ఎలా అడిగేది.....ఈ ప్రశ్నలన్నీ తరువాతకు వాయిదా వ్సుకుని లేచి నిలబడ్డాను. ఆయనకు తెలివి రావటానికి ఒక ఇంజక్షన్ ఇచ్చాను. ఆయనకేమీ భయంలేదనీ, త్వరలోనే తగ్గిపోతుందనీ ధైర్యం చెబుతూ యివతలకు వస్తూండగా ఆమె నన్ను సాగనంపటానికి గుమ్మందిగి వచ్చింది. మరునాడు ఉదయం వచ్చి తప్పక చూస్తానని చెప్పి రిక్షా యెక్కాను.
ఆ రోజంతా మనసు విచిత్ర భావాలతో నిండిపోయింది. గతమంతా నిర్దాక్షిణ్యంగా చెరిగి, పవిత్రమైన అనసూయమూర్తిని ఆక్రమించుకొని వరుసగా చిరునవ్వూ, కన్నీళ్లు కురిపిస్తోంది. నేను ప్రపంచంలో ఇంతవరకూ యేకాకిని. ఏ మాత్రం హృదయం లేని స్నేహితులు, శ్రేయోభిలాషులు. ఇన్నాళ్ళకు నా భాగ్యవశం చేత ఆప్తులు సంప్రాప్తించారు.
ఏడుపు ఆనందదాయకమైనది, సంతోషం దుఃఖభాజకమైంది నాలాంటి వాడికి. అందుకే ఆ రాత్రి తృప్తిగా ఏడిచాను. అత్యంతానందం అనుభవించానన్నమాట.
* * *
మరునాడు ఎనిమిదింటికి తయారై అనసూయ ఇంటికి వెళ్ళిపోయాను.
"ఇదిగో, మీరిలా మారాం చేస్తే ఎలా? మీ ఆరోగ్యంపట్ల ఎంతోశ్రద్దగా వుండాలని డాక్టర్ గారు చెప్పారు. నిన్న సాయంత్రమనగా పంపించిన మందు సీసాలో అలానే వుండిపోయింది. ఊ, త్రాగివేయండి" అంటూ ఒక చేత్తో తలకు ఊతం యిస్తూ, మరోచేత్తో మందు తాగిస్తోంది ఆమె.
"ఛీ, పాడుదానా నువ్వు నా ప్రాణానికి దెయ్యంలా దాపురించావు. అబ్బా, కటికచేదు, విషం."
ఆమె నవ్వుతూ, చీరచెంగుతో ఆయన పెదవులు తుడిచివేసి "తిట్టడంకూడా మాట్లాడటమే అవుతుంది. అధికంగా మాట్లాడితే శరీరానికి ఆయాసమని డాక్టరుగారు చెప్పారు."
నేను లోపలకు పోయేసరికి యిదీ దృశ్యం. అలికిడికి ఆమె చప్పున వెనుదిరిగి చూసింది. "అదిగో వచ్చేశారు మీ చిరంజీవి" అందామె.
ఆయన లేవటానికి ప్రయాసపడుతూ "దారా బాబూ! నీకోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నిన్ను చూసి పదిహేనేళ్ళకు పైగా అయిందనుకుంటా. అవును అంతే నే నీ వూరు విడిచి అంతకాలమే అయింది. అప్పుడు నువ్వు ఎర్రగా బక్కపలుచగా వుండేవాడివి. పదకొండేళ్ళ కుర్రాడివి. ఇప్పుడు నన్ను చూస్తుంటే మళ్ళీ అన్నయ్యను చోస్తున్నట్లుగా వుందిరా ఇలారా చిరంజీవి! నా ప్రక్కన కూర్చో!"
నేను పోయి పక్కమీద తలవంచుకుని కూర్చున్నాను. నా చేతిని గుండెలపై లాక్కుని డగ్గుత్తికతో "ఈనాటికి నువ్వు ప్రయోజకుడివి అయినందుకు నా సంతోషం యెలా వెలిబుచ్చేది చిరంజీవి! అన్నయ్య నన్ను బాగుపరుద్దామని ఎన్నో విధాల ప్రయత్నించాడు. నాది పాడుబుద్ధి. నాకంటే దాలిగుంటలోని కుక్కనయం. తల్లితండ్రులు పోయినప్పటినుంచీ అన్నయ్యే నన్ను సాదరంగా పెంచాడన్న విశ్వాసం చూపానుకాదు. ఎన్నోమార్లు యింట్లోనుంచి పారిపోయే వాడిని. మళ్లీ సిగ్గులేక వెధవ మొహం వేసుకొని వస్తూండేవాడిని. ఆయన యెంత మందలించినా నా చెవికెక్కలేదు. ఒకమారు యినప్పెట్టెలోంచి వెయ్యి రూపాయలు తీసుకొని పారిపోయాను.
"అంతే... మళ్ళీ గుమ్మం తొక్కలేకపోయాను. నా పాట్లు నేను పడసాగాను. తాడూ బొంగరంలేని జీవితం అయింది. జీవితంలో మూడు దశాబ్ధాలు గడిచినా కూడా ఏమీ బాధ్యతలేకుండా చంటిపిల్లాడిలా ప్రవర్తించసాగాను. చేతిలో డబ్బంతా అయిపోయింది. హఠాత్తుగా నేను ప్రయోజకుడ్ని కావాలనీ, నలుగురిలో ఒక వ్యక్తిని అనిపించుకోవాలనీ ఆరాటం ప్రారంభమైంది. అడ్డమైన గడ్డీ కరచాను. నానా తంటాలు పడ్డాను. నాలుగు డబ్బులు కూడబెట్టి వ్యాపారం వెలగబెట్టాను. కొంచెం లాభించింది. కలప వ్యాపారం పెట్టాను. కంట్రాక్టు వ్యాపారం మొదలుపెట్టి నాలుగైదు లారీలదాకా తీశాను. వందమంది కూలీలను పోషించే ఘనత దక్కింది. తర్వాత..."
బాగా దగ్గి.... ఆయాసంతో రొప్పి "అలా పదేళ్ళు వెలగబెట్టాను. అంతవరకూ పెళ్ళి చేసుకుందామన్న ఉద్దేశ్యం కూడా లేదు. ఒకనాడు ఈమెను చూశాను. కొండమీద వంటరిగా కూర్చుని వుంటే పెళ్ళాడేశాను. దీని అందం చూచి మోహపడ్డాను" అని, అసహ్యంగా ఆమెకేసి చూసి, "పాపిష్టి మొహం. ఏ ముహూర్తాన దీన్ని పెళ్ళాడానో గాని, నా వ్యాపారమంతా దివాళా తీయసాగింది. లారీలు పోయాయి. కొన్న మేడలు అమ్మేశాను. కూలీలందరూ నన్ను చీదరించుకున్నారు. మళ్లీ పూర్తిగా బికారినైపోయాను. ఓ స్నేహితుడి ఆసరా జూచుకొని యిక్కడ ఏదైనా జరుగుబాటు చూచుకొందామని వచ్చాను ఇబ్రహీం పట్నంనుంచీ పాడురోజులు. అదీ పొసగలేదు. పైగా యీ ముదనష్టపు జబ్బు ఒకటి సంక్రమించింది.
"నువ్విక్కడ వున్నావని తెలుసు నాకు. కాని, ఏ మొహం పెట్టుకొని నిన్ను చూసేదిరా బాబూ! నేను నీ చిన్నాయనని చెప్పుకొందామన్నా సిగ్గుగా వుంటుంది నీకు. మీ నాన్నకు సొంత తమ్ముళ్ళెవరూ లేరుగదా అని తెల్లబోతున్నావా? నేనూ మీ నాన్నదగ్గరే పెరిగాను. ఆఁ, నిన్ను యెలా జూసేది అని గింజుకు లాడానురా చివరకు తప్పలా, ఈ పాడుజబ్బొకటి పీల్చి పిప్పి చేస్తుండటంవల్ల!
"నాయనా! కదల్లేను గట్టిగా మాట్లాడలేను. గుండెల్లో ఏదోమంట, బరువు ఇవి నా అంతిమ దినాలనుకుంటాను."
నేనింతసేపూ తలవంచుకునే కూర్చున్నాను. అప్పుడు మెల్లగా యెత్తి చూశాను. ఆయన కళ్ళవెంబడి సంతతధారగా నీరు ప్రవహిస్తున్నాయి. కరుణతో నా గుండె ఆర్ద్రమయింది. "మీకేం భయంలేదు" అని అందామనుకొన్నాను.
చిన్నప్పటి విషయాలు లీలగా గుర్తుకువచ్చాయి. ఏమో! మా యింట్లో యిలాంటి వ్యక్తిని చూసినట్లుగానే వుంది.
"దౌర్భాగ్యుడ్ని, దుర్మార్గుడ్ని, అన్నయ్య పొయ్యాడని వాళ్ళద్వారా, వాళ్ళద్వారా తెలిసినప్పుడు కూడా నిన్ను చూడటానికి రాలేకపోయానురా ఆ రోజుల్లో నా కళ్ళు మూసుకుపోయి వున్నాయి."