"ఏమిటి ఆలోచిస్తున్నావు మళ్ళీ?"
ఈ లోకంలో అందగత్తెల జీవితం బాగుంటుందా? కానివాళ్ళ జీవితం బాగుంటుందా అని?"
ఇలా ఉండేది వారిద్దరి వాగ్వివాదాలు.
"ఇదిగో కోడలుపిల్లా! నీ అందం నాకుంటే భర్తని కదలనియ్యకుండా మంచానికి కట్టేసుకునేదాన్ని. మీ మామగారు వయసులో అన్ని పోకిరి తిరుగుళ్ళు తిరగడానికి వీలయేదా? నీకు చేతగాకగానీ లేకపోతే.
"అయ్యో! నా కొడుకు పెళ్ళాం మాయలో పడిపోయాడే" అని కుళ్లుతూ ఉండేదాన్ని యీసరికి" అనేది అత్తగారు.
భర్తకు జబ్బుచేసి ప్రమాదంగా ఉన్నప్పుడు భార్యను చెంతకు పిలిచి, దీనస్వరంతో "ఎవరికైనా ఒకరిచేత ప్రేమించబడితేనే జీవితానికి ధన్యత సమకూరుతుంది. అప్సరసలాంటి అర్ధాంగిని పెట్టుకుని కూడా ప్రేమకు నోచుకోలేకపోయాను. నేనింక ఎలాగు బ్రతకను. నా జన్మ వ్యర్థమైనట్లే" అన్నాడు.
వేదిత దుఃఖితురాలయింది. "మీరు బ్రతకండి. నేను ప్రేమించటానికి ప్రయత్నిస్తున్నాను" అంది ఆవేదనతో.
అతను బ్రతకలేదు.
ఈ సంగతులు గుర్తువచ్చి ఆమె తరచూ వ్యధిత హృదయురాలవుతూ ఉంటుంది. "నేను సున్నిత మనస్కురాలినని అనుకుంటూ ఉంటాను. ఇంత ప్రేమరాహిత్యం ఎలా సంభవించింది అప్పుట్లో? అప్పుడే మనుకుంటూ ఉండేదాన్ని?" అని నివ్వెరపోతూ ఉండేది.
దూరంగా కనిపించే ఎత్తయిన పర్వత పంక్తులు. వాటిమీద పెరిగిన ఆకుపచ్చని అడవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సకాలంలో చెట్లమీద ఎదిగే కొత్త చాగుళ్ళు. గాఢ తిమిరాలు, నిశాదేవి నిట్టూర్పులవంటి ప్రపంచాన్ని జోబుచ్చే సుందర తమస్సులు, పాలమీగడలాంటి వెన్నెలలూ, ఒకదాని వెంట ఒకటి ఉదయించే నక్షత్రాలూ నిండుగా, అర్ధవంకగా, మబ్బులమధ్య దాగుతూ, ఆకాశదీపంగా వెలుగుతూ, రకరకాలుగా సాక్షాత్కరించే చందురుడూ, చురుకులతో పలకరించి, తాపంతో దాహం తీర్చుకుంటూ, ఎర్రగా వాలుతూ అస్తమించే దినకరుడూ, రహస్యం చెబుతున్నట్లు వీచే రొదగాలీ, గాలికి చెట్ల ఆకులు చేసే సంగీత శబ్దాలూ, శ్రావణమాసంలోని నిండైన మేఘాలూ, భూమికి ఆశారేఖవంటి వర్ణాలూ, వానకు తడిసి కమ్మగా వ్యాపించే మట్టివాసనా, చీకటి వీడాక గగ్గుని విప్పుకున్నట్టు వికసించే పువ్వులూ, మారే ఋతువులూ.... ఆమె ప్రకృతిని ప్రేమించటం మొదలుపెట్టింది. ఆమెలో ఆరాధన మొదలిడింది.
తండ్రి యిది చూచాడు. కూతురు మాంగల్యాన్ని పోగొట్టుకుని యింటికి తిరిగి వచ్చేసరికి వృద్ధుడు శోకంతో కుమిలిపోయాడు. పిల్లదానికి ఎలానూ తల్లిలేదు. తనే సర్వమూ అయి పెంచి, ఒక అయ్య చేతిలో పెడితే దాని జీవితం యిలా తెల్లారింది. తన జీవితంలో ఏదో లోటు ఉంది. బ్రహ్మాండమైన అపరాధాలు చేసి ఉంటాడు. అందుకే భగవంతుడు ఈ శిక్ష తనకు విధించాడు. ఇంకా నయం తను బ్రతికి ఉన్నాడు, లేకపోతే కుర్రదాని గతి ఏమయ్యేది? ఆ వయస్సులో దానికి అభమూ, శుభమూ ఏం తెలుస్తుంది? వొంటరిగా మిగిలి కోరికలతో పెరిగి, నిట్టూర్పులు విడిచే మనసు ఒత్తిడికి తట్టుకోలేక, మాయాప్రపంచంలోని దుష్టశక్తులు ఎదురై, అది పాపం కాలు జారితే! అయ్యో, నిప్పులాంటి తన వంశం, వంశ ప్రతిష్ట తన కులాచారం, నిష్ఠ, నియమాలూ, ధ్యాస జీవితం అన్నీ గంగపాలు. "కృష్ణా!గోపాలా!హే దయానిధీ! దానికి రక్షణ కలిగించు."
అప్పుటినుంచీ వేకువనే లేపేవాడు . తనూ స్నాన - సంధ్య ముగించుకునే లోపల ఆమెను కూడా స్నాతయై శుచిగా ఉండమని చెప్పేవాడు, తర్వాత యిరువురూ కలిసి భగవద్గీత పారాయణం చేసేవారు. ఒక భగవద్గీతేమిటి - భారతమూ, రామాయణమూ, అనేక సంస్కృత కావ్యాలూ, ఆథ్యాత్మిక గ్రంథాలూ వరుసగా పఠించటం ప్రారంభించింది. ఆమెకు భాగవతం అభిమాన గ్రంథంగా పరిణమించింది.
చిన్నికృష్ణుని ముద్దులీలలు, బృందావనం, యమునానది, చల్లని పిల్లనగ్రోవి, అమృతపు చినుకులవంటి రసవాహినులు, ఆ రసవాహినులలో అంతర్వేగంగా ప్రవహించే వేదనాభరిత మూగ వీడ్కోలులూ.
తను గోపికా! తను అతని ఆరాధనలో పరవశించిన ప్రణయినా?
తను వేదిత!
తను రాధా! మాధవుని గుండెలోని తియ్యని మంటా?
తను వేదిత!
పిల్లనగ్రోవీ మృదుస్వరంలోని తొలి వొణుకు, తన్మయత చెందిన గోవుల పదధ్వనిలోని తొలి కదలికా, యమునానది సవ్వడిలోని తొలి వేగమూ యివన్నీ తనా?
తను వేదిత!
ఆమె కన్నుల నీరు నింపుకుంటుంది. అంజలి ఘటించి వినమ్రతతో యిలా వేడుకుంటుంది. "అల్పురాలిని నేను, నీ ఆరాధనలో ధన్యతచేకూర్చు."
అదే రోజుల్లో ఆనందపురానికి వేదమాత విచ్చేసి, గోవిందాచార్యులు గారింట్లోనే అతిధిగా ఉండసాగింది. వేదమాతకు ముప్ఫయి అయిదు, ముప్ఫయి ఆరు సంవత్సరాలకంటే ఎక్కువ ఉండవు. ఎత్తయిన రూపం విశాలనేత్రి స్ఫురద్రూపి. ఆమె ముఖంలో మహా వర్చస్సు తాండవిస్తూ ఉంటుంది. వేదమాతను చూడటానికీ, ఈమె ప్రసంగం వినటానికి ఊళ్ళోని ప్రజలూ, చుట్టుప్రక్కల ఊళ్ళనుండి కూడా వచ్చిన జనులూ రోజూ దేవాలయ ప్రాంగణంలో కిటకిటలాడుతూ ఉండేవారు. వేదమాత ఉపన్యసించేది. అది ఉపన్యాసం కాదు. ఆమె నోటివెంట ధారాప్రవాహంగా అమృతపు వాక్కులు, గీతాలు, శ్లోకాలు, పద్యాలు వెలువడుతూ ఉండేవి. మాటల మధ్య ఆమె తన్మయతతో గొంతెత్తి పాడుతుంటే జనులు ముగ్ధులై ఆలకించేవారు. ఆమె మహా శాంతస్వరూపిణి, గర్వంలేదు. గోపాలకృష్ణుని తలుచుకున్నా, పేరు ఉచ్ఛరించినా అమిత తన్మయత. 'కృష్ణా!కృష్ణా!' అని తనలో తను ఏడిచేస్తూ ఉండేది. ఎలుగెత్తి పిలుస్తూ వుండేది. ఆమె సత్యదేవుని భక్తురాలు. ఆమె నోటి వెంట ఆశువుగా భక్తిగీతాలు వెల్లువలా ప్రవహించేవి.
వేదిత అంటే ఆమెకు తగని ఆపేక్ష కలిగింది. రాత్రిళ్లు ఆమెను తన ప్రక్కన పడుకోబెట్టుకుని గీతామృతాన్ని, ఆధ్యాత్మికతలోని లోతుపాతుల్ని ముచ్చటిస్తూ ఉండేది. వేదితకు కొన్ని అర్థమయేవి, కొన్ని అర్థమయేవికాదు. అయినా ఏదో మహత్తుకు లొంగిపోయినట్లు ముగ్ధురాలై ఆలకిస్తూ ఉండేది. వేదమాత అంటే ఆమెకు ఎడతెగని భక్తి, అనురాగం, మమత ఏర్పడ్డాయి. ప్రజలు వేదమాత పాదాలను కళ్ళ కద్దుకోవటమే పరమ పవిత్రంగా భావిస్తూంటే ఆమె నిస్సంకోచంగా ఆమె మీద చేతులు వేసి కావిలించుకుని పడుకునేది. చంటిపిల్లలా ఆమె కౌగిలిలో ముడుచుపోయేది.