ఉన్నట్లుండి కుప్పలా కూలిపోయింది సామ్రాజ్యం. 'పాపా, పాపా!' అని ఆదుర్దాతో పిలుస్తూ అతను క్రిందికి ఒంగి ఆమెను లేవదియ్యటానికి ప్రయత్నిస్తున్నాడు. భరించలేని బాధతో ఆమెముఖంలో అప్పటికప్పుడు వూహించలేనంత మార్పు వచ్చేసింది. నేలమీద పడివుండి పెదవిని పంటితో నొక్కిపట్టి బాధ భరిస్తోంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
కష్టంమీద మంచంమీదకు చేర్చాడు. మల్లెలు చల్లిన ప్రక్క ఆమె రోగిష్టి శరీరంతో ఒకప్రక్క కాస్త నలిగింది.
ఆమె నుదుటిమీద చెయ్యివేసి, జుత్తురాసి ఊరడించటానికి ప్రయత్నించాడు. చివరకు లేచి ఇవతలకు వచ్చేస్తుంటే 'బావా! క్షమించు' అంది చేతులు జోడించి. అతని మనసు కలచివేసినట్టయింది. ఆ చేతులు పట్టుకుని, ఆమెబాధని మాటలతో ఉపశమింప చెయ్యటానికి తెల్లవారిపోయింది.
ఆ మొదటిరాత్రి మొదలు ఈనాటివరకు చరిత్ర ఎన్నిసార్లో తిరగబడింది. ఎన్నిరోజులో చరిత్ర నిద్రపోయింది. ఎప్పుడూ మొదటిపేజీలోనే వున్న చరిత్ర.
స్నేహితుల అవహేళనకి గురి అయ్యాడు. అపనిందలకు లోనయ్యాడు. డబ్బుకోసం పెళ్ళి చేసుకున్నాడనుకున్నారు. డబ్బు మనిషిన్నారు.
అన్నీ భరించి, దిగమ్రింగి తానుమాత్రం ఒంటరిగా చరిత్రలోనే కొత్తపుటల నలంకరిస్తున్నాడు.
భోజనాలయాయి. కాసేపు కబుర్లు చెప్పుకుని అప్పటికే బాగా పొద్దుపోవటంచేత నిద్ర ప్రయత్నాల్లో పడ్డారు.
మేడమీద, క్రింది గదులన్నీ మనుషులతో నిండిపోయాయి. వేసవి ఎండలు మొదలయినవిగాని యింకా ఆరుబయట పడుకునేంతటి తీవ్రస్థాయికి చేరుకోలేదు కాబట్టిగాని, లేకపోతే యింటిల్లిపాదీ చాపలో, జంబుఖానాలో పరుచుకుని డాబామీదకి చేరిపోయేవాళ్ళు.
మేడమీద గదిలోకి వచ్చిన గిరిజ తన పుస్తకాలు క్రింద మర్చిపోయి వచ్చానని గుర్తువచ్చి క్రిందకి దిగుతోంది. మెట్లకు సగంవరకూ వచ్చింది. సరీగ్గా ఆ సమయానికి క్రిందనుంచి మెట్లెక్కుతూ ఎదురుగా వచ్చాడు సుందరం. ఒకప్రక్కకి తొలగి అతనికి దారివ్వబోయింది. అతనూ ఆమె తొలగినవైపుకే అడ్డంగా వచ్చాడు. గిరిజ నవ్వేసి ఎడమవైపుకు జరిగి క్రిందకు దిగబోయింది. అతను మళ్ళీ అటే వచ్చాడు.
"ఏమిటిది?" అంది గిరిజ ముఖం కోపంగా పెట్టి.
"నువ్వు దారి ఇవ్వందే ఏంచెయ్యను?"
"నువ్వా నేనా అడ్డువచ్చేది?"
"నాకు అడ్డు తొలగించుకుని ముందుకెళ్ళిపోవటం అలవాటు. అడ్డు నిలబడటం అలవాటులేదు.
"అలాగా! యిప్పుడు చేసింది ఏమిటో?"
"నేనేమీ చెయ్యలేదు."
"అయితే సరే దూసుకుపోవటం నాకూ అలవాటే" అంటూ ఆమె సర్రున అతన్ని ప్రక్కకి త్రోసేసి క్రిందికి వెళ్ళబోయింది. అతనా తాకిడికి తట్టుకుని మెరుపులా మళ్ళీ బలంగా అడ్డుకున్నాడు. అనుకోని ఈ పరిణామానికి ఆమె బ్యాలెన్స్ తప్పి క్రిందపడిపోయింది. వెంటనే అతను లాఘవంగా ఆమెను పట్టుకోకపోతే ఆమె మెట్లన్నీ దొర్లుకుంటూ చివరంటా వెళ్ళిపోయేది. మరుక్షణం అతను ముందుకు వంగి 'దెబ్బ తగిలిందా' అని పరామర్శిస్తున్నాడు.
"చాల్లే, వాదులు" అని అతని చేతిని విదిలించేసి తన ప్రయత్నంమీద లేచి నిలబడింది. క్రిందపడినప్పుడు ఎడమకాలు బెణికినట్లుంది. కదల్చటం కష్టమయింది.
కొంచెం ఏడుపు వచ్చినట్లయింది. 'ఈ మగాళ్ళు మా దార్న మమ్మల్ని పోనివ్వరు' అని ఏడుపు గొంతుతోనే కసురుకుని, ఈ కాలు బెణుకుతో క్రిందకి వెళ్ళి అందరి ప్రశ్నలకూ గురికావటం యిష్టంలేక మళ్ళా పైకే ఎక్కసాగింది.
"నేను సాయం చేస్తానుండు" అని సుందరం ఆమె జబ్బ పట్టుకోబోయాడు.
"ఏమీ అక్కర్లేదులే" అని విదుల్చుకుని ఆమె ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకిచేరి తనగదిలోకి వెళ్ళిపోయింది.
ఆమె సుకుమారి. కించిత్తు బాధనికూడా ఓర్చుకోలేదు. కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతూండగా మంచంమీద కూర్చుని కాలు చూసుకుంటోంది.
అడుగుల చప్పుడయ్యాయి.
కళ్ళటు త్రిప్పేసరికి సుందరం గదిగుమ్మం దగ్గర నిలబడి లోపలకు వచ్చే ప్రయత్నంలో వున్నాడు.
"నువ్వేం రానక్కర్లేదు" అంది కోపంగా.
సుందరం ఆమె మాటను లక్ష్యపెట్టకుండా లోపలకు వచ్చేశాడు. చనువుగా ప్రక్కన కూర్చుని 'ఏదీ చూడనియ్యి, ఎక్కడ దెబ్బ తగిలిందో' అని ముందుకు ఒంగబోయాడు.
"నువ్వేం చూడనక్కరలేదు" అని కాలు క్రిందపెట్టేసుకుని ప్రక్కకి జైర్గి కూర్చుంది.
"మంత్రం పెడతాను. చిటికలో పోతుంది."
"నీ మంత్రాలు నాకేమవసరంలేదు."
"అయితే కోపం పోలేదా."
"అబ్బ! నువ్విక్కన్నుంచి వేళ్ళు బాబూ పుణ్యముంటుంది."
"కోపం పోయిందో లేదో చెబితేగాని వెళ్ళను."
"నే చెప్పను."
"అయితే నే వెళ్ళను."
"ఉండు అమ్మని పిలుస్తాను...ఆ..." అని అరవబోయింది.
అతను చప్పున ఆమె పెదవులమీద చెయ్యిపెట్టి సున్నితంగా అదుముతూ అరవకుండా చేశాడు. ఆ చేతిని కొరికెయ్యాలన్నంత ఆగ్రహం వస్తోంది గిరిజకు. అంతపనీ చేద్దామనుకుందికూడా. ఇంతలో మెట్లెక్కి ఎవరో వస్తోన్న అలికిడి అయింది. గబుక్కున ఆమెను వదిలేసి ఏమీ తెలియనివాడిలా అవతలకు వెళ్ళిపోయాడు.
"పెద్దవీరుడు" అనుకుంది మంటగా.