Next Page 
సౌజన్యసాహితి పేజి 1

                                 


                                   

                                    సౌజన్యసాహితి
                        
             వివిధ రచయిత(త్రు)ల
                                            కథలు
                                                                ----ఎమ్. డి. సౌజన్య

         

                                  

 

          సంచాలకుని మాట-


     సంకలనకర్త, ఎడిటర్ శ్రీ యమ్. డి. సౌజన్యగారు 'సాహితి' సంస్థ స్థాపించి, ప్రముఖ ఔత్సాహిక రచయిత(త్రు)ల కథలు చేర్చి  ఓ పుస్తకం ప్రచురిద్దామని కోరారు. ఈనాడు 'కథాసంకలనం' వేయటం సాహసమే అవుతుంది. ఐనా కార్యరంగంలోకి దూకాము.
    శ్రీ సౌజన్యగారు అనేక వ్యయ ప్రయాసలకు లోనై వివిధ రచయిత (త్రు)ల  రచనలను పుష్టినిచేకూర్చిన రచయిత(త్రు)లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
    ఈ పుస్తకం వెల్గులోకి రావటానికి ఫ్రీ - పేమెంట్ విషయికంగా  కృషిచేసిన శ్రీ వడ్లమన్నాటి, శ్రీ డి. యస్. చంద్రశేఖర్, శ్రీ పి. సుబ్బారావు, శ్రీ యమ్. డి. అమానుద్దీన్, శ్రీ ఎ. వి. సుబ్రహ్మణ్యం గార్లకు అభివందనములు. అందంగా ప్రచురించిన విజయా ఆర్ట్ ప్రెస్ శ్రీ రెడ్డి గార్ని మరువలేం.  బొమ్మ అందంగా వేసిన శ్రీ పుష్పగిరి  శంకర్, తెనాలిగారు అభినందనీయులు. మేం కోరిన వెంటనే తన ఎడ్వర్ టైజ్ మెంట్లు ఇచ్చి, ఈ ఉద్యమానికి అండగా నిలబడిన ప్రకటనకర్తలకు శుభాభినందనములు.
    మాకు బాహ్యంగా కొందరు, గోప్యంగా కొందరు అండగా నిలబడి ఎంతో సహాయ సహకారా లందించారు. వారందరికీ మేం పుస్తక ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాం.
            *అభినందనతో*

                                

              ఆటకట్టు

 

                                                                       ----శ్రీవీరాజీ
    
    
    గెడ్డం మాసింది.
    వార్తాపత్రికలతోబాటు ఓవార్త పత్రిక కూడా అర్జెంటుగా కొనుక్కొని వస్తున్నాను. వార్తలు, వారపత్రికలో పచ్చళ్లు, కూరలూ, శీర్షికలతో సహా బొమ్మలూ ప్రకటనలూ  చదివేయడం...... 'కాఫీకఫే' లు -  అవీతప్పితే సినిమాలు. వీటితో ఆత్మీయత, యీమధ్య చక్రవడ్డీలాగ పెరిగిపోయింది. ఇటీవల దైనందిన కార్యక్రమం తృప్తి నివ్వదు గాని మహ అర్జంటుగా దాన్ని నెరవేర్చుకోవడంలోనే వుంది అంత శ్రద్దా. సమాధానం రాని అప్లికేషనుమీద ఆశా, అక్కర్లేని సినిమా చూసి సంతోషపడ్డంలో గొప్ప, అలవాటైపోయింది.
    విద్యార్ది నిష్క్రమించి వుద్యోగి ప్రవేశించలేదు ఎదనింకా. అయినా యింత వెలితి ఎందుకనో.....
    పాఠాలు వెళ్లిపోయాయి. పరీక్షలు ఏడాదికి మూడు మార్లు అదో మాదిరి మలేరియాలా దాపురించేవి యిక రావు! గతానేక సంఘటనల్లో కలిసిపోయాయి. అయితే వెలితి మిగిలింది... ఎందుకుచెప్మా! సిలబస్ లనేవే, పరిమితంగా  వుంటాయి! అందులోనించి కాంపోజిషనులు రాసుకుని  ఆనక వాటినే ఇంపోజిషను రాసుకుని పరీక్షలు రాసేసి (పారేస్తే) అమ్మయ్య అనుకుంటాం. మూడోవంతు మార్కుల కోసం మనమూ, అవియిద్దామనే వాళ్లూ తాపత్రయం పడతాం. ఈమూడోవంతు వ్యవహారం అతి రహస్యమేం కాదు గనుక, మేష్టార్లు యింతకి మించి చెప్పరు.  చెప్పినా కుర్రాళ్లు వినరు. సరే.... పేపరు తీసి చూద్దామా అనుకున్నాను. హెడ్ లైన్లు చదువుదామనుకున్నాను. కాని దాం దుంప తెగిరి ఎక్కడో తిరుగుబాటు సైన్యంచేత  ప్రభుత్వ కైవసం. ఆప్రికాలోదో, ఆసియాలోదో కాబోలు. సోషల్ స్టడీసులో లేని రాజ్యంలో తిరుగుబాటూ గట్రా వుంటుంది.  దానికోసరం యిప్పు 'డట్లాసు'వెతుక్కోవాలి. అంచేతనే తిన్నగా రెండోపేజీ చూస్తే చాలునులే అనుకున్నాను.
    కాని ఉద్యోగాల కాలమ్ చూడ్డానికి ధైర్యం వుండాలి. అలవాటుండాలి. తెల్లార్లూ టీ తాగుడూ తూలుతూ పరీక్షలు చదివినప్పుడేనా మెడపీక లేదు గాని యీ ఉద్యోగాల (కలి) కాలం చూసేసరికి దాహం వేస్తుంది. బ్రతుకు భయం కాలేజీగేటు దాటగానే వస్తుందని బళ్లో చెప్పని పాఠం. నిజమే! గాని అది అంచనాకు మించి వచ్చింది. అయితే నాయీ ఉద్యోగపర్వంలో ఆదో ఆశ. తృప్తిలేకపోయినా రేపటిమీద మమకార ముంది! ఎండమావులైతేనేం?  దాహం వేసేవాడు పరుగెత్తాలంటే అవేనా అగుపించాలిగదా?
    మా పోస్టుమ్యానుతో ఎంతో దోస్తీ ఐపోయింది నాకు. మూడు బిందెలు ఒకదానిమీద ఒకటి పెట్టుకుని వాటిని నెత్తిన పెట్టుకుని, ఐనా ఒయ్యారంలో లోపం రాకుండా పంపునించి నీళ్లు పట్టుకుపోయే కాపు పిల్లలు కూడా నన్నంత ఆకర్షించడం లేదీ మధ్య. అందమైన వస్తువు కనిపిస్తే కళ్లు పూర్వం నాలుగూ. ఆరూ అయ్యేవిగాని యీమధ్య గెడ్డం తడుముకుంటే బాగుణ్ణు! అనిపిస్తోంది.
    వెనుక(అబ్బ! అప్పుడే కాలేజీ బ్రతుకు గతం అయిపోయింది) పోస్టుమేన్ ఉత్తరాలివ్వడం అందుకోడం అలవాటు లేదు, ఎప్పుడూ మనియార్డర్లను సంతకం చేయడం తప్ప. ఆ పోస్టుమాన్ లు ఒక్కడేనా జ్ఞాపకం లేదు నాకు.
     కాని యిప్పుడో.... మా పేపరు అప్పారావు తలలో తెల్ల వెంట్రుక లున్నాయని, మా పోస్టుమాను శామ్యూల్ పిల్లలవాడనీ (పేరు కూడా ఎంతో జ్ఞాపకం) అతని మొహాన కందికాయ వుందనీ యివన్నీ తెలుసు. చిన్నప్పుడు మాష్టారు ట్రై యాంగిల్ అంటే త్రిభుజము అని కంఠోపాఠం చేయమన్నారు. చూస్తే తెలియదూ? దాందుంపతెగ త్రిభుజానికి ఎన్ని భుజాలో!..కాని పాఠాలు శ్రద్దగా చదవాలని మాష్టార్లు అలా చెప్తారుట!
     అప్పారావు పేపరు అందిస్తూ నవ్వుతాడు.
    అందుకుంటూ  నేను నవ్వుతాను. పోస్టుమానూ అంతే. మావ్యవహారం నవ్వులూ, యివన్నీ - రైలు రావడం రెక్కవాలడం, రైలు వెళ్లడం రెక్క లేచిపోడం లాంటివి.
    ఇవాళ శామ్యూల్ యింకా రాలేదు అతగాడి కొడుకుమెట్రిక్యులేషను ఒక్క మార్కులో పోయిందట. ఒక్క మార్కు కాదు, ఒక్క సంవత్సరం! అంటాడు శామ్యూలు.  'నామాట విని చదివించు ప్యాసవుతాడు' అంటే నువ్వేం చేస్తున్నావు ప్యాసై అన్నాడు నా అంతవాణ్ణి నన్ను శామ్యూలు. 'ఫేలైతే ఏ పనేనా  చేసుకుంటాడు. ప్యాసైతే అదీ నామార్దాయే' ఇది శామ్యూల్ బ్రతుకు గురించి చెప్పే వేదాంతం! 'శ్యామూల్' చెప్పు  తెగిందిట. 'అందు కాలస్యం గంటన్నరా?' అడిగాను నేను. "అబ్బే! మెయిలు గంటప్పావు లేటు మామ్మూల్లేగా, నా జోడు కుట్టించుకోటం మరో పావుగంటా!" శామ్యూల్ కి లెక్కలు వచ్చును.  ఆల్జీబ్రా తెలిసిన నాకు మెయిలు అసలు టైము తెలియదు. దసరా కట్నం అడగడమే కాని క్రిస్టమస్ బక్షీస్  అడగడం శామ్యూల్ కి రాదు. క్రిస్టమస్ ఎందుకో తెలిసిన్నాకు, దసరా సంగతి సందర్బాలు తెలియవు!
     నేను అనుకున్నట్లే గవర్నమెంటు ముద్దర్లు లేని ఉత్తరాలే యిచ్చాడు శామ్యూల్. బహుశా మిత్రకోటిలోని ముఖ్యరత్నాలై యుంటారు. ఐనా ఆశ చెడ్డది. ఎవరేనా  రాశారేమో ఫలానా దగ్గర ఫలానా ఖాళీ వుంది, ఫలాణి వాణ్ణి పట్టుకో దూర్చేస్తాడూ అని.
     అలాగే పేపరులోనూ అంతే. నా నోరు తిరగని పేరుగల ఆఫ్రికాదేశంలో విప్లవం. మొత్తానికి సైనిక స్వామికం ఎక్కడో అక్కడ రోజూను! ప్రజాస్వామ్యం తరువాతిది. ఈ మధ్య అదే!
    "తస్మాత్! యీ విప్లవజాడ్యం మనకు రాకుండుగాక" అని రావాలనే బోలెడు కోర్కెతో ఓ ప్రతిపక్ష నాయకుని ప్రకటన. "అది రావడానికి ప్రతిపక్షులే నాంది కాగలరు" అని అధికార శిరోమణి ఒకడు ప్రతి ప్రకటన.
     సరే పేపరు రెండోపేజీ తాపీగా చూడాలని వాయిదా వేసి ఉత్తరాల్లో ఉద్యోగం. కుశల ప్రశ్నలు, పెళ్లి సంబంధం యీమూడూ తప్ప నాలుగోది ఏమీ వుండగలదా? అని పోస్టు ముద్రలు పరిశీలిస్తూ యింటి గుమ్మం ఎక్కుతూవుంటే సైకిలు గంట 'కింఖ్రిణేల్' మని.
     "ఏంరా! బావగారూ! లవ్ లెటర్సా?" మా సైకిల్ బావ ప్రశ్న. "మరే! నా గెడ్డం చూడు" అన్నాను. వాడు "సెంటిమెంటల్ ఫూల్" అంటూ వెళ్లిపోయాడు. 'డామిట్! వీడిలాగే నేను కూడా ప్రేమలేఖలు  రాస్తే ఎవడి చెల్లెలి మెళ్లోనో పుస్తెకట్టి వాళ్ల బాబు జేబులో నుంచి సైకిలు కొనుక్కొని కింఖ్రిణేల్ మనుకుంటూ ముప్పైయ్యోయేట 'ఎమ్ బీ' చదవాలి, అనుకున్నాను.
     ఔనుమరి! ఈ సైకిలు బావ అంటే మా పెద్ద చెల్లాయి భర్త.
    మరో పంచె బావ వున్నాడు. అక్కయ్య మొగుడు. ఇద్దరి పేర్లూ కోటీశ్వరరావులే గనుక యీ సంకేతాల అవసరం వచ్చింది.  ఈ సైకిలుబావ మా చెల్లాయికి ప్రేమలేఖలు రాసి ఆనక ఉద్యోగం మాని, మా నాన్న భుజాల కష్టంమీద ఎం. బీ. కి వెళ్తున్నాడు.
     సరే!ఉత్తరాలను పేపర్లనూ, ఆశగా చూసుకుంటూ లోపలికి వెళ్లాను.
    "ఏమే రాణీ, మీ ఆయన బళ్లోకి వెళ్లాడా? వీడేడీ? విశ్వం" అంటూ అమ్మ నా కోసరమే కాఫీ పట్టుకొస్తోంది.
     "ఆఁ! ఆఁ! వెళ్లారు. సైకిలు లేదుగా...."అంటూ  అమ్మకి చెపుతూ చెల్లాయ్ వచ్చింది. "అదుగో అన్నయ్య" అంది. వారపత్రిక తీసుకుంది. అందులో అది "అప్పడాలు వత్తుట" మీద ఎవరో రాసిన  వ్యాసంమీద వచ్చిన అభిప్రాయం మీద తన ఖండన రాసింది. అందుకు... దాని ఆదుర్దా దానిది.
     "ఊరు తెల్లారకుండా ఎక్కడికిరా? బయల్దేరావు. కాఫీ పట్టుకు గంటైంది.  కాలుకాలిన పిల్లిలా తిరలుగుతున్నా...." అమ్మా మూర్తీభవించిన అమృతమూర్తిలా నిల్చునుంది నా గది గుమ్మంలో.
     "మరేం! ఉద్యోగం వెతుక్కున్నందుకు వెళ్ళానమ్మా" నవ్వుతూ (నవ్వు అద్దంలో చూచుకుని ప్రాక్టీసు చేశానులెండి) కాఫీ అందుకున్నాను.
    'అలాగేం? మా అన్నయ్యవి కదూ!......అక్కడ మన కాలవలో వలేస్తే ఉద్యోగాలు పడ్తాయి కదురా? అన్నాయ్' చిన్న చెల్లాయి శాంతి నవ్వుతూ వచ్చింది. అంతలో అక్కయ్య "అదే పోనీండిగాని, ముందు టిఫిను తిను, ఆనక స్నానం చేద్దువుగాని" అంటూ ఇడ్డెన్లు ప్లేటులో పట్టుకుని వచ్చింది.
     ఇంట్లో టిఫిన్లు తంతు అక్కయ్యది - పై పెత్తనం శాంతిది.
     "చూడవోయ్! అబద్దం కాదు....."
    పేపరు ఫట్ మని పేజీలు విడేటట్లు దులిపి "యివన్నీ  ఉద్యోగాలే" నన్నాను నేను శాంతి నుద్దేశించి.
    "బావుందర్రా మీ వరస యివందుకోండి, నా కవతల పన్లున్నాయ్!" అని 'అవి' యిచ్చి అక్కయ్య వెళ్ళి పోయింది.
     అమ్మ నవ్వుతూ కప్పు నందుకుని "ఓరినీ అన్ని ఉద్యోగాలెందుకురా నాన్నా, మనకీ? నీకేది ప్రాప్తముందో అదే వస్తుంది  ఉద్యోగమూ రాక యీడొచ్చాకా పెళ్లామూ రాక ఏమవుతుంది? రోజూ తెల్లారకుండా యీ పేపరు సేవమానేసేయ్" అని వెళ్లిపోయింది.
     అమ్మకు భయం ఆ యింతా నేను చిక్కిపోతే ఆడపిల్లల తండ్రులు యీ యింటిమీద కాకులై వాలరని!

Next Page