Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 41

    మొదట్లో  తన అనుమానం పద్మజా, గిరీ ఇద్దరూ  కలసి నాటకమాడుతున్నారనే....గిరి వ్యాపారానికి పద్మజ డబ్బు ఇచ్చిందని తెలియగానే ఆ అనుమానం  మరింత ధృడపడింది. దేశంలో  సంచలనం సృష్టించిన కుమార్ నారాయణ కేసులాంటిది  తొందరలో  మరొకటి  బయట పడబోతూందని అనుకున్నాడు.

    గిరి పద్మజను  హత్య చేశాడని వినగానే ఆశ్చర్యపడ్డాడు  తను. అప్పుడే అనుమానం వచ్చింది. పద్మజ నిరపరాధేమోనని, ఆమె మీదకు అనుమానం మళ్లేలా ప్రయత్నము  చేశారేమోనని....కానీ పద్మజకు తెలియకుండా  ఈ రహస్యాలెలా  బయటకు  పొక్కాయి?

    "పద్మజ డైరీ వ్రాస్తుండేది గదూ?" అడిగాడు  సాలోచనగా.

    "అవును, ఇదివరకు రెగ్యులర్ గా వ్రాసేది. ఇప్పటి సంగతి నాకు సరిగా తెలియదు. కోర్టులో  కేసు నడుస్తున్నప్పుడు ఏదయినా ఆధారం దొరుకుతుందేమోనని  గదిలో చూశాను. పాతవి కనిపించాయి గాని కొత్తవేం లేవు" బీరువా తెరచి చూస్తూ అంది హిమజ.

    "ఏ నేరస్థుడయినా  నేరాన్ని  కప్పిపుచ్చుకోవడం  కోసం చాలా జాగ్రత్తపడతాడు. ఒక్కోసారి అతి జాగ్రత్తతో  చిన్న చిన్న పొరపాట్లు  చేస్తుంటాడు. వాటినే  మనం పట్టుకోవాలి" టేబుల్ సొరుగులో నుండి పుస్తకాలు తీస్తూ అన్నాడు సాగర్. రెండో అరలో  పుస్తకాల వెనక కనిపించిందొక  కవర్. తీసి చూశాడు. అతని భృకుటి ముడిపడింది.

    అవి డిఫెన్సు మినిస్ట్రీ లెటర్ హెడ్స్. లేతపచ్చరంగు కాగితాలు చాలా ముఖ్యమైనవి  ఉత్తరాలు వ్రాయడానికి ఉపయోగిస్తారు. వాటి మీద ఏమీ వ్రాసిలేదు. క్రింద ఒక పక్కగా పద్మజ సంతకం కనిపిస్తోంది. బ్లాంక్ పేపర్లమీద పద్మజ సంతకాలు పెట్టి  ఎందుకుంచినట్టు? ఇవి ఎవరికంటాపడకుండా  ఎలా మిగిలిపోయాయి?

    దొరికిన ఆధారాలన్నీ పద్మజను నేరస్తురాలిగా నిలబెడుతున్నాయి.

    పద్మజ ఎందుకు చేసిందిలా?

    గిరిధర్ కోసమా? అయితే అతను పద్మజను ఎందుకు  హత్యచేసినట్లు? వారి మధ్య అభిప్రాయభేదం ఏదైనా వచ్చి వుంటుందా? పార్టీలో కూర్చున్నవాళ్ళు అప్పటికప్పుడు  పైకి వెళ్ళి దెబ్బలాడుకున్న విషయం ఏమిటి? పద్మజ ఏ విషయంలోనయినా గిరిని బెదిరించిందా? అదే ఆమె హత్యకు దారితీసిందా? అన్నీ అనుమానాలే. జవాబు దొరకని ప్రశ్నలు.

    అరగంట తర్వాత  లైబ్రరీ  పుస్తకాల మధ్య దొరికాయి పద్మజ డైరీలు. అంత ముఖ్యమైన పేపర్లను గదిలో అశ్రద్దగా  పడేసి  ఈ డైరీలు ఎందుకిలా  జాగ్రత్తగా  దాచినట్టు? సాగర్ ఒక డైరీ తెరిచాడు.

    నవంబరు 10 :

    గిరిధర్ తలపులు ఎందుకో నన్ను చాలా ఉద్వేగ పూరితురాల్ని  చేస్తున్నాయి, ఇన్నాళ్ళూ  ప్రతి పురుషుడూ శేఖరంతో  సహా నన్ను తమతో సమంగా భావించి మాట్లాడేవారు, చాలాకాలం తర్వాత  నాలో స్త్రీత్వాన్ని  జ్ఞప్తికి తెచ్చి  నిదురపోయిన వలపులకు మేల్కొలుపు  పాడాడా గిరిధర్ అనిపిస్తోంది. అతని స్పర్శ శరీరాన్ని పులకింపజేసింది. అతడిని భర్తగా పొందిన  నేను ఎంత అదృష్టవంతురాల్ని. సెక్స్ లో స్త్రీని సంతృప్తిపరిచే ఆర్ట్ చాలా కొద్దిమంది మగవాళ్ళకే వుంటుందన్న  విషయం గ్రహించడానికి  పెద్ద అనుభవం, ఒకరికన్నా  ఎక్కువ మందితో  సంబంధం అక్కర్లేదు. అనుభూతి, ఆలోచించగల విచక్షణా జ్ఞానం వుంటే చాలు. ఇంత ఆనందంలో  ఫోన్లో  ఆ వార్త వింటుంటే  భయంతో ఒళ్ళు  జలదరించింది. అన్ని ఆయుధాలు  తీవ్రవాదుల చేతుల్లో పడడం ఎంత భయంకర పరిస్థితి! ఈ దేశ భవిష్యత్తు ఏం కాబోతుంది?

    నవంబరు 22 :

    హిమజ నేను శేఖరాన్ని  వివాహం  చేసుకుంటాననుకున్నదిట. అలాంటి అభిప్రాయం నాకెప్పుడూ  కలగలేదంటే  వింతగా  చూసింది. పిచ్చిపిల్ల. రేపు ప్రకాశరావు  అంకుల్ తో చెప్పాలి. ఏమనుకుంటారో? 

    నవంబరు 30 :

    శేఖరం చచ్చిపోయాడు. అందరూ  హత్య అనుకున్నారు. కాని నాకు తెలుసు అతనిది ఆత్మహత్య అని. ఎందుకింత పిరికిపని  చేశాడు? కనీసం నాతో కాస్సేపు  మాట్లాడితే బాగుండేది. అతని మరణానికి నేనె కారకురాలినా  అనిపిస్తోంది. కాని నా తప్పేం లేదని నాకు తెలుసు. ఏమయినా అతని లేని లోటు నాకు కనిపిస్తోంది.

    డిసెంబరు 12 :

    ఆ రాత్రి అంత భయంకరమైనదవుతుందని  కలలో కూడా అనుకోలేదు. శేఖరం ఆత్మ గిరిలో ప్రవేశించటమేమిటి? నాతో మాట్లాడాలని కోరుకోవటమేమిటి? ఇలాంటి వాటిని  గురించి ఎప్పుడూ  పుస్తకాల్లో చదవడమే గాని ప్రత్యక్షంగా చూడవలసి వస్తుందని అనుకోలేదు. శేఖరం చనిపోయిన రోజు నుండీ  నాలో అంతర్లీనంగా వున్న భయం ఎందుకో ఈ రోజే అర్ధమవుతుంది.

    మరో డైరీ తెరిచాడు సాగర్.

    జనవరి 20 :

    గిరిధర్ మంచితనం ఇప్పుడు మరింత తెలుస్తూంది. తన డబ్బు అంతా ఫ్రీజ్ అయి అవస్థలు  పడుతున్నా కూడా నా దగ్గర నుంచి పైసా కూడా తీసుకోడానికి  ఇష్టపడడంలేదు. తనను చూస్తే ఒక రకంగా బాధగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని  నిలబెట్టుకోవడం చూస్తే చాలా తృప్తిగా గర్వంగా ఉంది.

    "ఒక్కోసారి అర్ధంలేని  పట్టుదలకు 'వ్యక్తిత్వం' అన్న పేరు పెట్టి గర్వపడుతుంటారు కొందరు."

    సాగర్ నవ్వుకున్నాడు. మరో పేజీ తిప్పాడు.

    ఫిబ్రవరి 10 :

    గిరిధర్ మామూలు మనిషయ్యాడు. వాళ్ళ అక్కయ్య డబ్బు పంపిందట. తిరిగి బిజినెస్ లో పడ్డాడు. ఉత్సాహంగా ఉన్నాడిప్పుడు.

    ఆఫీసులో పని ఎక్కువగా వుంటోంది. శేఖరం ఆత్మ సహాయం లేకపోతే తట్టుకోలేకపోయేదాన్ని. ఈ మధ్య అలసటతో  నిద్ర ఎక్కువవుతున్నట్లనిపిస్తోంది. మత్తుగా నిద్రపోతున్నాను. ఒక్కోసారి శేఖరమే పని పూర్తిచేసి పెడుతున్నాడు. శేఖరం సీట్లో ఇంకా ఎవర్నీ వేయలేదు. ఆ పని వత్తిడి తెలియటంలేదు.

 Previous Page Next Page