Previous Page Next Page 
మమత పేజి 11

'ఆ పిల్లని ఆ గుమ్మంలో పెట్టేయి. లేకపోతే నీ చేతిలోంచి జారి కొట్టుకుపోతుంది...పద, పద!'
-ఆ మాటలతో ఆ పిల్లని ఆ గుమ్మంలో వదిలి, వాళ్ళందరితోపాటు పరుగెత్తి ఓ భవనంలోకి వెళ్ళి ఆగాను - నేనూ అక్కడే!
...ఎటుచూసినా నీళ్ళు. ఆ భవనంపైన, గోడల పైన.... ఇష్టం వచ్చినట్లుగా! గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకు నిలబడ్డాం. ఎంతసేపో! -నాకు ఒకటే ధైర్యం, ఈ వరద తగ్గాక నా పిల్లని నేను తెచ్చుకోగలను, అలా కాకపోతే ఈ పాటికి నా చేతుల్లోంచి జారి కొట్టుకుపోయేదే అనుకున్నా" అంది.
తులసమ్మ వింటోంది...
"అలా ఎంతసేపు, ఎన్ని గంటలు అక్కడుండిపోయాయో అంతా - వరదలో కొట్టుకొస్తున్న టీవీలు, కార్లు, గిన్నెలు, ఎన్నో అన్నీ చూస్తుంటే నెమ్మదినెమ్మదిగా నీరు తగ్గింది. ఒకరొకరూ అలసిపోయినవాళ్ళు అక్కడ దిగి జారి పడకుండా అడుగులో అడుగులేస్తూ నడుస్తున్నారు. నాకు ఒక్కటే ధైర్యం - నా పిల్ల క్షేమంగా వుందని! కానీ...'
"ఆ ఇల్లు గుర్తు పడతావా యిప్పుడు?" అంది తులసమ్మ ఏదో ఆలోచిస్తూ.
"తిన్నగా కాళ్ళీడ్చుకుంటూ ఆ ఇంటికెళ్ళా చీకటి పడింది. తలుపు తీసింది యిల్లాలు-అంతే... 'పో- పిల్లెవరు, నువ్వెవరు? - ఆ పిల్ల లేదు' అంటూ తిట్టి తోసిపారేసింది. ఏం చేయాలీ, నా పిల్ల ఏది పిన్నీ..?" - లీల మళ్ళీ ఫిట్ వచ్చి పడిపోయింది.
తులసమ్మ కళ్ళు తుడుచుకుంది. అంటే.... చీకట్లో ఓ ఇంటి గుమ్మంలో పడుకోబెట్టిందా, మరురాత్రి ఏడుగంటలకి వచ్చిందా- పిల్ల లేదా- అసలు ఆ ఇల్లు గుర్తుపట్టగలదా? ఇది నిజమేనా?
- తులసమ్మ లీలవంక చూస్తోంది. పాపం.... తల్లి! తల్లి మనసు గాయపడితే ఎలా!! తల్లీ పిల్లల్ని కలపగలదా తను? నిజంగా ఆ పిల్ల బతికుందా?
-తులసమ్మ కళ్ళు మూసుకుకూచుంది. పిల్లని దాచుకుని ఎం చేస్తారూ, తల్లి అడిగితే ఇచ్చేయాలికదా!! దీర్ఘంగా నిట్టూర్చింది తులసమ్మ.
గుమ్మంలో ఆటో ఆగింది. సుధాకర్ వచ్చాడు- "లీలని డాక్టరుకి చూపిద్దాం!" అన్నాడు.
"నీతో తీసికెళ్ళు" అంది తులసమ్మ.
"చచ్చినా రాను. నా పిల్లతో మాత్రమే వెడతాను. నేనూ, నా పిల్లా బయటికి రావటానికి ఆరోజు కారణం నువ్వే!" అరుస్తూ కొట్టడానికొచ్చింది లీల.
భయపడిపోయాడు సుధాకర్.
"చూడు అమ్మమ్మా- ఇల్లు అద్దెకిచ్చేసున్నా - ఆ అద్దె డబ్బులు లీలకిచ్చేయి-ఎప్పుడు వస్తానంటే అప్పుడు తీసికెడతా- నా ఉద్దేశం... లీల చెప్పే మాటలేవీ అర్ధం లేనివనీ!" అన్నాడు.
అన్నం తింటూ- "కన్నా కూతురెక్కడుందో తెలియని దురదృష్టవంతుడ్ని నేను!" ఆ మాట అంటూంటే, సుధాకర్ గొంతు వణికింది.
"అమ్మమ్మా... ఆ పిల్ల నా కళ్ళలో మెదులుతోంది! దాని కుడి చెవికి పైన కొద్దిగా నొక్కుకున్నట్టుగా వుంది. గుర్తుందా- మా అత్తగారు చెప్పింది అది గ్రహణం మొర్రిట! దాని నల్లని జుట్టు, గుండ్రని కళ్ళు, ఆ చిన్న పెదవులు ఎలా మరచిపోగలను చెప్పు? ఆడవాళ్ళు భోరున ఏడుస్తారు... నేను ఏడవలేనని బాధ- మగాడు ఏడవ కూడదని ఎవడు చెప్పాడో ఛీ..! అమ్మమ్మా, ఆ పిల్లని చూడగలనా మళ్ళీ" అన్నాడు.
తులసమ్మ ఏం చెప్తుందీ?
"మనకి ప్రాప్తం వుంటే, నిజంగా బతికుంటే మనింటి కొస్తుందయ్యా!" అంది గుండెలో దుఃఖాన్ని దాచుకుంటూ.
"వస్తుంది, నేను చెప్తున్నా, మళ్ళీ వెడతా. వెడతా, ఈమాటు నేను లోపలకెళ్ళి ఇల్లంతా వెతుకుతా, నా పిల్లని దాచుకుంటారా..." లీల పడుకున్నదల్లా లేచి అరవటం మొదలుపెట్టింది.
ఆ పిల్ల గురించి ఎంతోసేపు సుధాకర్ మాట్లాడుతుంటే జాలేసింది తులసమ్మకి, ఏం చేయగలదు తను!!
సుధాకర్ కి, లీలకి పెళ్ళి కుదిర్చి దగ్గరుండి చేయించింది తనే! ఈ కష్టం చూడ్డానికా!!
లీల నిద్రపోయింది..... తులసమ్మ పూజగదిలో కెళ్ళిపోయింది.
రాత్రి పగలు గడచిపోతున్నాయి. ఏ మార్పూ లేదు...
సుధాకరూ, లీల మళ్ళీ ఎలా కలుస్తారూ... ఆ పిల్ల ఎలా దొరుకుతుందీ- ఇదే చింత తులసమ్మకి!
ఆశ్రమంలో వృద్దులు భజన గీతాలు పాడుకుంటున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు- ఆశ్రమం గురించిన చింత తనకేమీ లేదు, లీల గురించే చింత!! తులసమ్మ కళ్ళకి మహాలక్ష్మి కనిపిస్తోంది.   
                                  *    *    *
రాజీవ్, సుమతిల మధ్య నిశ్శబ్దం నెమ్మదిగా తొలగిపోతోంది. రాజీవ్ కి గొప్ప తృప్తి! పిల్ల చాలా సుఖంగా హాయిగా పెరుగుతోంది. సుమతికి ఒకటే తృప్తి - భర్త ఆ పిల్ల గురించిగాని, 'ఆ పిల్ల ఏదీ...' అంటూ వచ్చిన ఆ స్త్రీ గురించిగానీ మాట్లాడటం మానేసినందుకు.
రాకీవ్ కి మరో ఆనందం ఏమిటంటే.... రవికి ట్రాన్స్ ఫరైనందుకు. ఈ ఊర్లోనే వుంటే ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటపడక తప్పదు. సుమతికి పిల్ల ఎక్కడుందో తెలియాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఈ ఆలోచనతో రాజీవ్ మనసు ప్రశాంతంగా వుంది. కానీ, అంతరంగంలో అట్టడుగుణ ఆ తల్లి ఎవరో, మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందీ, అని అనిపిస్తూనే వుంది.
తలుపు కొడుతున్న చప్పుడుకి ఉలిక్కిపడ్డాడు రాజీవ్.
సుమతి, పిల్లాడు రెండురోజులుండటానికి ఊరెళ్ళారు. తల్లికి ఒంట్లో బాగా లేదని వెళ్ళింది సుమతి.
తలుపు తీయగానే గబగబా లోపలకొచ్చింది తులసమ్మ.
"లేదా..?" అంది అటు ఇటు చూస్తూ.
"ఊరెళ్ళింది" అన్నాడు రాజీవ్. తులసమ్మ గారెవరో రాజీవ్ కి తెలియదు. కానీ, ఆ తులసమ్మ వెంట వచ్చినావిడ తెలుసున్నావిడలా వుందనిపించింది.
"పద పోదాం, ఊరెళ్ళిందట!" అంది తులసమ్మ ఆవిడతో.
"నేను రాను, ఇక్కడే వుంటాను - ఈ గుమ్మంలోనే వుంటా!" అంది మొండిగా ఆవిడ.
రాజీవ్ కి ఏమీ అర్ధం కావటంలేదు.
'ఎవరు కావాలి మీకూ?' అని రాజీవ్ అనేలోపలే ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు.
ఆ అమ్మాయి నడక, ఆ పొడుగైన జడ.... అవును, తనకి తెలుసు- లీల - తనతో స్కూల్లో చదువుకున్న లీల!! వాళ్ళమ్మగారు తనకి టీచరు- రాజీవ్ మనసు ఎటో వెళ్ళిపోయింది.
ఎందుకొచ్చిందీ? సుమతి తెలుసా... ఆవిడెవరో అత్తగారేమో! -మరి గుమ్మం దగ్గిర కూచుంటా అంటుందేమిటీ!!
రాజీవ్ కి చిరాగ్గా అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు తాళం వేసి రవి దగ్గరకొచ్చాడు.
రవి, వీణ హడావిడిగా వున్నారు. ఇల్లంతా సామాన్లు, మూటలు- రేపే ప్రయాణం మరి!!
మమత గులాబిరంగు గౌను తొడుక్కుంది.
"ఒరేయ్ అన్నయ్యా- చూసావా... ఇవాళే చెవులు కుట్టించా!"
"అదా, ఏమిటీ కొత్తగా కనిపిస్తోందనుకుంటున్నా, మమత చెవులకున్న రాగిపోగులు చూస్తూ-
"చూసావా, ఈ చెవిపైన ఎలా మడిచినట్టుందో!" అన్నాడు రాజీవ్.
"అది గ్రహణం మొర్రిట - మా వారన్నారు" అంది వీణ సామాన్లు సర్దుతూ- బొద్దుగా అందంగా వుంది మమత.
"వీణా, నెలకొక్కసారి తప్పకుండా వస్తా, వీలయితే ఇంకా రెండుసార్లొస్తా!" అన్నాడు రాజీవ్.
"అక్కడికే వచ్చేయ్, మీ ఆవిణ్ణి ఒప్పించు ఎలాగో!" అంది వీణ.
రాజీవ్ నవ్వాడు... "వీణా... మరచిపోకు ఒక్కమాట, నా ప్రాణాన్ని నీతో పంపిస్తున్నానంతే - అయినా ఇంకా నాకు ఆశ వుంది, సుమతి మనసు మారి పిల్లని తెచ్చుకుందాం అంటుందని - ఆ రోజూ రావచ్చు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్తారూ?" అన్నాడు ఆ మాటంటుంటే రాజీవ్ గొంతు గాద్గదికమవటం గమనించకపోలేదు వీణ. వీధిలో కారాగింది...
"అబ్బ, బోర్!" అంది నెమ్మదిగా వీణ-వీధికేసి చూస్తూ.
పొద్దున్న ఫోన్ చేసింది జానకి, వస్తానని! - కానీ, వీణకి ఎందుకో భయంగా వుంది మమత గురించే వివరాలు అడుగుతుందని..!
జానకి గబగబా లోపలికొచ్చింది.
"ఎంత బాగా జరిగిందో సింగపూర్ ట్రిప్! మీరొస్తే బాగుండేది. ఏదీ... ఆ బంగారు తల్లి!!" అంటూ పర్సులోంచి చిన్న పాకెట్ తీసింది.
అందమైన చిన్న గౌను!
"వీణా, పాపకి ఈ ఫ్రాకు వేసేస్తున్నా!" అంటూ మమతని ఒళ్ళోకి తీసుకుంది జానకి. ఎక్కడ దాగిందో మాతృత్వం- ఒక్కసారి పొంగి పొర్లినట్లయింది. పిల్లని గుండెలకి హత్తుకుంది.... జుత్తు ముద్దు పెట్టుకుంది.
వీణ భయంభయంగా చూస్తోంది. 'పిల్లకి దిష్టి కొట్టేస్తోంది బాబూ..!' అనుకుంటూ మనసులో బాధపడిపోతోంది.

 Previous Page Next Page