బోలెడంత ధైర్యం వచ్చేసింది. అమ్మపాట చిత్రంగా ఆకలినీ మరిపించింది చీకటిలో తడుముకుంటూ పైకిలేచాడు. పేంటు తడయ్యేట్టుంది. లైటు వెలిగితేగాని బాత్ రూమ్ కి వెళ్ళలేడు. రెండు మూడుసార్లు బద్దకించి మంచాన్ని తడిపేస్తే అమ్మ ఎంత కోపగించుకుందని!
"ఛీ జడ్డివెధవా" అంది ఓ రోజు.
మరోసారి చేస్తే "కంపువెధవా... పరుపంతా కంపుకంపు" అని తిట్టింది.
ఆ తర్వాత మళ్ళీ 'వాకిటికి' వస్తే అమ్మని లేపేవాడు.
నెమ్మదిగా గోడని చేరుకుని స్విచ్ కోసం తడుముతూ టక్కున ఆగిపోయాడు.
పక్కగదిలోనుంచి ఏవోమాటలు వినిపిస్తున్నాయి నెమ్మదిగా.
ఉత్సుకతను ఆపుకోలేక కిటికీరెక్కని వారగా తెరచి అక్కడి దృశ్యాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు.
అప్పారావు మరో స్త్రీని పెనవేసుకుని బెడ్ పై దొర్లుతున్నాడు.
అదేంటో తెలీదు.
కాని జుగుప్సగా అనిపించడంతో వెనక్కి జరిగాడు.
లయబద్ధంగా వినిపిస్తున్న బెడ్ చప్పుడుతోపాటు తనకు కామేశ్వరిని కానుకగా పంపిన విశాఖ జిల్లాపరిషత్ చైర్మన్ రంగరాజుని మనసులోనే అభినందించేస్తున్నాడు అప్పారావు.
ఇప్పుడు ఆ యావలో పడిన అప్పారావుకి గనికొండ గొడవలు గుర్తుకురావడంలేదు.
కొన్నిరోజులపాటు ప్రజల కళ్ళబడకూడదని ఓ మూల గదిలో దాచిన నానీని గురించిన ఆలోచనలు లేవు.
అంతా అఖండ రాజకీయ సచ్చిదానందం.
అప్పుడు చూశాడు నానీ.
తను నిలబడ్డ చీకటిగది కిటికీ తెరుచుకొంటూ ఓ ఆకారం లోపలికి దూకింది.
భయంగా కళ్ళు చిట్లించాడు.
కెవ్వుమంటూ కేక వేయబోయాడు కాని అప్పటికే ఆలస్యమైంది.
గదిలోకి వస్తున్న మసక వెలుతురులో ఓ మూల నిలబడ్డ నానీ నోటిని చేత్తో బలంగా నొక్కిన ఆగంతకుడు "భయపడకు! నిన్ను రక్షించాలనే వచ్చాను" అన్నాడు నెమ్మదిగా.
వచ్చింది రాజారావు కాదని తెలిసిపోయిన నానీ ఇక అల్లరిపెట్టలేదు స్పష్టంగా కనిపించని ఆ వ్యక్తి ఎవరై వుంటారా అని విస్మయంగా చూస్తున్నాడు.
ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో ప్రమాదభూయిష్టమైన పరిస్థితులకు అలవాటుపడిన రాందేవ్ చాలా రిస్కు తీసుకుని కాంపౌండ్ వాల్ దాటి నానీ గదికి చేరుకున్నాడు.
నానిచేత నిజం కక్కించాలని, మరుగుపడిన ఆ నిజాన్ని తన 'నిజం' పత్రికలద్వారా ప్రజలకి తెలియపరచాలని మాత్రమే అంతవరకూ అనుకున్నది.
కాని కిటికీలోనుంచి మరో దృశ్యం కనపడగానే మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. వచ్చింది ఒకందుకైనా అలవాటుగా తను కెమెరాని తీసుకురావటంతో అదెంత ఉపయుక్తమైందీ ఉత్సాహంగా అనుకుంటూనే కిటికీకి అభిముఖంగా నడిచాడు.
ఈ ఒక్క సన్నివేశాన్ని పత్రికలో ప్రచురిస్తే చాలు. అది అనూహ్యమైన సంచలనానికి దారితీస్తుంది. దీనితో అప్పారావులాంటి ఓ అవినీతిపరుడికి పదవిపోవచ్చు. లేదా రాజకీయ యంత్రాంగమే కుప్పకూలిపోవచ్చు.
ఏదిఏమైనా కొన్ని నెలలపాటు ప్రజలు విడ్డూరంగా చర్చించుకునే న్యూస్ అవుతుంది. అంతకుమించి తన పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుంది.
ఫ్లాష్ మెరిసింది చీకటి గదిలోనుంచి.
ముందు అర్థంకాలేదు గదిలోని అప్పారావు, కామేశ్వరీలకి...
మరో ఫ్లాష్...
శృంగారంలో పరాకాష్టని చేరుకున్న ఇద్దరికీ అప్పటికి ఏదో జరగకూడనిది జరగుతూందని అనిపించినా ఆ మూడ్ లో వెంటనే తప్పుకోలేకపోయారు.
ఇంకోసారి కెమెరా ఫ్లాష్ వెలిగింది.
అప్పారావు ఒక్క ఉదుటున బెడ్ పైనుంచి లేచాడు.
ఇక ఆలస్యం చేయలేదు రాందేవ్.
ప్రమాదం చాలా వేగంగా ముంచుకొస్తూందని గ్రహించడంతో నానీని పైకెత్తుకుని ద్వారం తెరిచి బయటకు పరుగెత్తాడు.
అప్పటికే అప్పారావు కారిడార్ లోకి వచ్చాడు.
రెప్పపాటులో గెస్టుహౌస్ ఆవరణలో లైట్లు వెలిగాయి.
పి.ఎ.కోసం కేకపెట్టాడు కాని ప్రయోజనం లేకపోవడంతో తనే కాంపౌండ్ వాల్ దాకా వెంటపడ్డాడు. కాని ప్రయోజనం లేకపోయింది.
వచ్చింది ఎవరో గుర్తుపట్టిన అప్పారావు నుదుట ముచ్చెమటలు పోశాయి.
తన రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర సమాధి కాబోయే చివరిక్షణం ఆసన్నమైనట్లు అర్థంకాగా వేగంగా వెనక్కి పరుగెత్తుకొచ్చాడు.
"వాడు..." కామేశ్వరి అరిచింది. "నానీ... మా వూరోడే... ఆ యశస్విని ట్రాన్స్ ఫర్ చేయించమన్నది ఈ పిల్లడి..." రొప్పుతూ టెలిగ్రాఫిక్ కోడ్ లో చెప్పింది గడగడా.
జంటగా ఇద్దరూ ఇరుక్కుపోయామని అర్థమైన అప్పారావు ఇప్పుడు ఈ కాకతాళీయం గురించి బేరీజు వేసుకుంటూ నిలబడలేదు.
ఈ నిప్పురవ్వలు దావానలం కాకముందే అర్పేయాలనుకున్నాడు.
ఫోన్ రిసీవర్ని అందుకొని తొట్రుపాటుతో ఎక్కడికో ఫోన్ చేశాడు. "నేనే అప్పారావుని. రాందేవ్ గాడు తెలుసుగా. వాడు... నేను మరోగుంటతో వుండగా ఫోటోలు తీసి పారిపోయాడు. వాడితో నానీ అని మరో పిల్లాడున్నాడు. ఇద్దరూ కడతేరిపోవాలి. ఆ తర్వాత ఏం చేయాల్సిందీ చెబుతాను. ముందు వాళ్ళని ఫినిష్ చెయ్... ఆ! వెంటనే..."
ఇక్కడ అప్పారావు కంగారుపడుతుండగా మోటార్ బైక్ స్టార్ట్ చేసి రాందేవ్ నానీని వెనుక కూర్చోబెట్టుకుని టౌన్ వేపు దూసుకుపోతున్నాడు.
సరిగ్గా అదే సమయంలో వెనక ఓ టాక్సీ కదిలింది.
క్షణం క్షణం తన చేతుల్నుంచి తప్పించుకుంటున్న నానీని ఎలాగన్నా కడతేర్చిగాని ఇంటిముఖం పట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్న రాజారావు కొన్నిగంటల క్రితమే ఓ టాక్సీ అద్దెకు తీసుకుని గెస్ట్ హౌస్ కి సమీపంలో కాపువేశాడు తన యిద్దరు అనుచరులతో.