"ఇప్పటి సంగతే చెపుతున్నా గురూ! నాకు చిన్నప్పటినుంచి 'లక్' లేదని చెప్పాను కదా! ఎన్నో వందలసార్లు నేను పూర్తి చేసిన క్రాస్ వర్డ్ పజిల్స్, రకరకాల పోటీలు ఎన్నో కేవలం వెంట్రుక వాసిలో తప్పిపోతుండేవి! దానర్థం ఏమిటి? నాకు అన్నీ వున్నాయ్ గానీ నా పేరుకి 'లక్' లేదనే గదా! అందుకే మొన్న భారత్ బ్రాందీ వాళ్లు పెట్టిన స్లోగన్ పోటీలో స్లోగన్ రాసి రంగారెడ్డి పేరు మీద పంపించాను. అందుకే రంగారెడ్డికి మొదటి బహుమతి వచ్చింది. ఇప్పుడు రంగారెడ్డే విమానంలో మద్రాస్ వెళ్ళి సినీ స్టార్ విద్యతో భారత్ బ్రాందీ ఒక పెగ్ తాగి డిన్నర్ చేసి" ఇంక చెప్పలేక మళ్ళీ భోరుమని ఏడ్చాడతను.
అప్పటిగ్గానీ మాకు సంగతంతా అర్థం కాలేదు. చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ మీద అందరికి విపరీతమయిన జాలి కలిగింది.
"బెటర్ లక్ నెక్ట్స్ టైమ్" అంటూ ఓదార్చి అతనింటివరకూ తీసుకెళ్ళి వాళ్ళావిడకు అప్పజెప్పాము.
"ఈ రాత్రి కొంచెం మీ ఆయన్ని జాగ్రత్తగా చూస్తుండమ్మా! ఏమయినా అఘాయిత్యం చేసినా చేయవచ్చు" అని హెచ్చరించాం ఆమెను.
మేము తిరిగి వచ్చేసరికి రంగారెడ్డి తను జరుపబోతున్న విమాన ప్రయాణం గురించి చాలా ఉత్సాహంగా అందరితో చర్చిస్తున్నాడు.
"నేను గుంటకల్లో పనిచేసేప్పుడు ఓ కొండదొర చెప్పాడు గురూ- థర్టీఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటాక విమాన ప్రయాణం చేస్తానని! అచ్చం వాడు చెప్పినట్లే జరుగుతోంది. వాడు సామాన్యమయిన కొండదొర కాదు! మన ప్రెసిడెంట్ కీ, ప్రధానమంత్రికి కూడా వాడే చెప్పాడు" అందరికీ రంగారెడ్డిని చూస్తే ఈర్ష్యగానూ వుందీ, మేం చేయలేని పని అతను చేస్తున్నాడన్న ఆనందమూ కలుగుతోంది.
ఆ రోజు నుంచీ రంగారెడ్డి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పొద్దున్నే కాలనీలో కొచ్చిన కూరగాయల బండివాడిని ఆపేశాడు.
"టమాటో ఎంత కిలో?" అడిగాడు రెడ్డి.
"మూడ్రూపాయల్సార్"
"ఏం రాజయ్యా? నేను ఎల్లుండి విమానంలో మద్రాస్ వెళుతున్నాననా ఏమిటి, ధరలు కూడా ఆకాశాన్నంటించేస్తున్నావ్! నేను వెళ్ళేది ఒక్క రోజేనయ్యా బాబు! ఆ సినిమా స్టార్ విద్యతో డిన్నర్ అవగానే మళ్ళా గంటలో హైదరాబాద్ చేరుకోనూ? సినిమా స్టార్ తో డిన్నర్ తీసుకుంటే నాకేం కొమ్ములొస్తాయా ఏమన్నానా? నువ్ టమాటో మూడు రూపాయలు చెప్తే ఎలా?"
"ఏంటి సార్? ఎల్లుండి విమానంలో మద్రాస్ వెళుతున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య.
"తప్పేట్లు లేదు! ఆ భారత్ బ్రాంది కంపెనీ వాళ్ళు మొండి బలవంతం చేస్తున్నారు. నాకేమో అక్కడ ఆఫీసులో చచ్చేంత వర్క్ వుంది. సెలవు ఇస్తారో ఇవ్వరో తెలీదు. వెళ్ళకపోతే ఆ భారత్ బ్రాందీ వాళ్ళూ, ఆ సినీ స్టార్ ఏమనుకుంటారోనని మళ్ళీ అదొకటి! పోనీలేగదాని ఆహ్వానిస్తే వీడికింత టెక్కా అనుకోరూ! మన గొడవలు వాళ్ళకేం తెలుస్తాయ్!"
"సినిమా స్టార్ విద్యతో డిన్నర్ చేస్తారా సార్?" మరింత ఎగ్జైట్ అయిపోతూ అడిగాడు రాజయ్య.
"వాళ్ళ మాట కాదని అనలేం కదా! సరదాగా చేయక తప్పదిక"
"అబ్బ! ఎంత అదృష్టం సార్ మీది?"
"ఆ- మనకిలాంటివి అసలు ఇంట్రెస్టు వుండవోయ్ ఏదో ఒక...."
ఆ సాయంత్రం మా ఆఫీస్ కాంటీన్ లో టీ తాగి వక్కపొడి కొడుక్కుంటున్నప్పుడు మళ్ళీ ఫోజు ప్రారంభించడం మాకు వినిపించింది.
"ఇదిగో-రాములూ ఒక వక్కపొడి పొట్లాం ఇవ్వు! అన్నట్టు మర్చిపోయాను ఎల్లుండి విమానంలో మద్రాస్ వెళ్ళి సినీస్టార్ విద్యతో డిన్నర్ చేయాలి! విమానంలో కొంచెం తిప్పినట్లుంటుందట కదా! అలాంటప్పుడు ఉపయోగించడానికి స్పెషల్ వక్కపొడి ఏదయినా వుందా మన దగ్గర?" ఇలా అడుగడుగునా తన మద్రాస్ విమాన ప్రయాణం గురించి బలవంతంగా అందరికీ చెపుతూనే వున్నాడు.
రెండు రోజుల్లో భారత్ బ్రాంది కంపెనీకి చెందిన ఓ సేల్స్ మేనేజర్ స్వయంగా మా కాలనీ కొచ్చి రంగారెడ్డికి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ మర్నాడు ఉదయం ఎనిమిదీ యాభైకే విమానం.
ఆ రాత్రి మాకెవరికీ నిద్రపట్టలేదు.
రంగారెడ్డి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూనే వున్నాం. రంగారెడ్డి మాత్రం బయట మా కాలనీ ఘూర్కాతో మాట్లాడుతున్నాడు.
"రేప్పొద్దునే లేసి విమానంలో మద్రాసెళ్ళాలోయ్! అందుకని ఈ రాత్రికి పెందలాడే నిద్రపోతాను. కొంచెం నువ్వు ఇవ్వాళ ఎర్లీగా రౌండ్స్ కొట్టడం మంచిది" చాలా కాజువల్ గా మాట్లాడుతున్నట్టు నటించసాగాడతను.
"రేపు విమానంలో మద్రాసెళ్తున్నారా సాబ్?"
"పర్సనల్ గా నాకు విమాన ప్రయాణం ఇష్టం వుండదనుకో- ఆ కంపెనీ వాళ్ళు బలవంతం చేయడం వల్ల"
"ఆహా! అదృష్టం సార్ మీది"
"ఆ విమాన ప్రయాణం దేముందిలే ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు పారేస్తే ఢిల్లీ వెళ్ళవచ్చు"
రాత్రి తొమ్మిది గంటలకు రంగారెడ్డి ఇంటి దగ్గర్నుంచి అందరం ఎవరిళ్ళకువాళ్ళు బయల్దేరబోతుంటే జనార్థన్ ఓ ఇంగ్లీష్ డెయిలీ తీసుకుని హడావుడిగా వచ్చాడు.
"గురూ! మొన్న గౌహతిలో జరిగిన వాయుదూత్ విమాన ప్రమాదం గురించి ఇందులో రాశారు చూశారా?" అడిగాడు గాబరాగా.
ఆ మాటలతో అందరం ఎలర్ట్ అయిపోయాం.
"ఏం రాశారు?" అడిగాడు రంగారెడ్డి అనుమానంగా.
"ఆ రోజు కంట్రోల్ టవర్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎక్కడికో వెళ్ళాడట... అక్కడ బిల్స్ రాసుకుని రికార్డులు మెయింటెయిన్ చేసే అసిస్టెంట్ ఫ్లైట్ కాప్టెన్ కి ఆదేశాలు ఇచ్చేశాడు. దాంతో ఆ విమానం కొండక్కొట్టుకుని మటాష్ అయిపోయిందిట."
అందరికీ ఆశ్చర్యం కలిగింది.
"అదేమిటి? ట్రాఫిక్ కంట్రోలర్ డ్యూటీ అసిస్టెంట్ చేసేస్తూంటాడా?" అడిగాడు శాయిరామ్.
"అదే! మన రైల్వేలే కూడా అంతేగా? డ్రైవర్ ఎవరితోనయినా హస్క్ కొడుతుంటే అసిస్టెంట్లు నడిపేస్తుంటారు" అన్నాడు అప్పలాచారి.
"అవునవును! గార్డు డ్యూటీ ఒకోసారి బఠానీలవాడు చేస్తూంటాడు కదా"
"అన్ని చోట్లా అది మామూలే లేవోయ్! లారీ డ్రైవర్లు నిద్రపోతుంటే క్లీనర్లు నడపడం అందరికీ తెలిసిందేగా?"
"కానీ వాటి సంగతివేరు, విమానం సంగతివేరు"
"అది మిగతా దేశాల్లో సంగతి. మనదేశంలో అన్నీ ఒకటే. మినిష్టర్లు చేసే పనులు సెక్రటరీళు చేస్తుంటారు. సెక్రటరీళు చేసే పని డిపార్టుమెంట్ ఆఫీసర్లు చేస్తుంటారు"
యాదగిరి జనార్ధన్ చేతిలోనుంచి ఆ పేపర్ తీసుకుని చకచక చదవసాగాడు.
"అరె బాప్రే! దిసీజ్ టూ మచ్ భాయ్" అన్నాడు గుండెలు బాదుకుంటూ.
"ఏమిటి?" మరింత ఆత్రుతగా అడిగాడు రంగారెడ్డి.
"ఏమాత్రం అనుభవంలేని పైలెట్లు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు నడుపుతున్నారట!" అందరం ఉలిక్కిపడ్డాం.
"ఏమాత్రం అనుభవం లేనివాళ్ళా?"
"ఏమాత్రం అంటే చాలా తక్కువ"
"ఎందుకలా చేస్తున్నారు వాళ్ళు?"