"మరి వెక్కిరించినందుకు శిక్ష" అన్నాడు సుందరం ఘనకార్యం చేసిన వాడిలా.
"బావా! అదేమిటి?" అంది గిరిజ చేత్తో ఏదో చూపిస్తూ...అతనివెనక.
"ఎక్కడ?" అంటూ అతనటువైపు తిరిగాడు.
"ఇక్కడ" అని అతని వీపుమీద చుర్రుమనేటట్లు ఒకటిచ్చుకుని లోపలకు దారితీసింది.
"అమ్మదొంగా! నీపని చెబుతానుండు" అంటూ సుందరం చురుకుగా ఆమెవెంట పడ్డాడు.
గిరిజ వంటింట్లో పనిచేస్తున్న తల్లిదగ్గరకు పరిగెత్తుకుపోయి ఆమెను పట్టుకోబోయి, మడిగట్టుకుందన్న సంగతి గుర్తొచ్చి "అమ్మా! బావ చూడవే," అంటూ ఆమెను తాకకుండానే ఆమెనడ్డం చేసుకుని నిలబడింది.
ఈలోగా సుందరంకూడా అక్కడికి చేరుకున్నాడు. "చూడత్తయ్యా బేబీ ఏంచేసిందో?" అంటూ.
"ఏమిట్రా మీ గొడవ?"
"నేను పెద్దవాడినికదా నన్నది యిష్టమొచ్చినట్లు కొట్టవచ్చా? వీపుమీద ఎంతదెబ్బ చరిచిందో తెలుసా?"
"ఏమిటి బేబి! రాకరాక బావవస్తే అప్పుడే అల్లరి మొదలుపెట్టావా?" అంది అనసూయమ్మగారు.
"అయితే తను నా జడ పుచ్చుకుని లాగవచ్చేమిటి?"
"మరి నన్ను' రాగానే వెక్కిరించావెందుకు?"
"నా యిష్టం ఇదిగో మళ్ళీ వెక్కిరిస్తా ఏంచేస్తావో చెయ్యి" అని గిరిజ నాలిక బయటపెట్టి మళ్ళీ యిందాకట్లా చేసింది.
"అత్తయ్య వుందనిగాని లేకపోతేనా? బయటకొస్తావుగా చెబుతాను నీ పని" అని సుందరం ఉడుక్కుంటూ బయటికెళ్ళాడు.
అతనట్లా వెళ్ళాడో లేడో "ఏం వదినా? వంటలో సాయం చెయ్యమంటావా?" అంటూ సుందరం తల్లి శారదమ్మ లోపలకు వచ్చింది. ఇదిగో బేబీకూడా యిక్కడే నక్కిందే" అంది గిరిజని చూసి, ఏమే బావని చూశావా?" అంది మళ్ళీ.
"ఊఁ మీ అబ్బాయంటే నాకేమన్నా భయమనుకున్నావు కాబోలు మా అమ్మకి వంటలో సాయంచేద్దామని వచ్చాను" అంది మురిపెంగా గిరిజ.
"అబ్బో! అయితే వంటకూడా నేర్చుకున్నావన్నమాట అయితే కోడలిపిల్లగా బాగానే పనికొస్తావు. యింకేం? ఏవమ్మా వదినా! అప్పుడే బేబీతో మడి కట్టిస్తున్నావన్నమాట" అంది శారదమ్మ.
"మడా? దానిమొహం దానికసలు అన్నం వార్చటం వచ్చేమో అడుగు" అంది అనసూయమ్మగారు కూతురివంక ప్రేమగా చూస్తూనే.
ఎంతో అవసరమైనప్పుడు తప్ప కోడళ్ళని కూడా వంటపని ముట్టుకోనివ్వదు అనసూయమ్మగారు. కూరలు తరగటం, బియ్యం కడగటం వరకే చేస్తారు కోడళ్ళు.
"నువ్వెప్పుడూ ఇంతే! నాకేం రాదని అందరికీ చెప్పటం నీకు గొప్ప" అంటూ గిరిజ బయటకు వచ్చేసింది.
అప్పుడామెకు చిన్నవదిన సంగతి గుర్తొచ్చింది. వాకిట్లో అంతా వున్నారు గానీ చిన్నన్నయ్య కనిపించలేదు. ప్రొద్దుట తాను సినిమాకి వెళ్ళమని చెప్పిందిగా, ఒకవేళ వెళ్ళారేమో!
గదిలోకి వెళ్లేసరికి సామ్రాజ్యం మంచంమీద గోడవైపు తిరిగి పడుకుని వుంది.
"అదేమిటి వదినా! సినిమాకి వెళ్ళలేదే?" అనడిగింది కాస్త బాధపడి.
సామ్రాజ్యం తల ఇటువైపు త్రిప్పిచూచింది. ప్రొద్దుట ఆరోగ్యంతో కళకళలాడిన ఆమెముఖం ఈ కొద్దిగంటల్లోనే ఎన్నో లంఖణాలు చేసినట్లు వాడిపోయి వుంది.
"సినిమా ఒకటి నా మొహానికి" అంది జీరపోయిన గొంతుకతో.
"ఏం వదినా! మళ్ళీ నొప్పి వచ్చిందా?" అనడిగింది జాలిగా గిరిజ దగ్గరకు వెళ్ళి.
సామ్రాజ్యం అవునన్నట్లు తలవూపింది.
"అన్నయ్య ఏడీ?"
"బయటకు వెళ్ళారనుకుంటాను. చూడు బేబీ! ఈ బీరువాలో ఆకుపచ్చ సీసాలో బిళ్ళలుంటాయి. రెండు తెచ్చిస్తావా?"
"బాధ ఎక్కువగా వుందా వదినా?"
సామ్రాజ్యం తలవూపింది.
"డాక్టరు తడవకి ఒకటికంటే ఎక్కువ వేసుకోవద్దన్నాడుగా!"
"ఒకటి వేసుకుంటే పనిచేసేరోజులు ఎప్పుడో గడిచిపోయాయి బేబీ."
గిరిజ ఒకక్షణం మౌనంగా నిలబడి తర్వాత బీరువా తెరిచి టాబ్లెట్స్ తీసి ఆమెకిచ్చి మూలనున్న కూజాలోంచి నీళ్ళుకూడా తెచ్చి యిచ్చింది. తర్వాత అక్కడ్నుంచి బయటకి వచ్చేసింది.
* * *
మన్మథరావు ఆ రోజు ఆఫీసులో పనిచేస్తుండగా ప్రక్కసీట్లోని అతని ఆప్తమిత్రుడు అచ్యుతరావు "ఈ వేళ పెందరాళే యింటికెళ్ళిపోవాలోయ్" అన్నాడు.
"ఏం?"
"సినిమాకెళ్ళాలి, మా శ్రీమతితో ప్రోగ్రాం పెట్టాను."
మన్మథరావుకు ఉదయం తనతో సామ్రాజ్యం అన్నమాటలు గుర్తువచ్చాయి.
"అయితే నేనుకూడా వస్తాను... మా శ్రీమతితో కలసి" అన్నాడు అనుకోకుండా.
"వెరీగుడ్ అయితే మనమంతా ఎక్కడ కలుద్దాం? పోనీ ఒకపని చేద్దాం. ఇళ్ళదగ్గర కలుద్దామనుకుంటే టైం చాలదు. తిన్నగా థియేటర్ దగ్గరకే వచ్చేసెయ్యి ఎవరు ముందొస్తే వాళ్ళు టికెట్లు తీసుకుని మిగతావాళ్ళకోసం వెయిట్ చేద్దాం."
ఏ సినిమాకి వెళ్ళాలో ఇద్దరూ నిర్ణయించుకున్నారు.