Previous Page Next Page 
పాప నవ్వింది పేజి 10

 

    అంతగా తను ఇంట్లో చెప్పి తీసుకొస్తే అన్నయ్య ఇదేమిటిలా రాజు పక్కన తను కూర్చున్నాడనుకుంటున్న నీరజ శ్రీపతి మాటలకి చకితురాలైంది. అన్నయ్య ఇంత కటువుగా ఎందుకు మాట్లాడతాడో కమలతో , అనుకుని ఏమీ చెయ్యలేక కమల చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని స్నేహ పూర్వకంగా పట్టుక్కూర్చుంది.
    పడవలు ముందుకి రెండు గజాలు సాగినై కదుల్తున్న నీళ్ళని చూసి పాప భయపడి 'కమలీ' అంటూ ఏడవడం మొదలెట్టింది. ఇక చేసేది లేక శ్రీపతి పడవలా వాళ్ళ పడవ దగ్గరగా పోనిచ్చి పాప నందించాడు. పాప పడవలోకి దిగ్గానే 'కమలీ' అంటూ కరుచుకు పోయింది. కన్నతండ్రి కంటే ఈ పని వాళ్ళెక్కువైనారను కుంటూ శ్రీపతి తన బోట్లో కూర్చున్నాడు. నీరజ కోపంతో 'అన్నయ్యా' అని అరిచింది.
    అప్పటికే అందరి లోనూ హుషారు సంతోషం చప్పబడిపోయినై. ఎందుకోచ్చామా అనుకోటం మొదలు పెట్టారు. తరవాత వాళ్ళాట్టె మాట్లాడుకోలేదు. ఎవరి పాటికి వాళ్ళు ముభావంగా ఆలోచిస్తూ తిరిగారు.
    ఇంతలో పాప ఆకలనటంతో ఒకచోట ఆగి పాపకి బిస్కెట్లుపెట్టి ,  పాలు పట్టింది కమల. దాంతో అలిసిపోయిన పాపకి నిద్ర ముఖం పడింది.
    పడవలు దిగినప్పటినించి అసలే మితభాషైనా రాజు ఒక్కడే ముందు నడవ సాగాడు. ఎవరితోనూ మాటా మంతీ లేకుండా.
    కమలకి పాప నెత్తుకుని నడవాలంటే కష్టంగా వుంది.
    'అన్నయ్యా పాపని కాస్త ఎత్తుకోరాదూ ఇంక ఇంటికి వెళ్దాం.'
    శ్రీపతి పాపని తీసుకుంటూనే 'అంత ఎత్తుకోలేని వాళ్ళు జీతాలకి కుదరటం ,పనికి రావటం ఎందుకు' అన్నాడు.
    అప్పటివరకూ వోర్చుకున్న కమల ఇహ పట్టలేక 'నా జీతంలోంచి ఒక ఐదు రూపాయలు కూలి ఇస్తాను. ఈరోజు మోసి నందుకు. అని ముందూ వెనకా చూడకుండా గబగబా రాజును కలుసుకుని నడవటం మొదలుపెట్టింది.
    రాజు కమల ఉగ్రరూపం చూసి ఏదో అయిందనుకుని 'ఏమైందండీ' అని అడిగాడు.
    అప్పటికి సర్దుకుని 'అబ్బే ఏం లేదు అన్నా, చెల్లెలు ఏదో మాట్లాడుకుంటుంటేనూ ' అని సర్ది చెప్పింది కమల. వాళ్ళాట్టె మాట్లాడుకోలేదు. కారు చేరుకొని ఇంటి ముఖం పట్టారు.
    రాజు ఆ సాయంత్రం ప్రయాణం పెట్టుకున్నాడు వెళ్తున్నానని.
    'అదేమిటి రాజు వచ్చిన పని కాందే యెట్లా వెళ్తావ్. ఇంకా కమలని అడగందే, రెండు రోజులాగు.'
    'అక్కయ్యా మీకు మాట మాత్రం నాతొ అని వుంటే ఇంత దూరం వొచ్చేవాళ్ళం కాదు గదా.'
    'ఏమిటయ్యా రాజు ఏం చెప్పలేదంటావ్.'
    'ఈరోజు దాస్తే ఇంకో నాలుగు రోజుల్లో తెలియదా' అంటూ వినిపించుకోకుండా అవతలికి వెళ్ళాడు.
    నీరజ ఆశ్చర్యంగా చూసింది వెళ్తున్న రాజు వైపు. రాజేశ్వరి 'ఆడపిల్లని అంత అర్ధంతరంగా యెట్లా పంపిస్తాను రాజు.' అని బలవంతాన మర్నాటి వరకు ప్రయాణం వాయిదా వేయించింది. మిగిలిన రోజంతా రాజు బైటే తిరిగాడు. ఇంట్లో నిలబడకుండా నీరజకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
    నీరజకేమీ తోచక ఆశ్చర్యంతో 'కమలా నిన్న రాజు నీతో ఏమన్నా అన్నాడా' అంది. కమల లేదనడంతో ఇంకా విభ్రాంతి చెందింది.
    వూరికి వెళ్ళినాక రాజు వాళ్ళ అక్కయ్యతో 'కమలని శ్రీపతి అన్నయ్యే చేసుకుంటాడుట. నీరజక్కయ్యకి మరి తెలియలేదో ఏమో నాకు చెప్పలేదు. అందుకే వెంటనే బయల్దేరి వచ్చాసా' నటంతో అసలు సంగతి తెలుసింది నీరజకి.
    'అయ్యో అక్కయ్యా నాకు నిజంగా తెలియదమ్మా నిన్న వచ్చేవరకూ అమ్మ కాని, అన్నయ్య కాని సంగతే చెప్పలేదు. ఇప్పుడు రాజంటుంటే వింటున్న. ఐతే రాజు నీకెవరు చెప్పారు?'
    'శ్రీపతి అన్నయ్యే చెప్పాడు మనం పడవల్లో వెళ్తున్నప్పుడు.
    ఈ మాటలతో చేష్టలుడిగి నుంచుంది నీరజ. 'ఏమిటి అన్నయ్య అంతర్యం? కమలను మాటలతో చిత్ర హింస పెట్టి వేధించుకు తింటూ తను పెళ్లాడబోతున్నట్టు చెప్పడంలో' అని మధన పడసాగింది.
    ఈ వాలకం చూసి రాజు, వాళ్ళక్కయ్య నీరజకేమీ తెలియదని తెలుసుకుని, 'పోనీలే నీరజా నీకు చెప్పలేదేమో వాళ్ళు. ఐపోయిందానికేం చేస్తాం' అని సర్ది ప్రయత్నించారు.
    ఇక్కడ శ్రీపతి తన మాటలకి చేష్టలకి కమల బాధపడట్టం చూసేవాడు. జాలేసేది. ఎండుకన్నానా అనుకునేవాడు. దగ్గరి కెళ్ళి పొరపాటుని ఒప్పుకుందామని అనిపించేది. కాని కమల ఆడదని గుర్తుకు రాగానే కోపం బుసలు కొట్టేది.
    సాయంత్రం కమలా, పాప కొలను పక్కన ఆడుకుంటున్నారు. ఆరోజు పాప మరీ ముద్దుగా చేస్తున్నది. పాప ఏదో అనడం, కమల చటుక్కున దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవడం , దానికి బదులుగా పాప రెండు చేతులతో కమల మెడని వాటేసుకోడం చూశాడు శ్రీపతి. తను కోరుకుంటున్న ఆప్యాయతని కమల పొందుతున్నదన్న ఈర్ష్య అతన్ని నిలవనియ్య లేదు. పాపని తనకి ఎంత దగ్గరికి తీసుకోవాలనుకున్నా పాప ఎడం ఎడంగానే తిరుగుతున్నది. ఇదంతా కమల నించే అనిపించింది శ్రీపతికి. వెర్రి కోపం వచ్చింది. ముందువెనక ఆలోచన లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మండిపడుతూ. కమలను చూస్తూ 'అదంతా ప్రేమేనా? కన్నతల్లి కైనా వుందో లేదో అంత గా.
    కమలలో కూడా అణచి పెట్టిన అబిమానం పడగెత్తింది. ఇంక ఆ మాటలు పడే సహనం లేకపోయింది. 'అంత ప్రేమ గల తల్లే దగ్గరుంటే నేనెందుకొచ్చేదాన్ని? లేకపోబట్టే ఇక్కడున్నాను. వుంటే తెచ్చుకోవచ్చు ' అంటూ విసవిసా నడిచింది పాప పిలిచినా వినిపించుకోకుండా.
    తను అన్న ఈ మాట ఎంత సూటిగా ఎంత లోతుగా తగిలిందో వూహ మాత్రంగా నైనా తెలియని కమల కోపంతో చకచకా నడుస్తున్నది.
    శ్రీపతి నిలువెల్లా వణికాడు. ముఖం తెల్లపడిపోయింది. ఒక్క క్షణం నెత్తురు వేగంతో పరుగు అందుకుంది. ఈ సంఘటనకి బెదిరి ఏడుస్తున్న పాపని ఎత్తుకుని కమల వెంట నడిచాడు.
    'ఏయ్ అగు. ఇకనించి నువ్వు ఇక్కడ వుండక్కర్లేదు. పని చెయ్యక్కర్లేదిక్కడ నీకొచ్చే డబ్బు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో...
    'నన్ను పెట్టుకున్నవాళ్ళు అనవలసిన మాట అది. వాళ్ళు వెళ్ళమంటే వెళ్తాను. అంతవరకు ఎవరేమన్నా ఒక్క అంగుళం కూడా కదలను. నన్ను పొమ్మనే హక్కు ఎవరికీ లేదు వాళ్ళకి తప్ప' అంటూ ఇంట్లో కొచ్చింది.
    కమలని అంత కోపంగా, తీవ్రంగా వుండగా రాజేశ్వరి ఏనాడూ చూడలేదు. ఏమైంది కమలా  ఏమైంది అంటుండగానే శ్రీపతి నిప్పులు కురిపిస్తూ 'నువ్వొక్క క్షణం వుంటానికి వీల్లేదు- వెళ్ళిపో' అనటం, పాప ఏడుపు వినపడ్డై-' ఒకేసారి. చేష్టలుదక్కి  నుంచున్నరాజేశ్వరి ఎమైందంటూ , అడుగుతున్నా వినిపించుకోవటం లేదు. శ్రీపతి ఇంకా మనిషికా వొణుకు కోపం తగ్గలేదు.
    పాప 'మామ్మా' అంటూ ఏడుస్తూ రాజేశ్వరి దగ్గరికొచ్చి  ఒక్క క్షణం వుండి 'కమలీ' అంటూ పరిగెత్తింది.
    శ్రీపతి జవాబివ్వ కుండగానే తన గదిలోకి వెళ్ళాడు. తేరుకున్న రాజేశ్వరి శ్రీపతి గదిలో కెళ్ళి ముఖాన చెయ్యి వేసుకు పడుకున్న శ్రీపతిని చూసి వెనక్కి తిరిగొచ్చింది.
    కమల గదిలోకి వెళ్లి చూస్తె కమలా పాపా ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడుస్తున్నారు. ఇది సమయం కాదని రాజేశ్వరి తిరిగి వెళ్ళింది.
    రాత్రివరకూ ఎవరూ మాట్లాడలేదు. కదల్లేదు. మెదల్లేదు. కేవలం నామకరణ భోజనాలైనై . పాప నిద్ర పోయింది. రాజేశ్వరి మెల్లగా కమల దగ్గర చేరింది. 'ఏమిటైందమ్మా' అంటూ. కమలకి మళ్ళీ దుఖం ముంచు కొచ్చింది. ఆగుతూ, ఆగుతూ మొదటి నించి శ్రీపతి తన పట్ల ఎట్లా వుంటున్నదీ, చేస్తున్నదీ పూస గుచ్చినట్లు చెప్పి ఈరోజు జరిగినదంతా వివరించి చెప్పింది.

 Previous Page Next Page