నిజంగా తన మనసు చంచలమైనదా?
ఇంచుమించు సంవత్సరానికి పైగా సరళతో సన్నిహిత పరిచయం ఉంది. సరళ పరీక్షలు కాగానే అత్తయ్యకు చెప్పి పెళ్ళి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. సరళను తప్ప ఇతరులను గురించి ఆలోచించని తన మనసులోకి ప్రయత్నించిన సరళ రావటం లేదు.
జనకిలోని ఏ శక్తి తననింత వశపరుచుకుంది? నిజంగా జానకి అన్నట్లు తన మనసు మళ్ళీ మారుతుందా? అంత బలహీనమైనదా? ఇంతవరకూ ఎందరో అందమైన స్త్రీలతో పరిచయమయింది. ఎవరికోసమూ తన మనసిలా పరితపించలేదే!
సరళ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది?"
అసలు సరళకీ సంగతి ఎలా చెప్పాలి?
రకరకాల ఆలోచనలతో వేగిపోతూ ఎప్పటికో గాని నిద్ర పోలేకపోయాడు మాధవ.
ఉదయం కాఫీ కప్పుతో సమీపించిన జానకిని చూసేసరికి అతని మనసు మళ్ళీ వశం తప్పింది. శరీరం ఉరకలు వేసింది. అతి బలవంతాన నిగ్రహించుకున్నాడు. జానకి తనను కాముకుడనుకుంటుంది. తను కొంతసహనం వహిస్తే తన ప్రేమ ఆమె అర్ధం చేసుకునే రోజు రాకపోదు.
కుర్చీలో కూచుని ఏదో ఎంబ్రాయిడరీ కుట్టుకుంటుంది కాత్యాయని. కాత్యాయని చక్కగా కుట్టగలదు. ఇంత వయసొచ్చినా ఆవిడ ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నురాలయ్యే ఉంటుంది. జానకి తను కూడా ఓ బట్ట తీసుకుని కాత్యాయని దగ్గర కుట్టు నేర్చుకుంటుంది. మాధవ వెళ్ళి కాత్యాయని దగ్గర కూచున్నాడు. కాత్యాయని నవ్వి "నా తప్పు లేదు మాధవా! జానకిని నీ దగ్గరికి వెళ్ళమని ఇందాకటినించీ పోరుతూనే ఉన్నాను. తనే నా మాట వినకుండా ఇక్కడ కూచుంది. చూశావా జానకీ! నేను చెప్పలేదూ, నువ్వెళ్ళకపోతే వాడే ఇక్కడకు వస్తాడని....." అంది.
జానకీ, మాధవ కూడా సిగ్గు పడిపోయారు.
"నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పటానికి వచ్చానత్తాయ్యా!" త్వరగా అన్నాడు.
కాత్యాయని తెల్లబోయి చూసింది.
"రేపా! ఇంకా నాలుగురోజుల వరకూ సెలవు పెట్టావుగా" అంటూనే జానకి వైపు చూసింది. జానకి తల వంచుకుని దీక్షగా కుట్టసాగింది. నిజానికి మాధవకూ ఉండాలనే ఉంది. కాని జానకి సమక్షంలో తనను తను నిగ్రహించుకోలేకపోతున్నాడు. చివరకు బలత్కారంగా నైనా సరే జానకిని పొందాలన్నంత ఉద్రేకం పోగుతోంది అతనిలో, సంఘం తనకొచ్చిన అధికారాన్ని ఉపయోగించి జానకిని వశపరుచుకునే\టంత పశుత్వం లేదతనిలో. జానకి తనను అర్ధం చేసుకునే వరకూ సహానం వహించాలనే నిర్ణయించుకున్నాడు. కాని ఈ ఘర్షణకు తట్టుకోవడం కష్టంగా ఉంది. అందుకే వెళ్ళిపోవటానికే నిర్ణయించుకున్నాడు.
"అవును , కాని.....అక్కడ కొంచెం పనులు ఉన్నాయి. వెళ్ళాలి"
ఒక్క క్షణం కాత్యాయని మాధవనూ, జానకినీ మార్చి మార్చి చూసింది.
"నీ యిష్టం" అనేసి తన కుట్టు పనిలో లీనమైపోయింది.
* * *
మెద్రాస్ చేరుకున్న దగ్గర్నుంచీ మాధవకు , సరళ నెలా ఎదుర్కోవాలన్నదే పెద్ద సమస్య అయిపొయింది. తను వచ్చిన సంగతి మోహన్ ద్వారా సరళకు తెలిసి తీరుతుంది. ఇంక సరళ వచ్చేస్తుంది. అంతకు పదిరోజుల క్రితం వరకూ సరళ రాకకోసం ఉత్సాహంతో ఎదురుచూసే మాధవ ఆరోజు ఏదో భయంతో ఎదురుచూస్తూ కూచున్నాడు.
సరళ వస్తూనే మాధవ మెడ చుట్టూ చేతులు పెనవేసి "ఇన్నాళ్ళకా రావటం?" అంది గారాబంగా.
మాధవ నెమ్మదిగా ఆ చేతులు విడిపించుకున్నాడు. సరళను చూస్తూనే ఉద్వేగంతో కొట్టుకుపోయే తనలో, సరళ స్వయంగా మెడ చుట్టూ చేతులు వేసినా, ఏ సంచలనమూ కలగకపోవటం అతనికే ఆశ్చర్యం కలిగించింది.
'అలా స్థిమితంగా కూచో చెపుతాను" నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు.
సరళ దెబ్బతిన్నట్లయింది. తను మెడ చుట్టూ చేతులు వెయ్యగానే తనను మరింత గాడంగా దగ్గరికి తీసుకోవడానికి బదులు విడిపించుకున్నాడు. ముఖం ముడుచుకుని ఎడంగా కూచుంది. వదిలిపోయిన సరళ ముఖాన్ని చూడగానే జాలి కలిగింది మాధవకు.
"బాగా చదువుతున్నావా?" ఆదరంగా అడిగాడు.
"ఆ! ఇంక రెండు నెలలేగా పరీక్షలు! శ్రద్దగా చదువుతున్నాను. క్లాస్ తెచ్చుకోవాలి"
"నీకు తప్పకుండా క్లాస్ వస్తుందిలే!"
"థాంక్స్"
"నీతో కొన్ని సంగతులు చెప్పాలి సరళా!"
"అదేంటి? అంత గంభీరంగా ముఖం పెట్టావ్? ఇప్పుడే సంగతులూ వద్దు బాబూ! ముందు చదువుకోవాలి. పరీక్షల ముందు సంగతుల మీదికి మనసు మళ్ళించలేను. పరీక్షలయ్యాక చెపుదువుగాని, ఎంత సేపైనా వింటాను . ఇక రెండు నెలలేగా!"
అతను చెప్పబోయేది తమ వివాహ విషయమే అని ఊహించుకున్న సరళ చిలిపి నవ్వుతో అంది. సరళ అలా అనుకోవటంలో వింతలేదు. అంతకముందు వివాహప్రస్తావన లేకుండా మాధవ ఎన్నడూ సరళతో సంభాషించలేదు. మాధవ ఆలోచనలో పడిపోయాడు. నిజమే, సరళకు ఇంక రెండు నెలల్లో పరీక్షలు. ఇప్పుడే తన వివాహం సంగతి చెప్తే ఏ విధంగా తీసుకుంటుందో? మనసును క్షోభపెట్టుకుని పరీక్షలు పాడుచేసుకుంటే సంవత్సరం చదివిన చదువు అంతా వృధా అయిపోతుంది. పోనియ్! పరీక్షలైపోయాకే చెప్పొచ్చు.
"ఏమిటా దీర్ఘాలోచన? ఏమైనా సరదా కబుర్లు చెప్పు"
"ఏమున్నాయ్? నువ్వు చదువుకో!"
"చదువుతాలే ! దగ్గర దగ్గర పదిరోజుల నించీ నిన్ను చూడలేదు. నాకెలా ఉందనుకున్నావ్? భావనలో ఎప్పుడూ నిన్ను నాలోనే ఉంచుకోగలననుకో. అయినా ప్రత్యేక్షంగా నిన్ను చూడకుండా ఒక్కరోజు గడిచినా నేను భరించలేను. రోజులు లెక్కపెట్టుకుంటున్నాను ఎప్పుడొస్తావా అని. నిన్ను చూడకుండా నీతో కబుర్లు చెప్పకుండా చదువుకోగలననే అనుకుంటున్నావా? ఇంత మాత్రంలో చదువేమీ పాడుకాదులే! అయినా సరే! అంత నిగ్రహం నాకు లేదు బాబూ!" తన్మయత్వంతో తనను చూస్తూ అమాయకంగా చెప్పుకోపోతున్న సరళ మాటలు వింటుంటే మాధవ మనసు ఏదో వేదనతో మూలిగింది.
"నువ్వేదో మారిపోయావు" మాధవ ముఖంలోని చూస్తూ నవ్వుతూ అంది సరళ.
"మారానా/ ఏమో! మార్పు ప్రకృతి సహజం కదా?"
"బాగుంది! అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటావా?"
గతుక్కుమన్నాడు మాధవ. సరిగ్గా జానకి కూడా ఇలాగే అడిగింది. దానికి సరయిన సంజాయిషీ దొరకటం లేదు తనకి.
"ఎప్పుడూ మారకపోవచ్చు. ఏదయినా బలమయిన అనుభూతి మనుషులను మార్చవచ్చు. ఆ మార్పు స్థిరంగా నిలిచిపోవచ్చు. ఇదంతా అనుభవం మీద కాని అర్ధం కాదు."
"ఓహో! అంత అనుభవం తమరికేం వచ్చిందో! అయినా, ఈ వేదాంత మంతా ఎక్కడ నేర్చావ్ బాబూ! అది సరే కాని మీ ఊరి నుంచి నాకేం తెచ్చావ్?ఇంకా నా సంపెంగ పువ్వులు నా కియ్యవెం? నీ అంతట నువ్వే తెచ్చి నా తలలో పెడతావని ఇందాకటి నుంచీ ఎదురు చూస్తున్నాను."
వెలవెలపోయాడు మాధవ. సరళకు ఆకు సంపెంగలంటే చాలా ఇష్టం. తమ ఊరు నుండి ఎప్పుడు వచ్చినా సరళ కోసం సంపెంగలు తేవటం ఇంత వరకూ ఎన్నడూ మరిచిపోలేదు. వెలవెలపోయిన మాధవను చూసి సరళ ముఖం పాలిపోయింది. మాధవ ముఖంలోకి చూస్తూ కంపిత స్వరంతో అంది.