ప్రపంచంలో చాలా పటిష్టమైన పోలీసు బలగాన్ని ఎదుర్కొన్న శ్రీహర్ష యిక్కడో శమంత్ అనబడే వ్యక్తి గురించి ఆందోళన చెందడం లేదు. కాని కొన్ని క్షణాలపాటైనా కలుపుగోలుగా మాటాడిన వ్యక్తి ముందు దోషిలాంటి స్థితికి కాస్త ఇబ్బంది పడ్డాడు.
తనదయినా తనదికాని ఈ దేశంలో పరిచయాలకి, స్నేహాలకి అతీతంగా వుండాలనుకున్న శ్రీహర్ష ఆ తర్వాత యిక పూర్తిగా మౌనాన్ని పాటించి నిద్రలోకి జారినా వున్నట్టుండి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
కాదు. రప్పించబడ్డాడు.
టైమెంతయిందో తెలీదు.
బోల్ట్ చేయబడ్డ డోర్ తలుపులు బాదుతున్నారెవరో.
ముందు పైకిలేచింది శమంత్.
డోర్ పక్కకి జరిపాడో లేదో అమాంతం మొహంపై బాదారెవరో.
సన్నని మూలుగు.
ఒకరు యిద్దరూ కాదు- ఉన్నట్టుండి అయిదుగురు లోపలికి చొచ్చుకొచ్చారు. దొంగల్లా లేరు. ఒక పోలీసాఫీసర్ ని తుదముట్టించడానికి ఆర్గనైజ్డ్ గా వచ్చిన వ్యక్తుల్లా వున్నారు.
సందిగ్ధంలో పడిపోయాడు శ్రీహర్ష.
ఓ వ్యక్తిచేతిలోంచి బరిసెలాంటి ఆయుధంతో శమంత్ పొట్టలో గుచ్చుతుంటే ఒడుపుగా పక్కకి జరిగాడు శమంత్.
మరో ఆగంతకుడి చేతిలో చైన్ శమంత్ నుదుటి భాగాన్ని చీల్చింది.
బాధగా టాయ్స్ పై పడ్డాడు.
బయట దట్టమయిన చీకటి.
శమంత్ ఆర్తనాదాలు మరెవరికీ వినిపించే అవకాశంలేని ట్రైన్ చప్పుడు.
మరో నిముషం గడిస్తే శమంత్ బ్రతకడు.
ఆ క్షణం శ్రీహర్షకి తండ్రి తెచ్చే బొమ్మలకోసం యింటిదగ్గర ఆర్తిగా ఎదురుచూసే పాప గుర్తుకొచ్చిందో లేక యిందాక అతను ఆప్యాయంగా తినిపించిన ఆపిల్స్ జ్ఞప్తికొచ్చాయో...
"స్టాపిట్! కూపేలో లైట్ వేస్తూ అరలిప్తలో శమంత్ గుండెల్లోకి దిగబోయిన బరిసెని అరచేత్తో పట్టుకున్నాడు.
చిట్లిన చేతి సిరల్లోనుంచి చిక్కని రక్తం... రగిలి పగిలి భగభగమంటూ లావాలా బయటికి చిమ్మింది.
ఉన్మత్త ప్రభంజనమయ్యాడు.
తలపై మరోదెబ్బ.
కణకణమని రాజుకునే రణకాష్టంగా మారేడు.
అగ్నిలో... శతఘ్నిలా...ఝంఝామరుత్తులా... దగ్ధంచేసే హరుడిలా... పైకిలేచాడు...
అరనిముషంపాటు అక్కడ శివతాండవం...
ఆవేశాన్ని నిభాయించుకుంటూనే కదిలాడు...
అందర్నీ నేలకరిపించాడు...
ఇంకొంచెం ముందుకెళితే అందరి తలలూ వృత్తంలా తిరిగి స్వరపేటికలు బయటికి వచ్చేవి.
ఆగిపోయాడు అది చాలన్నట్టు.
అదే అతడ్ని హంతకుడిగా మార్చనిది.
ట్రయిన్ ఆగిపోయింది కాదు, శ్రీహర్ష ఆపేసాడు చైన్ లాగి.
అనుకోని యీ అవాంతరానికి కారణం తెలీక కంపార్టుమెంట్ దగ్గరకు వచ్చిన రైల్వే పోలీస్ లతో అన్నాడు శ్రీహర్ష.
"ఇక్కడ స్పృహలో లేని అయిదుగురు నేరస్థులతోపాటు ప్రాణాపాయస్థితిలో ఉన్న పోలీసాఫీసరు వున్నాడు. అర్జెంటుగా అతడికి ఫస్ట్ ఎయిడ్ కావాలి."
ఏం చేయాలో వాళ్ళకీ పాలుపోనట్టు నిశ్శబ్దంగా చూస్తున్నారు.
ఆలస్యం చేయలేదు శ్రీహర్ష.
కొనవూపిరితో మూలుగుతున్న శమంత్ అమాంతం పైకెత్తుకుని ట్రాక్ కి సమీపంలో కనిపిస్తున్న వూళ్ళోకి నడిచాడు, వందలమంది ప్రయాణికులు అబ్బురంగా చూస్తుంటే.
సరిగ్గా అదే సమయంలో.
ట్రైన్ దిగిన ఓ ఆకారం తనూ అతడ్ని అనుసరిస్తూంది నెమ్మదిగా...
* * *
"డామిట్"
సూర్యోదయం వేళ దేశ ఉపప్రధాని కొడుకు. ఎదుగుతున్న యువజన నాయకుడు "రైజింగ్ సన్నాఫ్ ఆంధ్ర"గా ఖ్యాతిగాంచిన ఇరవై రెండేళ్ళ మహేంద్ర మండి పడిపోతున్నాడు.
తండ్రి ప్రాపకంలో రాష్ట్రంలో ఏదన్నా చేయగలనంటూ చాలా చేస్తున్న మహేంద్ర తన ప్రతి ప్రయత్నంలోనూ అడ్డంపడుతున్న ఏయస్పి శమంత్ ని కడతేర్చటానికి చాలా పటిష్టమైన ఓ పధకం వేసాడు. హత్యలు చేయడంలో సమర్థులైన అయిదుగురు వ్యక్తుల్ని రంగంలోకి దింపాడు.
ఘోరంగా దెబ్బతిన్నాడు.
"ఇప్పుడెలా" తన లాయర్ మిత్రుడు శంకర్ తో అన్నాడు.
"మనవాళ్ళు పోలీసు కస్టడీలో హాస్పటల్లో ఉన్నారు. మరో గంటా రెండు గంటల్లో స్పృహలోకి వచ్చిన శమంత్ తప్పకుండా వాళ్ళనుంచి వాస్తవాల్ని రాబడతాడు. అంటే నన్ను ఇంకా వేటాడి నామీదున్న అభియోగాల్ని బలపరిచి మరో తిరుగులేని సాక్ష్యాన్ని సాధిస్తాడు. ఇదేమిటి... అసలిదెలా జరిగింది?"
"మరో ప్రయాణికుడిమూలంగా"
"ఎవడువాడు."
"వాడ్ని లేపేయాల్సింది"
"వాడి తలకీ అరచేతికి వున్నగాయాల్ని బట్టి మనవాళ్ళు ప్రయత్నంచేసి విఫలమయ్యుంటారనిపిస్తోంది."
"అంటే... శమంత్ కి యిప్పుడు మరోసాక్షికూడా వున్నాడన్నమాట."
"యస్. ఆ సాక్ష్యాన్ని ముందు సమాధి చేయాలి." శంకర్ అలవాటుగా ఉచిత సలహా చెప్పాడు.
సరిగ్గా అదే సమయంలో...
ఫస్ట్ ఎయిడ్ తర్వాత హాస్పటల్ నుంచి బయటికి వెళ్ళబోతున్న శ్రీహర్ష ఆగిపోయాడు ఎవరో పిలిచినట్టు వినిపించి...