"సంజు ఇప్పుడు బ్యాంకాక్ లో వుంది సర్. నిన్ననే పేపర్లో చూశాను ఆమె బ్యాంకాక్ లో ప్రోగ్రామ్స్ యిస్తోందని" చెప్పింది ఆమె.
"ఫైన్....అలా అయితే అక్కడే కాంటాక్ట్ చేద్దాం. ఆ పనులన్నీ మేము చూసుకుంటాం. ఇంక నువ్వు వెళ్ళి ఎడ్వర్టయిజ్ మెంట్ ఎఫెక్టివ్ గా రావాలంటే ఏం చేస్తే బాగుంటుందో ప్లాన్ చెయ్యి" చెప్పాడు పిళ్ళై.
"థాంక్యూ సార్" అని చెయిర్ లోంచి లేచిందామె.
ఆ గది బయటకు రాబోతున్న ఆమె చెవికి "షి ఈజ్ జీనియస్" అన్న పిళ్ళై మాట అస్పష్టంగా వినిపించింది.
* * * * *
ఎక్కడో శబ్దం.
ఉలిక్కిపడి లేచింది అర్చన.
బెడ్ లైట్ వెలుతురులో మసకగా కనిపిస్తోంది బెడ్ రూమ్.
టేబుల్ మీది క్లాక్ లో టైమ్ పదకొండూ ఇరవయ్ కనిపిస్తోంది. అంటే....మహా అయితే తనకి నిద్రపట్టి ఓ పావుగంట అయివుండాలి. బుక్ చదువుతూ పది గంటలకు బెడ్ మీద పడుకుందామె.
పదకొండు అవుతుండగా నిద్ర రావటంతో లైట్ ఆఫ్ చేసి పడుకుంది.
ఇంతలో మెలుకువ వచ్చింది.
ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం?
మళ్ళీ ఏదో శబ్దం....
బెడ్ మీదనుంచి క్రిందికి దిగి లైట్ ఆన్ చేసిందామె.
గదినిండా వెలుగులు పరుచుకున్నాయి.
ప్రక్కనున్న బెడ్ రూమ్ లోంచి వచ్చిందా శబ్దం.
ఆ బెడ్ రూమ్ చనిపోయిన తన కొడుకు పవన్ ది.
ఆ కుర్రాడు చనిపోయిన అతని బుక్స్, బట్టలు....అన్నీ ఆ గదిలోనే అలాగే వుంచేసింది.
అప్పుడప్పుడూ ఆ గదిలో కూర్చుని గత స్మృతులు నెమరువేసుకుంటుందామె.
ఆ గదిలోకి ఎవరూ వెళ్ళరు.
వెళ్ళటానికి ఆ ఇంట్లో ఆమె తప్ప మరో మనిషి లేరు.
పనిమనిషి కూడా ఆ గదిలోకి వెళ్ళదు.
ఆ గది అప్పుడప్పుడూ తనే క్లీన్ చేస్తుంటుంది.
తన బెడ్ రూమ్ దాటి ఆ బెడ్ రూమ్ డోర్ ని సమీపించింది.
లోపలి నుంచి మరోసారి చిన్నగా శబ్దమైంది.
ఎలుకలు ఏమైనా ప్రవేశించాయేమోనని అనుమానం వచ్చిందామెకు. తలుపు తెరిచి లైట్ ఆన్ చేసింది.
ఆమెకు ఎక్కడా ఏమీ కనపడలేదు.
ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి.
ఆమె దృష్టి ఆ గదిలోని బెడ్ మీద నిలిచిపోయింది.
కారణం....
బెడ్ మీద....సుమారు నాలుగు అంగుళాలు వెడల్పు, పదంగుళాలు పొడవు వున్న ఎర్రని స్లిప్ ఒకటి వుంది. దానిమీద నల్లని అక్షరాలు వున్నాయి. పరీక్షగా వాటివైపు చూసిందామె.
"నేను చనిపోలేదు"
కళ్ళు నులుముకుని మరోసారి వాటివంక చూసింది. అవే అక్షరాలు....
"నేను చనిపోలేదు"
అది ఖచ్చితంగా తన కొడుకు రాసిన అక్షరాలలాగే వున్నాయి.
ఆ స్లిప్ ఏమిటి? తలుపులు అన్నీ బంధించి వున్న ఆ ఇంట్లోకి ఆ కాయితం ఎలా వచ్చింది?
వెన్నులో పురుగు పాకినట్లయి శరీరం జలదరించిందామెకు.
* * * * *
ఫ్లషింగ్....
న్యూయార్క్ నగరంలోని ఓ ప్రాంతం అది.
అధికంగా ఆసియా దేశస్థులు నివసించే ప్రాంతం అది.
సెకండ్ ఎనెన్యూలోని ఇరవై ఎనిమిది అంతస్థుల ప్రైమ్ బిల్డింగ్ అది.
అప్పుడు సమయం సరిగ్గా అయిదు గంటలు అయింది.
పందొమ్మిదవ ఫ్లోర్ వద్ద వచ్చి ఆగింది లిఫ్టు.
లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి.
సుమారు 30 మంది పైగా ఆ లిఫ్టు దగ్గర గుమిగూడారు.
అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన పాప్ సింగర్ సంజుకి సెండాఫ్ ఇస్తున్నారు వాళ్ళు.
"థాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలటీ" కృతజ్ఞపూర్వకంగా అంది ఆమె.
"ప్లీజ్ విజిట్ ఎగైన్" అందరి తరపున చెప్పాడు ఆ పెద్ద వ్యక్తి.
"ష్యూర్" సమాధానం చెప్పి లిఫ్టులోకి అడుగు పెట్టిందామె.
ఆమెతోపాటు లిఫ్టులోకి ఎక్కారు మరో ఎనిమిదిమంది.
"ఓ.కె.బై" లిఫ్టు బయట ఉన్నవాళ్ళకి చెప్పిందామె.
వాళ్ళంతా చేయి వూపారు.
లిఫ్టు బటన్ ప్రెస్ చేశాడో వ్యక్తి.
సరిగ్గా డోర్స్ క్లోజ్ అయ్యే సమయంలో శరవేగంతో వచ్చి దూకినట్లుగా లిఫ్టులోకి ప్రవేశించాడు ఓ వ్యక్తి.
అలా రావటంతో మరో వ్యక్తి కాలు తొక్కాడతను.
"అయాం సారీ" అన్నాడు మర్యాదపూర్వకంగా.
"నెవర్ మైండ్" జవాబు చెప్పాడతను.
లిఫ్టు క్రిందికి జారసాగింది.
ఆ వ్యక్తి వైపు చూసింది సంజు.
నల్లని నలుపు, ఒకింత ఉంగరాలు తిరిగిన జుట్టు, చప్పిడి ముక్కు, బలిష్టంగా ఎత్తుగా వున్నాడతను.
అతను కూడా రెప్పవాల్చకుండా ఆమె వైపు చూశాడు.
అతను చూసే విధానం ఆమెకు ఒకింత ఇబ్బందిగా అనిపించింది.
లిఫ్ట్ ఆగింది.
బయటికి వచ్చారు అందరూ.
అక్కడ మూడు కార్లు రెడీగా వున్నాయి.
ముందుగా వున్న కారు 'లియోజైన్' అత్యంత ఖరీదయిన లగ్జరీ కారు అది. సిక్స్ డోర్స్ కారు అది.
అందులో రిఫ్రిజిరేటర్, వి.సి.ఆర్ వంటి లగ్జరీస్ అన్నీ వున్నాయి.
"మీరు ఈ కారులోకి ఎక్కండి" లియోజైన్ వైపు చేయి చూపించాడు ఫ్రెడరిక్స్.
ఆమెకు అత్యత్యున్నతమైన గౌరవంతో వీడ్కోలు చెబుతున్నారు వాళ్ళు.
కళ్ళతోనే కృతజ్ఞత తెలియచేసి కారులో కూర్చుందామె.
డోరు క్లోజ్ చేశాడు డ్రైవరు.
లియోజైన్ కారు వెనుక మరొక బి.యం డబ్ల్యు కారు, ఒక కాడిలాక్ వున్నాయి.
ఆ రెండు కార్లలోనూ మరో ఐదుగురు ఎక్కారు. ఆమెతో పాటు ఎయిర్ పోర్ట్ వరకు వచ్చి సెండాఫ్ ఇవ్వటానికి.
బయలుదేరాయి కార్లు.
ఆ సమయంలో విపరీతమైన రద్దీతో వున్నాయి రోడ్లు.
నున్నని రోడ్డుమీద మెత్తగా జారిపోతోంది కారు.
విండో గ్లాస్ లోంచి బయటికి చూడసాగిందామె.
డ్రైవర్ కి ఆమెకు మధ్య గ్లాస్ పార్టీషన్ క్లోజ్ అయి వుంది. అందువల్ల కారు శబ్దం ఏ మాత్రం వినపడటంలేదు.
ఫోర్ ఛానల్ మ్యూజిక్ సిస్టంలోంచి మంద్రస్థాయిలో వచ్చే మ్యూజిక్ ఆమె చెవులకు హాయిగా సోకుతోంది.
నిన్నరాత్రి ఆమె తన మ్యూజిక్ ప్రోగ్రాం యిచ్చింది.
'మేన్ హాట్టన్' స్టేడియంలో జరిగిందా ప్రోగ్రాం.
అసంఖ్యాకమైన జనం.
అనూహ్యమైన రెస్పాన్స్. ఉర్రూతలూగించిన ప్రోగ్రాం.
ఆమె ప్రోగ్రామ్స్ కి ఎక్కువగా ఇండియన్స్ ఏషియన్స్ రావడం మామూలయింది.
మేన్ హాట్టన్ ఇండోర్ స్టేడియంలో ప్రోగ్రాం అనేది ప్రెస్టేజ్ గానే చెప్పుకోవాలి. మేన్ హాట్టన్ ప్రాంతం మెయిన్ షాపింగ్ సెంటర్ కావటంతో ప్రోగ్రాంకి వచ్చే జనాభా కూడా ఎక్కువగా వుంటారు.
ఆమె పాప్ సింగర్ అవుతుందని ఏనాడూ అనుకోలేదు. అయినా ఇంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆల్బమ్ విడుదల చేసిందామె.
దానికి ఆమెకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
ఆమె సాధించిన విజయం ఆమెకెంతో గర్వంగా అనిపిస్తోంది.
ఇప్పుడు ఆమె ఇండియాకు వెళుతోంది.
తను పుట్టిన దేశం....
తన తొమ్మిదో ఏడువరకు పెరిగిన దేశం....
అందునా ఆంధ్రదేశం....
విశాఖపట్నంలో తొలి ప్రదర్శన యివ్వబోతోంది.
దానిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో!
తనని తెలుగు యువతిగా భావిస్తారా! గౌరవిస్తారా! ఆదరిస్తారా! ఏమో?
తను స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలదు. చదవటం, రాయటం కూడా వచ్చు. తన వస్త్రధారణలో కూడా భారతీయత కనిపించేలా చూసుకుంటుంది. తన మాతృభూమికి వెళుతున్నానంటే....మనసు ఆనందంతో వుప్పొంగిపోతోంది.
కారు 'షియా' స్టేడియం ప్రక్కగా వెళుతోంది.