Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 8


    "నువ్వు కేవలం గొప్పకోసం చెప్పావో, లేక ఎప్పుడూ నిజమే చెప్తావో కనుక్కోవటం కోసం పరీక్ష. అఫ్ కోర్స్, మొత్తం ఈ నాటకం అంతా ఏర్పాటు చెయ్యడానికి పదివేలదాకా ఖర్చయిందనుకో! కానీ నాక్కావలసిన కుర్రాడివి దొరికావు."

    "నేనడిగిన ప్రశ్నకి సమాధానం అదికాదు" అన్నాడు వేణు కోపంగా. అతడి కాళ్ళకి తొండలు కొరికిన చోట ఇంకా బాధగానే వుంది.

    "పద నడుస్తూ మాట్లాడుకుందాం. ఇక ఈ పాడుబడిన బిల్డింగ్ లో అనవసరం. బై దిబై నా పేరు ప్రసాదరావు" అంటూ కుర్చీలోంచి లేచాడు. ఇద్దరూ బయటికి నడుస్తూ వుంటే అతడు అన్నాడు__

    "బ్యాంక్ దొంగలతో కలియబడి నా డబ్బు వాళ్ళ దగ్గర్నుంచి లాక్కున్నప్పుడు నాకంతగా సంతోషం అనిపించలేదు. కానీ, నువ్వు అలా ప్రాణాలకి తెగించి వాళ్ళమీదకు దూకిన కారణం చెప్పగానే మాత్రం అదిరిపడ్డాను. నువ్వు యధాలాపంగా అన్నావో, నిజంగానే అన్నావో అర్ధం కాలేదు. ప్రాణంపోయినా అబద్ధం చెప్పని కుర్రాడి అవసరం నాకు చాలా వుంది. దాంతో ఇంతదూరమూ ఆ రోజు నీ సిటీబస్ వెనుక ఫాలో అవుతూ వచ్చాను. నువ్వీ ఫ్యాక్టరీలో కార్మికుడవని తెలిసింది. ఇద్దరు మనుషులు రోజుకి ఇరవైనాలుగ్గంటలపాటూ ఎన్నో రోజులు కష్టపడి నీ గురించి మొత్తం వివరాలన్నీ సేకరించారు. నీ వివరాలన్నీ చూసినకొద్దీ నా ఆనందం మరింత ఎక్కువ అయింది." వృద్ధుడు నడుస్తూ మాట్లాడుతూ వుంటే వేణు పక్కనే నడవసాగాడు.

    ఇద్దరూ కాంపౌండ్ లోంచి బయటకొచ్చారు. పక్కనే రోడ్డుమీద మారిస్ మైనరు కారుంది. "మా ఇంటికి వెళ్దాం రా. నీతో చాలా మాట్లాడాలి. తిరిగి నిన్ను దింపుతాలే" అన్నాడు ప్రసాదరావు. వేణు మాట్లాడకుండా కారెక్కాడు. పాతకాలంనాటి మారిస్ మైనరు కారు అది. దడదడా శబ్దం చేస్తూ బయల్దేరింది.


                                                                          3


    "చాలామంది పైకి గొప్పగా కనబడతారు. విపత్కర పరిస్థితి వస్తే జావకారిపోతారు. కొందరు అలాకాదు. ఎప్పుడూ మామూలుగానే వుంటూనే, ప్రమాదస్థితిలో కూడా అలా మామూలుగానే వుండగలరు. ఈ మామూలుగా వుండగలగటం అనేది గొప్ప విద్య. నాకు కావాల్సింది సరిగ్గా అదే క్వాలిటీ" ఆగి అన్నాడు.

    "నువ్వొక కార్మికుడివి, చిన్నప్పుడే తల్లీ తండ్రీపోయారు. అయినా చాలా 'మామూలు'గా చదువు పూర్తి చేసేవు. ఇదేగానీ ఇంకొక రెవరయినా అయివుంటే 'లేబర్ హీరో', 'కార్మికుల్లో రత్నం' వగైరా టైటిల్సుతో అడ్వర్టయిజు తీసుకుని పాపులారిటీ కోసం ప్రయత్నించి ఉండేవాడు. "సరే-అదలా పక్కన పెట్టు. అంతకన్నా నాకు నచ్చిన విషయం మరొకటి వుంది. నువ్వు ఉద్యోగంలో చేరిన తరవాత బ్యాంకు అకౌంటు ప్రారంభించి, నెలనెలా కొంత డబ్బు అందులో వేస్తూ వస్తున్నావు! నీ అకౌంటు ప్రారంభిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ప్రతినెలా రెండో తారీఖున నువ్వు ఆ డబ్బు జమచేస్తూ వచ్చావు. అది చాలా చిన్న మొత్తం అనుకో. కానీ పన్నెండు సంవత్సరాల్నుంచీ- అంటే- నూటనలభైనాలుగు నెలలు. నూటనలభై నాలుగు ఎంట్రీలు. శలవు రోజున తప్పిస్తే సరిగ్గా రెండో తారీఖునే పడ్డాయి. అంటే ఇన్ని సంవత్సరాల్నుంచీ క్రమం తప్పకుండా రెండో తారీఖున ఆ పని చేస్తున్నావన్నమాట. ఎంతో గొప్ప క్రమశిక్షణ వుంటేకానీ అది సాధ్యంకాదు. అది నీ రెండో క్వాలిటీ.

    పోతే మామూలు సమస్యల్లా కాకుండా నీకో పెద్ద కష్టం వచ్చిపడింది. అది నీ చెల్లెలు అనారోగ్యం. నీ చెల్లెలంటే నీకు చాలా ప్రేమ. నీ తల్లి నీ మీద వదిలేసి వెళ్ళిపోయిన ప్రభావం తాలూకు రిఫ్లెక్షన్సు నీ చెల్లి మీద వున్నాయి. నీలో ఇంత సంస్కారం పెంపొందటానికి కారణం నీ తల్లే. నీ తల్లి ఎందుకు వురేసుకు చచ్చిపోయిందో ఎవరికీ తెలీదు. ఆమె నీకు చిన్నతనంలో పురాణ కథల్నీ- గాధల్నీ వినిపించి మిగతావాళ్ళనుంచి ప్రత్యేకంగా తయారుచేసింది. అలాంటి నీ తల్లి రిప్లికా అయిన నీ చెల్లెలి అనారోగ్యం నీకు బాధగా తయారైంది. ఇప్పుడది బాగుపడాలంటే పాతికవేలు కావాలని ఈ నగరంలో కెల్లా మంచి డాక్టరూ, కానీ బాగా డబ్బు వసూలు చేసేవాడు అయిన రాజారావు అన్నాడు. నీ మొత్తం జీవితకాలంలో ఆ డబ్బు సంపాదించగలవని నువ్వు అనుకోవడంలేదు. దయానందం ప్రాపకం సంపాదించి కార్మికుల్లో అలజడి సృష్టిస్తే అతడేమైనా కొద్దిగా డబ్బు సర్దితే సర్దవచ్చేమోగానీ అతగాడంటే నీకు పరమద్వేషం. ఈ విషయంలో నువ్వెప్పుడూ బైటపడలేదు.... ఈ బైటపడకపోవటం అనేది నీకున్న మంచి క్వాలిటీ."

    అతడు చెప్పుకుపోతూంటే వేణు నోటమాట రాక విస్మయంగా చూస్తూ వుండిపోయాడు. జల్లెడవేసి పట్టుకున్నట్టూ తన జీవితంలో ప్రతీ అనుభవాన్నీ, ఆలోచననీ పట్టుకున్నాడు ఈ వృద్ధుడు. ఎంతో కష్టపడితే తప్ప మానవమాత్రుడికి సాధ్యమయ్యే పనికాదిది. అయితే వేణూకి ఒకటే అనుమానం పురుగులా దొలుస్తూంది.

    ఇంత కష్టం యితగాడెందుకు పడ్డాడు?

    అతడు అది అడిగేలోపులో కారు ఒక ఇంటిలోకి ప్రవేశించింది. చాలా పురాతనమైన ఇల్లు అది. ఆ ఇంటిలోకి కారు తిరుగుతూ వుండగా ఎదురిల్లువైపు యధాలాపంగా చూశాడు వేణు. బైట నేమ్ బోర్డు మెరుస్తూంది.

    'సర్ జగపతిరావ్ బహద్దూర్'

    'ఈయనిల్లు ఇక్కడా?'.... అని అనుకున్నాడు. దాని గురించి అంతగా పట్టించుకోకుండా ఆ వృద్ధుడితో కలిసి మెట్లు ఎక్కాడు. చెక్క మెట్లు అవి. జాగ్రత్తగా ఎక్కకపోతే క్రిందపడిపోవటం ఖాయం. ఇద్దరూ మేడ మీద ఒకే గదిలోకి ప్రవేశించారు.

    ఆ గదిలో బీదతనం నాట్యం చేస్తూంది. ఒక దండేనికి పాతబట్టలు వ్రేలాడుతున్నాయి. కిటికీ దగ్గిర కుక్కి మంచం వుంది. దానిపైన మేకుకి మిలటరీవాళ్ళు ఉపయోగించే బైనాక్యులర్స్ వున్నాయి. గదిలో ఒక మూల నీళ్ళ కూజా వుంది. పక్కమీద దుప్పటి మాసి వుంది. పరుపు లేదు. చాలా చిన్న గది అది. ఏ క్షణమైనా పై కప్పు మీద నుంచి పెద్ద పెచ్చు వూడి పడటానికి సిద్ధంగా వుంది.

    వేణు ఆ గదిని పరీక్షగా చూడటం గమనించి, ఆ వృద్ధుడు నవ్వి "చాలా బీదవాణ్ణి. అందుకే గది ఇలా వుంది" అన్నాడు.

    వేణుకి అతడో ఆశ్చర్యార్ధకంగా తయారయ్యాడు. మారిస్ మైనరు (అది పాతది చౌకలో వచ్చినదీ అయి వుండవచ్చు) కారులో తిరిగేవాడు ఇంత బీదగా వుండటం ఏమిటా అని.

    "అసలు మీరెవరు? ఆ మిలటరీవాళ్ళకూ, మీకూ ఏమిటి సంబంధం?"

    "నాకూ, వాళ్ళకీ ఏ సంబంధమూ లేదు. నీ చుట్టూ మిలటరీ వాతావరణం సృష్టించటానికి ఆ నాటకం ఆడాను. ఒకడికి ఇన్సూరెన్సు ఏజెంటు వేషం వేసి రామయ్య దగ్గరికి పంపాను. రామయ్య ఎలానూ కవరు నీకే ఇచ్చి మిలటరీ డాక్టరుకి ఇచ్చి రమ్మంటాడని నాకు తెలుసు. మిలటరీ కాంప్ గేటు దగ్గిర మరో మనిషిని మోటారుసైకిలుతో వుండమన్నాను. మిగతా ఇద్దరు జవాన్లూ, జోషీ, చివరకి నీ ముందుగా చచ్చిపోయినట్లు నటించినవాడూ, అందరూ రంగస్థలం నటులే. ఒక్కొక్కరూ రెండువేలు తీసుకున్నారు. మొత్తం పదివేలు ఖర్చయిందని అన్నది అందుకే...."

    వేణు అతడివైపు కన్నార్పకుండా చూసేడు. నుదుటిమీద ముడతలు వృద్ధాప్యంతోపాటూ విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. అతడి మొహంలో ఎప్పుడూ విషాదానికి చోటు లేదన్నట్టు కళ్ళు సంతృప్తితో నవ్వుతున్నాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ కళ్ళ వెనుక అదోలాంటి తపనా, పట్టుదలా కనబడుతున్నాయి. వేణుకి అతడెందుకో మొదటి చూపులోనే నచ్చాడు. నేను పక్కనున్నాను సుమా- అనే 'పెద్దతోడు' అతడిలో కనపడుతూంది. 

    మొత్తానికి తను చాలా గొప్పగా 'ఫూల్' చెయ్యబడ్డాడు. అసలు ఇదంతా నాటకం అయివుండవచ్చు అన్న అనుమానం తనకి రాలేదు. మొదట్లో దీనిపట్ల కోపం వచ్చినమాట నిజమేకానీ, ఆ తరువాత ఆలోచిస్తే ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు అతడిని అభినందించాలని అనిపిస్తుంది. మిలటరీ కాంప్ 'లోపలికి' తీసుకెళ్ళకుండా తనని బైట సత్రంలోకి తీసుకొచ్చినప్పుడే తనకి అనుమానం రావల్సింది. కానీ ఆలోచించుకోవటానికి టైమ్ ఇవ్వకుండా ఒకదాని తరువాత మరొక పని చాలా పకడ్బందీగా చేసేరు పాత్రధారులందరూ.

    "నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు. మరణం చివరి అంచువరకూ తీసుకెళ్ళి నన్ను పరీక్షించవలసిన అవసరం మీకెందుకు వచ్చింది?"

    "అది చెప్పాలంటే పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి" అంటూ చెప్పబోతూ వుండగా గుమ్మం దగ్గిర అలికిడి అయింది. ఒక స్థూలకాయురాలు- ఇంటి యజమానిలా వుంది గుమ్మం దగ్గిర నిలబడి వుంది. ఆవిడ శరీరం జూలో ఏనుగులాగానూ, ఆవిడ మొహం టి.వి.లో అనౌన్సర్ మొహంలాగానూ వుంది. "ఏవఁయ్యా! రెండు నెలలక్రితం చెప్పాను. ఇల్లు ఖాళీ చెయ్యమని చేస్తావా_లేదా?" అంది.

    ప్రసాదరావు ఆవిడవైపు ఇబ్బందిగా చూసి, "మేం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నాం" అన్నాడు.

    "నా అద్దె నాకూ ముఖ్యమైన విషయమేనయ్యా!" అంది ఆవిడ అక్కణ్ణుంచి కదలకుండా. 'ఈ మహాశయుడు అద్దె కూడా సరిగ్గా ఇవ్వటం లేదా_' అనుకున్నాడు వేణు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది 'అద్దె పెంచటం' విషయం అని మాటల సందర్భంలో అర్ధమైంది. నూటపాతిక నుంచి నూటయాభై చెయ్యమంటున్నది ఆవిడ. నూటముప్పై వరకూ చేస్తానంటున్నా డీయన, అదీ చర్చ. చివరకి, ఇంకో నాలుగు నెలల్లో ఖాళీ చెయ్యటానికి నిర్ణయం కుదిరింది. ఆవిడ వెళ్ళిపోయాక ఆ ముసలాయన వేణువైపు తిరిగి, "ఆవిడ అడిగినట్టూ అద్దె నూటయాభై చేస్తే ఓ పాతిక ఎక్కువ ఖర్చవుతుంది.... చెయ్యొచ్చు కానీ ఈ గదికి ఇంతకన్నా ఎక్కువ అవసరం అని నా ఉద్దేశ్యం. అదీగాక మరో నాలుగు నెలల్లో ఈ గది అవసరం తీరిపోతుంది" అన్నాడు.

    వేణు దానిపట్ల అంతా ఉత్సాహం చూపించక, "మీరు తొందరగా పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం కోరుకుంటున్నాను" అన్నాడు. వృద్ధుడు హుక్కాలో పొగాకు కూరుకుంటూ చెప్పటం ప్రారంభించాడు.


                                4


    "నాకూ నీలాగే ఒక చెల్లెలుండేది. మా చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. దాని పేరు రాజ్యలక్ష్మి. నేను రైల్వే డిపార్టుమెంటులో పనిచేసేవాడిని. తరచు కాంపులు వెళ్ళవలసి వచ్చేది. చిన్నగదిలో మేమిద్దరమూ వుండేవాళ్ళం. ఒంటరిగా వున్న ఆడపిల్ల మనసు కోతిలాంటిది. ఎంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిందో తెలీదు కానీ, ఒక కుర్రవాడితో అది పరిచయం పెంచుకుంది. నాకు తెలిసేసరికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.

    ఆ క్షణం దాన్ని చంపేసేవాడినే. కానీ అదోమాట అంది. 'ప్రేమ గురించి నీకేం తెలుసన్నయ్యా__' అని. ఆ వయస్సులో అందరూ అలాగే అనుకుంటారనుకుంటా. ప్రేమ గురించి తాము కనుక్కున్న మహత్తర సత్యాన్ని మరెవరూ తెలుసుకోలేకపోయారని.... అదలా వుంచు. నా చెల్లెలి కోణంలోంచి ఆలోచిస్తే నాకు ఆమె చేసిన తప్పేం కనబడలేదు. ఆప్యాయంగా మాట్లాడటానికి ఎవరూ లేరు. ప్రేమ పంచివ్వటానికి తల్లీ తండ్రీ లేరు. ఈ పరిస్థితిలో కొద్దిగా అభిమానం చూపిస్తే కరిగిపోయే వయసులో ఆ చిన్నపిల్ల అతడివైపు ఆకర్షితురాలవటంలో తప్పేం వుంది. ఆ ఆకర్షణకి పర్యవసానంగా కేవలం స్త్రీనే శిక్షించటం దేవుడి సృష్టి తప్పు. రాజ్యం గురించి నాకు బాగా తెలుసు. పద్దెనిమిదేళ్ళు వచ్చినా దానికి లోకం గురించి తెలీదు. దాని అమాయకత్వాన్ని ఆ కుర్రవాడు బాగా వాడుకున్నాడు. నేను అతడి గురించి ఎంక్వయిరీ చేసేను. బాగా డబ్బున్నవాళ్ళ అబ్బాయి అతడు. కుర్రవాడు కాస్త పప్పుగుత్తిలా వున్నా బాగానే వున్నాడు. అదృష్టవశాత్తూ అతడికి ఇంకా పెళ్ళి కాలేదు.

    నేను ఆ పళాన వెళ్ళి గూర్ఖాని పక్కకి తోసేసి హాల్లోకి నడిచి ఆ తండ్రిని నిలదీసి, కొడుకు చేసిన నిర్వాకానికి సంజాయిషీ అడిగి, పెళ్ళి పీటలమీద ఇద్దర్నీ కూర్చోబెట్టమని అడగలేదు. లేదు_ అలా చేస్తే గూర్ఖా దగ్గిరే నేను మెడపట్టుకుని బైటకి గెంటివెయ్యబడతానని తెలుసు. డబ్బున్న తండ్రులు, కొడుకుల్ని ఎలా రక్షించుకుంటారో కూడా నాకు బాగా తెలుసు. మైనారిటీ దాటిన ఒక ఆడపిల్లా, ఒక కుర్రవాడూ కలసి తిరిగి, ఆ పరిణామం శృతిమించినా కూడా న్యాయశాస్త్రం కుర్రవాడిని శిక్షించదు. పెళ్ళి చేసుకొమ్మని శాసించదు. కానీ ఆ కుర్రవాడు తనకింకా పెళ్ళి కాలేదనీ, నిన్ను పెళ్ళి చేసుకుంటాననీ వాగ్దానం చేసి, ఆ వాగ్దానంవల్ల ఒక అమ్మాయిని లోబర్చుకుంటే అది 'బీచ్ ఆఫ్ ప్రామిస్' క్రింద వస్తుంది.

 Previous Page Next Page