పక్కింట్లో ఒకడు పెళ్ళాన్ని చావగొడుతుంటే కిటికీల్లోంచి, తలుపు సందుల్లోంచి తొంగి తొంగి చూస్తారేగానీ వెళ్ళి వాడి చేతిలో కర్ర లాగేసి ఇదేమిటని అడగరు. అదేమంటే అవతలివాళ్ళ స్వంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న థియరీ! కానీ ఏదైనా జరిగితే, ఆ ఆడదాని మీద రాళ్ళు వేయడానికి మాత్రం ఈ థియరీ అడ్డు రాదు."
"ఇదీ కొంత కరక్టే! పెళ్ళిచేసి పంపేసి చేతులు దులిపేసుకొంటారు తల్లిదండ్రులు. చచ్చినా బ్రతికినా అక్కడే అనుకొంటారు. ముందు తల్లిదండ్రుల దృక్పధంలో మార్పువస్తే ఈ సమస్యలను కొంతవరకు పరిష్కారం లభిస్తుంది" అర్చన కూడా ఏకీభవించింది.
"అరుణోదయ చెప్పిన పాయింట్ ను నేనూ సమర్ధిస్తాను. ఎలాగా పోరాటం తప్పనప్పుడు బయటికి వచ్చిన సమాజంతో పోరాడేకంటే యింట్లో వుండి మగడితో పోరాడడమే తేలికకదా? ఇంట్లో ఒక మగాడిని గెలువలేనిది. బయటికి వచ్చి అలాంటివాళ్ళు లక్షలూ, వేలూ వుండే సమాజంతో ఏం గెలుస్తుంది?" అన్నాడు అరవింద్.
"కానీ, ఏ ప్రయత్నానికీ లొంగని జగమొండిగాళ్ళ సంగతో?" అడిగింది అర్చన.
"కొండకొమ్ము పట్టుకొని పైకి ఎగబ్రాకాలని ప్రయాసపడుతున్నప్పుడు ఎక్కడినుండో ఒక నాగుపాము వచ్చి పడగెత్తి బుస్సుమని కాటేయ్యబోతే ఏం చేస్తాం? క్రిందికి దూకేయాల్సిందేకదా? ఇదీ అంతే! ఇహ ఆ కాపురాన్ని ఖచ్చితంగా వదిలెయ్యాల్సిందే! కానీ, అది ఏదో నేరం చేస్తున్న ఫీలింగ్ తో కాదు.
తప్పని పరిస్థితిలో బయటికి వచ్చేసి అతడిని నేరస్థుడిగా, దుర్మార్గుడిగా సమాజం ముందు నిలబెట్టగలగాలి. అతడికి మళ్ళీ సంసార జీవితం లేకుండా చేయాలి. సంఘబహిష్కరణ చేయాలి. ఏకాకిగా వాడు అలమటించి పోయినప్పుడు తెలుస్తుంది వాడికి భార్య విలువ! కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఆడపిల్లవి శనిగా భావించి, వదిలితే చాలని ఎలాంటి కటికవాడయినా ఇవ్వడానికి వెనుకంజ వేయని తల్లిదండ్రులు కోకొల్లలుగా వున్న సమాజం మనది. ఒక భార్య వదిలితే ఏం? మళ్ళీ పెళ్ళికొడుకై కులుకుతాడు! అదీ వచ్చిన చిక్కు."
అరవింద్ వాచీ చూసుకున్నాడు. "ఇక నె వస్తాను వదినగారూ!" అని లేచి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
అర్చనని 'వదినగారూ' అని పిలిచే అరవింద్ రామకృష్ణకి మంచి స్నేహితుడు.
"ఆయన భార్య అదృష్టానికి ఈర్ష్యపడాలనిపిస్తూంది" చెస్ పావుల్ని డబ్బాలో జాగ్రత్తగా పోసి మూత పెడుతూ అంది అరుణోదయ.
స్టౌమీద రైస్ కుక్కర్ పెట్టడానికి వెళ్ళబోతున్న అర్చన చివ్వున వెనుదిరిగి, "ఎవరి భార్య సంగతి?" అని అడిగింది.
"అరవింద్ గారి భార్య."
"ఏమిటిట ఆ అదృష్టం?"
"అందగాడు! ఆదర్శభావాలున్నవాడు! ముఖ్యంగా పెద్ద డాక్టరు!"
"నువ్విచ్చిన సర్టిఫికెట్లన్నీ అతడికి తగుతాయి. కానీ, నువ్వన్న ఆ అదృష్టం ఎక్కడో గంధర్వలోకంలో బంగారు సరస్సున అపురూప పుష్పంలా అలాగే పదిలంగా వుంది. ఇంకా ఎవరూ దక్కించుకోలేదు."
"అంటే ఆయనకింకా పెళ్ళికాలేదా?" అరుణోదయ కళ్ళలో ఏవో వింత మెరుపులు!
"కాలేదు."
"అదేమిటి? ముప్పైకీ, నలభయ్ కీ మధ్య వచ్చేసినట్లున్నాడు. పెళ్ళి చేసుకోనని ఏదైనా ప్రతిజ్ఞ చేశాడా?
"ప్రతిజ్ఞ ఏదీ చెయ్యలేదుగానీ తనకి సరిపోయిన అమ్మాయి దొరకదన్న భయంతో పెళ్ళి ఆలోచనలకి దూరంగా వున్నాడు."
"సరిపోయిన అమ్మాయి అంటే?"
"తన భావాలకు సరిపోయిన అమ్మాయి! కొంచెం అందంగా....నాజూకుగా, చదువుకొన్నదీ, సంస్కారం, వివేకం వున్నదీ...ముఖ్యంగా అతడి తల్లిదండ్రులను అభిమానంగా చూసుకొనేది."
అరుణోదయ చప్పున అర్చన ముందుకు వచ్చి నడుముకు చేతులు పెట్టుకొని నిటారుగా నిలబడింది.
"చూడు! నేను సరిపోతానా?"
"నీ మొహం!"
"ఏమిటి నా మొహానికి తక్కువ?"
"ఉన్న మాటంటే ఉలిక్కిపడనంటే."
"ఉన్నమాటే చెప్పు!"
"చూడగానే గుండె జల్లుమనిపించే అందాలేవీ లేవు నీ ముఖంలో. ఏదో మామూలుగా అనిపిస్తావు. చేసే ఉద్యోగమైనా గొప్పది కాదు! నర్సు ఉద్యోగం."
"ఏయ్, ఆంటీ! నన్నను, బాగా లేవు_కొండముచ్చులా వున్నావని! నేనేం బాధపడను. కానీ నేను చేసే ఉద్యోగాన్ని మాత్రం చులకన చేయకు.
చిన్నప్పటినుండి నాలో జీవం పోసుకొన్న ఓకే అందమైన కలకు ప్రతిరూపం ఈ ఉద్యోగం! తెల్లచీర కట్టుకొని, తెల్లకోటు వేసుకొని మెడలో స్టేత్ తో చిరునవ్వులు చిందిస్తూ రోగుల మధ్య తిరుగుతున్నట్టుగా కలలు కనేదాన్ని! డాక్టర్ని కావాలని ఎంతగానో అనుకొన్నాను. కానీ, దురదృష్టం అదేమో, ఎన్నిసార్లు ఎంసెట్ రాసినా రాంక్ లేదు. వేలకి వేలు డొనేషన్లు కట్టి మెడిసిన్ చేయించే స్థోమత మావాళ్ళకి లేకపోయింది. రోగుల మధ్య తెల్లటి దుస్తుల్లో తిరిగే ఆ కలని మాత్రం దూరం చేసుకోలేకపోయాను. అందుకే నర్సునయ్యాను! రోగుల మధ్య శ్వేతవస్త్రాలతో తిరిగే అదృష్టాన్ని అలా దక్కించుకొన్నాను!