నే.... నే.... నే.... నే....
నిద్రలో పడిపోయాను.
32
ఊపిరాడనంత వేగంతో రోజులు గడిచిపోతున్నాయి. నేను ఇంచుమించు రాయటం మానేశాను. కాని మా స్టాఫ్ అద్భుతంగా రాసి పారేస్తోన్న నవలలు నా పేరుతో వెలువడుతున్నాయి.
తెలుగులో నా పేరు తప్ప మరో రచయిత పేరు వినబడటం లేదు.
నా విజయం చూసి నన్ననుసరించే చోటా రచయితలు పుట్టుకురాసాగారు.
వాళ్ళకు భాష మీద అధికారం ఉండటమలా ఉంచి అసలు ప్రాథమికమైన భాషాజ్ఞానం కూడా ఉండదు. శరత్ బాబు పేరు తెలీదు. అదో సినిమా నటుడి పేరనుకుంటారు. అయినా ఏవేవో ట్రిక్కులు పెట్టి రాసేస్తూ రచయితలుగా చలామణీ అయిపోతున్నారు. పత్రికలకు పేరు కావాలి కదా. ఈ కొత్త రచయితలు చేస్తోన్న ప్రయోగాలతో అవి పేజీలు నింపేస్తున్నాయి. ఈ గాలి దుమారంలో పాత రచయితలు, ఎన్నో సంవత్సరాల పాటు ప్రఖ్యాత రచయితలుగా గుర్తింపబడినవారు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయారు. కొందరు రాజీపడి కొత్త మార్గాన్ని అనుసరించాలని ప్రయత్నించి మరింత అధోగతి పాలయిపోతున్నారు. మొత్తం మీద పత్రికలూ, సాహిత్యం.... అన్నీ భ్రష్టు పట్టి పోయాయి. టి.వి., స్టార్, కేబుల్ టి.వి.ల ప్రభంజనంలో రచయితలంతా గాలి కెగిరిపోయారు.
మదన్ ఏమయ్యాడు?
అతని పేరు కనిపించటం మానేసింది.
ఒకరోజిద్దరు ఆడవాళ్ళొచ్చారు.
"మీతో ఇంటర్వ్యూ చెయ్యటాని కొచ్చాం" అన్నారు.
"చెయ్యండి" అని వాళ్లని సగౌరవంగా కూచోబెట్టి పనమ్మాయి లతతో జ్యూస్ తెప్పించాను.
మంచి ఎండలో వచ్చారేమో, జ్యూస్ త్రాగడం ఎన్ జాయ్ చేస్తున్నట్లు కనిపించారు.
"మీరు రాసేది సాహిత్యమనుకుంటున్నారా?"
"అనుకోవటం లేదు."
"మరేమిటి?"
"ఏమిటో నాకూ తెలీదు."
"తెలీకుండానే రాస్తున్నారా?"
"అవును."
"ప్రస్తుతం తెలుగులో చాలా పాప్యులారిటీ, క్రేజ్ ఉన్న రచయిత్రి మీరు. ఒకరకంగా చెప్పాలంటే మీ స్థానానికీ, మీ తర్వాత వారికీ పది స్థానాలు తేడా ఉంటుంది."
"అవన్నీ నేను పట్టించుకోను."
"మీ పాప్యులారిటీకి కారణం మీరు రాసే బూతులు అనుకోవచ్చా?"
"బూతులు చాలామంది రాస్తున్నారు. నాకంటే ఎక్కువ రాసే వాళ్ళున్నారు. అందరికీ ఇంత పాప్యులారిటీ రావటం లేదుగా."
"మీకు అద్భుతమైన అందముంది. అమోఘమైన హొయలుంది. గొప్ప క్రేజ్ ఉంది. ఒరిజినాలిటీ ఉంది. అదీగాక ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మీరు. ఇవన్నీ కలిపి అదనపు ఆకర్షణలుగా తయారై ఉండవచ్చు."
"అయి ఉండబోవు" అని నవ్వేసి ఊరుకున్నాను.
"మిమ్మల్ని చూస్తోంటే ఆడాళ్ళము మాకే...."
"స్త్రీ అంటే స్త్రీకి ముచ్చట కలగటం కొత్త సంగతేమీ కాదు."
"మీకు చాలా ప్రేమలేఖలొస్తుంటాయా?"
"నన్ను చూసి వచ్చేవే అవి. నన్ను చూసి సారీ నా రచనల ద్వారా నన్ను చూసి పిచ్చెక్కిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు."
"వాటికి మీరు జవాబులిస్తూంటారా?"
"నా సెక్రటరీ సాయంతో ఇస్తూ ఉంటాను."
"మీరింత పచ్చిగా, ఉన్నదున్నట్లు రాయటానికి కారణమేమిటి?"
"పరిస్థితులు."
"కొంచెం వివరంగా చెబుతారా?"
"నా వైపు ప్రపంచాన్ని లాక్కుపోదామనుకున్నాను. దానికోసం ఎన్నో హింసలనుభవించాను. నన్ను నేను పోగొట్టుకున్నా లెక్క చెయ్యలేదు. ప్రపంచం వేటినైతే విలువల క్రింద జమ కట్టిందో, ఆ విలువల కన్న మనిషి విలువ అనంతం అని చాటి చెప్పటానికి ఆరాటపడ్డాను. ఘోష పెట్టాను. ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. వినిపించుకోవటం లేదు. హతాశురాలయినాను. ఒక్క 'నిజం' తెలుసుకున్నాను. మనిషి అనేవాడు అనేకమంది అల్పజీవుల సమ్మేళనం. ఆ అల్పజీవుల వైపు బాణాలని సంధించాను. విజయం వరించింది."
"ఇది విజయమంటారా?"
"ఇప్పుడు నాకు ప్యాలెస్ లాంటి భవనం, నాలుగు కార్లు, అసిస్టెంట్లు, నౌకర్లు.... ఇదంతా ఏమిటి"? ఆగండి. విజయాన్ని మరో కోణం నుంచి దర్శిస్తూ మళ్ళీ మీరడగబోతున్నారు. కొన్నాళ్ళయ్యాక నేనే దానికి జవాబు చెబుతాను. ఆ సమయం రావాలి."
"ఎప్పుడొస్తుంది?"
"తప్పక వస్తుంది. ఎప్పుడు అని కొన్నిటి గురించి అడక్కూడదు."
"మీ పర్సనల్ విషయాలు అడగవచ్చా?"
"నిరభ్యంతరంగా."
"మీరు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని డైవోర్స్ చేసినట్లున్నారు.
"అవును."
"అలా చెయ్యటంవల్ల మీ వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అవటం లేదా?"
"ఏం చేస్తాం? మొదటి పెళ్ళే చాలా పటిష్టంగా ఉండాలి. ఆడది గాని మగాడు గాని చాలావరకూ రాజీపడుతూ ఉంటారు. అది దెబ్బ తిన్నాక స్థిరత్వం మీద నమ్మకం పోయి రాజీపడే గుణం కూడా తగ్గిపోతుంది."