"మరి చెప్పలేదేం?"
"మీరు పెళ్ళి ముచ్చట్లలో ఉన్నారు." అవి అప్పుడే తేలవనిపించింది."
"తెలటానికేముంది! ఒక్క నిముషం" అంటూ సుదర్శనం గారు- అమ్మాయ్ , అపర్ణా!' అంటూ కేక వేశారు.
అపర్ణ వచ్చింది. "ఏం మామయ్యా?" అంది.
అయన విషయం వివరించాడు.
"అన్నయ్యను వెళ్ళనివ్వండి. మళ్ళీ రాత్రికి వస్తాడుగా?"
"కాదమ్మా! మేం వెళ్ళాలి. చాలా అవసరం."
"మరైతే -- ఉత్తరం వ్రాస్తాం లెండి!"
"ఎంత లౌక్యరాలవయ్యావు , అపర్ణా! సరే, అయితే! ఉంటాం లే!"
"మరి కాకపోతే -- ఆడపిల్ల పెళ్ళి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు వస్తే అవుతుందిరా, తమ్ముడూ! బెట్టు చేస్తారు. క్షణాల్లో తేలుస్తారా?" అన్నారు సూర్యం అన్నాయన.
"అయినా తేలేదేముంది! కృష్ణ చెప్పనే చెప్పే! చెల్లెలూ , పిన్ని గారూ ఒప్పుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని. ఆయన్ని వెళ్ళనివ్వండి. వదిన గారూ, అపర్ణా ఇక్కడే ఉన్నారుగా?" అన్నది సుదర్శనం గారి భార్య.
కృష్ణ లోని కెళ్ళి ఒక సంచీలో కావలసినవి వేసుకుని పది నిమిషాల్లో వచ్చాడు.
ఇద్దరు మామల దగ్గరా సెలవు తీసుకుని అందరికీ వెళ్ళి వస్తానని చెప్పి గిరిధారి తో కలిసి వెళ్ళిపోయాడు.
18
మళ్ళీ రాత్రికి వచ్చేసరికి ఇల్లు చుట్టాలు లేక చిన్నబోయి ఉంది.
"వాళ్లేరీ?' అన్నాడు కృష్ణ.
కాంతమ్మ గారు మంచినీళ్ళ చెంబు, గ్లాసు బల్ల మీద పెట్టి, "వెళ్ళిపోయారు" అన్నది.
"ఏం?' ఉంటానన్నారుగా!"
"వాళ్ళెంత తరిచి అడిగినా అపర్ణ అలోచించి ఉత్తరం వ్రాస్తామన్నది. కోపం వచ్చినట్లుంది. సరే, అలాగే వ్రాయమని వెళ్ళిపోయారు."
"నువ్వైనా అపలేకపోయావా, పిన్నీ?"
"నా మాటకూ, అభిప్రాయానికి ఒక విలువా, గౌరవమూ అంటూ ఉంటె తప్పక ఆపేదాన్ని, నాయనా. చిన్ననాడు మీకు అయాను, మీరు పెరిగాక వంట మనిషి నయాను." కాంతమ్మగారు తీవ్రంగా అన్నది.
"పిన్నీ!" కృష్ణ తో పాటు అపర్ణ స్వరమూ కలిసింది.
"విషయం మించి పోలేదు. వాళ్ళ కంత పట్టుదలా, తొందరా దేనికి అప్పుల వాళ్ళలాగా? నాన్న పోయి నప్పుడు కూడా రాలేదు వాళ్ళు. ఇప్పుడు వచ్చి నిలేసినట్లు మొరాయించడం ఏం మర్యాదగా ఉంది? అది చిత్రమైతే ఇంత గొప్ప సంబంధం ఎక్కడ చిత్లిపోతుందో నని నువ్వు అరాతపడటం అంతకన్నా విచిత్రంగా ఉంది. అన్నయ్యకు పెళ్ళి కాదనా నీ భయం? ఇంటికి అమాంతం పిల్లతో సహా వచ్చి కూర్చోవటమే నాకు రోత అనిపించింది."
"కావాల్సిన వాళ్ళం కనక వచ్చారు. తప్పేముంది? పిల్ల యోగ్యురాలు. పెద్దల ఒద్దికలో పొందికగా పెరిగింది."
"ఏమిటా ఒద్దికా, పొందికా! ఏమడిగినా సమాధానం చెప్పకుండా వాళ్ళ అమ్మా, నాన్నల వేపు చూస్తుంది. పిల్లను నోరు తెరవనివ్వకుండా వాళ్ళే సమాధానం చెబుతారు. ఇంత వ్యక్తిత్వం లేని పిల్లను నా వదినగా ఆహ్వానించ లేను. ఆ తరవాత వాడి ఇష్టం."
'అంతేనమ్మా! అంతే! కాదని ఎవరన్నారు? మీ ఇష్టం. నా స్థానమేదో నాకు తెలిసి కూడా మళ్ళీ ఒకసారి పిచ్చి పుల్లమ్మ నయాను" అంటూ లోని కెళ్ళింది కాంతమ్మ గారు.
కృష్ణ ఆమెతో పాటు లోనికి వెళ్ళాడు.
అపర్ణ గిరిధారిని చూసి చేతులు జోడించి ఒక వినిపించని నిట్టుర్పు వదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది.
కృష్ణ వచ్చాక చెప్పి వెళదామని అతను అక్కడే ఉన్న పేపర్ అందుకున్నాడు.
* * * *
"మీరా?"
"ఔన్నాయనా, నేనే!"
"కబురంపితే వచ్చేవాడిని గద!"
"ఎవరు వస్తే ఏం లే!"
"కూర్చోండి!" అంటూ కుర్చీ చూపించాడు.
కాంతమ్మ గారు కూర్చున్నది.
రెండు నిమిషాల సేపు ఎవరూ మాట్లాడలేదు. ఆమె చుట్టూ చూసింది. గిరిధారికి ఏ ఉద్యోగమూ లేదు. అయినా హాయిగా ఉన్నాడు. అతని గడిలోనివీ, వాడేవీ వస్తువులను బట్టి అతని అంతస్తును అంచనా వేయవచ్చు. అతను తాడూ బొంగరం లేనివాడు కాదు. గంబీరమైన వ్యక్తిత్వం ఎవరినీ నొప్పించడు. స్నేహశీలి, కాంతమ్మ గారు ఆలోచిస్తుంది.
"నీవు మాలో ఒకడుగా మేలుగుతున్నావు గనక నీ ముందు నేను సంకోచించవలసిన అవసరం లేదను కుంటాను." తన ప్రస్తావనకు నాందిగా అన్నది కాంతమ్మ గారు.
"ఎంతమాత్రం లేదు."
"తన తల్లి జీవితానికి నేను ప్రత్యర్ధి గా సంచరించానని అపర్ణ అనుమానం. దాని అనుమానానికి ఆస్కారం లేకపోలేదు. నాకు బావ అంటే ప్రాణం. మేనత్త, మేనమామ బిడ్డలం. చిన్ననాటి నుంచి మాతోనే మా ఆశలు పెంచుకుంటూ పెరిగాం. భవిష్యత్తు లో మా మధ్య ఒక కనిపించని అడ్డుగోడ ఉందనే విషయం మాకు కానీ, మమ్మల్ని చూసిన వారికి గానీ కలలో కైనా రాలేదు."
"ఏమిటా అడ్డుగోడ?"
"జాతకాలు! నాకు వైదవ్యయోగముందని బయట పడింది. ఎవరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. బావ మాత్రం పట్టుపట్టాడు. అతన్ని మార్చలేక చివరి కందరూ భారం నా మీద వేసి తప్పుకున్నారు. నేనేం చేయను? ఆరోజుల్లో ఇప్పటి కన్నా చాలా ఎక్కువగా ఉండేది జాతకాల నమ్మకం. చూస్తూ అందర్నీ కాదని ముందడుగు వేయలేకపోయాను. ఏడిచీ, మొత్తుకునీ చివరకు బావను మరో వివాహానికి ఒప్పించగలిగానే కాని అయన మనసులో ఉన్నది నేనేనని నాకు తెలుసు."
కాంతమ్మ గారు కళ్ళు తుడుచుకుంది. ఆమె ఏడుస్తూన్నది.
కొంచెం సర్దుకుని ఆమె తిరిగి ప్రారంభించింది. "కాలం గడిచింది. రెండు పుష్కరాలు గతించి పోయాయి. అపర్ణ ఆరేడేళ్ళ పిల్లగా ఉండగా ఆమె తల్లి పోయింది. నేనప్పటికే భర్తను పోగొట్టుకుని, అయన దాయదుల్లో నన్నెవరు పోషించాలో తెలియక నిరాధారంగా వారి పంచనా, వీరి పంచనా జీవిస్తున్నాను. అపర్ణ తల్లికీ, బావకూ నా మూలంగా ఒక రగడ జరిగిందని నాకు తెలుసు! ఆ పరిస్థితుల్లో బావ నన్ను రమ్మనలేకపోయాడు. నేనూ వెళ్ళలేదు. చివరి కామె పోయింది. ఆ పిల్లల పోషణకూ, ఇల్లు కనిపెట్టుకుని ఉండటానికి ఒక అడ సాయం అవసరమైంది. నేను వచ్చి ఉండి పోయాను. కానీ...."
"చెప్పండి!"
"బావకూ, నాకూ మధ్య అపర్ణ ఊహించే సంబంధం మాత్రం లేదు. ఒకరి హృదయాన్ని మరొకరి హృదయం నిక్షిప్తం చేసుకోవడం లోనే మేము తృప్తి పడ్డాము. ఇది మాత్రం నిజం! బావ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను."
గిరిధారికి ఆమెకు నమస్కరించాలనిపించింది.
"చిన్నప్పట్నించి అపర్ణను పెంచారు మీరు. కానీ, ఆమె కన్నా కృష్ణ ను ఎక్కువ అభిమానిస్తున్నారు ఏమంటారు?"
"వాడు తండ్రి పోలిక! తండ్రికి నా మీద గల గౌరభిమానాలను కూడా వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు. తల్లికి నా పట్ల గల ఈర్ష్యా సూయలు అపర్ణ పాలయ్యాయి. ఆమె నన్ను ద్వేషిస్తుంది. నేనామెకు భయపడతాను."
గిరిధారి కళ్ళు కూడా చెమర్చాయి.
'అయినా ఆ ఇంటిని వదలలేక పోతున్నాను. బావ పోయిన ఇంట్లో ఆ జాగాలోనే మరణించాలని నా కోరిక! అయన సమాధి పక్కనే కాకపోయినా ఆ ప్రాంతంలోనే మట్టిలో కలవాలని మరో కోరిక!"
"అమ్మా!' అతను చేతులు జోడించాడు.
"నాయనా! నేను గొడ్రాలిని! అయినా నీ ఈ పిలుపుకు కోటి జన్మల మాతృత్వపు పులకరింతను అనుభవించాను. ఇంతకూ నేను నీ దగ్గరి కోక స్వార్ధం తోనే వచ్చాను."
"నిరభ్యంతంగా చెప్పండి!"
"కృష్ణ భార్య నేను మెచ్చిన కోడలు కావాలి."
అతను విచలితుడయ్యాడు. ముందు కాసేపు ఏం చెప్పాలో, ఎలా ప్రారంభించాలో తోచలేదు.
"ఈ విషయం కృష్ణ కే వదిలేస్తే?" అన్నాడు చివరకు.
"వాడికేం తెలుసు!"
"వధువు ఎన్నిక వరకూ అతనికి వదలటం న్యాయం!"
"అంతే నంటావా?"
"అవును. నేను అపర్ణకూ ఇదే చెప్పదలుచుకున్నాను. ఈ ఒక్క విషయంలో మీరు ఇద్దరూ తప్పుకోమని నా సలహా! నేను కూడా ఉంటాను గద? బంధుత్వాలైతే చెప్పలేను గాని, అంత అయోగ్యమైన సంబంధాలు మీకు వలలు వేస్తుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా?"
"ఆ మాత్రం హామీ చాలు! వాడు పసివాడు. వాడి సంగతేదో చూడందే అపర్ణ తన విషయం ఆలోచించేలా లేదు. నిజం చెప్పాలంటే అది ఉత్త మూర్ఖురాలు. మొండి! ఆమె తల్లి మూలంగా భర్త ఎంత సుఖపద్దాడో నాకు తెలుసు!"
అతను మౌనం వహించాడు.
"నేను వెళ్ళి వస్తాను, నాయనా! ఇటువంటి ఒంటరి అవకాశం కోసమే నిన్ను వెదుక్కుంటూ వచ్చాను."
"మంచిది. మీరు నిశ్చింతగా ఉండండి! ఏ విషయంలోనైనా నేను చెయ్యగల సాయం తప్పక చేస్తాను."
ఆమె వెళ్ళిపోయింది.