Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 10

    "పనేమిటో చెప్పలేదు" అంది సుభద్రమ్మ.
    "మీ అబ్బాయిని చూడడమే నా పని!" అన్నాడు రాయుడు.
    సుభద్రమ్మ అనుమానంగా రాయుడి వంక చూసింది "ఎవరైనా ఆడపిల్లని చూసుకుందుకు వస్తారు కానీ అబ్బాయిని చూసుకుందుకురారు" అందావిడ.
    "చూడ్డమంటే చూడ్డం కాదమ్మా - మీ వాడితో చిఒన్న పని కూడా ఉంది!"
    "నాతో చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా ఏ పనికీ ఒప్పుకోడు వాడు. అంచేత అదేమిటో ముందుగా నాకె చెప్పండి" అంది సుభద్రమ్మ.
    "అంతా మీకే చెబుతానమ్మా! ఎటొచ్చీ ముందు అబ్బాయిని చూడనివ్వండి. నేను వచ్చింది చాలా పెద్దపని. అబ్బాయిని చూడకుండా ఏం చెప్పడం నాకు ఇష్టంలేదు" అన్నాడు రాయుడు.
    ఇదంతా ఏదో పెళ్ళి వ్యవహారమే అయుండాలని సుభద్రమ్మ అభిప్రాయ పడింది. రాయుడి దర్పం చూడగానే చాలా గొప్పవాడయుంటాడని ఆవిడకు తోచింది. ఆవిడ చటుక్కున లోపలకు వెళ్ళి "ఏరా, ఆవకాయ తీయడం అయిపోయిందా లేదా?" అనడిగింది.
    "అయిపోయిందమ్మా - అవతల నువ్వు ఎవరో మగాళ్ళతో మాట్లాడుతున్నావుగదా, వాళ్ళను పంపించి వచ్చేదాకా ఇక్కడే ఉండిపోదామని ఉండిపోయాను. ఎవరమ్మా వాళ్ళు!" అన్నాడు సుబ్బారావు. అతను చిన్న తడి తువ్వాలొకటి మాత్రం మొలకు చుట్టుకుని వున్నాడు.
    "నీ కోసమే వచ్చార్రా! చూడ్డానికి చాలా గొప్పవాళ్ళు లాగున్నారు. నువ్వువెళ్ళి చేతులు కడుక్కుని మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా తలా అదీ దువ్వుకుని రా! చెల్లాయి మెలకువగానే ఉందా, పడుకుందా?" అంది సుభద్రమ్మ.
    "పడుకుందమ్మా? పాపం దానికింకా జ్వరం తగ్గినట్లు లేదు" అన్నాడు సుబ్బారావు.
    "సరేలే. నువ్వు తొందరగా రా, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను" అని సుభద్రమ్మ మళ్ళీ రాయుడున్న వీధి గదిలోకి వెళ్ళి "అబ్బాయొచ్చేస్తున్నాడండి. అమ్మాయికి జ్వరంగా ఉండడంవల్ల వాడీపని చెయ్యాల్సొచ్చింది కాని లేకపోతే ఇలాంటి పనులు వాడికి చెప్పను ఎంత చెప్పిన మాట వింటే మాత్రం ఉద్యోగం చేసుకుంటున్న కుర్రాడి చేత ఇలాంటి పనులు చేయించడం ఏ తల్లికి ఇష్టముంటుంది చెప్పండి!" అంది.
    "తప్పేముందండీ! చిన్నతనంలో నేను మా అమ్మకి బియ్యమెరి పెట్టేవాన్ని. పెద్దయ్యాక కూడా ఏరి పెడదామనుకున్నానండి. కాని ఆమె చచ్చిపోయి నాకా అదృష్టంలేకుండా చేసింది. కన్నతల్లి సేవలు చేసుకునే అదృష్టం అందరికీ ఉండొద్దూ" అన్నాడు రాయుడు. ఆయన మాటలు విని రచయిత తనలో తహను ముసి ముసిగా నవ్వుకున్నాడు.
    "చిన్నప్పుడలా సేవలు చేశారు కాబట్టే ఇప్పుడు గొప్పవారయ్యారు. మావాడూ అంతే! నన్నేపనీ చెయ్యనివ్వదు. ఇంట్లో నాలుగు రోజుల్నించీ వాడి చెల్లెలికి జ్వరం. నిన్నటికి నిన్న నేను గోంగూర పచ్చడి చేస్తూంటే పొత్రం లాక్కొని తనే రుబ్బేశాడు. ఎంత బాగా చేశాడని!" అని "ఒరేయ్ బాబూ, నువ్వొచ్చేటప్పుడు చిన్న ఆకులో గోంగూర పచ్చడివేసి తీసుకురా! వీళ్ళకి రుచి చూపిస్తాను...." అంటూ కేక పెట్టింది సుభద్రమ్మ.
    రాయుడు, రచయిత ముఖముఖాలు చూసుకున్నారు రాయుడు నెమ్మదిగా "అబ్బాయిని చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది" అన్నాడు.
    "అదే అందరూ అంటారు. సంబంధాలకోసం ఎంతమందో మా ఇంటి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కాని అల్లాటప్పా సంబంధాలు చేసుకోవడం నాకు ఇష్టంలేదు. పిల్ల బాగుండాలి. సంప్రదాయమైన కుటుంబం కావాలి డబ్బు దేముందండీ? ఏదో - వాడి చెల్లెలి పెళ్ళి చేయడానికి సరిపడ్డ కట్నం వస్తే చాలు. మాకేమన్నా లేదనా డబ్బాశ పడడం. ఈ ఇల్లు మా స్వంతం. ఈ రోజుల్లో స్వంతిళ్ళు ఎంతమందికున్నాయి చెప్పండి! కనీసం నలభైవేలు చేస్తుందని అంతా అంటారు. ఇందులో ఓ గధైనా అద్దెకివ్వకూడదా. ఇంకో నలభయ్యో యాభయ్యో వస్తుందని చాలామంది చెప్పారు. చిన్నప్పటినుంచీ విశాలమైన కొంపలో మసలిన దాన్ని. నలభై రూఅపయాల కోసం ఇల్లెవరికో యిచ్చి ఇరుకుచేసుకుంటానా?" అని ఆగింది సుభద్రమ్మ. తన భోగ భాగ్యాల గురించీ సిరిసంపదల గురించీ సుభద్రమ్మ గర్వంగా చెప్పుకుపోతూంటే రచయిత తనలో తను నవ్వుకుంటున్నాడు రాయుడు మాత్రం శ్రద్దగా వింటున్నాడు. సుబ్బారావును పట్టాలంటే ముందు సుభద్రమ్మను మంచి చేసుకోవాలని ఆయన గ్రహించాడు.
    ఈలోగా సుబ్బారావు అక్కడికి వచ్చి గోంగూర పచ్చడి ఉన్న చిన్న ఆకును తల్లి చేతిలో పెట్టాడు. "నాకిస్తా వేంటిరా? వారికి రుచి చూపించు" అంది సుభద్రమ్మ, సుబ్బారావది తీసుకుని రాయుడి దగ్గరకు వెళ్ళాడు.
    రాయుడు సుబ్బారావువంకే ఆశ్చర్యంగా చూశాడు. మనిషి బాగా ఒడ్డూ పొడుగూ ఉన్నాడు. శరీరం మేలిమి బంగరుఛాయ. అరబ్బీ ఆడవాళ్ళకుండే పలచటి సూధైన ముక్కు. అమాయకత్వాన్ని ప్రస్పుటం చేసే కళ్ళు. ఎటొచ్చీ క్రాపు, వేసుకున్న బట్టలు అతడి రూపానికి తగ్గట్లు లేవు. అతను రాయున్ని సమీపించి గోంగూర పచ్చడి ఆకును కాస్త ముందుకి జాపాడు. రాయుడు వేలితో రవంత పచ్చడితీసి నాలిక్కి రాసుకుని- "ఆహా ఏం రుచి? ఈ పచ్చడి కోసమైనా ఒకరోజు మీ ఇంట్లో భోం చేయాలి!" అన్నాడు.
    సుభద్రమ్మ ముఖం చేటంతయింది. "రుబ్బింది అబ్బాయే కాని పాళ్ళు నేనే వేశాను" అంది. ఈలోగా సుబ్బారావు పచ్చడిని రచయితకూ, గీతకూ కూడా రుచి చూపించి తర్వాత ఏం చేయాలన్నట్లు తల్లివంక చూశాడు.
    "వారికి బాగా నచ్చినట్లుంది. అలా బల్లమీద పెట్టు; వెళ్ళేటప్పుడు తీసుకువెడతారు" అని "అబ్బాయిని చూశారుగా ఇప్పుడు చెప్పండి!" అంది.
    "అబ్బాయిది తండ్రిపోలి కనుకుంటాను" అన్నాడు రాయుడు.
    సుభద్రమ్మ ఆశ్చర్యంగా మీకెలా తెలుసు? మీకు ఆయన తెలుసా?" అంది.
    రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిధవునో కాదో చెప్పక్కర్లేదు కదా! అబ్బాయి మీ పోలిక కాదు కాబట్టి తండ్రి పోలికయుంటాడని అనుకున్నాను" అన్నాడు రాయుడు. ఆయనింకా సుబ్బారావునే పరీక్షగా చూస్తున్నాడు.
    "అన్నీ ఆయన పోలికలే వీడికి. ఇల్లు కదలడానికి మొహమాటం. ఎవరితోనైనా మాట్లాడడానికి మొహమాటం. ఆడపనీ, మొగపనీ అన్నీ నేనే చూచుకోవలసి వచ్చేది. ఆ దేవుడు దయతలచి నాకాసామర్ధ్యం ఇచ్చాడు" అంది సుభద్రమ్మ.
    రచయిత కో సందేహం వచ్చింది. సుభద్రమ్మ కారణంగా భర్త మెతక మనిషి అయ్యాడా? భర్త కారణంగా సుభద్రమ్మ మగరాయుడయిందా? చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం.
    "కూర్చోవోయ్" అన్నాడు రాయుడు. సుబ్బారావు తల్లి వంక చూశాడు. ఆమె కూర్చోమన్నట్లు సైగ చేసింది. అప్పుడు సుబ్బారావు కూర్చున్నాడు.

 Previous Page Next Page