Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 4

   
    పెళ్ళికాకముందు ఆమె అతన్ని "బావా" అని పిలిచేది. నువ్వులోంచి మీరులోకి రావటానికి ఆమె చాలా ప్రయాసపడవలసి వచ్చింది.
    
    "ఏమిటి విశేషం?"
    
    "విశేషమేంలేదు అదంతే"
    
    "అలాగే" అని అతను ఆమె కోరికప్రకారం అవే వేసుకున్నాడు.
    
    "కూర్చోండి పౌడరు వేస్తాను."
    
    "ఏమిటీ రోజు?" అంటూ అతను బుద్దిమంతుడిలా మంచంమీద కూర్చున్నాడు.
    
    ఆం చేతికి కాస్త పౌడరు రాసుకుని కనిపించీ కనిపించనట్లు అతని ముఖానికి చక్కగా రాసింది. తర్వాత దువ్వెన తీసుకుని క్రాపింగు కుదురుగా దువ్వింది.
    
    "నువ్వీవేళ ఎలా వున్నావో తెలుసా?" అంది అతని కళ్ళల్లోకి చూస్తూ.
    
    "పిలుపుకూడా మారిపోయిందే."
    
    "అవును యివేళ అలాగే పిలుస్తాను ఇంతకూ నామాట పూర్తిగా వినవేం?"
    
    "నేనెలా వున్నానో చెప్పబోతున్నావు."
    
    "చాలా, చాలా అందంగా వున్నావు" మాట పూర్తయిందిగాని ఆమెముఖం ఎర్రబడిపోయింది.
    
    మన్మథరావు శరీరం పులకించింది. ఆ మాటతో అతనికేమిటో కావాలనిపించింది. చప్పున ఆమెవీపుచుట్టూ చేతులువేసి దగ్గరకు లాక్కుని ఆమె వక్షస్థలంమీద తల ఆనించాడు. ఆమె అతని తలమీద చెయ్యేసి గుండెకు గట్టిగా అదుముకుంది. ఆ స్థితిలో యిద్దరూ రెండుక్షణాలసేపు వుండిపోయారు. ఇద్దరికళ్ళల్లో కొంచెం కొంచెం నీళ్ళు తిరిగినట్టయింది.
    
    "ఒదులు బావా! ఎవరైనా చూస్తారు" ఆమె చలించే కంఠంతో అంది.
    
    గది తలుపులు తెరిచేవున్నాయి. ఆచారాలకు, గౌరవాలకు, మొహమాటాలకు లొంగిపోయిన మనస్తత్వాలు కాబట్టి ఆ యింట్లో ఏ గది తలుపులూ పగటిపూట మూతపడటానికి వీల్లేదు. ఆ యింట్లో ఒక సభ్యుడిగా ఆ విషయం మన్మథరావుకు బాగా తెలుసు. గది తలుపులు మూసేద్దామని మనసులో ఎంతో అనిపించినా, అతను ఆమెను విడిచిపెట్టేయడమే చెయ్యగలిగాడు.
    
    "బావా! యివేళ ఆఫీసునుంచి త్వరగా వస్తావుకదూ?"
    
    "ఏం?"
    
    "సినిమాకెళ్దాం."
    
    "ఓ యస్ అలాగే" ఆమెబుగ్గమీద చిటిక వేసి అతను బయటికి వెళ్ళి పోయాడు.
    
    రోడ్డుమీద సైకిలెక్కబోతున్న అతనిలోనూ, గదిలో మంచంపట్టెకు ఆనుకుని నిలబడిపోయిన ఆమెలోనూ ఒకేరకం ఆలోచనలు చెలరేగాయి.
    
    ఇద్దరిమధ్యా ఏంవుంది?
    
    ఇద్దరిమధ్యా ఏంలేకుండా వుంది?
    
    ఆమె రోగం, ఆమె నిస్సహాయత సరే! తమ వయసులు, తమ కోరికలు సరే! శరీరవాంఛలూ సహజధర్మాలు సరే! ఆపేక్షలూ, అనురాగాలూ సరే! వీటన్నిటినీ మించి ఏదోవుంది. యివన్నీ వున్నా అంతకంటే ముఖ్యమైనది ఏదో లేదు. అది గుప్తంగా వుండిపోతుందా? లేక కావాలని గుప్తంగా పూడ్చి పెట్టేస్తున్నారా....వాళ్ళకు సరిగ్గా అర్ధంకావటంలేదు అతను సైకిలెక్కి ఆఫీసు కెళ్ళిపోయాడు ఆమె ఇంటిపనులు చేసే ఆరోగ్యస్తోమత లేదుకాబట్టి ఒంటరిగా మిగిలిపోయింది.
    
                                                      2
    
    కాలేజీ విడిచిపెట్టేశారు. అలసిపోయిన శరీరంతో, వాడిపోయిన ముఖంతో చేతిలో పుస్తకాలు విధిలేనట్లుగా పట్టుకుని గేటుదగ్గరకు వచ్చింది గిరిజ.
    
    వెనకనుండి ఓ సన్నని కంఠం, ఎవరో ఆమెను పేరుపెట్టి పిలుస్తున్నారు.
    
    గేటుదగ్గర మహాగోలగా వుంది. సైకిల్ బెల్స్ మ్రోగించుకుంటూ వచ్చే వాళ్ళూ, గట్టిగా అల్లరిగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చేవాళ్ళూ, అమ్మాయిల్ని చూసి ఈలలు వేసేవాళ్ళూ, ఒకరిమీద ఒకరు జోక్సు కట్ చేసుకుంటూ తోసుకుంటూ వచ్చేవాళ్ళూ, తలవంచుకుని గబగబ నడిచి వెళ్ళిపోయే అమ్మాయిలూ, వాళ్ళకు దారి యివ్వకుండా ఏడిపించే అబ్బాయిలూ....గట్టు తెగిన ఏరులా సందడి ప్రవహిస్తోంది.
    
    ఆ గోలనుంచి కాస్త తప్పుకుని కాలేజీ బయట రోడ్డుకిరుప్రక్కల ఆక్రమించుకునివున్న పెద్ద పెద్ద చెట్లక్రింద నడుస్తూ కొంచెం యివతలగా వచ్చారు.
    
    "సరోజా! ఎప్పుడొచ్చావు వూరినుంచి?"
    
    "రాత్రి ప్రొద్దుట కాలేజీకి ఆలస్యంగా రావడంతో కలుసుకోలేకపోయాను. లీజర్ టైంలో స్పెషల్ క్లాసు వుందని చెప్పేసరికి అక్కడికి పరుగెత్తుకుపోయాను పద నడుద్దాం."
    
    "ఎందుకూ? కాసేపు ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుని బస్సులో వెళ్ళిపోతాను ఏం?"
    
    "అలా ఏంకాదు. మనిద్దరం కలుసుకుని వారంరోజులయింది. నీతో చాలా సంగతులు చెప్పాలి. మా యింటికివెళ్ళి ఓ గంటసేపన్నా వుండి తర్వాత వెళుదువుగాని."
    
    గిరిజ కాదనలేకపోయింది. ఇద్దరూ మెల్లగా నడక మొదలుపెట్టారు.    
    
    సరోజ ఇల్లు కాలేజీకి రెండు మూడు ఫర్లాంగుల దూరంకంటే ఎక్కువ లేదు అందువల్ల ఆమె కాలేజీకి నడిచేవస్తుంది. నడిచే వెడుతుంది. కరున్నా అనవసరమని ఉపయోగించబోదు.
    
    గిరిజ, సరోజ చిన్నప్పట్నుంచీ స్నేహితులు పి.యు.సి. వరకూ ఒకటే క్లాసులోకూడా వుండేవారు. తర్వాత గిరిజ బి.ఏ.లో సరోజ బి.యస్.సి.లో చేరటంవల్ల ఒకే కాలేజీలో చదువుతున్న, క్లాసుల్లోమాత్రం విడిపోయారు.
    
    "మీ అత్తయ్యకి ఎట్లా వుంది?" అనడిగింది దారిలో గిరిజ.
    
    "హార్టు ఎటాక్ సివియర్ గానే వచ్చింది. ఇప్పటికి గండం గడిచిందని డాక్టర్లంటున్నారనుకో. అయినా మనిషి బాగా దిగులుపడిపోయింది. బావని వెంటనే బయల్దేరి రమ్మని కేబుల్ యిచ్చారు."

 Previous Page Next Page