మహావీర్ ప్రెస్ కి పంపడానికి ఆర్టికల్ తయారుచేసాడు. జర్నలిజం కూడా ఒక ఆర్ట్. క్లుప్తంగా ప్రధానమైన అంశాలన్నీ కవరయ్యే లాగ, ఆసక్తి కలిగించేలాగ ఉండాలి. వ్యాసమే అయినా కధనం కథా ధోరణిలో సాగాలి. ఈ కళలో మహావీర్ మంచి నిపుణుడు. అందుకే అతని వ్యాసాలకి పత్రికా ప్రపంచంలో గిరాకీ యెక్కువ.
"ఆంధ్ర రాజధానీ నగరంలో కుసాలుగుడా ప్రాంతంలో విసిరేసినట్లుగా వున్న ఒక బంగళా. ఆ బంగళాలో కొన్ని చీకటి గదులు. ఆ గదుల్లోంచి ఏవేవో దీనంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి...." అలా మొదలుపెట్టాడు వ్యాసం. కలం చకచక పరుగులు తీసింది. కావలసిన ఫోటోలన్నీ ఎక్కడెక్కడ ఏది ప్రచురించాలో మార్కు చేసి వ్యాసంతో పాటు క్లిప్ చేసి సంతృప్తిగా చూసుకున్నాడు. వీధి తలుపు దగ్గిర ఏదో సవ్వడైనట్లు తోచింది. ఇలాంటి విషయంలో అతడు చాలా అలర్టుగా వుంటాడు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులికేమాత్రం భద్రతలేదు. జర్నలిస్టుల భార్యల్ని రేప్ చెయ్యడాలు, జర్నలిస్టుల్ని హత్యలు చెయ్యడాలు, చిత్రహింసలు పెట్టడాలు- ఏదో ఒక నేరం ఆరోపించి జైల్లో పెట్టడాలు సర్వసాధారణమైపోయింది. ఇటీవల ఫోటోలు తీయడానికొచ్చిన జర్నలిస్టుల్ని భాద్యత గల ఉద్యోగస్థులు చావ చితకబాది వదిలిపెట్టారట. అంచేత ప్రతీక్షణం తన జాగ్రత్తలో తనుండడం అలవాటు చేసుకున్నాడు మహావీర్. పైగా ఎవరికీ దొరకని రహస్యాలు సేకరించిన సెన్సేషనల్ వార్తలు ప్రచురించడంలో పేరుపొందాడు కాబట్టి చాలా మందికి అతని మీద గుఱ్ఱుగా వుంది. జర్నలిజం కూడా ఒక వ్యసనమేనేమో? ఒకసారి ఈ రంగంలోకి దిగాక ప్రాణాలని కూడా లక్ష్యపెట్టకుండా విషయాలని సేకరించాలనిపిస్తుంది.
లేచి ఫ్రెంట్ డోర్ వెనక పక్కకి నిలబడి వ్యూ మిర్రర్ లోంచి చూసాడు ముగ్గురు మనుష్యులు స్క్రూడైవర్లతో కీ హామ్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుమీద పార్క్ చేసిన కారు ముందు రాజభూషణం నిలబడి బోనెట్ ఎత్తి పట్టుకుని ఏదో రిపేర్ చేస్తునట్లు నటిస్తున్నాడు. జరుగుతున్నదేమిటో క్షణంలో గ్రహించాడు మహావీర్. ప్లెమింగ్ లేబ్ లో జరిగిందేమిటో రాజభూషణానికి తెలిసిపోయుంటుంది. సహజంగానే అతడు విషయం ప్రెస్ కెళ్ళకుండా జాగ్రత్త పడడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. తరువాత మృదులని అటాక్ చేసినా ఆశ్చర్యపడఖ్కరలేదు. ఇప్పటికే ఆ ప్రయత్నంలో వున్నాడేమో? ఏం చెయ్యాలో ఆలోచించాడు మహావీర్. పోన్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యొచ్చు కాని ప్రజాస్వామ్య పోలీసు స్టేషన్ నుంచి పోలీసు అధికారులోచ్చి ఆదుకొనేసరికి అణ్యకాలం మించిపోతుంది. అది తక్షణ కర్తవ్యం కాదు. మొదట అక్కణ్నుంచి బయటపడాలి. మహావీర్ ఆలోచనలో ఉండగానే బయట తలుపు లాక్ విరిగిన చప్పుడు వినిపించింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా మెట్లవేపు పరుగెత్తాడు మహావీర్. ఇలాంటి సందర్భాలలో ఎలా తప్పించుకోవాలో అతడు ముందుగానే ఆలోచించుకున్నాడు. మెట్లుమీదుగా డాబాపైకి యెక్కేసాడు. అవి హౌసింగ్ బోర్డు ఇళ్ళు. కింద కొంచెం కాంపౌండ్ వొదిలినా పైన టెర్రేస్ లు మాత్రం ఒకదానికొకటి ఆనుకునుంటాయి. పిట్టగోడమాత్రమే వేరుచేస్తుంది వాటిని. పిట్టగోడ దాటుకుంటూ ఒక టెర్రెస్ మీంచి మరొక టెర్రస్ మీదికి చేరుకుంటూ సందు చివరికి వెళ్ళిపోయాడు. చివరి ఇంట్లోంచి మెట్లమీదుగానే క్రిందకు దిగి దొడ్డి తలుపు తీసుకుని బయటపడ్డాడు. కొంచెం నడిచి ఇంటిగోడ వెనక నిలబడి దూరంగా వున్న తన ఇంటివేపు చూసాడు. కారుబోనెట్ ముందు రాజభూషణం లేడు. తలుపులు తెరుచుకున్నాయన్నమాట. వాళ్ళంతా లోపలికి ప్రవేశించి ఉంటారు. తను సరిగ్గా సమయానికి తప్పుకున్నాడన్న మాట. వ్యాసం రాసిన కవరు. పోటోలు తనతో తెచ్చుకోనందుకు కొంచెం నొచ్చుకున్నాడు. ఫరవాలేదు. ఇంకో సెట్ పోటోస్, నెగిటివ్ స్ సౌగంధి దగ్గరున్నాయి. ఎటొచ్చి ప్రచురణ కాస్త ఆలస్యమౌతుంది. మృదుల సోమనాధ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ ఆఫీసుకు రాగానే లాయర్ యశోధరాదేవిగారికి ఫోన్ చేయించాలి. మరో సందులోంచి కొంతదూరం నడిచి ఆటో ఎంగేజ్ చేసుకుని సోమనాధ్ డిటెక్టివ్ ఏజన్సీస్ ఎడ్రసు చెప్పాడు మహావీర్.
* * *
లాకప్ రూమ్ లో ప్లెమింగ్ చేత నిజం కక్కించడానికి పోలీసులు పెద్దగా శ్రమపడవలసిన అవసరం లేకపోయింది. అమెరికన్ జైల్లో అతనికి బాగా బ్రయిన్ వాష్ అయిపోయింది. తన ప్రయోగాలు కొనసాగించే సమయంలోనే అతడు జర్మనీలోనే "కైసర్ విల్ హెల్మ్ ఇన్ స్టిట్యూట్" లో "కెమిస్ట్రీ ఆప్ బ్రైన్" గురించి స్టడీ చెయ్యడానికి వెళ్ళాడు. రహస్యంగా సాగే అతని ప్రయోగాలు- జర్మనీకి రాకపోకలు ఇవన్నీ అమెరికన్ సి.ఐ.బి.కి అనుమానం కలిగించాయి. సడన్ గా అతని లేబ్ మీద రైడ్ చేసారు. విషయం బయటపడిందికాని అతను చేస్తున్న ప్రయోగాలు దేనికోసమో అర్ధంకాలేదు. అరెస్ట్ చేసి మానసికంగాను, శారీరకంగానూ చిత్రహింసలు పెట్టి ఆధునిక పద్ధతులన్నీ ఉపయోగించి బ్రైన్ వాష్ చేసి నిజం కక్కించడానికి ప్రయత్నించారు. చివరికి అతడు చేస్తున్న ప్రయోగాలు అమానుషమైనవైనా అతడికి రాజకీయాలతో సంబంధం లేదని నిర్ధారించుకుని, డాక్టర్ డిగ్రీ రద్దుచేసి, ఇహ ముందు ఎలాంటి ప్రయోగాలు చెయ్యడానికి వీల్లేదని ఆంక్ష విధించి, పైన్ వేసి వొదిలేసారు. అతడు విడుదల కావడానికి దేవకి ప్రమేయం చాలా వుంది.
ప్లెమింగ్ కి తన ప్రయోగాలు కొనసాగించుకోవాలనే కుతూహలం ఎంత వున్నా- జైల్లో పొందిన భయంకర అనుభవాల కారణంగా పోలీసులు కంటపడగానే బ్రేక్ డౌన్ అయిపోతున్నాడు. పోలీసుల లాఠీ దెబ్బలు వొంటిమీద పడగానే జరిగిందంతా చెప్పేసాడు.
అమెరికాలో తన ప్రయోగాలు కొనసాగించడానికి ఏమాత్రం అవకాశం లేని ప్లెమింగ్ ఎలాగైనా ఇండియాకొచ్చి తన ప్రయోగాలు కొనసాగించాలని ఆశపడ్డాడు. దేవకి రాజభూషణాన్ని కలుసుకుని ఓడంబడిక కుదుర్చుకుంది. దేవకీ ప్లెమింగ్ లు ఇండియాకి రావడానికి అక్కడ ప్రయోగాలు కొనసాగించడానికి ఏర్పాట్లన్నీ రాజభూషణం చేసేటట్లు- ప్లెమింగ్ తను కనిపెట్టిన దీర్ఘకాలిక జీవితాన్ని ప్రసాదించే ముందు ఫార్ములా రాజభూషణానికే అమ్మేటట్లు, అలా దేవకి, ప్లెమింగ్ లు ఇండియాకి వచ్చారు. అమానుషమైన తన ప్రయోగాలు ఇండియాలో ప్రారంభించాడు ప్లెమింగ్. ఆడపిల్లలను వొద్దనుకొనే తల్లుల దృక్పధమూ, అందుకు కారణమైన ఏనాటికీ మారని వరకట్న సమస్య అతడి ప్రయోగాలకి బలాన్నిచ్చాయి. గర్భంలో వున్న శిశువు ఆడో-మగో తెలుసుకోవాలనుకొనే అమాయక స్త్రీలను మోసగించి తన ప్రయోగాలు సాగిస్తున్నాడు ప్లెమింగ్. ఈ ప్రయత్నంలో తల్లుల ప్రాణాలు కాపాడ్డానికి కావలసిన సాధన సామాగ్రి ప్లెమింగ్ దగ్గరలేదు. సమకూర్చుకోవడానికి డబ్బూ లేదు. ప్లెమింగ్ ప్రయోగాలు ఎంతవరకూ సఫలమవుతాయో రాజభూషణం అంచనా వేయలేకపోతున్నాడు. అంచేత ప్లెమింగ్ కోరినప్పుడల్లా డబ్బీయడంలేదు. పదిసార్లు లెఖ్కలడిగి వివరాలు తెలుసుకుని అడిగిందానిలో సగమో- నాల్గోవంతో ఇస్తాడు. దేవకి తన కేబరే డాన్స్ లతో సంపాదించేదే అతనికి ప్రధానమయిన ఆధారం.
ఇండియాకొచ్చాక దేవకి దృక్పధంలో చాలా మార్పు వచ్చింది. ఫారిన్ డాక్టరనే వ్యామోహంతో పెళ్ళి చేసుకున్న ప్లెమింగ్ మీది వ్యామోహం చాలావరకు తగ్గిపోయింది. జైలు నుంచి వచ్చిన ప్లెమింగ్ జైలుకెళ్ళడానికి ముందున్న ప్లెమింగ్ కాదు. జీవి చిత్రమైన మృగంలాగ మారిపోయాడు. అలాంటి మృగంతో కలిసి జీవించడం దుర్భరంగా తయారైంది. దానికితోడు లాయర్ యశోధరాదేవి- మృదుల- భాగవతార్- వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, "ఎలాంటి జీవితం వదులుకుని ఎలాంటి ఊబిలోకి వచ్చి పడ్డానా. అనే ఆలోచనతో ఆమె మనసు విలవిల్లాడిపోయేది. దానికితోడు నిద్దరలోనూ మెలకువలోనూ వినిపించే సాటి స్త్రీల ఆర్తనాదాలు ఆమెను రోజురోజుకి పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఇన్ని కారణాలవల్ల దేవకి ఒత్తిడి లేకుండానే నిజం వొప్పేసుకుంది. ప్లెమింగ్ రాజభూషణానికి తెలియబరుస్తే తమను బెయిల్ మీద విడిపిస్తాడని చెప్పాడు. పోలీసాఫీసర్ రాజభూషణానికి ఫోన్ చేశాడు. అతడు వీళ్ళ విషయం తనకేమీ తెలియదని, డాన్సర్ గా దేవకితో మామూలు పరిచయమేనని- దేవకి భర్తగా మాత్రమే ప్లెమింగ్ తెలుసునని సమాధానం చెప్పాడు. లాకప్ రూమ్ లో ప్లెమింగ్ భయంతో గొడ్డులలా అరిచాడు. దేవకిమాత్రం అలసటగా కళ్ళు మూసుకొని కటికనేలమీద పడుకుంది.
* * *
మూతలు పడుతోన్న కళ్ళని అతి ప్రయత్నంమీద తెరిచింది మృదుల. కొన్ని క్షణాలు తనెక్కడుందో.... ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. చుట్టూ చూసింది. సరికొత్త పరిసరాలు. రోజ్ వుడ్ కాట్ మీద మెత్తని యు-పోమ్ బెడ్ పైన పడుకునుంది. చేతులూ కాళ్ళూ ఏదో తాడుతో కట్టేసి వున్నాయి. తల విదిలించుకుని ఆలోచించడానికి ప్రయత్నించింది. టాక్సీలో ఎక్కడం- డ్రైవర్ ఏదో చెప్పబోతున్నట్లు వెనక్కి తిరిగి రుమాలు తనకి వాసన చూపించడం గుర్తొచ్చింది. ఆ సమయంలో ప్లెమింగ్ లేబ్ గురించి- స్త్రీ శిశుహత్యల గురించి ఆలోచనల్లో వుండటం వల్ల జరుగుతున్నదాన్ని ముందుగానే గ్రహించి ఎదుర్కోలేకపోయింది. జూన్ 14 "ఇండియాటుడే" మేగజైన్ లో తమిళనాడులోని ఉసిలిమ్ పట్టి తాలూకా కల్లార్ జాతులలో జరుగుతున్న స్త్రీ శిశు హత్యల గురించి వివరంగా వ్యాసం రాసారు. కట్నాలిచ్చుకోలేకనే తాము కన్న శిశువులను తామే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నామని ఆ తల్లులు చెప్పారట.