థియేటర్ డ్రస్ లో గుర్తించలేని ఆకారంతో ఆపరేషన్ టేబుల్ దగ్గరకొచ్చాడు శరత్ చంద్ర. కళ్ళు తప్ప అతని శరీరభాగమంతా స్టెరైల్ క్లాత్ తో కవర్ చేయబడి ఉంది. చేతులకు గ్లవ్స్ తొడుగుతూ అనస్థటిస్ట్ వేపు చూశాడు.
"యూ కెన్ ప్రొసీడ్ శరత్ చంద్రా" ఆ చూపుని అర్ధం చేసుకొన్నట్లు చెప్పాడు అనస్థటిస్టు శ్రీవర్మ. అతని గొంతు స్నేహ పూర్వకంగా ఉంది. రోగి మత్తులో కెళ్ళి సిద్ధంగా ఉన్నాడనే సూచన అది.
క్రైసిస్ ని ఎదుర్కోబోతున్న స్నేహితుడికిచ్చే ప్రోత్సాహం ఆ గొంతులో పలికింది.
అతని మాట వింటూనే యుద్ధరంగంలో రాజులా రోగివైపు స్థిర చిత్తంతో అడుగువేశాడు శరత్ చంద్ర.
మృత్యువక్కడక్కడే తిరుగుతూ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.
రోగి గుండెకి అమర్చేందుకోసం - అతని తొడభాగం నిలువునా చీల్చి, లోయలో పడుకొని ఉన్న కొండచిలువలాంటి బలమైన రక్త నాళాల్ని కండరాల నుండి జాగ్రత్తగా చకచకా విడదోస్తోంది అసిస్టెంట్ రవళి.
శరత్ చంద్ర చేతిలోని డయోథెరమీ సాయంతో ఛాతీ మీది చర్మం నిలువునా తెగి, ఛాతీ నిలువు ఎముక బయటపడింది.
అసిస్ట్ చేస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్ ఎలక్ట్రిక్ పరికరం అందించాడు. రంపం లాంటి ఆ పరికరం సాయంతో, పొట్లకాయని నిలువుగా మధ్యకి కోసినట్లు నిలువు టెముకను కోశాడు శరత్ చంద్ర.
అసలు యుద్ధం మొదలైంది!
శత్రువు ఆయువు పట్టయిన ఛాతీ అంతర్భాగాన్ని స్థావరం చేసుకొని పోరాటం మొదలెట్టాడు శరత్ చంద్ర.
ఎ.సి. గది వేడెక్కింది.
పేల్చడానికి సిద్ధంగా ఉన్న తుపాకుల్లా, కళ్ళూ, చెవులూ, మెదడూ సమస్తం శరత్ చంద్ర మీదే కేంద్రీకరించి అతని సూచనకోసం బిగుసుకుపోయి నిలబడి వున్నారు నర్స్ లు.
తమ విధేయతను నిరూపించుకునేందుకు, సహాయానికి సిద్ధంగా ఉన్న సామంతరాజుల్లా సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్ డాక్టర్స్ అక్కడక్కడే తచ్చాడుతున్నారు.
తెగిన ఎముక భాగం లోపలికి రెండుచేతుల వేళ్ళూ ఎదురెదురుగా దూర్చాడు శరత్ చంద్ర. హనుమంతుడు ఛాతీని చీల్చుకున్న విధంగ చేతుల బలమంతా ఉపయోగించి ఛాతీని రెండు భాగాలుగా చీల్చాడు. గ్లవ్స్ తో కవర్ చేసిన అతని చేతులు రక్తంతో తడిసిపోయి పట్టుదలని సూచిస్తున్నాయి.
గుండెని అందుకొనేందుకు వీలుగా అలా తెరుచుకుని ఉండేందుకు మరో పరికరం అమర్చాడు.
కొండగుహ ద్వారంలా ఛాతీ తెరుచుకొని ఉంది.
స్పాట్ లైట్ ఛాతీ లోపలి భాగంలో పడేట్లు అమర్చాడో స్టూడెంట్ డాక్టర్.
అప్పుడు కనిపించింది.... ఇంత యుద్ధానికి కారణమైన గుప్పెడంత గుండె!!
సరదాగా అడవికి వెళ్ళి, పులినోటికి చిక్కి చావు తప్పించుకుని పారిపోయి గుహలో దాక్కున్న రాజుగారి చిన్న కుమార్తెలా....బిక్కు బిక్కు మంటూ బలహీనంగా కొట్టుకుంటోంది.
అంతిమ క్షణాల్లో బలవంతంగా కళ్ళు తెరిచి తన వాళ్ళందరినీ చూసుకుంటున్నట్లు జాలిజాలిగా లబ్-డబ్ ల కదలికలు!
ఏదో తెలీని ఉద్వేగానికి లోనయ్యాడు శరత్ చంద్ర.
ఒక్కక్షణం అలాగే దానివైపు చూసి, చేతులూ రెండూ ఛాతీలో దూర్చి, అపురూపంగా గుండెని దోసిట్లోకి పొదువుకొంటుండగా....
"సర్! మీ బాబుకి యాక్సిడెంట్ అయిందట!" అని చెప్పలేక.... చెప్పలేక చెబుతున్నట్టు వినిపించింది నర్సు గొంతు.
ఊహించని విధంగా శత్రువు బాంబు విసిరినట్టు... అక్కడందరి చూపులూ నర్స్ మీద కేంద్రీకృతమయ్యాయి, ఒక్క శరత్ చంద్ర తప్ప!
తనని కాదనుకున్నట్లు చేతుల్లోని గుండెని ఏకాగ్రతంగా పరిశీలిస్తున్నాడు.
మృత్యువు అతన్ని చూసి ఎగతాళిగా నవ్వింది!
"సర్! మిమ్మల్నే- మీ బాబుకి యాక్సిడెంట్ అయిందట డాక్టర్ రవళి అతనివైపు వంగి చెప్పింది.
"యాక్సిడెంటా? ఎవరు చెప్పారు?" చూపు మరల్చలేదుగానీ, మాట బుల్లెట్ లా దూసుకొచ్చింది.
"మీ మిసెస్ వచ్చి చెప్పారు సార్! మిమ్మల్ని పిలవమంటున్నారు" అంది వార్త మోసుకొచ్చిన నర్స్.
"బాబుకేమైంది?" వెన్నుమీద బండరాయి పడినంత బరువుగా ఉందతని మాట.
"తెలీదు సార్! మీ మిసెస్ కంగారుగా ఉన్నారు."
అతను మనసు కీడుని శంకించింది.
"జీవూకేం జరగలేదు కదా!" మనసు మూలిగింది. ఎవరో తనలోని శక్తినంతా పీల్చేసుకుంటున్నట్టు... కాళ్ళలో సన్నని కంపనం..... ఎలా?
ఇప్పుడెలా వెళ్ళగలడు తను?? ఇతన్ని అర్ధాంతరంగా జూనియర్ చేతుల్లో వదిలి వెళ్ళగలడా?
తుది ఘడియల్ని లెక్కిస్తూ ఆగి ఆగి స్పందిస్తున్న దోసిట్లోని గుండె వైపోసారి చూశాడు.
ప్రాణం ఎవరిదైనా ఒక్కటే! జీవన్ తనకెంత ముఖ్యమో ఇతనూ అంతే!
"నన్ను క్షమించు జీవూ!" అనుకున్నాడు. ఒక్క నిర్ణయానికి వచ్చినవాడిలా.... క్షణంలో చుట్టుముట్టిన పది ఆలోచనల్లోంచి తల విదిలించాడు.
రణరంగంలో నిర్ణయాలు చకచకా జరగవలసిందే! తీరికగా సమీక్షించుకునే టైమ్ కాదది!
నిటారుగా నిలబడి రోగి తొడభాగం దగ్గరున్న రవళిని చూస్తూ "మీ పని ముగిసిందా?" దృఢంగా అన్నాడు.
"కుట్లు వేయాలి సార్" చెప్పింది.
చిన్న స్టీలు గిన్నెలో ఆమె తీసన రక్తనాళం వానపాములా పడుకొని ఉంది. దాని మీదంతా ఐస్ తో కవర్ చేయబడి ఉంది.
"మీ పని మరొకళ్ళు చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి. నా భార్యకి తోడుగా ఉండండి. బాబు కేమైందో చూసి వెంటనే నాకు ఫోన్ లో తెలిజయజేయండి! ప్లీజ్!"
అతని గొంతులోని ఆదేశమూ, అభ్యర్ధనలకి కదిలిపోయింది రవళి.
"తప్పకుండా సార్!" అంటూ అక్కడినుండీ కదిలింది. ఆమె పనిని మరో జూనియర్ అందుకున్నాడు.
తన పనిలో నిమగ్నమయ్యాడు శరత్ చంద్ర.
అతని స్థిరత్వానికి ఖిన్నులయ్యారు అక్కడందరూ.
అతనివైపే ఆరాధనగా చూస్తూ బయటికెళ్ళింది రవళి.
"నాకు టెలిఫోన్ అందుబాటులో వుంచండి" నర్స్ తో చెప్పాడు. ఆమె పరిగెట్టింది. అతని చేతులు సెకను కూడా వృధా కానీయకుండా పనిచేసుకుపోతున్నాయి.