జానకిని కౌగలించుకుని పకపక నవ్వింది కుసుమ. కాత్యాయని కుసుమను సాదరంగా ఆహ్వానించింది. స్నానమూ, భోజనమూ అయ్యాక తన గదిగా వాడుకొంటున్న మాధవ లైబ్రరీ గదిలోకి కుసుమను తీసికెళ్ళి "ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చావో ?" అంది. కుసుమ అలిగినట్లు బుంగమూతి పెట్టింది. "సిగ్గులేక సంజాయిషీ అడుగుతున్నావా? నీకేం? అందాల రాకుమారుణ్ణి చేపట్టి అనందాల్లో తేలుతున్నావు. మధ్య ఏం తోచక చస్తున్నదాన్ని నేను. ఏదో ఒక్కసారి చూసి పోదామని వస్తే ఎందు కొచ్చావని నిలేస్తావెం? ఎందుకంట ఏడుపు? మీ అయన ఊళ్ళో లేనప్పుడే వచ్చాగా!"
జానకి ఫకాలున నవ్వేసింది.
"నువ్వు లక్ష చెప్పు. కోటి చెప్పు కారణం లేకుండా నువ్వు ఇల్లు కదిలావంటే నేను చస్తే నమ్మను."
"ఎలాగూ నమ్మటం లేదు గనుక నిజం చెప్పేస్తాను. నాకు మెడ్రాస్ లో ఉద్యోగం దొరికింది. వెళ్తూ వెళ్తూ నిన్ను చూసిపోదామని వచ్చాను."
"ఆ సంగతి చెప్పవేం? ఎంత సంతోషంగా ఉందనుకున్నావ్? అప్పుడే ఉద్యోగస్తురాలివి కూడా అయిపోయావ్. ఏం ఉద్యోగం?"
"......కంపెనీలో స్టెనో"
"అదేమిటే! ఆ కంపెనీలో రిట్రెంచ్ మెంట్ వచ్చి చాలా మంది ఉద్యోగాలు పోయాయని విన్నానే ! నీకు కొత్తగా ఉద్యోగం ఎలా వచ్చింది?"
"నా ఫోటో కూడా దరఖస్తూ తో పాటు పంపటం వల్ల వచ్చింది. అదంతేలే! బహుశ రిట్రెంచ్ మెంట్ వల్ల తీసేసిన ఎవరి ఉద్యోగమో నాకొచ్చి ఉంటారు"
"ఎంత అన్యాయం!"
"నేనూ అనుకున్నాలే కాసేపు అన్యాయమని. కాని ఉద్యోగంలో మాత్రం చేరుతున్నాను. నేను చేరాకపోతే మరొకరు చేరతారు. జరిగే అన్యాయం ఎలాగూ జరుగుతుంది. మధ్యలో నేనెందుకు నష్టపోవాలి?"
జానకి ఏం మాట్లాడలేకపోయింది.
"అలా చిచ్చుబుడ్డి మొఖం పెట్టకు. మన సమాజం మొత్తం ఒక విచిత్రమైన పద్దతిలో పరుగులు పెడుతోంది. కొన్ని విలువలు పడిపోతున్నాయి. కొన్ని విలువలు గుర్తింపబడుతున్నాయి. కొన్ని అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. స్త్రీల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇంతకు ముందంతా వంటింట్లో బంధింపబడి ఒక్కసారిగా గాలీ, వెలుతురూ మధ్యకి వచ్చిన మనం ఉక్కిరిబిక్కిరయిపోతున్నాం. వెనుకటి స్త్రీల కన్నా మనకి ఎన్నో సదుపాయాలూ సమకూరాయి. ఎంతో రక్షణ కల్పించబడింది. అదే సమయంలో మన వెనుకటి తరం వాళ్ళకు లేని క్లిష్టసమస్యలనేకం మనం ఎదుర్కోవలసి వస్తోంది. ఉన్న అవకాశాలను ఆయుధాలుగా అందుకొని సమస్యల నెదిరించటమే మనం చెయ్యవలసిన పని. అలా చెయ్యడానికే నేను నిశ్చయించుకున్నాను. జీవితానికి భయపడి కలలలోకి పారిపోను! వినయంగా తలొగ్గి దానికి లోంగిపోను. జీవితంలో దెబ్బలాడి జీవితాన్నే నాకు కావలసిన విధంగా మలుచుకుతీరతాను" ముఖమంతా ఎర్రగా అయిపోగా ఉద్రేకంగా అంది కుసుమ.
అభిమానంగా కుసుమ చెక్కిళ్ళు నిమిరింది జానకి.
"నువ్వు తప్పక సాధిస్తావు. స్వార్ధపరతతోనూ, కాపట్యతోనూ జీవితాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునేవాళ్ళు కొందరున్నారు. నువ్వు అలాంటి దానివి కావు. విశాల హృదయంతో, సరళ ప్రవర్తనతో , కొన్ని విలువలు దృష్టిలో ఉంచుకుని, జీవితాన్ని నీ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు తప్పకుండా జయిస్తావు."
కుసుమ జానకి చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది.
"నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలిగినదానివి నువ్వొక్కదానివున్నావు. ఈ బలం చాలు నాకు"
ఆ సాయంత్రం జానకి కుసుమని వెంట బెట్టుకుని తన తోటలన్నీ చూపించింది.
"అదృష్టవంతురాలివి జానకీ! రూపమూ, ఐశ్వర్యము, గుణమూ కలిగిన యువకుడు భర్తగా దొరికాడు నీకు" సంతృప్తిగా అంది కుసుమ. అప్రయత్నంగా జానకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తెల్లబోయి చూసింది కుసుమ.
"జానకీ!" అంది కుసుమ ఆశ్చర్యంగా.
చటుక్కున జానకి కుసుమ ఒళ్ళో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చేసింది. నిర్ఘాంతపోయింది కుసుమ. ఏం మాట్లాడకుండా జానకి తల నిమురుతూ కూచుంది. కొంతసేపటికి తనను తాను సమ్మాలించుకుని కుసుమ ఒళ్లోంచి తలెత్తి కళ్ళు తుడుచుకుంది జానకి.
కుసుమ జానకి చుట్టూ చెయ్యేసి దగ్గరగా ఒత్తుకుని "నాకు చెప్పు ఏమిటీ ఆవేదన? ఎవరికైనా చెప్పుకుంటే కాస్త హృదయ భారం తగ్గుతుంది" అంది ఆర్ద్రంగా.
"ఏం లేదు......ఏం లేదు" వణుకుతున్న గొంతుతో అంది జానకి.
కుసుమ జానకి ముఖంలోకి సూటిగా చూసింది.
జానీ! మనం బంధుత్వం మాట ఎలా ఉన్నా మనం మంచి స్నేహితులం కదూ!"
"స్నేహితులం మాత్రమేనా! ఈ లోకంలో నా అని చెప్పుకో దగ్గ వ్యక్తులెవరైనా ఉంటె అది నువ్వే! నా కష్ట సుఖాలు నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను? నాకోసం కన్నతల్లిని కూడా ఎదిరించటానికి సిద్ధపడ్డ నీ ప్రేమ నేను బ్రతికుండగా మరిచిపోగలనా? కాని, ఇప్పుడు నా సంగతేమిటో నాకే తెలియని అయోమయంలో ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు పోయాక కాని, నా స్థితి నాకే స్పష్టంగా తెలీదు. అప్పుడు చెప్తాను. నీకు వివరంగా."
"సరే! నీ ఇష్టం. ఇంతకూ నువ్వు నేను ఊహిస్తున్నంత సౌఖ్యంగా లేవన్నమాట" భారంగా నిట్టూర్చింది కుసుమ.
కొంతసేపు తోటలో తిరిగాక లోపలకు వచ్చారు.
ఆ మరునాడే ప్రయాణమయింది కుసుమ. కాత్యాయని జానకి చేత కుసుమకు బొట్టు పెట్టించి కొత్తచీర, జాకెట్టు గుడ్డ పెట్టించింది. కుసుమ మర్యాదకు వద్దని వారిస్తే . "ఇంటికి వచ్చిన కన్నె పిల్లని ఉత్త చేతులతో పంపమంటావా?" అని మృదువుగా మందలించింది.
"మా మాధవ అక్కడే ఉన్నాడు. ఎప్పుడైనా కనిపిస్తే అడిగానని చెప్పు."
"తప్పకుండా అయన దగ్గర కెళ్ళి మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తాను"{ కాత్యాయనికి నమస్కారం చేసి జానకిని కౌగలించుకుని పాలేరు తెచ్చిన బండిలో ఎక్కి కూచుంది కుసుమ.
* * *
ఆరోజు పోస్టుజవాను తెచ్చిన ఉత్తరాలు చూస్తున్న కాత్యాయని జానకి చిరునామా గల కవరు చేత్తో పట్టుకుని ఆగిపోయింది. మాధవ దస్తూరి గమనించి నవ్వుకుంది. ఆనాడు మాధవ ఉండమన్నా ఉండకుండా వెళ్ళి పోవడంతో జానకీ మాధవలు అన్యోన్యానురాగంతో లేరేమోనని భయపడింది. ఈ ఉత్తరం చూశాకా మనసు కొంత స్థిమితపడింది కాత్యాయనికి. జానకిని పిలిచింది.
కాత్యాయని కోసం తయారుచేసిన పళ్ళ రసం గ్లాసు తీసుకొచ్చి ఆవిడ కందించి దగ్గరగా కూచుని ఏమిటన్నట్లు చూసింది జానకి.
"నీకో చాలా మంచి అపూరూపమైన వస్తువు ఇయ్యబోతున్నాను. ఏమిటో చెప్పుకో!' చిరునవ్వుతో అంది కాత్యాయని.
జానకి ఆశ్చర్యంగా చూసింది. ఏదైనా నగేమో అనుకుంది.
"ఇప్పటికే మీరు నాకు చాలా నగలు చేయించారు. ఇంకా నాకు నాగలెందుకూ?' వినయంగా అంది జానకి. కాత్యాయని పకపక నవ్వింది.
"ఇప్పుడు నీకియ్యబోతున్నది నగకాదు. నీకున్న నగలన్నీటికీ మించి నీకు అందానిచ్చే వస్తువు ఇదిగో!" మాధవ ఉత్తరం జానకి చేతిలో పెట్టింది కాత్యాయని.
ఆ ఉత్తరం అందుకుంటుండగా జానకి చేతులు వణికాయి. క్షణంలో ముఖమంతా సంతోషంతో , సంభ్రమంతో , సిగ్గుతో కందిపోయింది. ఆ ముఖంలోకి చూస్తూ ఆదరంగా నవ్వింది కాత్యాయని.