ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఈ మధ్య రోజూ యిలాంటి కలలు వస్తున్నాయి. పద్మజ ఎప్పుడో కాకుండా యిప్పుడే హత్యచేయబడినట్లుగా అనిపిస్తోంది. ఏమిటీ కలకు అర్ధం?
హిమజ లేచి బాల్కనీలోకి వచ్చింది. దూరంగా మినుకు మినుకు మని వెలుగుతూ దూరమవుతోంది విమానం, నన్నెవరూ అందుకోలేరు అన్న ధీమాతో.
గిరి వెళ్ళిపోయాడు. ఎవరికీ అందనంత దూరంగా. తననుంచీ, చట్టాన్నించీ తప్పించుకుని, ఉన్న ఒకే ఒక్క రక్తబందువునీ దూరంచేసి విజయగర్వంతో ఎగిరిపోయాడు. ఒక్కమాటైనా అనలేదు పద్మజ గురించి. తప్పు చేశానన్న భావం ఏ కోశానా కనిపించలేదు. సాగర్ కంట్రోల్ చేసి ఉండకపోతే ఏం చేసి ఉండేదో తను? తన నిస్సహాయతని తలుచుకుంటుంటే హిమజ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మంచంమీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది, గుండెలోని ఆవేదనంతా కన్నీళ్ళ రూపంలో వదిలించుకుందామని.
కింద ఫోను మోగుతోంది
అర్దరాత్రి ఎవరుచేసి ఉంటారు? ఎవరో ఓదార్చడానికో, ఒంటరిగా ఉన్నందుకు జాలిపడుతూ నిట్టూర్చడానికో చేసి ఉంటారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించటం లేదు.
కింద శివయ్య కాబోలు ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. అంతగా అవసరమైతే పిలుస్తాడులే అనుకుంది.
శివయ్య పిలువలేదు. ఆమె తిరిగి కళ్ళు మూసుకుంది. ఎవరి మీదో తెలియని కోపం, కసి, కక్ష మిళితమై గుండెల్ని కోసేస్తున్న బాధ.
తిరిగి నిద్రపోవటానికి ప్రయత్నించింది హిమజ మరో పీడకలకు ఆహ్వానం పలుకుతూ. ఆ ఫోన్ లోనయినా మాట్లాడి ఉంటే మనసు కాస్త డైవర్టు అయ్యేదేమో ?
* * *
అదే సమయానికి పారిస్ లో....
ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆలోచనలో పడింది జూలీక్లాడ్.
హిమజ యింట్లో లేదట. టైం చూసుకుంది. పదవుతోంది. అంటే ఇండియాలో రాత్రి రెండు దాటింది. ఈ సమయంలో ఎక్కడకెళ్ళి వుంటుంది? ఫోన్లో మాట్లాడిన నౌకరు వచ్చీరాని ఇంగ్లీషులో హిమజ లేదని చెప్పాడు. పేపరూ, పెన్నూ తీసుకుని వ్రాయడం మొదలు పెట్టింది. ఆమె.
"ప్రియమైన హిమజా !"
నా పేరు జూలీ క్లాడ్. మీ అక్కయ్య పద్మజ యిక్కడకు వచ్చినప్పుడు మాకు స్నేహం కలిసింది. మీ యింటి అడ్రస్సూ, ఫోన్ నెంబరూ తనే యిచ్చింది నాకు. ఉత్తరాలు వ్రాస్తుండమనీ, మీతో కలం స్నేహం చేసుకోమనీ, అనేది. ఇలాంటి పరిస్థితిలో ఉత్తరం వ్రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
విచిత్రమైన పరిస్థితిలో పద్మజ మరణం గురించి యిప్పుడే ఒక మ్యాగజైనులో చదివాను. పుస్తకం తిరగేస్తుంటే పద్మజ ఫోటో కనిపించింది. ఆశ్చర్యంగా తీసి చూశాను. తను చనిపోయిందనీ, హత్య చేయబడిందని చదవగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెంటనే మీకు ఫోన్ చేసాను. మీరు ఇంట్లో లేరని చెప్పారు. మళ్ళీ ఆలోచిస్తే అనిపించింది. ఫోన్లోకంటే ఉత్తరం ద్వారా మీకు వివరంగా విశదంగా తెలియపర్చవచ్చునని.
ఎంతోమంది భారతీయులను అంతకు ముందు చూసినా, కొద్దిమందితో పరిచయం ఉన్నా, పద్మజను చూడగానే చాలా అభిమానం కలిగింది. కొంతమందిని చూడగానే ఎన్నాళ్ళగానో తెలిసిన వాళ్ళనిపిస్తుంది. మరి కొందరితో కొద్ది పరిచయంతో సన్నిహితులవుతాం. పద్మజను చూడగానే పాత స్నేహితురాలిని చూసినట్లనిపించింది. నాలుగు రోజుల పరిచయంలోనే ఎంతో దగ్గర స్నేహితులమయ్యాం. నేనొక జర్నలిస్టు ననగానే, మీ గురించి చెప్పింది. తనతో ఎంతోసేపు మాట్లాడినా తనివితీరేదికాదుగానీ తనకు మాత్రం నాతో ఎక్కువసేపు గడపడానికి వీల్లేని పరిస్థితి. నన్ను మీ దేశం రమ్మని ఆహ్వానించింది. అలాంటి వ్యక్తి ఈ రోజు హత్యచేయబడిందనీ, అందులోనూ భర్త చేతుల్లోనే చచ్చిపోయిందనీ, తెలిసి నన్ను నేను నిగ్రహించుకోలేక పోతున్నాను. నాలో రేకెత్తిన అనుమానాలను మీకు తెలియపరచకుండా వుండలేక పోతున్నాను.
నేను చదివిన పుస్తకంలో కేసు గురించి పూర్తి వివరాలు వ్రాశారు. అది చదువుతుంటే నాకనిపించింది. ఇదేదో పకడ్బందీగా ఎన్నాళ్ళగానో వేసుకున్న ప్లాన్ అని. మీ బావ గిరిధర్ ని ఇక్కడ చూశాను. సైకాలజీ మెయిన్ గా చదువుకున్న నాకు కనిపించిన ప్రతీ మనిషినీ పరీక్షించి చూడటం అలవాటు. మీ అక్కయ్యను చూడగానే ఎంత అభిమానం కలిగిందో గిరిధర్ ను చూడగానే అతనిలో ఏదో అస్వాభావికత కనిపించింది. అతను నవ్వుతూ మామూలుగా మాట్లాడుతున్నా నటిస్తున్నట్లుగానే అనిపించేది నాకు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి స్పష్టంగా కనిపించేది. అయితే మాటల సందర్భంలో మీ అక్కయ్యకు అతనిమీద ఉన్న భక్తీ, అనురాగమూ గమనించాక ఏమి చెప్పలేక పోయాను, ఎంత ఆరాధిస్తుంది ఈమె భర్తను అని ఆశ్చర్యపోయాను. అసలు నా వేపు చూసే చూపులకు అర్ధం తెలిసివుంటే ఆమె అతన్ని అంతగా పూజించగలిగేదా? ఏది ఏమయినా మీ అక్కయ్య హత్య విషయంలో గిరిధర్ అమాయకుడంటే నమ్మలేక పోతున్నాను. కారణం అప్పుడు నాలో రేకెత్తిన కొన్ని అనుమానాలు.
మీ అక్కయ్య ఇక్కడకు వచ్చింది దేశరక్షణ విషయమై డిఫెన్స్ మినిష్టర్స్ కాన్ఫరెన్స్ కోసం. రెండు దేశాలమధ్య ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. జర్నలిస్టుని గాబట్టి మీ అక్కయ్య ప్రాముఖ్యం నాకు బాగా తెలుసు. అందువల్ల ఆమె దగ్గర ఆ విషయాలేవీ ప్రస్తావించేదాన్ని కాదు. ఒకరోజు సాయంత్రం తను కాస్త ఫ్రీగా ఉంటాననీ గిరిధర్ కూడా ఏదో వ్యాపార చర్చల నిమిత్తం వెళతానన్నాడనీ, సియాన్ నదికి షికారు కెళదామని అంది పద్మజ. తను చెప్పిన సమయానికి కాస్త ఆలస్యంగా తన గదికి వెళ్ళాను హడావిడిగా. అప్పటికి గదిలో పద్మజ లేదు. గిరిధర్ ఉన్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపడ్డాను. నన్ను చూసి అతను గాభరపడుతున్నాడు. కాని అతను మంచి నటుడు సుమా. ఆ విషయం నాకు తెలియకూడదని చాలా జాగ్రత్త పడ్డాడు. కాని మనిషి ముఖకవళికలూ, మాటకే కాకుండా శరీరపు కదలికలు కూడా అతని ప్రవృత్తిని తెలియజేసాయి. అతనెందుకు గాభరా పడుతున్నాడో నని క్యాజువల్ గా గదిని పరిశీలించాను. నా అనుమానం గదిలో వేరే ఎవరో వున్నారని. కానీ ఎవరూ లేరు.