Previous Page Next Page 
అష్టావక్ర పేజి 6


    "ఈ బూడిద ఏ పొలంమీద పడితే అదే బాగా పండుతుందా దీని ఎఫెక్టుకి పక్క పొలాలు కూడా పండుతాయీ" నవ్వుతూ అడిగింది.

    అతడు నవ్వలేదు.

    దూరంగా ఎక్కడనుంచో... స్ స్ స్ మని చప్పుడు వినిపించి, ఇద్దరూ అటు చూశారు. కొండ అవతల్నుంచి వలయాలు చుట్టుకుని వస్తున్నట్టు ఒక సుడిగాలి - వెన్నెల్లో దుమ్ము స్పష్టంగా కనపడుతుంది... ఆ శబ్దం భయంకరంగా వుంది- ఇటే వస్తూంది. వారిని చుట్టుముట్టింది.

    అతడెందుకో వణికిపోయాడు.

    పోలియో కాలితో అలా చేతులు సాచి నిలబడటం అసాధ్యమై ఆమె కూలిపోబోయి నిలదొక్కుకుంది.

    చుట్టూ వున్న పైర్లకే నోరు వుండి వుంటే ఆమె అమాయకంగా చేస్తున్న పనికి 'వద్దు వద్దు' అని ఎలుగెత్తి అరిచేవేమో, ఆమె శక్తిలేనట్టు వెళ్ళి కార్లో కూర్చుంది.

    పని పూర్తయినట్టు అతడు కారు స్టార్ట్ చేశాడు. కారు బయల్దేరబోతూంటే 'టప్'మని వర్షం చుక్క పడింది. మరునిముషం వర్షం మొదలైంది. పైర్లమీద పొరలాగా పాకిన భస్మం మరి పైకి రావటానికి వీల్లేదన్నట్టుగా, బాణాలు వదిలినట్టు ఉదకం- ధారగా ఆకాశం నుంచి!

    కారు ఊరివైపు వెళుతూ వుంటే "అరె, అటు చూడు అదేమిటి" అంది. దూరంగా పొలంలో మంట.

    "ఎవరో చెరుకు తగలబెడ్తున్నట్టున్నారు" అన్నాడు అతను తల తిప్పకుండా.

    "ఈ కాలంలో చెరుకేమిటి? అయినా ఇంత వర్షం కురుస్తూంటే మంట ఎలా వస్తుంది?"

    అతడు మాట్లాడలేదు.

    పంచభూతములలో ఆఖరిదైన అగ్నిని ప్రసన్నం చేసుకోవటానికి ఉస్సోక్ చేస్తున్న పని అది- అని అతడికి తెలుసు.

    అంతలో కారు ఊరిలోకి ప్రవేశించింది....


                                            *    *    *    *


    మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన మలుపులన్నీ అనుకోకుండానే జరుగుతూ వుంటాయి. కొన్ని సంఘటనలైతే జీవిత గమనాన్నే మార్చేస్తాయి. అలాటి సంఘటనే కేదారగౌరి జీవితంలో ఆ రోజు జరిగింది.

    RAWE అయిపోవస్తూంది. ఇంకో వారంలో తిరుగు ప్రయాణం.

    పొలం మధ్యలో నిలబడి రైతుతో ఏదో మాట్లాడుతూంది కేదారగౌరి. అరికాలి దగ్గిర ఏదో చాలా సేపట్నుంచీ సన్నగా గోకుతున్నట్టు అనిపించి క్రిందికి చూసింది.

    అక్కడ చూసి కెవ్వున కేక పెట్టింది. పెద్దసైజు పెన్సిల్ అంతవున్న జలగ ఆమె పాదాన్ని కరిచిపట్టి రక్తం తాగుతూంది. ఆమె వరుసగా కేకలు వేస్తూనే వుంది. ముసలి రైతు వంగి దాన్ని పీకటానికి ప్రయత్నం చేశాడుగానీ అది రాలేదు. జలగని చర్మం నుంచి వేరుచేయటం చాలా కష్టం. అంతలో అక్కడే కొంతదూరంలో వుండి మొక్కల్ని పరిశీలిస్తున్న సిద్దార్ధ ఉరుకున అక్కడికి వచ్చాడు. జేబులోంచి చిన్న చాకు తీసి, దాన్ని వేరుచేశాడు.

    అప్పటికే ఆమె దాదాపు స్పృహ తప్పింది. తనని ఎవరో నడిపించుకు తీసుకు వెళ్ళటం తెలుసు. "కొంచెంసేపు పడుకో అమ్మా" అంటున్నారు.

    క్రింద నులక మంచం తగిలింది. కళ్ళు విప్పి చూస్తే నుదుట కుంకుమలేని లక్ష్మీదేవి కనిపించింది. పక్కనే సిద్ధార్థ. "మా అమ్మ" అన్నాడు.

    గౌరి లేవబోయింది. "పడుకోమ్మా" అందావిడ. ఆమె పేరు పార్వతి. పాతిక సంవత్సరాల క్రితమే పార్వతమ్మ అయింది.

    ఆమె తెచ్చి యిచ్చిన మజ్జిగ తాగి సర్దుకుంటూ లేచింది గౌరి. చేతులు జోడిస్తూ "వెళ్ళొస్తానండీ. అనవసరంగా చిన్న విషయానికి మీకు శ్రమ ఇచ్చాను" అంది.

    "అదేమిటమ్మా. భలేదానివే-"

    సిద్ధార్థతో కలిసి ఆమె బయటకి వచ్చింది. "మీది ఈ ఊరేనని నాకు తెలీదు" అంది నడుస్తూ.

    "ఈ ఊరే".

    "ఈ యిల్లు, పొలం మీదేనా" - తను వచ్చిన పాకను చూపిస్తూ అన్నది. సిద్దార్ధ ఇబ్బందిగా చూసి, "ఒక రకంగా మాదే! ఒక రకంగా కాదు" అన్నాడు.

    "అంటే?"

    అతడు మాట మార్చి "ఆ సంగతి వదిలెయ్యండి" అన్నాడు.

    "మీదీ ఊరని ఇంతకాలం చెప్పలేదేం? అందరం భోజనానికి వచ్చిపడతామని భయమా?" అంటూ అతడివైపు చూసి నవ్వింది. 

    "అలా అనుకోను నేను. ఒకవేళ నేనేగానీ భోజనానికి పిలుస్తే దాన్ని ఎలా ఎగ్గొట్టాలా అని చాలామంది ఆలోచిస్తారని నాకు తెలుసు".

    ఆమె బాధపడి "సారీ. నా ఉద్దేశ్యం అదికాదు" అంది. అతడు నవ్వేసి- "నేనూ వూరికే అన్నాను" అన్నాడు.


                    *    *    *    *


    మరో రెండ్రోజుల్లో వాళ్ళ ప్రోగ్రాం అయిపోతుంది. అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ జీపులో కొంతమంది విద్యార్ధులని తీసుకొచ్చి పొలం దగ్గిర దింపి వెళ్ళిపోయాడు.

    ఒకరిద్దరికి స్ప్రే-డిమాన్ స్ట్రేషన్ చూపిస్తూ చివరి కొచ్చింది. అందులో సిద్దార్ధ మాటలు గుర్తొచ్చి "అది మా సిద్దార్ధ స్థలం కదూ" అంది.

    "అవునమ్మా. కానీ పెద్ద దొరకి తాకట్టు పెట్టినాడుగా సిన్నప్పుడే" అన్నాడో రైతు.

    "అతడు కాదే, అతడి అమ్మ" సరిదిద్దాడు పక్క కూలీ.

    ఆ తరువాత ఆమె సిద్దార్ధని కలుసుకున్నప్పుడు నవ్వుతూ "మీ పొలం రహస్యం నా కర్దమైంది. మీది అయ్యీ- కాకపోవటం" అంది.

    "ఎవరు చెప్పారు?"

    ఆమె చెప్పింది.

    "చిన్నప్పుడే నాన్న పోయాడు. అమ్మ ఆ రెండెకరాల్నీ రెండు వేలకి తాకట్టు పెట్టింది. దాంతో నా చదువు ఇంటర్మీడియెట్ వరకూ సాగిపోయింది" అన్నాడు.

    "ఇక్కడ వీళ్ళకి వడ్డీ ఎక్కువ వుంటుందా?"

    "ఇంతని లేదు. మాకు అప్పిచ్చిన వ్యాపారే ఆ పొలాన్ని కౌలుకి తిప్పుతున్నాడు. అప్పు పూర్తిగా తీరేవరకూ దానిమీద వచ్చినదంతా అతడికే చెందుతున్నదన్నమాట.... అదే వడ్డీ"

    మనసు చెదిరి ఆమె చాలా సేపటివరకూ మాట్లాడలేకపోయింది. తరువాత నెమ్మదిగా అంది- "విప్లవం అని నినాదాలిస్తారు గానీ విప్లవం ఎందుకు రావాలో ఇలాటి సంఘటనలతో సోదాహరణంగా ఎందుకు చెప్పరు?" తనలో తనే అనుకుంటున్నట్టు.

    అతడు నవ్వుతూ "మిగతా వారి సంగతి నాకు తెలీదు కానీ, మాకు అప్పిచ్చిన వ్యాపారి మాత్రం మంచివాడే. అతడేగానీ కావాలనుకుంటే మా పొలం ఎప్పుడో 'స్వాహా' చేసి వుండగలిగేవాడు" అన్నాడు.

    "ఎన్నాళ్ళనుంచీ జరుగుతూంది ఇలా?"

    "పదహారు సంవత్సరాల నుంచీ".

    ఆమె విచలితురాలై "రెండువేల రూపాయల అప్పు తీరటానికి పదహారు సంవత్సరాలా?" అంది.

    "ఇన్ని సంవత్సరాలుగా మేము అసలికి జమ చేసింది ఏముంది?" అన్నాడు. ఆమెకేదో అనుమానం వచ్చి "మరి ఇన్నాళ్ళూ మీ జీవనాధారం?" అని అడిగింది.

    "అమ్మ ఇక్కడే మా పొలంలోనే పనిచేస్తుంది. నేను అక్కణ్ణుంచి వందో రెండొందలో పంపిస్తాను నెలనెలా".

    "ఎలా?"

    "ప్రైవేట్లు చెప్పి".

    ఆమె స్థబ్దురాలై అతడి వంక చూసింది. అతడు గమనించలేదు. తల వంచుకుని తన ధోరణిలో చెప్పుకున్నాడు. "ఎంత ప్రయత్నించినా అంతకంటే ఎక్కువ రావటం లేదు. తొందరగా ఉద్యోగం వస్తే ఒక ఆర్నెలల్లో అసలు తీర్చెయ్యొచ్చు. అప్పటివరకూ పని చెయ్యొద్దు అంటే అమ్మ వినదు. కొడుకు ఎ.జి.బి.యస్సీ.... తల్లి రైతుకూలి..."

    అతడు మాట్లాడుతున్నది ఆమె వినటంలేదు. మనసప్పటికే వికలమైంది.


                                           *    *    *    *


    అవతలివాళ్ళు మామూలుగా మాట్లాడిన దాంట్లో ఏదైనా మంచి విషయం వుంటే- చాలా సాధారణంగా దాన్ని అప్పుడు విన్నా, దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవటం కేదారగౌరికి అలవాటు. తను అందమైనది కాదనీ, కనీసం సామాన్యమైన అందం కూడా తనకి లేదనీ ఆమెకి తెలుసు. దానికితోడు అవిటితనం ఒకటి. తను తెలివైనది కూడా కాదని ఆమెకి తెలుసు. పెద్దవాళ్ళు తన పక్క పిల్లల్ని దగ్గిరకు తీసుకుని ముద్దు చేయటాన్ని ఆమె "చాలా మామూలుగా" గుర్తించింది. తనలో ఎ కాంప్లెక్సూ బయల్దేరకుండా వుండటానికి ఆమె పుస్తకాల్ని ఆశ్రయించింది. మౌనాన్ని ఆభరణం చేసుకుంది. ఈ రెండూ అలవాటు చేసుకున్నాక ఆమె ఒక విషయాన్ని తొందర్లోనే గుర్తించింది. పెద్దవాళ్ళుగానీ, చివరికి అల్లరి చేసే కుర్రవాళ్ళు గానీ, ఎవరైనా గానీ హుషారుగా వుండే అమ్మాయిల్ని మెచ్చుకుంటారు. స్నేహం చేస్తారు. నిజమే కానీ అభిమానంతో అంతరంగంలో ఒక ప్రేమ, ఒక గౌరవం కురిపించవలసి వచ్చేసరికి, నెమ్మదిగా ఒద్దికగా వుండే అమ్మాయిల్నే అభిమానిస్తారు. అలా స్థబ్ధంగా డల్ గా వుండాలని కాదు. ఎవరు పలకరించినా చిరునవ్వుతో మాట్లాడేది. ఈ రకమైన ప్రవర్తన ఆమెకో రకమైన హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. తొందర్లోనే తన అవిటితనాన్ని మర్చిపోగలిగింది.

    ఆ వయసులో మనసు ఎటుపడితే అటు వంగుతుంది. సరీగ్గా ఆ సమయంలో ఒక IDEALHE దొరికితే అది అదృష్టమే. అలా దొరక్కేచాలామంది సినిమా ఆక్టర్లనీ, క్రికెట్ ప్లేయర్లనీ తమ ఐడియల్-హీలుగా చేసుకుని తమ సహాధ్యాయుల్లో వాళ్ళని చూసుకుని పతనమవుతూ వుంటారు. ఆమెకి దొరికిన 'ఐడియల్-హి' ఆమె తండ్రి!

    ఆమె మీద తండ్రి ప్రభావం ఎంతవుందో తెలియజెప్పటానికి ఒక చిన్న సంఘటన చాలు!

    ఆమె పదో తరగతి చదువుతూండగా ఒకసారి రాత్రి పన్నెండు గంటలకి కూతురి గదిలో లైటు వెలుగుతూ వుండటం చూసి లోపలికి వచ్చి "ఇంకా చదువుతున్నా వేమిటమ్మా" అని అడిగాడు.

    "పరీక్షలు నాన్నా. ఇంకా రెండు మూడు రోజులే వున్నాయి".

    అతడు నెమ్మదిగా, "ఈ రెండు రోజుల్లో ఎన్ని గంటలు ఇలా చదవగలవు" అని అడిగాడు.

    ఆమె చకితురాలై "పోర్షన్ చాలా వుంది నాన్నా" అంది.

    "నా ప్రశ్న అదికాదు".

    "ఇరవై... ముప్పై గంటలు".

    "మార్చిలో కాకుండా ఇదే చదువు జనవరిలో మొదలుపెట్టి రోజుకో అరగంట ఎక్కువ చదివి వుంటే ఇంతగొడవ వుండేది కాదుకదా".

    "అదేమిటి నాన్నా- పరీక్షలన్నాక టెన్షన్ వుండదా ఏమిటి?"

    "నేను చెప్పేది లెక్కల గురించమ్మా. బిజినెస్ మాన్ ని కదా! నాకు చదువులో టెన్షన్ గురించి అంతగా తెలీదు. తెలిసిందల్లా లెక్కలే" అంటూ నవ్వాడు. ఆమెకు అర్ధమైంది.

    ....ఆ మరుసటి సంవత్సరం ఆమె జూన్ నుంచే ఒక అరగంట ఎక్కువ చదవటం ప్రారంభించింది. ఆ తరువాతెప్పుడూ ఆమె ఏవిధమైన టెన్షనూ ఫీలవలేదు. పరీక్షల ముందు టీ త్రాగి, టాబ్లెట్లు వేసుకునీ చదివేవాళ్ళని చూసి, "ఇంత చిన్న విషయం వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కెందుకు చెప్పలేదా" అనుకునేది.

 Previous Page Next Page