రవి ముందునుంచీ ఆలోచించేది ఒకటే! షాపువాళ్ళు 'జనరల్'గా ఇచ్చేదీ ప్రత్యేకంగా ఇవ్వలేనిదీ తను ఇవ్వాలి. షాపువాళ్ళు వేసిన ఆప్లిక్ వర్క్ లో మంచిగుడ్డ వాడరు. చీరకన్నా ముందు అది వెలిసిపోతుంది. పల్చటి చీరకు మందపాటి బట్టవేస్తే డిజైను కనిపించకపోగా, చీర క్రుంగిపోతుంది. షాపుల్లో దొరికేవి అన్నీ ఒకే రకంగా వుంటాయి. ఇక్కడే అతడు తన పథకం అమలులో పెట్టదల్చుకున్నది.
ప్రింటింగ్ చీరలకి దీనికి తేడా ఏమిటి, ప్రింట్ చేయించుకోవచ్చుగా అనేవాళ్ళకి దీని అందం తెలీదు. దీని అందం అంతా డిజైను అందంగా కత్తిరించటంలోను, వాడే దారాల రంగుల్లోనూ వుంటుంది. అందులో అతడు ఎలాగూ నిష్ణాతుడు.
పెట్టుబడి వెయ్యికీ-మరో వెయ్యి అప్పుతో ఇరవై చీరలు తీసుకున్నాడు. పది జార్జెట్, పది ఆర్గండీ అందులో చెరో ఐదు మీదా పది రోజులు కూర్చుని ఆప్లిక్ వర్క్ చేశాడు.
మొత్తం ఇరవై చీరల్నీ పట్టుకుని ఓ గవర్నమెంటు ఆఫీసుకి వెళ్ళాడు.
ఇక్కడ ఆఫీసుల్లో చీరల అమ్మకం గురించి కొంచెం చెప్పాలి. అడవుల్లో లేళ్ళగుంపు వెళ్తూ వుంటుంది. ముందు వెళ్తున్న లేడి కాస్త తలపైకెత్తి- తడిసిన గడ్డి వాసన పసిగట్టి పరుగెడుతుంది. వెనుక లేళ్ళన్నీ దాని వెనుక అక్కడికి చేరుకుంటాయి.
చీరలవాళ్ళు మూటలు తీసుకుని మెల్లగా ఆఫీసులోకి ప్రవేశించి బాగా తెలిసినవాళ్ళకి తాము వచ్చిన సంగతి మెల్లగా తెలియజేస్తారు. ఎక్స్ టెన్షన్ ఫోన్లోనో, లేక చిన్న చిరునవ్వు సైగతోనో ఈ వార్త క్షణాల్లో ఆఫీసంతా పాకిపోతుంది. ఇదంతా రహస్యంగా జరుగుతున్నట్టు వుంటుంది. కానీ అందరికీ తెలిసే జరుగుతూ వుంటుంది. ఆఫీసరు స్ట్రిక్టు అయితే మంచినీళ్ళతో, టాయిలెట్ కనో బయల్దేరతారు. లంచ్ రూమ్ లు తాత్కాలికమైన చీరల షాపుల్లాగా మారతాయి. ఈ చీరలు సాధారణంగా ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో అమ్మబడతాయి. ఎక్కువ వెరైటీలు లేకపోయినా పక్క ఆడది కొంటూందే అన్న ఆరాటం "మాస్ మెంటాలిటీ" మనస్తత్వం మీద బాగా ప్రభావితమై, బజార్లో దొరికే మామూలు చీరల్నే ఎక్కువ ధరకి కొనేలా చేస్తుంది. ఆఫీసుల్లో ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేసే ఆడవాళ్ళకి ఇలా మధ్యమధ్యలో చీరల బేరం చేయటం, ఎంతో మానసిక శ్రమని తగ్గించి ఉత్సాహపరుస్తున్దిల్. ఎవరైనా సెక్షన్ ఆఫీసరు దీనికి అభ్యంతరం పెడితే అతడు యముడుగా చూడబడటంలో తప్పేముంది?
(ఒక రచయిత మిత్రుడిని చూడటానికి ఎ.జి. ఆఫీసుకు వెళ్ళినప్పుడు ముగ్గురాడవాళ్ళు అగ్నిమాపక సిబ్బంది స్థాయిలో వరండాలో పరుగెడ్తూంటే కంగారుపడి విషయం ఏమిటి అని కనుక్కుంటే... అప్పుడే చీరలవాడు వచ్చాడని తెలిసింది. రచనలవల్ల సమాజంలో మార్పు ఎందుకు తీసుకురారు అనే వారికి.....అంత మార్పెందుకు.....కనీసం ఈ నవల చదివి, ఒక్క ఉద్యోగిని అయినా ఆ గొర్రెల్లో కలవకుండా వ్యక్తిత్వం నిలుపుకుంటుందా అని ఎదురుప్రశ్న వేస్తే మరి సమాధానం ఏమిటో? వాయిదా పద్దతి మీద చీరల్ని కొనుక్కునే అధికారం స్వంతంత్ర భారతదేశంలో ఎవరికైనా వుంది. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసు టైమ్ అయ్యాకే మా ఆఫీసు ఆడవాళ్ళని ఎంగేజ్ చెయ్యి అని చీరల వాడిని శాసించే అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు.)
రవి తన ఇరవై చీరల్నీ తీసుకెళ్ళి ఆఫీసులో ప్రదర్శన ప్రారంభించినప్పుడు ఆడవాళ్ళయితే మూగారుగానీ, మామూలు బడ్జెట్ చీరల్ని చూసి పెదవి విరిచారు. మరీ ఎక్కువ నెలసరి వాయిదాలు ఇచ్చే షరతు మీద రెండు చీరలు మాత్రం తీసుకున్నారు. అవీ మామూలువి ఆప్లిక్ చేయనివి.
ఒక దశాబ్దం ముందు ఆప్లిక్ వర్క్ కి అంత గుర్తింపు లేదు. అతడు చేసిన దెవరూ అంతగా పట్టించుకోలేదు. ఒక లావుగా వున్నావిడ మాత్రం దాన్ని తీసుకుంది.
అయితే రవి వెంటనే దాన్ని ఆమెకు అమ్మలేదు. ఇలాటి చీర మరొకటి కుట్టి తీసుకొస్తానమ్మా అని వెళ్ళిపోయి, మరుసటి రోజు రాత్రంతా కూర్చొని కుట్టి తీసుకొచ్చాడు.
మామూలుగా చూసేవాళ్ళకి ఆ రెంటికీ తేడా తెలీదు. ఆప్లిక్ లో విశిష్టత 'కట్టుకుంటేనే' తెలుస్తుంది. మొదటిరోజు ఎన్నిక చేస్తున్నప్పుడే ఆమె శరీరతత్వాన్ని కళ్ళతో అంచనా వేశాడు అతడు. అతడు రెండో చీరమీద కుడుతున్నప్పుడు.... ఆ శరీరానికి సరిపోయేలా....
....గుండె దగ్గిర్లో పువ్వు
.....కొంగు చివర ఒకటి
.....నడుము దగ్గిర నుంచి కొంగు వేసుకొనే వంపు దగ్గిర ఒక పువ్వు.
.....కాళ్ళ దగ్గిర, కుడిచేతి కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతూ ఒకటి.
మొత్తం అయిదు పువ్వులు, చీరంతా సన్నటిలైను, మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు..... ఆమె కట్టుకుంటే.. సరిగ్గా సరిపోయేలా కుట్టాడు.
చిలకాకు పచ్చ రంగుమీద ఆప్లిక్ ఎంత బాగా కుదిరిందంటే,. రెండ్రోజులు తరువాత ఆమె దాన్ని కట్టుకుని ఆఫీసుకు వచ్చిన రోజు సచివాలయంలో స్ట్రయికు కన్నా ఎక్కువ సంచలనం సృష్టించింది.
పువ్వులు అమర్చటంలోనే ఆ "ట్రిక్" వుందని తెలుసుకోలేని ఆడవాళ్ళు......మొత్తం చీరలన్నిటినీ ఎగబడి కొనుక్కున్నారు. ఆడవాళ్ళు ముచ్చటపడితే మరి ధర సంగతి చూడరని అతడికి తెలుసు. వెయ్యికీ మరో వెయ్యి లాభం వచ్చింది.
అదీ ప్రారంభం.
ఆ తరువాత రెండు సంవత్సరాలకి.... అంటే 1978, 79 ప్రాంతాల్లో సాదా అమెరికన్ జార్జెట్ చీరలకి చిన్న చిన్న పువ్వులు వున్న గుడ్డని అంచుగా వేసి, అదే కలర్ బ్లౌజు వేసుకోవటం ఆంద్రప్రదేశంలో ఒక రకమైన వేలం వెర్రిగా కూడా మారిన సంగతి, పదేళ్ళ క్రితం విషయాలు జ్ఞాపకం వున్నవాళ్ళకి - ఇప్పటికీ గుర్తుండే వుంటుంది.
ఆ తరువాత అతడు ఎక్కడా ఆగలేదు. దాదాపు పది పన్నెండు షాపులకి ఆప్లిక్స్ సరఫరా చేసేవాడు. హైద్రాబాద్ లో కనీసం ఆరు ఆఫీసుల్లో ప్రతీ స్త్రీ అతడి దగ్గిర ఖాతా తెరిచింది. మొదటి ఆర్నెల్లలో అమ్మకాలు అరలక్ష దాటినయ్.
అప్పుడు కలిశాడు శర్మ అతడిని.....
5
ఏదో ఆఫీసులో చీరెల అమ్మకం విషయం మాట్లాడి అతడు మెట్లు దిగుతూ వుండగా, ఎదురుగా వస్తూ, శర్మ అతడిని ఆపుచేశాడు. 'ఫలానా షాపులో నాకు చీరమ్మింది నువ్వేకదూ' అని రవిని అన్నాడు. "ఆ రోజునుంచి నీ గురించి చూస్తున్నాము. పాపం నీ ఉద్యోగం పోయిందటగా నీ మీద అబద్దాలు చెప్పినవాడి ఉద్యోగం కూడా పోయిందటలే, మా ఆవిడ చెప్పింది. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?"
"వాయిదాల పద్ధతిమీద చీరెలమ్ముతున్నాను, గవర్నమెంటు ఆఫీసుల్లో."
"నీ చేతిలో గొప్ప ఆర్టుంది....మా కంపెనీలో చేరకూడదూ?" రవి నవ్వి, "జీతం ఎంతిస్తారు?" అని అడిగాడు.
"అయిదొందలు. ఓ.కే...."
"ప్రస్తుతం నాకు డిజైన్స్ కత్తిరించే వాడికి నేను అంతే ఇస్తున్నాను. క్షమించండి. మిమ్మల్ని హర్ట్ చేయటం నా వుద్దేశ్యం కాదు. ఇప్పుడు నేను చేస్తున్న ఆప్లిక్ పని బాగానే వుంది. దాన్ని వదిలి రాలేను."
"ఎంతుంటాయి నీ అమ్మకాలు?"
"క్రితం నెల దాదాపు లక్ష..."
శర్మ విస్తుబోయి అతడివైపు చూశాడు. తేజ టెక్స్ టైల్స్ హైదరాబాద్ విభాగం అమ్మకాలకన్నా అది ఎక్కువ.
శర్మవ్యాపారవేత్త! తన ముఖ భంగిమ అవతలి మనిషికి కనపడనీయకుండా, "పోనీ నీకు నీ వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో, అంతా ఇస్తాను. నీ ఆప్లిక్ వర్క్ అంతా మా కంపెనీకే చెయ్యకూడదూ?" అని అన్నాడు. దాదాపు ఆర్నెల్ల క్రితమైతే రవి ఎగిరి గంతేసి దానికి వప్పుకునేవాడే! అప్పుడు ఇతడు కేవలం ఒక బట్టల షాపులో సేల్స్ మెన్ కానీ.....ఇప్పుడు 'అమ్మకాల రుచి' చూచిన మనిషి! ఆ నిచ్చెన ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలియనివాడు. రిస్కుకి అలవాటు పడ్డవాడు.
"దానికెంత ఇస్తారు?"
"నెలకి పదివేలు."
అంటే సంవత్సరానికి లక్షా ఇరవై వేలు. ఫుట్ పాత్ ల మీద పడుకునే రోజుల్లో అందులో ఒక సున్నా తీసేసినా - అది కలలో కూడా ఊహించలేనంత పెద్ద రొక్కం.
తను చెప్పిన సంఖ్య, రవి మొహంలో తెచ్చే భావాల మార్పుని శర్మ మరోలా అర్ధం చేసుకుని, తను పొరపాటున ఎక్కువ చెప్పానేమో అనుకున్నాడు. "నువ్వు అన్నట్టు క్రితం నెల నీ అమ్మకాలు లక్షవుంటేనే సుమా" అని చివర్లో కలిపాడు.
శర్మ పదివేలు అనగానే వప్పుకోబోతున్న రవి, ఈ మాటలకి హర్ట్ అయ్యాడు. మొట్టమొదట, షాపులో ఆయన్ని చూడగానే గౌరవభావం కల్గింది. తేజా టెక్స్ టైల్స్ ఎమ్. డి. అనగానే, అనవసరంగా సలహా యిచ్చానా అని భయపడ్డాడు. కానీ యిప్పుడు ఈయన పూర్తి వ్యాపారవేత్తలాగే మాట్లాడటంతో, అతడూ అలాగే జవాబు చెప్పసాగాడు. అవును మరి. ఎప్పుడైతే వ్యాపారం రంగంలోకి దిగిందో ఇక అక్కడనుంచి మిగతావన్నీ పారిపోతాయి. తన చేతిలోని 'కళ' విలువ తెలిసినవాడు అతడు. తన వ్యాపారంలో యిప్పటికే పదివేలు లాభం సంపాదిస్తున్నవాడు అతడు. "సంవత్సరానికి లక్షా ఇరవైవేలు యిస్తామంటున్నారు. నాకు అంత అవసరంలేదు. మీ కంపెనీలో అయిదు శాతం షేర్లు ఇప్పించండి చాలు."