Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 38


    అతను వెళ్ళిపోయాక ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. "ఛీఛీ! నా బ్రతుకెంత శూన్యం?" అని వాపోయింది.
    తను శేఖరం మాయలో పడిపోయి, మనసులో అతనికి స్థానమిచ్చినమాట నిజం. దానికి కారణం అతని అందం కావచ్చు. ఆకర్షణ కావచ్చు. ప్రలోభంలో పడిపోయింది. అందుకే మనసు తీవ్రంగా గాయపడి, ఆ దెబ్బకామె తట్టుకోలేక పోయింది. ఆ సమయంలో ఆమె మనసులో మృత్యుంజయరావు మెదిలాడు. పాపం! అతను అమాయకుడు. తనని కోరాడు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించింది. అందుకు పాపఫలం అనుభవించింది. అసలు మొదటనుంచీ తనమీద అతనికి ఊహ వున్నదని ఆమెకు తెలుసు. అతనంటే అణువణువునా ఆమెకు జాలి వ్యాపించింది. తనకు పెళ్ళికాకపోతే తను భరించగలదు, అవివాహితగా జీవితాంతం గడుపగలదు. కాని తనను ఆశించిన ఓ నిర్భాగ్య జీవికి సంతృప్తినివ్వగలిగితే అదే చాలు. అంతేకాదు, ఏ ముక్కూ మొహం ఎరుగని వాడినో చేపట్టితే వాడుమట్టుకు ఉద్ధరిస్తాడని నమ్మకమేమిటి?
    ఆమె వెంటనే మృత్యుంజయరావును చూడకుండా వుండలేకపోయింది. అతనితో ఆ మాట చెప్పకుండా వుండలేకపోయింది. అతని గదికి పరిగెత్తింది.
    ఈ కథంతా మృత్యుంజయరావు చాలావరకూ సవ్యంగానే ఊహించాడు. ఇలా జరిగివుండకపోతే మాలతి తనదగ్గరకు రాదు. కాని అతని సందేహమల్లా ఏమిటంటే శేఖరంతో ఆమె వ్యవహారం ఎంతదూరం వెళ్ళిందీ అని. అది తల్చుకుంటూంటే అతనికి వళ్ళంతా కంపరమెత్తినట్లుగా వుండేది. ఆమెనడిగి అసలు విషయం తెలుసుకుందామని ఉద్రేకపడేవాడు. కాని అతన్లో యింగిత జ్ఞానం కాస్త పనిచేసి, తాను ఆ ప్రమేయం ఎత్తటంవల్ల సమాధానం రాబట్టక పోగా, తమ సంసారంలో సుఖశాంతులు వుండవని గ్రహించి, మాట్లాడకుండా వూరుకున్నాడు.
    అతను అనేకసార్లు శేఖరం, మాలతుల ఆంతరంగిక సంబంధాన్ని గురించి మధనపడుతూ ఆలోచించినా, ఆమె అంటే ద్వేషమేం కలగలేదు. ఆమెను అణువణువునా గాఢంగా ప్రేమించాడు. పువ్వులా చూసుకున్నాడు, పూజించాడు, ముట్టుకుంటే యెక్కడ వాడిపోతుందోనన్న భయంతో ప్రవర్తించాడు.
    ఇప్పుడు తాను కాపురస్థుడు. తనకో సంసారం, యిల్లాలూ. ఒక్కోసారి అతనికి గర్వంగా వుండేది. "నేనూ జీవిస్తున్నాను" అనుకునేవాడు ఠీవిగా.
    అతని జీవితంలో 'థ్రిల్' ఏర్పడలేదు. మునుపటికన్నా జీవితం సాఫీగా గడిచిపోతోంది. నిండుతనం ఏర్పడింది. క్షణక్షణానికీ ఉలికిపడటం మానుకున్నాడు. మాలతి నీడలో సేద తీర్చుకుంటున్నాడు.
    అయితే ఒక ప్రశ్న అడగాలని అతని మనసెప్పుడూ ఆరాటపడుతూ వుండేది. 'మాలతీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?' అని.
    అమ్మో! ఆమె నిజం చెప్పేస్తే? తాను తట్టుకోలేడు. మిగతా జీవితమంతా ఆమెతో కలసి జీవించడం దుర్భరమైపోతుంది.
    కాని తనను ఒక్కరయినా మనసారా ప్రేమించారన్న తృప్తి కలగాలి. తల్లి తనని ప్రేమించింది. కాని ఆ ప్రేమ కాదు తనకి కావలసింది. తనని ధన్యుడ్ని చేసే ప్రేమ, తనని పునీతుడ్ని చేసే ప్రేమే కావాలి.
    కాని యీ జన్మలో అది తనకు లభిస్తుందా? ఎవరయినా తనమీద జాలి కురిపిస్తే దానితోనే తృప్తి పడాలి. అదే తనకు భిక్ష.
    ఈ విధమైన చిన్న చిన్న ఎగుళ్ళదిగుళ్ళతో రెండేళ్ళపాటు అతని జీవితం ప్రశాంతంగానే సాగిపోయింది.
                                                   19
    మాలతి డాక్టరుదగ్గరకు వెళ్ళివచ్చింది. మృత్యుంజయరావు "ఏమన్నది?" అని అడిగాడు.
    మాలతి చెప్పింది.
    అతను నిర్విణ్ణుడయాడు. ఆమెకు మూడోనెల.
    ఆమెముఖంలో సంతోషమూలేదు. విచారమూలేదు. ఒక్కొక్కప్పుడు యీ మాలతేనా తనకు యిదివరకు పరిచయమున్న చలాకీ యువతి అనిపిస్తూ వుంటుంది అతనికి. ఈమేనా నాటకంలో నటించింది? ఆ నటికేనా తను ప్రాంప్టింగ్స్ యిచ్చింది? తన గదికివచ్చి అక్కతో సంభాషణ జరిపిన యువతి యీమెయేనా అనిపిస్తూ వుంటుంది. ఇంత నిర్లిప్తత ఎలా ఆవరించింది? తనని పెళ్ళి చేసుకున్నందుకు ఒకవేళ పశ్చాత్తాపపడుతున్నదా? తనని అసహ్యించుకుంటున్నదా?
    ఈ ఆలోచనలు అలా వుంచి, యిప్పుడీ కొత్తవిపత్తు వచ్చిపడింది. మాలతి కిప్పుడు నెలతప్పింది.
    అతని కళ్ళముందు చీకటి ఆవరించింది. ఒకనాడు అతను చేసిన పాపం, యీనాడు తిరిగి దెయ్యమై, భూతమై బాధించసాగింది.
    మంజులతతో ఆరాత్రి గడిపాక, వారం పదిరోజుల లోపల ఏదో దోషం కనిపించింది. వ్యాధిలక్షణాలు కనిపించాయి. అతను గడగడ వొణికిపోయాడు. డాక్టరుదగ్గరకు పోదామంటే సిగ్గూ, భయం, యేం చెయ్యటానికి తోచక బెంగపెట్టుకుని కృశించిపోయాడు. రాత్రుళ్ళు నిద్రపట్టటం మానేసింది.
    ఎవరైనా స్నేహితులతో చెప్పుకుందామంటే సిగ్గుచేటు, ఏమి పాలుపోక బజారుకు వెళ్ళి ఓ పుస్తకాలషాపులో జొరబడి, సుఖరోగాలకు సంబంధించిన యింగ్లీషుపుస్తకం ఒకటి కొన్నాడు. దాన్ని శ్రద్ధగా పఠించి, తన బాధనూ, అందులోని సారాంశాన్నీ సమన్వయించుకున్నాడు. ఫలితం తెలిసేసరికి భయంతో అతనిగుండె బేజారైంది. తన అనుమానాలే నిజమైతే, తనకు వచ్చింది సిఫిలిస్.
    'భగవంతుడా, నాకేదీ దారి?' అనుకున్నాడు.
    ట్రీట్ మెంటు తీసుకున్నా తీసుకోకపోయినా పదిపదిహేనురోజుల్లో వ్యాధి లక్షణాలు అంతరించిపోతాయట. తర్వాత అయిదారు నెలలలో సెకండరీ స్టేజ్ వచ్చి, గ్లాండ్స్ వాయడం మొదలైన మరో కొన్ని లక్షణాలు పొడచూపుతాయి. అవే తగ్గిపోతాయి. అయిదారేళ్ళు గడిచాక టెరిపియరీ స్టేజ్ వచ్చి, వ్యాధి శరీరంలో భాగాలన్నీ ఆక్రమించి, క్రమంగా శిథిలం చేసి వదిలి పెడుతుంది. ఇవన్నీ చదివి, భయంతో అతనివళ్ళు జలదరించిపోయింది. అయినా డాక్టరుదగ్గరకు పోవటానికి అతనికి ధైర్యం చాలలేదు. ఆ డాక్టరు తనను గెలిచేస్తాడేమో, తిడతాడేమో అందుకని సొంతవైద్యానికి పూనుకున్నాడు. మందులషాపుకు వెళ్ళి ఓరల్ పెన్సిలిన్ టాబ్లెట్సు తెచ్చుకున్నాడు. అయిదారు రోజులపాటు మింగాడు.
    తర్వాత అంతా సక్రమంగా వున్నట్టు కనిపించింది. అంతా తగ్గిపోయింది. అయిదారు నెలలు గడిచినా మిగతా లక్షణాలు ఏమీ కనిపించనందున తను పూర్తిగా విముక్తుడనైపోయానని సంతోషించాడు. అప్పుడప్పుడూ దాని స్మృతి అతన్ని కలవరపెడుతున్నా 'ఫర్వాలేదులే. మందు తిన్నాగా' అని సరిపెట్టుకుని తనని తాను సముదాయించుకుంటూ వుండేవాడు.
    కాని యిప్పుడు మాలతి గర్భవతి అని తెలియగానే అతనిలో కొత్తశంకలు పొటమరించాయి. తనలో యింకా సిఫిలిస్ వున్నట్టయితే దానివల్ల యిప్పుడు చాలా అనర్ధాలున్నాయి. ఏ నెలలోనైనా మాలతికి గర్భస్రావం జరగవచ్చు. ఒకవేళ గర్భస్రావం కాకుండా దైవికంగా తప్పించుకున్నా, శిశువు చచ్చి పుడతాడు. అదీ తప్పించుకుని జీవంతో జన్మించినా- బిడ్డకు ఆకృతి సరిగా వుండదు. ముక్కు చప్పిడిగా వుంటుంది. వంటినిండా పొడలుంటాయి. శరీరంలో యింకా అనేక వంకర్లుంటాయి. చూడగానే "సిఫిలిస్ చైల్డురా" అంటారంతా గుర్తుపట్టి. ఆ పిల్లాడైనా ఏడాదికంటే ఎక్కువ జీవించడు. ఒకవేళ అదీ తప్పించుకుని ఆరోగ్యంగా పుట్టినా ఏడాదిలోపల చనిపోవటం తప్పదు.
    ఇవన్నీ చదివాడతను. తనలో వ్యాధి వుందా? అంతరించి పోయిందా? అతనికి తెలియదు. ఇప్పుడు రక్తపరీక్ష చేయించుకోవటం అసలు యిష్టంలేదు. మరి...! ఈ సంగతి బయటపడి, మాలతికి తెలిస్తే ఆమె తనను క్షమిస్తుందా?తమ కాపురం నిలబడుతుందా?
    "వీడు అష్టావక్రుడేకాదు, నీచుడుకూడాను" అని చీదరించుకోదూ!
    ఆమెకు నెలలు నిండుతున్నకొద్దీ అతని దిగులెక్కువైపోతోంది. కృశించి పోతున్నాడు. నిద్రలో పీడకలలు వస్తున్నాయి. తనకు వికృతాకారుడు పుట్టినట్లూ, వాడిని చూసి మాలతి కెవ్వుమని అరిచినట్లూ...!
    "నిజం చెప్పండి, ఎందుకలా దిగులుపడుతున్నారు?" అనడిగింది మాలతి ఒకరాత్రి భోజనాలు చేస్తుండగా.
    "దిగులా? లేదే!" అన్నాడతను బలవంతాన నవ్వి.
    "ఉహుఁ! అబద్దమాడుతున్నారు. నాకు చెప్పండి. చేతనైతే తీరుస్తాను."
    "లేదు మాలతీ! నువ్వు ప్రక్కనుండగా దిగులెందుకు? ఇలాంటి అదృష్టం నన్నావరించటమే అపూర్వం. నా దిగుళ్ళన్నీ నీ సన్నిహితత్వంతో పటాపంచలయినాయి."
    "మరి అలా కనిపిస్తున్నారేం?"
    "నీకు తెలియదా మాలతీ! నా వైఖరి అంతే!"
    కాని ఆమె తృప్తిపడినట్లు కనిపించలేదు.   
    రాత్రి అతని ప్రక్కకు జరిగి దగ్గరకు లాక్కుని జుట్టు నిమురుతూ "నేను మిమ్మల్ని సరిగ్గా చూడటంలేదా? ఏమయినా కష్టపెడుతున్నానా?" అంది ఆర్ద్రస్వరంతో.
    ఈ సౌజన్యానికి అతను కరిగిపోయాడు. అతని హృదయం చలించింది. "లేదు మాలతీ! అలా మాట్లాడకు. నువ్వలా అంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు దేవతవు. దేముడిచ్చిన వరానివి. నన్నెంతో దయగా చూస్తున్నావు. నవజీవనం ప్రసాదించావు. నువ్వు గొప్పదానివి. కరుణామూర్తివి" అన్నాడు గద్గదస్వరంతో ఆమె వక్షస్థలంలో తలదాచుకుంటూ.
    "అంత పొగడకండి. నాలో అనేక లోపాలున్నాయి. సామాన్య మానవురాల్నే."
    "కాదు, కాదు. నాకలా అనిపించటంలేదు. నువ్వు నా వెలుగురేఖవి."
    కొంచెం ఆగి మాలతి "నేను ప్రెగ్నెంట్ అవటం మీకిష్టంలేదా?" అని అడిగింది.
    "ఎందుకొచ్చింది నీకా అనుమానం? చాలా యిష్టం."
    "ఇష్టం లేకపోతే చెప్పండి. మందో మాకో మ్రింగుతాను."
    "అలా అనకు మాలతీ! చాలా గర్వంగా, సంతోషంగా వుంది నాకు."
    "మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?"
    అతని గర్వం పులకరించింది. సినిమాల్లో విన్న సంభాషణలు, పుస్తకాల్లో చదివిన సంభాషణ, ఇలాంటి మధుర ప్రసంగానికి తనుకూడా నోచుకున్నాడన్న మాట.
    "అమ్మాయే" అతని గొంతులో అసహజత, అపస్వరం ధ్వనించాయి.
    "అమ్మాయా? ఎందుకు?"
    "ఏమో, సరిగ్గా చెప్పలేను. నాకు అబ్బాయిలని చూస్తే భయమనుకుంటా! స్త్రీలలోని దయాగుణంమీద నాకు మక్కువ."
    "ఎందుకండీ ఆడజన్మ? ఒకదశలో ఆ గుణాలన్నీ పోయి ఎండమావిలా తయారౌతుంది" అంది మాలతి విరక్తిగాయా.
    అతనేం జవాబు చెప్పలేదు. ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది.
                     *    *    *

 Previous Page Next Page