూసి ఆ తరవాత చెల్లెలికి సమాధాన మిస్తాడు కృష్ణ.
భూమి తాలుకూ ఆఖరు వాయిదా పైకం మొత్తం వచ్చింది. పైసా కదలకుండా జాగ్రత్త చేయించింది సునీల . ఏది ఎక్కడో ఎంతో -- అంతా ఆకళింపు చేసుకున్నది.
ప్రస్తుతం సునీల భర్తను ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో చేయమని రాచి రాపాడుతున్నది.
ఆమె పోరు పడలేక గిరిధారి సలహాతో కృష్ణ అంత వరకూ పట్నం లో లేని 'గాస్' ఏజెన్సీ తీసుకున్నాడు.
ఇంత జరిగాక కృష్ణ మారాడు. అతని మనస్తత్వం మారింది. సంపాదనలో పడ్డాక, అందులో లాభం కనిపించాక డబ్బు విలువ తెలిసి వచ్చింది. సునీలకు నెల తప్పింది. ఆమె కిప్పుడు నాలుగో మాసం.
* * * *
ఇన్ని మార్పులూ, విచిత్రాలూ జరిగాక కాంతమ్మ గారు ఇంక తట్టుకోలేకపోయింది. ఆమె గిరిధారి తో మొర పెట్టుకుంది. తను చెయ్యగలిగిందేమీ లేదని స్పష్టంగా చెప్పాడతను. నిజాని కతనికి కృష్ణ తీరు "కలయో వైష్ణవమాయయో' అన్నట్లుంది. అయినా ఈ మార్పు గిరిధారికి నచ్చింది. అతను సునీలను మనసు లోనే అభినందించాడు.
ఆమె అక్కడుండగానే అపర్ణ వచ్చింది.
"నువ్వూ వచ్చావా, అపర్ణా!" కాంతమ్మ గారి ఆశ్చర్యం.
అపర్ణ నీరసంగా నవ్వింది. "నువ్వు రావటం చూశాను, పిన్నీ! నీ బాధ నాకు తెలుసు!" అన్నది.