భగవాన్ లోపలికెళ్లి రెండు మందు బాటిళ్లు తెచ్చి రెండు గ్లాసుల్లో పోసి చంద్రముఖి దగ్గర ఒక గ్లాసు పెట్టి తను ఒక గ్లాసు తీసుకుని తాగటం మొదలుపెట్టాడు.
"అవునూ...ఏమిటి? దుకాణం కట్టేశావా? వూరేమైనా వెడుతున్నావా?" అడిగాడు భగవాన్.
చంద్రముఖి నిజాయితీగా "నేనిక ఆర్భాటాల బతుకు బతకటం మానేశాను భగవాన్" అంది.
దేవదాసు తలెత్తి చూసి మళ్ళీ తలవంచుకున్నాడు.
ఇంతలో బయట ఓ పెళ్లి ఊరేగింపూ, పల్లకీలో వధూవరులు, షెహనాయి వాద్యం వినిపించింది. కిటికీలోంచి ఆ దృశ్యం చూసిన దేవదాసు మూడ్ ఇంకా సీరియస్ గా తయారైంది. పల్లకీలో తనూ, పార్వతీ కూర్చున్న గతం గుర్తుకొచ్చింది. మొహం కందగడ్డలా తయారైంది. 'ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు పాపం..' అని గొణుక్కున్నాడు. ఇక తట్టుకోలేక చంద్రముఖి ముందు భగవాన్ పెట్టిన గ్లాసు విస్కీని గటగటా తాగేసి, గొంతుపట్టుకుని కాసేపు అవస్థపడ్డాడు. చంద్రముఖి కంగారుగా లేచి మంచినీళ్లు ఇచ్చి భగవాన్ వైపు కోపంగా చూసింది.
* * *
తలుపుతీసి ముక్కుమూసుకుని అడ్డం తొలిగింది పార్వతి. దేవదాసు తడబడుతూ వెళ్లి, మంచం మీద డభాలున పడిపోయాడు. పార్వతికి కళ్ల నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా వెళ్లి దేవదాసు కాళ్ల చెప్పులు తీసి కిందపెట్టి, మళ్లీ అతడి పాదాల దగ్గరే కాస్త చోటు చూసుకుని, మాగన్నుగా నిద్రపోయింది.
మర్నాడు పొద్దున "మనోరమ వచ్చింది నిన్న సాయంకాలం. ఇవ్వాళ వూరెడుతోందిట. నేనూ వెడుతున్నాను దానితో..." అంది.
దేవదాసు తెల్లబోయాడు. పారూ వెళ్లిపోతోందా? ఎలా? తనకెలా? "ఓ వారంలో వచ్చేస్తావా?" అడిగాడు.
పార్వతి విచిత్రంగా నవ్వింది. "మల్లెపూలూ అత్తర్లూ, విస్కీ వాసనలూ తగ్గిపోయాక కబురు చేయండి. వస్తాను. రాక చస్తానా కట్టుకున్నాక.." అంది.
తనిప్పుడు ఏం చెప్పినా అనవసరమని, అర్థం చేసుకునే సమయం దాటిపోయిందని మౌనంగా ఉండిపోయాడు దేవదాసు.
రెండు నెలలయింది.
ఒకరోజు పొద్దున్నే తలుపు తడుతూంటే పార్వతి వచ్చిందేమో అన్న ఆశతో తలుపు తీశాడు.
ఎదురుగా ధర్మదాసు. గుడ్లనీరు కుక్కుకుంటూ "దేవదా.. మీ నాన్నగారు..." అంటూ దుఃఖంతో మాట్లాడలేక వెక్కుతున్నాడు.
దేవదాసు ఒక్కక్షణం స్థాణువయ్యాడు. తండ్రి పొవటమన్నది ఓ పట్టాన జీర్ణం కాలేదు.
దేవదాసు నాన్నగారు పోయాక ఆస్తి పంపకాలయ్యాయి. తనకిన్ని కోట్లు వచ్చాయని అమ్మ చెపితే 'ఓహో...' అని ఊరుకున్నాడు.
ఆ రాత్రి దేవదాసు గదిలోకొచ్చింది పార్వతి.
"రేపే నా ప్రయాణం?" అంది. దేవదాసు సూట్ కేసు సర్దుకుంటూ జవాబు చెప్పలేదు.
"నేనూ ఒస్తాను" అంది.
దేవదాసు మాట్లాడలేదు.
"ఇల్లుంచారా? ఖాళీ చేసి ఆవిడెవరూ...ముఖి...ఆ...చంద్రముఖిఇంట్లోనే ఉంటున్నారా?" అంది.
దేవదాసు ఒకసారి తీక్షణంగా చూసి ఊరుకున్నాడు.
"ఇంకెంతకాలం పుట్టింట్లో వుండనూ? నన్నూ తీసికెళ్ళండి" అన్నది.
"ఎంతకాలం ఉండాలని ఒచ్చావు? ఇక ఇక్కడ వుండవలసిన అవసరం లేదా?" అన్నాడు దేవదాసు మామూలుగా.
"అంటే?" అంది పార్వతి.
"అదే... మా నాన్నగారు ఎప్పుడు పోతారూ అని అడిగావుగా ఆ రోజు" అన్నాడు.
పార్వతికి వెంటనే దుఃఖం వచ్చింది. ఏదో పొరపాటున మాట్లాడితే ఇన్నిరోజులు గుర్తుపెట్టుకున్నాడా!
"దేవా!" అని వాళ్లమ్మ కేక వినిపించింది.
వెంటనే బయటకు వెళ్లబోయాడు.
పార్వతి "ఆగండి" అని చెయ్యి పట్టుకుంది.
దేవదాసు ఆ చేతిని ఒదుల్చుకుని "మా అమ్మ పిలుస్తోంది" అన్నాడు.
"మీరు మీ భార్యతో మాట్లాడుతున్నానని చెప్పండి" అంది.
"నువ్వలా అనుకుంటున్నావేమోగానీ - నేనలా అనుకోవటం లేదు" అని వెనక్కి వెళ్లి సూట్ కేసులోంచి అందినన్ని చోట్ల కట్టలు తీసి పార్వతి ముందు పడేసి వెళ్లిపోతుంటే - పార్వతి దుఃఖంతో "నేనేమన్నా మీరుంచుకున్న సానిదాన్ననుకున్నారా..." అంది బిగ్గరగా.
దేవదాసు విననట్లే వెళ్లిపోయాడు.
* * *
ఒకరోజు చంద్రముఖి దగ్గర వున్నప్పుడు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది దేవదాసుకి. చంద్రముఖి కంగారుపడి డాక్టర్ ని పిలిపించింది. 'లివరు బాగా పాడైపోయింది. అర్జెంటుగా మందు మానెయ్యా'లన్నాడు డాక్టరు. "మానెయ్యండి. అయినా డాక్టరయివుండి అంతగా ఎలా పాడుచేసుకున్నారు?" అన్నాడు దేవదాసు పదో పెగ్గు తాగుతూ.
అప్పట్నుంచీ దేవదాసుని బయటకెళ్లనీయకుండా, మందు తాగనివ్వకుండా అహర్నిశలూ దగ్గరుండి ఆరోగ్యవంతుడిని చేసింది చంద్రముఖి. దేవదాసుని చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. 'ఇక భవిష్యత్తులో ఒక్క గుక్కకూడా తాగకూడదని, తాగితే తనిచ్చిన మందులన్నీ వికటించి చాలా డేంజరవుతుంద'ని చెప్పాడు.
కొన్నాళ్లు గడిచాయి. తిరిగే కాలూ తాగే నోరూ ఊరుకోవు గదా! చంద్రముఖి వద్దంటున్నా వినకుండా, ఆమెకు చేతికందినంత డబ్బు ఇచ్చి, మనశ్శాంతి కోసం దేశం అంతా తిరగటానికి బయల్దేరాడు. చంద్రముఖి కన్నీళ్లు పెట్టుకుంది.
"నాకెందుకు డబ్బు" అంది.
"ఒంటరి ఆడదానివి. డబ్బు చాలా అవసరమవుతుంది" అన్నాడు దేవదాసు.
చంద్రముఖి కళ్లు తుడుచుకుని నవ్వి "నేను ఒంటరి ఆడదాన్నని ఇన్నాళ్లకి గ్రహించారన్నమాట" అంది.
దేవదాసు బయల్దేరుతూ "ఇక్కడే ఉంటావా లేక..." అన్నాడు.
చంద్రముఖి "మీకోసమే ఇక్కడున్నాను... నా స్వగ్రామం వెళ్లిపోతాను. అక్కడ నా వాళ్లు కొంతమంది వున్నారు" అంది.
"బాగుంది. నీకు శుభమగుగాక" అని ఆమె నెత్తిమీద చెయ్యిపెట్టి ఆశీర్వదించాడు.
దేవదాసునే అంటిపెట్టుకుని వుంటున్న ధర్మదాసు - లగేజీని తీసికెళ్లి బండిలో సర్దాడు.
"మీ సేవ చేసుకునే భాగ్యం మళ్లీ ఎప్పుడు కలుగుతుంది?" అంది చంద్రముఖి దుఃఖపడుతూ.