"అతడు కాబట్టి ఊరుకున్నాడు. నేనే అయి ఉంటేనా...." అని లత తనవైపు చూడడంతో ఆ వాక్యాన్ని అక్కడికి ఆపాడు.
లత వారి మాటలు విని బాధగా నిట్టూర్చి అందరూ తననొక వింత జంతువు ను చూసి నట్లు చూస్తుండగా ముందుకు పోయింది.
ఎదురుగా వచ్చి కూర్చొన్న లతను చూసి రాజ్ లేచి బయటికి వచ్చాడు. అతన్ని అనుసరించింది లత. అందరూ వారిద్దరి వేపూ ఆశ్చర్యంగా చూడసాగారు.
ఫిజిక్స్ లాబ్ దగ్గర అతన్ని కలుసుకొంది లత. ఆమె అడ్డు రావడంతో చేసేది లేక నిలబడి తలవంచుకున్నాడు రాజ్.
"మీరు నా మొహం చూడటానికి ఇష్ట పడకపోతే పోనీ, ఒక్క విషయం అడుగుతాను. చెప్పండి."
రాజ్ తలెత్తి ఆమె మొహం లోకి ఏమీటన్నట్లు చూశాడు. మొహం లోని దీపత్వాన్ని చూసి జాలి పడ్డాడు. జరిగిన దానికి పశ్చాత్తాప పడిందని గ్రహించాడు. అనవసరంగా తాము ఆమెను కష్ట పెట్ట కూడదని తన కఠిన్యాన్ని ఉపసంహరించు కొన్నాడు.
"మీ మిత్రుడి కి నే చేసిన అన్యాయానికి మీరంతా నన్ను అసహ్యించు కొంటున్నారు. కనీసం మీరైనా నన్ను క్షమించలేరా? నా పైన జాలి చూపలేరా?"
"క్షమించవలసింది మేము కాదు. వాడే నిన్ను క్షమించాలి. ఇక ఏం చూసి జాలి పడ మంటావు? నీలో బలహీనత ను, నిస్సహాయతను చూసి జాలి పడమంటావు. అంతేనా? నువ్వు చేసిన పని నీ బలహీనతను చాటుతుందా? నీ నిస్సహాయత్వాన్ని చాటుతుందా? నీలోని అహంభావాన్ని వెల్లడి చేస్తోంది. ఇతరుల అహంభావాన్నీ, అధికారాన్నీ చూసి జాలిపడే స్థితిలో లేడు మానవుడు. నువ్వు జీవితాలతో చెలగాటమాడుతున్నావన్న విషయం గ్రహించి ఉంటె ఇంత విషమ పరిస్థితి సంభవించేది కాదు. మీరంతా మా జీవితాలతో ఆడుకోడానికి వచ్చారు. వాడు చేసింది తప్పనకుండా ఉండలేను. అతని కన్నా పెద్ద తప్పునే నువ్వు చేశావు. అతనేం పెద్ద చెయ్యరాని తప్పు చెయ్యలేదు. అందరిలా ప్రేమించాడు. ఆ ప్రేమను హృదయం లో దాచుకోన ప్రయత్నించి చేతకాక ఎదురుగా అడిగే ధైర్యం లేక ఉత్తరం ద్వారా తెలియజేసి నీ ప్రేమను అర్ధించాడు. నీకిష్టం లేకపోతె తిరస్కరించవచ్చు. చేతనైతే బుద్ది చెప్పవచ్చు. ఇదేం స్కూలనుకున్నావా ఉపాద్యాయునికి చెప్తే నాలుగు చీవాట్లో లేక నాలుగు తన్నులో తగిలించి వూరు కోవడానికి? ఇది మన జీవితాలను ఒక సుస్థిర ప్రదేశానికి చేర్చే ఇరుసు లాంటిది. అదే విరిగిపోతే అతని జీవితమే దారి మారి దూరంగా విసిరి వేయబడుతుంది."
"ఇప్పుడు నన్నేం చెయ్య మంటారు?"
"నువ్వు చేయగలిగింది, చేయవలసినదీ ఒక్కటే. ఎన్నడైనా, ఎక్కడైనా వాడు కనిపిస్తే క్షమాభిక్ష నర్ధించి వీలైతే దేనికోసం వాడు ఆ పరిస్థితికి వచ్చాడో అ పేమను అతనికి ప్రసాదించి, అతనికి అంకితమై పోయి అతని సేవలో నీ జీవితాన్ని గడుపు. అప్పటికి నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అలా చేయగలిగే మనస్తైర్యం , ఆత్మార్పణ చేయగలిగే ధైర్యం నీలో ఉందొ లేదో నాకు తెలియదు కానీ అలా చేయక పొతే నీ జీవితాంతం కుమిలి ఏడ్చినా నీకు శాంతి దొరకదు" అని అక్కడి నుండి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
* * * *
"ఏమే రజియా ! ఈ మధ్య మాయింటి వైపే రావడం లేదు?" అడిగింది అరుణ.
"పోనీ నేను రాలేదనుకో. నువ్వు మా యింటికి రావచ్చు గా?" జవాబు చెప్పింది రజియా.
"అదికాదే . మా అన్నయ్య కు ఎప్పుడూ నీ కలవరింత లే ననుకో. మీరేమైనా పోట్లాడు కున్నారా అని ఒకే పోరు."
"నువ్వేం చెప్పావు?"
"ఇప్పుడావిడగారు మనల్ని మరిచి పోయింది లేరా అన్నయ్యా! అని చెప్పాను."
"మరిచి పోవడమంటే అంత తెలికేమే! ఇంకోసారి అలాంటి మాటలన్నావంటే తంతాను."
"ఆహా. మరిచి పోలేదనుకో. మీవారితో తిరుగుతుంటే మేమెక్కడ జ్ఞాపకాని కోస్తామా అని."
"ఏయ్, ప్రతిసారీ ఇలాటి మాటలు మాట్లాడావంటే అసలు నీతో మాట్లాడను." సిగ్గుతో చెప్పింది రజియా.
"నాతొ మాట్లాడ కుంటే పోనీలే. ఒకసారి మా యింటి కొచ్చి మా అన్నయ్య కు కనపడి పొదువు గానీ రా. లేకుంటే నా ప్రాణాలు తీస్తాడు."
'అలాగే పద" అంది రజియా వల్లే వాటు సరిచేసుకుంటూ.
"ఏమిటో దారి తప్పి వచ్చినట్లున్నావే, రజియా?" అడిగాడు ఆనంద్.
"లేదు. దారి తెలుసుకునే వచ్చాను."
"అయితే మమ్మల్ని మరిచి పోయావా?"
"అదేం కాదు. మా యింటి దగ్గరే ఒక స్నేహితుడు దొరికాడు."
"క్రొత్త స్నేహితులు తోడైతే పాత వారిని వదిలెయ్యడమేనా మీ ఆడవారి పని?"
'ఛ ఛ! రోజూ ఇంతదూరం రావాలంటే కష్టంగా ఉంది. పోనీ మీరే మా యింటికి రాకూడదూ?"
"తప్పకుండా."
ఇంతలో అరుణ కాఫీ తీసుకు వచ్చింది. ఆనంద్ కాఫీ త్రాగుతూ కళ్ళతో రజియా అందాన్ని త్రాగేస్తున్నాడు. అదేమీ గమనించలేదు రజియా.
* * * *
ఆకర్షణ ప్రతి పాణీ కి ఉంటుంది. మనిషికీ, మనిషికీ ఆకర్షణ ఎక్కువ. కొందరి హృదయాలు కొందరిని చూచి ఆకర్షించుకొంటాయి. దాని నుండి తప్పించుకోలేరు వారు. ఎదుటి వారి కున్న శక్తి అటు వంటిదేమో? మరీ వారికి పరిచయం ఏర్పడితే అది విడివడరాని బంధంగా తయారవుతుంది. ఆ పరిచయం ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము. ఆ పరిచయమే జీవితానికి సౌఖ్యాన్ని ఆపాదించవచ్చు లేక నిరంతర దుఃఖాన్ని ఇవ్వవచ్చు. కానీ ఆ ఆకర్షణ కు లొంగి వారు దగ్గరవుతున్న కొద్దీ, వారు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఊహాలోకాల్లో తేలిపోతారు. క్రొత్త శక్తులను, క్రొత్త ఉత్సాహాన్ని పొంది ఇతరులు చూసి ఈర్ష్య పడే సుఖ సౌఖ్యాలను, భోగ భాగ్యాలను తమవిగా చేసుకొంటారు. స్వర్గానికి పోకుండానే భూలోకం లోనే స్వర్గ సౌఖ్యాన్ని చవి చూడగలుగుతారు. తమ చుట్టూ ఒక దివ్య తేజస్సు ను నిర్మించు కొని, చూచేవారు ఆరాధించే లోగా ప్రకాశిస్తారు. తమ జీవితాలను అతి సౌఖ్య వంతంగా మార్చుకో గలిగే శక్తి వారికి ఉంది. నిజమా, కాదా తెలుసుకోవాలి.
రజియా, రాజ్ ల స్నేహం దినదినాభివృద్ది చెందుతుంది. రాజు తనకు తెలియకుండానే ఆమెతో కాలం గడుపుతున్నాడు. ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేక పోతున్నారు. ఎవరికి వారు నిత్య నూతన సంతోషం తో మెలగుతున్నారు. తమ ఆనందాన్ని మరొకరికి పంచి పెట్టి తృప్తి పడుతున్నారు. స్నేహం స్నేహంగా నే ఉంది.
అందరికీ అటువంటి జీవితం లభ్యమవుతుందా? కాదు. అదే లభించిన నాడు ఈ చింతా చీకులూ , కష్టమూ, దుఖమూ బాధా వీటికి తావుండదు. అలాంటి నిర్మల స్నేహం, స్వాతంత్యం , ఆనందం పొందిన నాడు మానవుడి కి స్వర్గంతో పని ఏముంది?
రజియా అప్పుడప్పుడూ ఏదో కోరిక తెలియ చెయ్యాలని ప్రయత్నిస్తుంది. కాని, దాని పర్యవసానం ఏమవుతుందో నని భయపడేది. రాజ్ మాత్రం ఏ ఆలోచనలకూ , కోరికలకూ అవకాశ మివ్వకుండా ఆమె సాంగత్యం లో క్రొత్త క్రొత్త ఆనందాల్ని అనుభవిస్తున్నాడు. ఎన్నడూ ఎరుగని హుషారు, జీవితమంటే ప్రేమ కలుగుతున్నాయి. ఇన్నాళ్ళూ సౌఖ్యం , ఆనందం అంటే ఏమిటో ఎరుగని అతని మనసు ఇప్పుడిప్పుడే వాటిని అందుకొంటుంది.
ఒకనాడు "రాజ్, నీతో ఒక విషయం చెప్పాలని ఉంది" అంది రజియా.
"ఏమిటో చెప్పు, రజియా" అన్నాడు రాజ్ చుట్టూ చూస్తూ.
"దీని పర్యవసానం ఏమైనా సరే మన ఈ స్నేహం విడి పోగూడదని నా ప్రార్ధన."
'అలాగాలే, రజియా. ఏమిటో చెప్పు."
"బహుశా నీకు జ్ఞాపక ముంటుందను కొంటాను. ఆనాడు నేను నా హృదయాన్ని ఒకరి కర్పించానని చెప్పాను. ఇప్పుడు అతనెవరో చూపిస్తాను. నువ్వు సహాయం చెయ్యాలి."
"తప్పకుండా చేస్తాను" అని రాజ్ ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాడు.
నవ్వింది రజియా.
"నువ్వు కళ్ళు మూసుకో. అతన్ని నీ ముందుకు తెస్తాను."
అలాగే చేశాడు రాజ్.
"ఇక కళ్ళు తేరు" అనగానే రాజ్ కళ్ళు తెరిచాడు. తన గడ్డం కింద రజియా దోసిలి లో ఉన్న నీటిలో తన మొహం కనిపించింది. అర్ధం చేసుకొన్నాడు.
"రజియా!" అన్నాడు మెల్లిగా.
'అర్ధమైందా, నా ఆరాధ్య దేవత ఎవరో." అంది రజియా తన ఆనందాన్ని అదుపు లోకి తెచ్చుకుంటూ.
ఏమీ మాట్లాడకుండా తల వాల్చేశాడు.
"ఏం, రాజ్, నేను నీకు తగనా?" నీళ్ళవతల పారేసి అడిగింది రజియా ఆశ్చర్యంగా.
"ఇటువంటి విషమ పరిస్థితి వస్తుందని ఊహించ లేకపోయాను, రజియా! అనుకోని విషమ సమస్య తెచ్చి పెట్టావు."