'ఇల్లు ఈ పాటికి తలకిందులు చేసి ఉంటారను కున్నాను మీరిద్దరూ' అంటూ ఎవరో వచ్చిన అలికిడికి లేచాడు బలరాం. వచ్చినావిడని చూసీ చూడగానే ఆదరంగా ముందుకి నడిచి లోపలికి ఆహ్వానించి కూర్చో పెట్టాడు. ఆప్యాయంగా అతని తలపై చేయి వేసి రాశారావిడ.
కూర్చుంటూనే 'నువ్విక నన్ను చూడడానికి రావేమో అని భయపడ్డాను బలరాం. ఏ రంభో, నిన్ను పట్టేసి ఉంటుంది -- ఇక నన్ను చూడవచ్చే ఓ కుర్రాడూ రాడని బాధపడి పోయానోయ్ ' అన్నారావిడ.
'లేదు అమ్మమ్మగారూ, నేను చాలా విశ్వాస పాత్రుడ్ని ' అంటూ నవ్వాడు బలరాం.
'లలితా ఈమె ' మన సుబ్బారావు గారికి తల్లి గారు. నా యిష్ట బంధువు.' అంటూ లలితని పరిచయం చేశాడు. వినయంగా లేచి నిలబడి లలిత నమస్కరించింది.
'ఈ అమ్మాయిని చూడాలనే వచ్చాను నేను. నాకు చూపడానికి ఎందుకు తీసుకు రాలేదని ఆగడానికి వచ్చాను. ఈరోజే సుబ్బారావు చెప్పాడు -- ' అన్నారావిడ నిశితంగా లలితని పరిశీలిస్తూ.
లలిత కూడా ఆవిడని పరీక్షగా వాల్చిన కను కోసల నుంచి చూసింది. పండు తమల పాకులాగా ఉన్న ఆమెకి ఎంత లేదన్నా డెబ్బయి అయిదు ఏళ్లు దాటి ఉంటాయి అని ఊహించింది. అంచులేని తెల్లని పట్టు పంచె కట్టుకున్నారు. తెల్లని వెండి వెంట్రుకలు చిన్న ముడిలో యిమిడిపోయాయి. చెవుల రవ్వల రుద్దలు పల్చని తమ్మల నుంచి ఒడులుగా దిగజారాయి. ఆమె మాట్లాడుతుంటే కదలాడుతున్నాయి. చేతికి గుత్తంగా నాలుగేసి జతల పాతకాలపు బంగారు గాజులున్నాయి. మెళ్ళో నాలుగు పేటల చంద్ర హారం వాడకంతో తెగసాగి బొడ్డు కింద దాకా వచ్చేసింది.
'నువ్వేనా తీసుకురాలేక పోయావా సరస్వతమ్మ అమ్మాయిని?'
"ఏమిటో కుదరలేదండి, లేకుంటే తీసుకురానూ' అంది సరస్వతమ్మ. 'అక్కడి కావిడగార్ని తీసుకు వెళ్ళకపొతే ఏం మునిగి పోయిందో' అన్నట్టు ముఖం పెట్టుకుందావిడ.
'ఇలారామ్మా వచ్చి నా పక్కన కూర్చో' అంటూ లలితని పిలిచారావిడ.
వెళ్ళి కుర్చీలో ఆమె పక్కనే కూర్చుంది లలిత.
'బలరాం, రామచంద్రం పోలిక లున్నాయి కదూ అమ్మాయిలో. బాగుంది కుందనపు బొమ్మలా గుంది. ఏమిటి ఇలా ఇక్కడే మగ్గ పెట్టేస్తావేమిటి? ఈసారి మనవాళ్ళంతా పార్యీ ఇస్తే తప్పక తీసుకు రావాలి అమ్మాయిని' అంటూ లలిత భుజం మీద చేయి వేశాడు. ' పేరుకి తగ్గ మనిషి. లలిత ఎంత ముచ్చటైన పేరు' తనలో తనుగా అనుకున్నారావిడ.
తరవాత ఓ అరగంట లో లలిత హృదయం పూర్తిగా దోచుకున్నారు అమ్మమ్మగారూ.... ఆవిడ సరస్వతమ్మ నీ సరళ నీ ఉన్నట్టే నా గుర్తించకుండా బలరాం తో మాట్లాడుంటే ఆశ్చర్యంగా చూసింది లలిత. ఓ గంట ఆ కబురూ ఈ కబురూ చెప్తూ గడిపారు. తరవాత 'ఇక లేస్తా ' నంటూ బయలుదేరారు.
కారు దాకా వెళ్లి తలుపు తెరచాడు బలరాం.
'ఈసారి లలితని తీసుకు రాకుండా నువ్వు రాకు' అంటూ కారెక్కారామె.
ఇదే సందని లలిత తోటలోకి తప్పుకుంది. సరస్వతమ్మ ని ఎదుర్కోడం అంటే భయంగా ఉంది లలితకి. తన ఉత్సాహం మీద ఇట్టే చన్నీళ్ళు చల్లుతుందావిడ అనుకుంది . తల్లీ కూతుళ్ళు ముఖాలు చూసుకుని ఊరుకున్నారు.
'ముసలి పీనుగ! అన్నిటిలోనూ తనూ ఉన్నానంటుంది' గట్టిగానే అంది సరళ.
'నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మాయి , ఆవిడ గారు సూటిగా బలరాం నువ్వా అమ్మాయిని పెళ్లాడాలి అని చెప్పేయ కలదు.' అని వార్నింగు ఇచ్చింది.
"నీకేం పిచ్చేమిటే అమ్మా! బలరాం కలలో కూడా అలా ఊహించడు. నీకు మతి పోయింది.' అంటూ తోటలోకి చూసింది సరళ.
'ఏమో నే'....అంటూ లోపలికి నడిచింది సరస్వతమ్మ.
"ఎన్నాళ్ళగానో అమ్మమ్మగారు చెప్తూనే ఉన్నారు -- మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక స్థిర పడాలోయ్ బలరాం.' అంటూ. మగవాడి బుర్ర లోకి ఆ ఊహ రానే కూడదు. వచ్చిందంటే -- అందులోనూ తగని పిల్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు -- అని సరస్వతమ్మ గారి అసలు భయం.
అమ్మమ్మగార్ని సాగనంపి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు బలరాం. ఈ అత్తయ్య నే లేనప్పుడెం చేస్తున్నట్టు? లలితని నలుగురిళ్ళకి తిప్పి పరిచయాలు చేసి ఉంటుందని అనుకున్నానే,' అనుకుంటూ బల్ల మీద కాళ్ళు పడేసి చేతి కందిన పుస్తకం అందుకున్నాడు.
పుస్తకం తెరవనే లేదు అలా చేత్తో పట్టుకుని తిరిగి ఆలోచనలలో మునిగి పోయాడు. 'అమ్మమ్మగారన్నది నిజమే లలితని ఎప్పుడో తన స్నేహితులకీ చుట్టాలకీ పరిచయం చేయవలసింది. లలిత చిన్న వయసులో ఉంది. సరదాగా కాలక్షేపం చేయాలని ఉండదా?...ఇక్కడా మళ్ళీ సుబ్బమ్మ గారితో లాగే ఉంటె పాపం ఏం బాధగా ఉంటుందో ....నలుగురిని కలుసుకోవాలి. ప్రపంచం చూస్తె కదా లోకం పోకడ తెలిసేది -- నేనే ఆ పనికి పూనుకోవడం ఉత్తమం -- సరస్వతత్తయ్య మీద వదిలితే లాభం లేదు.' అనుకుని ఓ నిర్ణయానికి వచ్చాడు బలరాం.... ఆలోచనలు ఆగాయి. చేతిలో పుస్తకం తెరిచాడు.
రాత్రి భోజనాల దగ్గిర చెప్పాడు బలరాం.
'రేపు నేనూ లలితా టౌను లోకి వెడతాం. కారు సంగతి చూసి అమ్మమ్మ గారితో కాస్త కాలక్షేపం చేసి వస్తాం' అన్నాడు నెమ్మదిగా.
తను చేయదలచుకున్నది ఎంత సూటిగా చెప్తాడో మళ్ళీ ఓసారి గ్రహించింది లలిత. అతనికి అడ్డంకుల లెక్క లేదు. వాటిని ఉన్నట్టే గమనించడు.
'నాకూ కొంచెం పనుంది బలరాం.' నేనూ సరళ కూడా బయలుదేరుతాం. అన్నారు సరస్వతమ్మ గారు.
'దానికేం, టిఫెన్ కాగానే బయలుదేరుదాం. మధ్యాహ్నం భోజనం అక్కడ చూసుకుందాం.' అంటూ లేచాడు బలరాం.
రాత్రంతా నిద్ర పట్టలేదు లలితకి------ తనకీ అంటూ కారు వస్తుందని ఒకపక్క సంతోషం. మళ్ళీ బలరం తో తిరిగి రావచ్చు. అమ్మమ్మగారి వంటి ఉత్సాహవంతురాలిని చూడచ్చు-- అని ఒక వైపు నిద్ర రాకుండా చేశాయి.
పొద్దుటే లేచింది మొదలు రత్తి ఒకటే హడావిడి పెట్టింది. ఈ చీర కాదని, అది కాదిదని ఒకటే గోల అది- 'ఆ సరళమ్మని చూడండి. పొట్ట కన్పిస్తూ బొమ్మలాగా కడుతుంది కోక. నీకేం బంగార బొమ్మవి ఎలా కట్టినా అందంగా ఉంటావు.' అంటూ ఎర్రని చీర జాకట్టు కట్టి తీరాలంది.
లలిత కిందికి దిగేసరికి అంతా డైనింగ్ హాలులో బల్ల ముందున్నారు. ఒక్క సారి అందరి కళ్ళు లలిత మీద కేంద్రికరింపబడ్డాయి. గబగబ దిగివస్తూ 'రాత్రి ఏదో చదువుతూ పడుకున్నాను. లేచేసరికి లేటయింది.' అంటూ తన స్థలం లో కూర్చుంది.
'ఫరవాలేదు లలితా, అర్జెంట్ ఏమీ లేదు ' అంటూ రెప్ప వాల్చక లలిత అలంకరణ ని చూస్తున్నాడు బలరాం.
మరీ గాడీగా బట్టలు వేసుకున్నందుకు లోపల్లోపలే తిట్టుకుంది లలిత.
అంతా బయలుదేరారు బలరాం డ్రైవు చేస్తున్నాడు. పక్కనే సరస్వతమ్మ కూర్చుంది. వెనక లలితా సరళా కూర్చున్నారు. కారు కాంపౌండు దాటేక కాని గమనించలేదు లలిత -- సరళ ఎంత ముభావంగా కూర్చున్నది.
టౌను లో ఎవరి పనుల మీద వాళ్ళు తమకి కావాల్సిన చోట దిగిపోయారు.
'నువ్వు వచ్చి ముందు కూర్చో లలిత . అంటూ తలుపు తెరిచాడు బలరాం.
సరస్వతమ్మ కూర్చున్న స్థలం లో లలిత కూర్చుంది.
'ఇప్పుడు వెళ్లి కారు చూద్దాం. ఇప్పుడే తోలుకు వెళ్ళడానికి వీలుండదనుకో-- అదోచ్చేసరికి ఎంత లేదన్నా ఎనిమిది వారాలు దాటోచ్చు. ముందు బేరం చేద్దాం సరేనా?' రోడ్డు చూస్తూ జాగ్రత్తగా కారు నడుపుతూ అడిగాడు బలరాం.
'ఇప్పుడునవసరపు ఖర్చుమో, విడిగా నాకెందుకు కారు? ఎక్కడి కేడతాను? వద్దులే" అంది లలిత.
'నీ డబ్బు నీకివ్వడం కర్చేమిటి లలితా.... చెప్పానుకా నేనా ముసలి వాణ్ణి నీ కాళ్ళ పై నువ్వు నిలవాలి . తెలుసా? కొంటెగా నవ్వుతూ అన్నాడు బలరాం.
లలిత కూడా గట్టిగా నవ్వేసింది... ఇంత స్నేహంగా సన్నిహితంగా ఎప్పుడూ అనిపించలేదు....అందుకే కాబోలు ఇల్లు రెండురోజులు బోసిగా తోచింది -- బలరాం లేకపోవడం.... అనుకుంది లలిత.
'నాకసలు డ్రైవింగు వస్తుందను కోలేదు ..అయినా సరస్వతమ్మ గారికి నే కారు తోలడం , నువ్వు కొంటాననడం అంతగా ఇష్టం లేనట్టుంది...' నసిగింది లలిత.
'రబ్బిష్! ఇదేం పాతరాతి యుగమా? ఎందరమ్మాయిలు కార్లు తోలుకుంటూ హాయిగా ఉండడం లేదు.... అయినా నీకెప్పుడు కాపలా అవసరమో నే గుర్తించకలనులే --' అన్నాడు కారుని ఓ కంపెనీ ముందు ఆపుతూ.
'తన ప్రాణం విసిగించలపోతే చాలు కాబోలు, నేనేమైనా అవసరం లేదు' అనుకుంది లలిత. 'అతనికి తలనొప్పి తెప్పించకుంటే చాలు' అన్న ఊహ ఎంత కూడదన్నా మనస్సులో ప్రవేశించింది లలితకి.. అయినా ఎక్కడో కొంచెం తన బాధ్యత ని సరదా గానే మోస్తున్నాడు అనిపించక పొతే ఉండలేదింక అక్కడ. అందుకే అటువంటి ఊహని తలెత్తనివ్వకూడదని తలపోసింది లలిత. తనేమాత్రం ఇచ్చిన స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసినట్టు తెలిసినా కట్టడి చేస్తాడు-- అందులో సందేహం లేదని కూడా గ్రహించింది లలిత.
సరదాగా చాలాసేపు పట్టింది కారు బేరం -- చక్కటి తెల్లటి కారు. రెండు నెలలో ఇస్తానన్నాడు. అంతే రాతా కొతా ముగిసేసరికి ఒంటిగంట దాటింది. కారుని అమ్మమ్మగారింటికి మళ్ళించాడు బలరాం. అప్పటికే అక్కడికి వచ్చేశారు సరస్వతమ్మ , సరళా. అమ్మగారిల్లంతా నవ్వులతో కబుర్ల తో కలకలలాడుతుంది. సరళ తన స్నేహితులందరినీ చుట్టేసుకు వచ్చింది.
అందర్నీ బలరాం భోజనానికి ఆహ్వానించాడు . పొలోమంటూ మూడు కార్ల లో బయలుదేరారు అంతా. అమ్మమ్మగారితో ఉండిపోవాలని అనిపించింది లలితకి. తను వాళ్లతో ఈ జన్మకి కలవలేదు.
అయినా బలరాం బలవంతం మీద బయలుదేరింది. బట్లర్ల కి ఆర్డరు వినబడనంతగా మాట్లాడుతున్నారు అంతా. మౌనంగా చూస్తూ కూర్చుంది లలిత. సరళ లేచి పక్క టేబిలు దగ్గర భోజనం చేస్తున్న వారిని పలకరించడానికి వెళ్ళింది.
'రా నిన్ను బలరాం కి పరిచయం చేసి తీరాలి. పట్నం లో ఎవరెవరు నీ స్నేహితులంటే ఎందర్నో చూపెట్ట కల్గాను నిన్ను తప్పించి.' అంటూ ఒక వ్యక్తిని చేయి పట్టుకు లాక్కు వచ్చింది.
'బలరాం, మోహన్, గొప్ప నటుడు , రచయిత కూడా' అంటూ పరిచయం చేసింది.
'లలిత , బలరాం చుట్టాలు ' అంటుంటే లలిత కళ్ళు పైకెత్తి చూసింది. అంతే మరుక్షణం లో ఆమె ముఖం పాలిపోయింది. మోహన్ కూడా వింతగా ఏదో ఆద్భుతాన్ని చూస్తున్నట్టు లలిత కళ్ళల్లోకి చూస్తున్నాడు.