Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 9


    "మీ నవలలు బాగుంటాయని గౌతమి చెప్పింది. చదువుదామని ఇవాళ వాటిని తీసుకున్నాను."
    "అలాగా! అవి చాలాకాలం క్రితం రాసినవి. ఇప్పుడు చదివిన థ్రిల్ ఏమీ ఉండదు. ఇవి చదవండి_ మీ ఆడపిల్లల అభిరుచికి నచ్చేటట్టుగా రాశాను" అంటూ టీపాయి మీదవున్న ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన తన మూడు పాపులర్ నవలలను తీసి ఆమె చేతికిచ్చాడు.
    సాహితి మౌనంగా అందుకుంది.
    రచయితగా సమ్రాట్ అనేక స్త్రీ పాత్రలను సృష్టించాడు కాని సాహితి వంటి అణకువ ఉన్న అందాలరాశిని ఎన్నడూ చిత్రించలేదు. కనీసం చూడనైనాలేదు. ఊహల్లో కూడా ఎన్నడూ అటువంటి యువతి కనిపించలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు!
    సాహితితో మాట్లాడిన ఆ కొద్దిక్షణాలలోనే అతనికేదో అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది.
    రెప్పవాల్చకుండా సాహితినే చూస్తూ ఉండిపోయాడు.
    వాళ్ళిద్దరి ప్రవర్తనకూ కళ్యాణి ముఖంలో రంగులు మారాయి.
    "మనం వచ్చి చాలాసేపైంది. ఇక వెళ్దాం."
    ఇంకా అలాగే ఉంటే ఎక్కడ వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారో అన్న ఉక్రోషంతో అంది గౌతమి.
    కళ్యాణి అప్పటికి కుర్చీలోంచి లేవనే లేచింది. వాళ్ళిద్దరిలో పుట్టుకొచ్చిన స్త్రీ సమాజమైన ఈర్ష్యను సమ్రాట్ గమనించాడు.
    ఇప్పుడా ఇద్దరిలో మొదట ఉన్న ఉత్సాహం సన్నగిల్లింది. వెంటనే సమ్రాట్ వాళ్ళిద్దరి చేతులలో ఉన్న ఆటోగ్రాఫ్ పుస్తకాలను తీసుకుని సంతకం చేశాడు.
    మరుక్షణమే వాళ్ళిద్దరిలో ముఖాలు విప్పారాయి.
    'హమ్మయ్య' అనుకున్నాడు సమ్రాట్.  
    తన దగ్గరకు వచ్చే అభిమానులందరినీ తృప్తిపరచడం చాలా కష్టమైన పనే. ఏ ఒక్కరూ అసంతృప్తిగా వెళ్ళినా మనశ్శాంతి ఉండదు సమ్రాట్ కు.
    సమ్రాట్ దగ్గర సెలవు తీసుకుని ముగ్గురూ వెళ్ళిపోయారు.


                                  *    *    *    *


    ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
    ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
    రోడ్ల వెంట గుంపులు గుంపులుగా విద్యార్థులు కర్రలు, కత్తులతో సంచరిస్తున్నారు.
    విద్యార్థులను ఆ స్థితిలో చూసిన వ్యాపారస్తులు ఎవరికివారే తమ దుకాణాలను, హోటళ్ళను మూసేసుకుంటున్నారు. షట్టర్లు పడుతున్నాయి.
    కొందరు ఆందోళనకారులు ఆర్.టి.సి. బస్సుల టైర్లలో గాలి తీసివేశారు.
    జనజీవనం స్తంభించిపోయింది.
    "ఆ వస్తున్న అమ్మాయే!"
    దూరంగా రిక్షా రావడం గమనించి, గుంపులోంచి ఒక విద్యార్థి కేక వేశాడు.
    ఆందోళన కారులంతా ఒక్కసారిగా అటు పరుగెత్తి రిక్షాను చుట్టుముట్టారు. కొందరు రిక్షా టైర్లను కత్తితో కోసివేశారు.
    మరికొందరు రిక్షాలో కూర్చున్న సాహితిని చేయి పట్టుకుని కిందకు లాగారు! ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సాహితి కెవ్వున అరిచింది.
    "పోలీసు జులుం_నశించాలి!"
    "ఇన్ స్పెక్టర్ _ డౌన్ డౌన్!"
    "సాహితి, విద్యార్థులకు క్షమాపణ _ చెప్పాలి!"
    ఆందోళనకారుల నినాదాలు మిన్నుమట్టాయి.
    సాహితికి పరిస్థితి అర్థమయింది. ఉదయాన తనను అల్లరి పెట్టిన విద్యార్థులపై ఇన్ స్పెక్టర్ చేయి చేసుకున్నందున విద్యార్ధులంతా ఇప్పుడు ఇలా ఆందోళన చేస్తున్నారు.
    ప్రస్తుతం తనను ఎవరూ రక్షించలేరు. ఎవరో వస్తారు, రక్షిస్తారని ఆలోచిస్తూ కూర్చుంటే జరగవలసిన అవమానం కాస్తా జరిగిపోతుంది!
    వెంటనే వాళ్ళకు క్షమాపణ చెప్పి ఈ గండం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది సాహితి.
    "దయచేసి నేను చెప్పేది కూడా వినండి. ఇన్ స్పెక్టర్ కు నేను రిపోర్టు ఇవ్వలేదు!"
    "ఇన్ స్పెక్టర్ చేత విద్యార్థులను కొట్టించింది చాలక అబద్ధం ఆడుతున్నావా? వారికి జరిగిన అవమానానికి నిన్ను రోడ్డు మీద పరాభవించవలసిందే!"
    అంతా కోపోద్రిక్తులయ్యారు.
    "నాకేం తెలియదు. నన్ను కాపాడండి! జరిగినదానికి నేను క్షమాపణ చెబుతున్నాను. క్షమించి నన్ను వదిలివేయండి. ప్లీజ్!" ప్రాధేయపడింది సాహితి.
    "ఆడదాన్నని ప్రయోజనం లేదు. ఇన్ స్పెక్టరు పోలీసు జులుం చూపించాడు. పదండి - పోలీసు స్టేషన్ ముందు ధర్మా చేద్దాం" - అంటూ ఆందోళనకారులు సాహితిని వదిలి పోలీస్ స్టేషన్ వైపు కదిలారు.


                                                      *    *    *    *


    బిందుమాధవి ఆలోచనలలో క్రమంగా నీలినీడలు చోటుచేసుకున్నాయి.
    సాహితి ప్రవర్తన ఆమెను కలవరపరుస్తున్నది.
    అన్ని కాలేజీల విద్యార్థులూ ఆందోళన చేస్తున్నారు.
    "ఇన్ స్పెక్టర్ వీరేష్ కు - సాహితికి అక్రమ సంబంధం!" అంటూ గోడలనిండా రాశారు.
    ప్రొద్దున వెళ్ళిన సాహితి ఇంతవరకూ ఇంటికి రాలేదు. ఆమెకు ఆందోళనకారులేమైనా కీడు తలపెడితే? తనూ ఒక స్త్రీయే! తను మాత్రం బయటకు వెళ్ళి సాహితిని రక్షించుకోగలదా? ఆ ఊహతో కళ్ళనీళ్లు తిరిగాయి బిందుమాధవికి.
    సరిగ్గా అదే క్షణంలో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి చేరింది సాహితి.
    బిందు మాధవి చూపులను తప్పించుకుని తన గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి విఫలురాలైంది సాహితి.
    "ఆగు! ఆగవే ఆగు! ఇప్పటివరకు ఏం చేస్తున్నావే?" ఆమె స్వరం ఆవేశంతో బొంగురుపోయింది.
    సాహితి మొదటిసారిగా బిందుమాధవిలో అంతటి కావేశాన్ని కళ్లారా చూసిందేమో, మ్రాన్పడిపోయింది. బయట జరిగిన గొడవ అంతా ఆమెకు తెలిసిపోయిందనుకుంది.

 Previous Page Next Page