అని నిట్టూర్చి ఒక క్షణమాగి "ఊరికే అనుకున్నానంతే. సమయం దాటిపోయాక అనుకున్నంత పటిష్టంగా దాటకముందు అనుకోలేంకదా. నా విషయంలోనూ అదే జరిగింది . నీ పెళ్ళికి వచ్చాను. శాయితో కలిసి దూరంనుంచి తిలకించి నన్ను నీ కళ్ళతో వెదుకుతూ చూసినప్పుడు చిరునవ్వులు నవ్వాను. ఆ చిరునవ్వుల్లో యెంత విషాద మాధుర్యాలు దాగివున్నాయో నువ్వు గ్రహించి వుండవు. నీ దారిన నువ్వు పల్లకీఎక్కి వెళ్ళిపోయావు. తిరిగి చదువుకునేందుకు వెళ్ళిపోయాక నీ స్మరణ మరీ ఎక్కువై పిచ్చివాడిలా తయారయ్యాను. నిన్ను పోగొట్టుకున్నాక నీ విలువ ఆకాశం యెత్తున పెరిగి నన్ను ఆక్రమించి, కప్పివేసింది. ఏం చెయ్యను? నీ ఆలోచనలతో పిచ్చెక్కి మత్తెక్కి జీవితాన్ని పూర్తిగా కాల్చుకోనా? ఆలోచించాను. చివరకు ఒకటే నిర్ణయించుకున్నాను. మనశ్శాంతి కలగాలంటే దిగుళ్ళు గుర్తురాకుండా గడిపెయ్యాలని. అంతే! రాత్రింబవళ్ళు చదివెయ్యటం మొదలుపెట్టాను. ఎప్పుడన్నా మనసు బాగుండకపోతే నా దగ్గరున్న నీ చిన్న ఫోటోను ఎదురుగా వుంచుకుని, కాసేపు దర్శించేవాడిని. నూతన ఉత్తేజం కలిగినట్లు, నూతన రక్తం ప్రవహించినట్లు అయేది. అట్లా రోజులూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. ఈ ఊరిలోవున్న మా బంధువుల ద్వారా ఎప్పటికప్పుడు నీ క్షేమసమాచారాలు తెలుసుకుంటూ వుండేవాడ్ని. నీ వైవాహిక జీవితం గతంగా మారిందని తెలిసినప్పుడు మిన్నువిరిగి మీదపడినట్లయింది. ఏం చెయ్యను? భరించాను. భరిస్తూ జీవించాను."
ఆమె ముఖంవంక తదేకంగా చూస్తూ "యిప్పుడు... యిన్ని సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాక, ఈ మహా సాగరంవంటి కల్లోలంలో, నలువైపుల నుంచి ముంచుకువస్తూన్న ఉపద్రవంలో, దావానంలా క్రమ్మివేస్తూన్న కారు చీకటిలో - యిహ భరించటం నా సాధ్యం కాదనిపిస్తోంది. ఏమంటావు? అన్నాడు.
చివరకు ఆమె కళ్ళు అతనికేసితిరిగాయి. ఆ శరీరానికి సంబంధించిన వాటిలా కాకుండా, ఎక్కడో గాలిలో నిలిచినట్లు ఆకాశంనుంచి వ్రేలాడుతున్నట్లు ఉన్నాయి ఆమె నేత్రాలు.
"ఏమంటావు?" అని మళ్లీ వినిపించింది అతని కంఠస్వరము. "ఆఁ" అంటు ఆమె ఉలిక్కిపడింది. "శనికాలం దాపురించింది. తిరగబడుతూన్న చరిత్ర నా ప్రాణాలు తోడేస్తోంది. గాలి మళ్ళీ అటునుండే వీస్తోంది. అదే పిలుపు. అదే శాసింపు, గొంతు మారింది. మరో మనసు" అంది అస్పష్టంగా ఏదో లోకాలనుండి మాట్లాడినట్లు.
ఈసారి 'ఆ' అని అతను నివ్వెరపోయాడు. "ఏమన్నావు?" అన్నాడు అర్థంకాక.
"అదేపిలుపు, అదే శాసింపు, గొంతు మారింది. మరో మనసు" అంది వేదిత. మళ్లీ ఆమె కనులు మూతలు పడినట్లయినాయి, కనీసం అతని కట్లా అనిపించింది. ఆశ్చర్యంగా నోరు తెరిచి యేదో అనబోతున్నాడు.
ఇంతలో బయటనుంచి పెద్దగాలి వీచి గోడనున్న దీపం ఒకక్షణం రెపరెపలాడి పూర్తిగా ఆరిపోయింది. వేదిత కుటీరమంతా చీకటి మయమైపోయింది. అది వెన్నెల రాత్రికూడా కాదు.
"అయ్యో" అంది వేదిత కంగారుగా, "దీపం వెలిగిస్తాను" చీకట్లో ఆమె కదిలిన చప్పుడయింది. "అగ్గిపెట్టె యెక్కడ పెట్టానో" అనుకుంటోంది తనలో తాను ఆందోళన వ్యక్తపరుస్తూ.
"వేదితా!" ఆ చీకటిలో, గాలిలో తేలిపోతూ చాలా దగ్గర్లో వినిపించినట్లయింది ఆ పిలుపు. ఆమె ఉలికిపడి ఉన్నచోటనే నిలబడిపోయింది. తలత్రిప్పి కళ్ళు నిశితం చేసుకుని అతనున్న దిశకు చూడటానికి ప్రయత్నించింది. లీలగా అతని రూపం పొడగట్టింది. అతను కూర్చున్న చోటే ఉన్నాడు. కదల్లేదు. 'హమ్మయ్యా' అని ఊరడల్లి తను అలా భ్రమపడినందుకు నాలిక కొరుక్కుంది.
అదిగో తను మామూలుగా మానవిలా పరివర్తిస్తోంది. తనను మించిన ఏదో శక్తి తనను గడ్డిపోచవలె బలహీనురాలుని చేసి వేస్తోంది. అన్నట్లు అతను పిలిచాడుగా! ఊఁ!" అంది జవాబుగా.
"ఆ చీకట్లో యేమి వెదుకుతావు వేదితా? వెలుతురులోకన్నా చీకటిలోనే నీతో మాట్లాడటానికి అనువుగా వుంది. అలాగే వుండు వేదితా!"
నిస్సహాయురాలిగా, మంత్రముగ్ధలాగా నిలబడిపోయింది ఆమె.
"దివ్యమైన దేవాలయ ప్రాంగణంలో కుటీరం... నలువయిపులా అలుముకున్న చీకట్లు, వింత వింత చలిగాలులు, సంవత్సరాల తర్వాత కలుసుకున్న చెలికాడు, చెలికత్తె...! వేదితా! ఈ దృశ్యం నీకు బాగుండ లేదూ?"
సుకుమారమైన ఆమె మేను యెన్నడూ యెరుగనిరీతి గగుర్పొడిచింది. అడవిలోని మల్లెపోద గుబాళించినట్లయింది. చిరుగాలికి పూలలతలా ఆమె లేత శరీరం చిన్నగా తొణికింది.
"కళ్యాణమూర్తీ!" అన్నది కంపిత స్వరంతో.
"వ్యర్థపూజలతో జీవితాన్ని శుష్కం చేసుకుంటూన్న భగవంతుని పరిచారికవు. బ్రతుకుతూనే మరణించిన తపస్వినివి. మోహాన్ని కాలదన్ని మోక్షానికి పయనమవుతూన్న ముముక్షువువు ఈ ఆత్మవంచన కట్టిపెట్టి హృదయకవాటాలు పూర్తిగా తెరిచి, నీ అంతరంగ శోభను ఛేదించి వెలికి తీసుకువచ్చి, అసలు మనిషివై నా ప్రశ్నకు సమాధానం చెప్పు వేదితా! నీకు ప్రేమంటే తెలియదూ?"