"రాత్రి నువ్వు మాట్లాడింది నాకేమీ అర్ధం కాలేదు. హరిస్వామి ఎవరు?" అన్నదామె దగ్గరగా వచ్చి కూర్చుంటూ.
బృహస్పతి మొహం మ్లానమయింది. "ఏం మాట్లాడాను?" అన్నాడు.
"సి.బి.ఐ.చీఫ్ రహస్యంగా నీకేదో పని అప్పగించారు అన్నావ్!"
బృహస్పతి తత్తరపడి, వెంటనే సర్దుకుంటూ "అదేమీ లేదు, నువ్వు రాత్రి విషయం పూర్తిగా మర్చిపో" అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి లేచిపోయింది. అంత సులభంగా మర్చిపోవడానికి కాదామె అక్కడి కొచ్చింది.
23
ఆ మధ్యాహ్నం ఎవరూ లేనప్పుడు ఆమె దగ్గరికి రావు వచ్చాడు. తలుపు దగ్గరగా వేస్తున్న అతన్ని చూస్తూ ఆమె ఆశ్చర్యంగా, కాస్త భయంగా "ఏం కావాలి నీకు?" అనడిగింది.
"నీతో కాస్త మాట్లాడాలి."
ఆమె అనుమానంగా చూస్తూ "ఏం మాట్లాడతావ్?" అనడిగింది.
అతడు చనువుగా పక్కకొచ్చి కూచుంటూ ".... నువ్వు నాకో సహాయం చెయ్యాలి. నిజానికి నీలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను. నీక్కూడా లాభం వుంటుంది" అన్నాడు.
"ఏమిటది?"
"బృహస్పతి దగ్గరనుంచి ఆ నిధి ఎక్కడుందో తెలుసుకోవాలి. అది నీ కొక్కదానికే సాధ్యం. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే నీకు అందులో వాటా ఇస్తాను!"
"నువ్వు చెప్పేది ఒక్క ముక్కకూడా నా కర్ధం కావడంలేదు. మంగళ్ సింగ్ ఎలాగూ నన్ను పెళ్ళి చేసుకుంటాడు. ఆ నిధి ఆయనిది! మధ్యలో నువ్వు నాకు వాటా ఇవ్వటం ఏమిటి?"
రావు తల అడ్డంగా విదిలిస్తూ ".... బృహస్పతి గతజన్మలో మంగళ్ సింగ్ కాదు- మేమిద్దరం ప్రాణ స్నేహితులం! ఇద్దరం కలిసి నాటకమాడాం!! అతను నిన్ను పెళ్ళి చేసుకోవడమనేది కలలో మాట!!!" అన్నాడు.
"నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ నిధి ఎక్కడుందో అతడికి కూడా తెలీదు కదా!" తెలివిగా ఎదురు ప్రశ్న వేసింది.
"నిజమే! మామూలు పరిస్థితుల్లో తెలిసి వుండేది కాదు. కానీ మంగళ్ సింగ్ భార్య రత్నాబాయి మా నాటకపు ఆఖరి రోజున మా దగ్గర కొచ్చింది. ఆమె మరణించిన కొద్ది క్షణాల తర్వాత ఒక సంఘటన జరిగింది. అది కేవలం నాకూ బృహస్పతికే తెలుసు. అయితే నాకు తెలుసన్న విషయం బృహస్పతికి తెలీదు."
"నువ్వు చెప్తున్నది నాకేం అర్ధంకావడంలేదు" మొహం చిట్లిస్తూ అన్నదామె.
"దావూద్ హర్షద్ తుప్పల వెనకనుంచి మిషన్ గన్ పేల్చి నప్పుడు రత్నాబాయి మరణించింది. కాలుకి గాయం అవడంతో నేను కుప్పకూలిపోయాను. నాకు స్పృహ తప్పింది. బృహస్పతి దావూద్ హర్షద్ ని వెంటాడుతూ పరుగెత్తాడు. అయితే ...." ఒక క్షణం ఆగి గాఢంగా శ్వాస తీసుకుంటూ అన్నాడు రావు. ".... ఆ పరిస్థితిలో కూడా నిధి విషయం అతడు మర్చిపోలేదు."
ఆమె ఆశ్చర్యంగా అతడివైపు చూస్తోంది.
అతడు కొనసాగించాడు. ".... పెట్టెలోంచి నిధి ప్లాన్ తీసి, చొక్కాలోకి దోపుకుని అప్పుడు పరిగెత్తాడు. నాకు స్పృహ తప్పింది అనుకుని భ్రమపడ్డాడు. నేనా దృశ్యం కళ్ళారా చూశాను. ఆ విషయం నా కతడు చెబుతాడనే ఇన్నాళ్ళూ వేచి వున్నాను. చెప్పలేదు. డబ్బుముందు మానవత్వం, స్నేహం - ఏదీ నిలబడదని అతడు నిరూపించాడు. వందకోట్లు ....తక్కువ డబ్బేమీ కాదు. ఎటువంటి బంధాన్నయినా తుంచేయ గలిగేటంత డబ్బు?"
ఆమె కొంచెం సేపు మాట్లాడలేదు. చివరికి తెప్పరిల్లి "అతడు నిజంగానే మంగళ్ సింగ్ కాదా?" అనడిగింది.
"కాదు. పైగా ఇంకో విషయం- అతడు హేమంత సంధ్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇంకో రెండు రోజుల్లో ఆ అమ్మాయి ఇక్కడికి వస్తోంది. రాగానే పెళ్ళికూడా చేసుకోబోతున్నారు."
ఆ అమ్మాయి సాలోచనగా ".... అతడు మంగళ్ సింగ్ కానప్పుడూ - నన్ను వివాహం చేసుకోనప్పుడూ - నాకు మాత్రం ఆ నిధి రహస్యం ఎందుకు చెప్తాడు?" అనడిగింది.
"దానికో పథకం ఆలోచించి పెట్టాను. నువ్వు సరేనంటే మిగతా విషయాలు చెప్తాను."
ఆమె ఏదో చెప్పబోతూండగా గుమ్మం దగ్గర ఏదో అలికిడయింది. ఇద్దరూ అటు చూశారు. గుమ్మం దగ్గర బృహస్పతి నిలబడి వున్నాడు.
అతడి మొహం వాడిపోయి వుంది. ".... నువ్వు.... నువ్వు.... నిజంగా నా ఫ్రెండ్ రావువేనా?" అన్నాడు అనుమానం, ఆందోళన మిళితమైన స్వరంతో.
రావు లేచి నిలబడ్డాడు. "అవును. నేనే! నిజానికి ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు.... దావూద్ హర్షద్ కాల్పులు సాగిస్తున్నప్పుడు నువ్వు ఆ నిధి ప్లాన్ తీసుకుని పరుగెత్తలేదూ?"
"లేదు" గట్టిగా అరిచాడు బృహస్పతి. ".... నువ్వు చెప్పేది ఎక్కడయినా తర్కానికి అందుతోందా? ఆ రోజు రాత్రి ఒకవైపు రత్నాబాయి మరణించింది. ఒకవైపు నీ కాలిలో బుల్లెట్స్ గుచ్చుకుని అంతా రక్తసిక్తమై వుంది. మరోవైపు బుల్లెట్ల వర్షం కురుస్తోంది. ఆ స్థితిలో నా ప్రాణాలు రక్షించుకోకుండా పెట్టెతీసి నిధి ప్లాన్ వెతికి తీసుకుని అప్పుడు పరిగెడతానా? అలాంటి స్థితిలో ఏ మనిషికయినా ఇంత ఆలోచన వస్తుందా?" సామరస్యంగా అన్నాడు.
రావు అదోలా నవ్వాడు. ".... నువ్వు చాలా తెలివైన వాడివి బృహస్పతీ! ప్రధానమంత్రి అవుదామని ప్లాన్ వేశావు. పక్కన ఒక తోడుండాలి కాబట్టి నన్నొక బాబాగా తీర్చిదిద్దావు. అనుకోకుండా అదృష్టం నిధి రూపంలో కలిసొచ్చేసరికి వైరాగ్యం వచ్చినట్లు నాటకమాడుతున్నావ్."
"అబద్ధం!"
"కాదు. నిజం. ఆ నిధి గురించి నీ అంతట నువ్వే చెబుతావని ఇన్నాళ్ళూ వేచి వున్నాను. ఒక స్నేహితుడిగా ఇంతకాలం నీకు గౌరవమిచ్చాను. ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకోలేక పోయావు. అయామ్ సారీ!" అన్నాడు రావు.
"జరిగిన సంఘటనంతా నీకు కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాకూడా నన్ను నమ్మవేం?" అన్నాడు బృహస్పతి.
ఆ అమ్మాయి ఇద్దరివైపూ చూస్తోంది.
రావు శుష్కంగా నవ్వాడు. "నువ్వు చాలా తెలివైనవాడివని ముందే చెప్పానుగా బృహస్పతీ! జరిగిన సంఘటనే కాస్త ఇటూ అటూ మార్చి ఎంత బాగా కళ్ళకి గంతలు కట్టి చెప్పినట్టు చెప్పావ్? రత్నాబాయి మరణించిన మాట నిజమే.... నా కాలిలో బుల్లెట్స్ గుచ్చుకున్న మాటా నిజమే. ఆ తర్వాత నువ్వు చెప్పింది మాత్రం అబద్ధం."
"ఏది?"
"నీ మీద బుల్లెట్ల వర్షం కురుస్తోందని నువ్వు చెప్పిన మాట!"
బృహస్పతి అవాక్కయి చూశాడు.
"అవును బృహస్పతీ! అప్పుడే నాకు స్పృహ తప్పుతోంది. అయినా ఆనాటి దృశ్యం నా కళ్ళలో ఒకప్రింట్ లా ముద్ర పడిపోయింది. దావూద్ హర్షద్ నిన్ను కాల్చబోతుండగా వెనకనించి ఆ ఇన్ స్పెక్టర్ సరళరేఖ కెవ్వున కేక పెట్టింది. వాడు ఆమెను తరుముకుంటూ అటు పరుగెత్తాడు. నువ్వుకూడా అటు వెళ్ళబోయి రెండడుగులు వేసి ఆగావు. అప్పటికే రత్నాబాయి మరణించింది. నేను స్పృహ తప్పుతున్న స్థితిలో ఉన్నాను. వెళ్ళబోయేవాడివల్లా వెనక్కొచ్చి పెట్టె తెరిచి డైరీలూ, నిధి ప్లాన్ తీసుకున్నావు. నా ప్రాణాపాయ స్థితిలోకూడా నీ తెలివితేటలకి నిబ్బరతకి సమయస్పూర్తికీ మనసులోనే జోహార్లర్పించాను. ఎందుకంటే.... అక్కడికి ఎలాగూ పోలీసులు వస్తారు. అప్పుడు ప్లాన్ ని వాళ్ళ కంటబడకుండా తీసుకోవడం కష్టం...." రావు చెప్పడం కొనసాగించాడు. బృహస్పతి మొహం రక్తం లేనట్లు పాలిపోయి వుంది.
".... నా ప్రాణం పోతున్నా నీకు నిధి దొరికినందుకు సంతోషించాను. స్నేహమంటే ఆదిరా బృహస్పతీ! మనిద్దరం కలిశాక ఆ విషయం నువ్వు ప్రస్తావిస్తావని ఇన్నాళ్ళూ చూశాను. కానీ నీ నరనరాల్లోనూ స్వార్ధం పేరుకుపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం నువ్వు మారిపోయినట్లు నటించావు. ఎవరో ప్రశాంత నివాళి మాటలకి ప్రభావితమయ్యానన్నావ్! కాలు పోయిన నేను కన్విన్స్ కాక మరేం చేయగలను? బ్రతుకు తెరువు కోసం నువ్విచ్చిన ఉద్యోగంలో చేరాను."
బృహస్పతి కొంచెంసేపు మాట్లాడకుండా మౌనంగా వుండి చివరకు నెమ్మదిగా ప్రశ్నించాడు. ".... యింతకాలం అనుమానం నీ గుండెల్లో పెట్టుకుని నన్నెందుకు అడగలేదురా?"
"మనిద్దరం కలిసి ఒక నాటకం ఆడినప్పుడు ఆ లాభంలో సగం వాటా నాకు రావాలనుకోవడంలో తప్పుందా?"
"లేదు."
"ఆ నిధి నిజంగా నీకు దొరికివుంటే అందులో సగం వాటా నాకూ యిచ్చి వుండేవాడివా?"
"తప్పకుండా యిచ్చి వుండేవాడిని."
"అదే కదా మన అగ్రిమెంట్"
"అవునదే మన అగ్రిమెంట్"
"ఆ నిధి ప్లాన్ నీ దగ్గర ఉందా?"
"లేదు."
రావు విసురుగా ఒంటికాలి మీద లేవబోయి పడిపోతూ కర్ర సాయం తీసుకున్నాడు. ఊహించని వేగంతో గాలిలా బృహస్పతి దగ్గరకొచ్చి అతడి మొహంలో గుచ్చి గుచ్చి చూస్తూ పళ్ళు బిగపట్టి కసిగా అన్నాడు- "ఇంత అనుమానం నా గుండెల్లో పెట్టుకుని నిన్నెందుకు అడగలేదో తెలుసా బృహస్పతీ? ఈ సమాధానమే నీ దగ్గర్నించి వస్తుందని! నేనడుగుతాను. నువ్వు తెలీదంటావ్! కానీ నీ మనసులో అనుమానం పీకుతూనే వుంటుంది. జరిగినదంతా నేను చూశానని నీకు నిర్ధారణ అవుతుంది. నన్ను అడ్డు తొలగించడానికి నువ్వు సిద్ధమైనా అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే డబ్బు నీలాంటి వాళ్ళని ఎంతలా మార్చేస్తుందో కళ్ళారా చూశాను కనక...."
బృహస్పతి మొహం జేగురు రంగులోకి మారింది. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. అతడి ముఖ కవళికల్ని మరోలా అర్ధం చేసుకున్నట్టు రావు అన్నాడు.... "ఇక నీ రెండో ప్రశ్న- 'ఇంతకాలం' ఇంత అనుమానంతో రగిలిపోతూ నీతో కలిసి ఎలా వున్నానని! నీ నుంచి ఆ నిధి రహస్యం బయటికి వచ్చేలా చేయాలంటే నీతో కలిసి వుండక తప్పదు! ఈ అమ్మాయి సహాయంతో దాన్ని బయట పెట్టిద్దామనుకున్నాను. ఒక పథకం కూడా ఆలోచించి వుంచాను. దురదృష్టవశాత్తూ అది ఫెయిల్ అయింది" అతడు గుండెలనిండా గాలి పీల్చుకుని వదులుతూ అన్నాడు.... "బృహస్పతీ! నువ్వెంత తెలివయిన వాడివో, నేనూ అంతే తెలివైన వాడిని. డాకూ మంగళ్ సింగ్ గా నువ్వెలా నటించావో స్వామీజీగా నేనూ అంతే రక్తి కట్టించాను. ఈ క్షణం నుంచీ మనిద్దరికీ రమ్మీ మొదలయింది. ఎవరు షో తిప్పుతారో కాలమే నిర్ణయిస్తుంది. నీ తల తిరిగిపోయే ప్లానేసి నీ దగ్గరనుంచి ఆ ప్లాన్ సంపాదించకపోతే నా పేరు రావు కాదు" అంటూ బయటకు నడిచాడు.