"నన్ను చెప్పమంటావా?' అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా.
"ఏం చెబితే?"
"నమ్ముతారా?"
"ఎందుకు నమ్మరు బావా? నీ దగ్గిర సాక్ష్యం ఉంది. కావాలంటే నేనూ చూశానని బుకాయిస్తాను. పరీక్ష కి నిలబడక తప్పదు గదా? రంగు బైట పడ్డాక ఎవరు నోరెత్తుతారు? ఎలా ఎత్తుతారు?"
కూతురు మాటలు సమంజసం గానే కనిపించాయి సుభద్రమ్మ కి. ఆ విధంగా చేస్తే కోర్టు సంగతి, పోలీసుల సంగతీ దేవుడెరుగును గానీ, ఆ నిక్రుష్టుడి మీద పగ తీర్చుకున్నట్టన్నా అవుతుంది. నలుగురూ చుట్టూ చేరి ముఖాన ఉమ్మేస్తుంటే ఏమైపోతాడో చూడాలి ఆ మునసబు.
"నువ్వు చెప్పింది బాగానే ఉంది గాని వరలక్ష్మీ , ఒక్క సంగతి మర్చిపోయావు. ఆ రామదాసు తన గుట్టు బైట పడిందని తెలిస్తే ఒక్క క్షణం ఇక్కడ ఉంటాడా? అన్నాడు రాజారావు.
"ఎట్లా తెలుస్తుంది?' అన్నది వరలక్ష్మీ.
"నువ్వు చెబుతున్నావుగా? నలుగురికీ చెబుదామని. ఈ వూళ్ళో ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో? ఆ వార్త అతనికి చేరటానికి ఎంతసేపు కావాలి?"
"ఏం సిఐడివి బావా ?" అన్నది వరలక్ష్మీ.
సుభద్రమ్మ గారు ఉలిక్కిపడింది. రాజారావు సిఐడి యా? ఆశ్చర్యంతో అతని వంక చూసి "నిజమేనా నాయనా?' అన్నది.
"నిజమే అత్తయ్యా."
సుభద్రమ్మ గారు ఒక్క క్షణం అలోచించి "ఐతే...?" అన్నది సందేహంగా.
"చెప్పు"
"రామదాసు ని అరెస్టు చెయ్యవచ్చునుగా?"
చెప్పు "
"రామదాసు ని అరెస్టు చెయ్యవచ్చునుగా?'
వరలక్ష్మీ ఆసక్తి గా బావ వంక చూసింది . ఆమె కూడా కొద్ది సేపటి క్రితం అదే అడిగింది . జవాబు రాలేదు.
"అదంత తేలిక కాదత్తయ్యా! డానికి చాలా తతంగం ఉంది."
"మరి మనం ఈ వూరు విడిచి వెళ్ళిపోతే ఎలా అరెస్టు చేస్తావు?' అన్నది వరలక్ష్మీ.
"మళ్ళీ వస్తాను."
"అప్పుడు మాత్రం పారిపోడా?"
"అందుకే అడబుర్ర అన్నారు! మనం అందరం వెళ్ళిపోతే వాళ్ళు పీడ విరగడిందని హాయిగా ఉంటారు. నేను పట్నంలో అడుగు పెడుతూనే వారంటూ పుట్టించి తిరిగోస్తాను. అంతే"
"ఏమో బావా? అంతకన్నా నా ఉపాయమే బావుంది."
సుభద్రమ్మ గారు కూడా అదే అనటంతో రాజారావు వూరుకున్నాడు. అతని మనసులో ఇందాకటి దృశ్యమే తిరుగుతోంది. అతనికీ ఈ వూరు మీద అసహ్యం కలగసాగింది. ఈ వూళ్ళో మనుషులంతా మొండితనం మూర్తీభవించిన వాళ్ళు. పల్లెటూళ్ళంటే తనకు అంతకు మునుపు ఉన్న సదభిప్రాయం సడలి పోయింది. బహుశా అ రామదాసు తనని చూసి ఉంటాడు. అతన్ని గురించి తన ,మనసులో ఉన్న అనుమానం నిజమే అయితే చాలా గొడవ జరుగుతుంది.
"భోజనానికి లేనాయనా! పొద్దుపోయింది"అన్నది సుభద్రమ్మ గారు లేస్తూ.
భోజనం చేసాక వచ్చి తన గదిలో కూర్చున్నాడు రాజారావు. అతనికేం చెయ్యాలో పాలుబోవటం లేదు. అడవాళ్ళిద్దరూ తన మాట వినేటట్లు లేరు. మరో మార్గం, అందరికీ మంచి చేసే మార్గం ఆలోచించాలి. అతను మంచం మీద వెనక్కి వాలాడు.'
ఒక అరగంట సేపు ఆలోచించాడేమో? అతనికి ఏమీ తట్టలేదు. అతనికి తెలియకుండానే నిద్ర ముంచుకు వచ్చింది. వరలక్ష్మీ గదిలోకి వచ్చి "పిచ్చి బావా!" అనుకుని వెళ్లి పోవటం అతనికి తెలియదు.
* * * *
తెలతెలవారుతుండగా ఉలిక్కిపడి మేలుకు కున్నాడు రాజారావు. గడియారం చూసుకుంటే ఆరుగంట లైనట్టు తెలిసింది. తనని తాను తిట్టుకున్నాడు. ఈ దిక్కుమాలిన వూరు తాను ఎందుకు వచ్చాడో ఆ కర్తవ్యం మర్చిపోయి నిద్రపోయాడు తాను. కాని ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలని ఉండి, ఏమీ చెయ్యలేనప్పుడు మనిషికి కలిగే బక్క కోపం అతన్ని ముంచెత్తింది. మనసంతా తిక్కగా అయిపొయింది. కాసేపటికి తమాయించుకుని లేచి బైటికి వచ్చాడు. పెరట్లో పాలేరు చెబుతున్నదేదో ఆసక్తిగా వింటూ నిలబడి ఉన్నారు వరలక్ష్మీ , సుభద్రమ్మ గారూను, రాజారావు రావటం చూసి "విన్నావా బావా?' అన్నది వరలక్ష్మీ.
"ఏం జరిగింది ?" అన్నాడు రాజారావు.
రామదాసు కనిపించటం లేదుట."
అంగుళం దూరంలో బాంబు పెలినట్లైంది రాజారావు కి. మతిపోయింది. రామదాసు కనిపించటం లేదా? అంటే?
"మునసబు గారు పిలుచుకు రమ్మని పంపిన మనిషి తిరిగొచ్చి చెప్పాట్ట. వూరంతా వెతికించారట. ఎక్కడా లేడు. ఆ పాకలో అతని బట్టలూ, సామానూ కూడా లేదుట.' అన్నది వరలక్ష్మీ.
పాలేరు వంత పాడుతున్నట్టుగా "మాయలుగా ఉంది బాబూ! ఈ వూరికేదో సెటోచ్చింది." అన్నాడు.
రాజారావు నెమ్మది మీద నిలదిక్కుకున్నాడు. "నే చెప్పానా?' అన్నట్టు చూస్తున్న వరలక్ష్మీ వంక చూడలేక తల దించుకుని అక్కడ్నించి కదిలి పోయాడు. సుభద్రమ్మ గారు అతని వెనకాలే ఇంట్లోకి వచ్చింది. వరలక్ష్మీ నూతి దగ్గరికి వెళ్ళింది.
ఒక గంట గడిచింది.
బైట నుంచి ఎవరో కేకవేయ్యటం వినిపించింది. వరలక్ష్మీ వెళ్లి వీధి తలుపు తీసింది. బైట నిలబడి ఉన్న మునసబు ను చూడం గానే ఆమెకి వళ్ళు మండిపోయింది. అయన వెంట ఎవరో యువకుడున్నాడు. అతనున్నాడన్న లక్ష్యం కూడా ఆమెకు లేకపోయింది. కోపంతో నిలువెల్లా వణికి పోతూ "ఇంకా ఏం మొహం పెట్టుకు వచ్చారిక్కడికి? సిగ్గు లేదూ? అన్నది . ఆ తర్వాత ములుకుల్లాంటి మాటల్తో తన ఎదలోని బాధను వెళ్లి గక్కేసింది. చివర్న దడాలున తలుపు మూసి ఇవతలికి వచ్చేసింది.
రెండడుగులు వేసి ఆగిపోయింది.
వెనక నించి అసలే భీకరంగా ఉండే మునసబు గారి గొంతు మరింత బీకరంగా వినిపించింది. కోపోద్రేకంలో గడియ వెయ్యటం మర్చిపోయింది వరలక్ష్మీ. మునసబు గారు ఆ యువకుడితో లోపలికి అడుగు పెట్టి "ఆ బాబుకి తగ్గ కూతురివి! తెలివీ తేటా రమ్మంటే ఎక్కడ్నుంచి వస్తాయి?' అన్నాడు. వరలక్ష్మీ ముఖం కంద గడ్డలా ఐపోయింది. క్రోధం నిలువంతా కంపించి వేస్తుంటే 'ఛీ!' అని ఇంట్లోకి వెళ్ళిపోయింది చరచరా.
మునసబూ ఆ యువకుడూ వసారా లోకి వచ్చారు. అక్కడ వాల్చి ఉన్న మంచం మీద కూచున్నాక "అమ్మాయ్!" అని కేక పెట్టాడు మునసబు . వరలక్ష్మీ ద్వారా మునసబు రాక విన్న సుభద్రమ్మ గారు శోక భారంతో క్రుంగి పోతూ లోపలనే కూచుండి పోయింది. ఆమెకి జవాబు ఇవ్వాలని పించలేదు. వూళ్ళో పని చూసుకుని తిరిగి వచ్చిన పాలేరు మునసబు గార్ని చూసి "దండాలయ్యా" అన్నాడు.
'చిన్నయ్యగారేర్రా?' అన్నాడు మునసబు.
"పిలుస్తానుండండి" అని వాడు లోపలికి వెళ్లి రాజారావు ను పిలుచుకొచ్చాడు. రాజారావు , బైటికి వచ్చి మునసబు కి, అయన పక్కన నున్న యువకుడ్ని చూసి నమస్కారం చేశాడు.
"రామదాసు పారిపోయాడు, తెలిసిందా?' అన్నాడు మునసబు.
"తెలిసింది" అన్నాడు రాజారావు.
మునసబు ఒక్క క్షణం ఆగి "మొత్తం మీద మంచి టోపీ వేశాడు" అన్నాడు.
రాజారావు అర్ధం గాక "ఎవరికి"? అన్నాడు.
"అందరికీను....తెలివైన వాడు" అన్నాడు మునసబు. ఒక క్షణం పోయాక "అన్నట్టు ఇతను మాధవరావని మా అబ్బాయి స్నేహితుడు. నిన్ననే వచ్చాడు. పల్లెటూరు కదాని, ఏమీ తోచదేమోనని నీ దగ్గరకు తీసుకొచ్చాను" అన్నాడు.
రాజారావు కరచాలనం చేశాడు.
"మీరెక్కడ పని చస్తున్నారు?' అన్నాడతను.
రాజారావు తటపటాయించి "నా ఉద్యోగం సంగతి ఎందుకు లెండి? మీరు తెలుసుకోవాలసి నంత పెద్ద ఉద్యోగం ఏం కాదు!!' అన్నాడు.
అతను జేబులో నుంచి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టె తీసి "మునసబుగారు కేకలేసినా ఈ అలవాటు మానలేకుండా ఉన్నాను....సిగరెట్ తీసుకోండి" అన్నాడు.
రాజారావు ఒకటి తీసుకున్నాడు.
మాధవరావు జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు.
"అది కాదయ్యా రాజూ! సి.ఐ.డి. గా పని చేస్తూ ఆ సంగతి చెప్పుకోవటానికి సిగ్గు పడతావెం?' అన్నాడు మునసబు.
రాజారావు ఉలిక్కి పడలేదు. మాధవరావు చేతిలో ఉన్న అగ్గి పెట్టె మీద అతని దృష్టి పడింది. దాని మీద ట్రేడ్ మార్క్ కాయితం లేదు. మునసబు గారి వంకా, అతని వంకా చూసి తల దించుకున్నాడు.
"చెప్పండి" అన్నాడు మాధవరావు.
"చెబుతాను' అన్నాడు రాజారావు.
గుమ్మం వారగా వినయంగా నిలుచుని ఉన్న పాలేరు కనిపించాడు రాజారావు కి, సిగరెట్ వెలిగించుకుని ఒక దమ్ము లాగాడు. "చెప్పండి" అన్నాడు మాధవరావు తిరిగి.
* * * *