వెలుగుబాట
-డా.సి. ఆనందారామం.
ప్రభాతసమయం, పక్షులనీ రెక్కలు విప్పుకొని నవచైతన్యంతో బారులుతీర్చి ఎగురుతున్నాయి. విశ్వమంతా చిక్కగా పరచుకొన్న చీకట్లను చెల్లాచెదురు చేయాలని బాలసూర్యుని లేత కిరణాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి.
రాత్రి గడిచినా ఇంకా నిద్రపోవాలనే ఉన్నట్లు చీకటి పోలేక పోలేక బద్ధకంగా ఆవులిస్తోంది. దూరంగా ఎక్కడో రైలు కూసింది. మంచంలో పడుకున్న ఝాన్సీ గభాలున లేచి కూచుంది- పరుగులాంటి నడకతో కిటికీదగ్గరగా వచ్చి ఆ మసక చీకటిలో దూరంగా పరుగుపెడుతున్న రైలును కళ్ళు చీల్చుకొని చూడసాగింది. రైలు సాగిపోయింది.
ఝాన్సీ మాత్రం కిటికీదగ్గరే నిలబడిపోయింది ఏదో మైకం ఆవహించిన దానిలా కదలలేనిదానిలా కిటికీ అనుకుని ఉండిపోయింది. ఆ సమయంలో ఆ అమ్మాయిని చూసిన వారెవరయినా ఆమె మనసు ఈ లోకంలో లేదని ఇట్టే పోల్చుకోగలరు.
గడియారం ముళ్ళు కదిలిపోతున్నాయి. కానీ ఝాన్సీలో కదలిక లేదు. వీధి తలుపు చప్పుడయింది ఆ చప్పుడుకు ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చి తలుపుతెరిచి ఎదురుగా నిలబడ్డ కుమార్ ని చూసి దిగ్భ్రాంతితో "మీరా!" అంది. కుమార్ జుట్టు రేగిఉంది. బట్టలు నలిగి కాస్త దుమ్ముకొట్టుకుని ఉన్నాయి, కళ్ళు ఎర్రగా బడలికగా ఉన్నాయి
"ప్రయాణం చేసి వస్తున్నారా?"
"అవును. నిలబడి మరీ ప్రయాణం చేశాను"
"అది సరేగాని మీరు అర్జంటుగా అలా బయటికి రండి, మీతో మాట్లాడాలి."
"ఎక్కడికి? ఎందుకు?"
"అవన్నీ తరువాత! ముందు రండి?"
క్రింద నేలమీద పక్క పరచుకొని పడుకున్న తమ్ముడి వైపూ చెల్లెలివైపూ భయంగా చూసింది. ఇంట్లోంచి తల్లీ అక్కా పనులు చేసుకుంటూ ఏదో మాట్లాడుకొంటున్న శబ్దం వినిపిస్తోంది.
ఆలస్యం భరించలేనట్లు కుమార్ ఝాన్సీ చెయ్యి పట్టుకొని తనతో ఈడ్చుకుపోయాడు ఇంటినుంచి ఒక ఫర్లాంగు దూరం వచ్చాక అప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఝాన్సీ ఆయాసపడుతూ కొంచెం కోపంగా "ఏమిటిది? సంగతేమిటో చెప్పండి" అంది కోపంగా.
"మీరు వెంటనే తయారయి మీ బట్టలుకూడా తీసుకుని బయలుదేరండి! క్విక్"
"ఆఁ" అంది ఝాన్సీ గాభరాగా__
"నాతో లేచి రావటానికికాదు, ఉద్యోగ ప్రయత్నానికి. ఇంట్లోకూడా అలాగే చెప్పండి."
ఉద్యోగం మాట వినగానే ఝాన్సీ కోపం ఎక్కడిదక్కడ ఎగిరిపోయింది. ఎంతో కష్టపడి ఎం.బి.బి యస్ పాసై ఆరునెలలనుంచీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.
"ఉద్యోగమా? ఎక్కడ? ఎలాంటిది? దానికింత హడావుడి, అర్జంటు దేనికి?"
"అబ్బబ్బ! అన్నీ తర్వాత చెప్తాను. ఒక్కొక్క క్షణం ఆలస్యమవుతున్న కొద్దీ మనకు కొంప మునిగిపోతుంది. యం. యల్. ఏ.గారు ఇంకా ఆ ఊళ్లోనే ఉన్నారు. రేపే వెళ్ళిపోతారు. ఇది తప్పితే ఇంక ఛాన్స్ లేదు. ఈ లోగా ఆ ఛాన్స్ ఎవడో కొట్టేస్తాడు త్వరగా తాయారవండి. ఇవిగో నేను దిగుతూనే మనకు టికట్స్ కూడా కొనేసాను, కిక్వ్ ఏడున్నరకే ట్రైన్."
ఝాన్సీకి ఏది అర్థంకావటంలేదు. ఏదో ఉద్యోగం ఉందనీ, దానికోసం త్వరగా వెళ్ళాలనీ మాత్రమే అర్థమయింది.
"అయితే సరే! మీరు స్టేషన్ లో ఉండండి నేను తయారయి వచ్చేస్తాను" అని ఇంటివైపు చకచక నడిచింది.
కుమార్ అసహనంగా స్టేషన్ లో ఎదురు చూస్తున్నాడు. ట్రైన్ ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. ఇంకా ఝాన్సీ రాలేదు. గార్డు ఆకుపచ్చ జండా ఊపుతున్నాడు. ఝాన్సీ రాలేదు. ఇంజన్ కూసింది. ఝాన్సీ వచ్చింది. ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కదులుతున్న ట్రైన్ లోకి ఎక్కేసారు. ఎక్కడా కూచోడానికి చోటులేదు. తలుపుపక్కగా నిలబడ్డారు. పైట భుజం మీదుగా కప్పుకుని చుట్టూ చూసింది భయంగా "ఇప్పుడు చెప్పండి, ఎక్కడికీ ప్రయాణం? ఏమిటా ఉద్యోగం?"
"సారీ, ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. బెజవాడలో దిగాక చెప్తాను"
నిలబడలేక కపార్ట్మెంట్ గోడకి జేరగిలబడిపోతున్న అతని అవస్థచూసి ఝాన్సీ కూడా ఏమీ మాట్లాడలేక పోయింది.
బెజవాడ వరకూ ఇద్దరూ నిలబడే ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. మధ్య మధ్య ట్రైన్ ఆగినప్పుడు ఇద్దరూ డిగి ఫలహారంచేసి, కాఫీత్రాగి వచ్చేవారు. ప్రయాణికుల కళ్ళు ఇద్దరినీ ప్రశ్నార్థకంగా కుతూహలంగా చూస్తున్నాయి. ఝాన్సీ పైట నిండుగా కప్పుకోవటంవల్ల వాళ్లు ఏదీ ఊహించుకోలేక పోతున్నారు. ఒక ముసలావిడ ఊరుకోలేక ఝాన్సీని పలకరించుకొనట్లు ముఖం తిప్పుకుంది. ఆవిడ ఊరుకోకుండా కుమార్ ని అడిగింది, ఈ అమ్మాయి నీకేమవుతుందీ అని.
కుమార్ ముసిముసిగా నవ్వుతూ "మావాళ్ళేనండీ" అన్నాడు. ఆ గడుసు సమాధానానికి ఝాన్సీకి కూడా నవ్వు వచ్చి ముఖం మరోవైపు తిప్పుకుంది.
బెజవాడ రాగానే ఇద్దరు ట్రైన్ దిగారు. ప్లాట్ ఫాం దాటకుండానే ఝాన్సీ "ఇప్పుడయినా చెప్పు ఎక్కడికి? ఏమి ఉద్యోగం?" అని అడిగింది. కుమార్ గాబరాగా వాచ్ చూసుకుంటూ "ముందు హొటల్ కెళ్లాలి!" అన్నాడు.
ఝాన్సీ తీక్షణంగా "హొటల్ కి దేనికి?" అంది.
"నా ప్రెండ్స్ అక్కడ వున్నారు, వుండమని చెప్పాను"
"నీ ఫ్రెండ్స్ దేనికి"
"సాక్షి సంతకానికి"
"దేనికి సాక్షి సంతకం?"
"రిజిస్ట్రారాఫీసులో మన పెళ్ళికి"
"ఏమిటి! ఇందుకా ఇంత హడావుడిగా నన్ను తీసుకొచ్చావ్? ఎంత ధైర్యం? నేను వెళ్ళిపోతాను."
" ఝాన్సీ ప్లీజ్! తొందరపడకు అన్నీ చెప్తాను. లెట్ మి రిలాక్స్, నిన్న రాత్రికూడా నిలబడి ప్రయాణంచేసాను.
నిద్రలేదు నన్ను నమ్ము. నీ యిష్టంలేకుండా ఎదీ జరగదు." అతడి ముఖంచూస్తే జాలికలిగింది ఝాన్సీకి. కానీ. ముందుకి నడవటానికి సాహసం కలగలేదు. ఓ.కే వివరంగా చెప్తాను. నేను ఉద్యోగం చేస్తున్నా కొత్తపల్లెలో బోసుబాబు అనీ.....