Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 35


    ఆ హడావుడిలో వెనుకనుంచి వస్తున్న లారీని చూసుకోలేదు.

    అదే వేగంతో వచ్చి లారీ వాడిని కొట్టుకుంది. అడ్డు పెట్టుకోవడానికి కూడా వీల్లేకుండా చేతులు కట్టేసి వున్నాయి. వాడి శరీరం గాలిలో ఎగిరి అంత దూరాన పడింది.

    అంతా క్షణాల్లో జరిగింది.

    విహారి, ప్రవల్లికలు చలనంలేని ప్రేక్షకులే అయ్యారు.

    రోడ్డు కవతల ప్రక్క రక్తపు ముద్దలా పడి వున్నాడు టెర్రరిస్టు. ప్రాణం పోలేదు కానీ తల పచ్చడైంది.


                                                      *    *    *


    అనంతానంతస్వామి ఉగ్రుడయ్యాడు. జరిగింది జరిగినట్టు అతడికి తెలిసిపోయింది. ఒకడు చచ్చిపోయాడు. రెండోవాడు చావు బ్రతుకుల మధ్య వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాడు. వాడు అప్రూవర్ గా మారితే కష్టం. వాడికి చాలా రహస్యాలు తెలుసు.

    "బ్రతుకుతాడా?" అని అడిగాడు స్వామి.

    "చాలా మేజర్ ఆపరేషన్ స్వామీ. డాక్టర్ దయానంత కృష్ణమూర్తి చేస్తున్నారు. అతనే సూపర్ స్పెషలిస్ట్... ఈ నగరంలో కెల్లా గొప్ప న్యూరో సర్జన్" అతడి మాటలు ఇంకా పూర్తికాలేదు. వాటిని మధ్యలో ఆపుచేస్తూ - "A-5 నోరు విప్పకూడదు" క్లుప్తంగా అన్నాడు స్వామి. పరమేశ్వరం తలవూపి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.


                                                       *    *    *


    "అతను ఎలాగైనా బ్రతకాలి అంకుల్" అన్నాడు విహారి. డాక్టర్ కృష్ణమూర్తి మొహం కడుక్కుంటున్నాడు. పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళారు అని ఫోన్ వచ్చింది.

    "అతడు బ్రతికితే ఒక అంతర్జాతీయ ముఠా బయటపడుతుంది" అంది ప్రవల్లిక.

    కృష్ణమూర్తి కళ్ళజోడు పెట్టుకున్నాడు.

    "ఏం చేసైనాసరే, అతడు మాట్లాడగలిగేట్టు చేయాలి. అతడికి మీరు ప్రాణం పోయాలి అంకుల్-"

    వెళ్ళబోతున్న డాక్టర్ అడిగాడు. "డాక్టర్లకి ఒకరు ముఖ్యం-ఇంకొకరు కాదు అని లేదు. ప్రమాదంలో వున్న ప్రతివాడికీ ఒకేలా ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు క్లుప్తంగా.

    విహారి ఏదో మాట్లాడబోతుంటే పద్మాకర్ 'వద్దు' అన్నట్టు సైగ చేశాడు. తండ్రి విషయం పద్మాకర్ కి బాగా తెలుసు. అంతలో ఫోన్ మ్రోగింది.

    "డాక్టర్ కృష్ణమూర్తి హియర్-" అన్నాడు రిసీవరు ఎత్తి.

    "డాక్టర్! ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయడంకోసం హాస్పిటల్ కు వెళ్ళబోతున్నారు కదూ!"

    "అవును!"

    "ఆ పేషెంట్ బ్రతక్కూడదు."

    "నాన్సెన్స్. మీరెవరు?"

    "ఆ పేషెంట్ బ్రతికితే నష్టపోయేవాళ్ళం" ఫోన్ కట్ అయింది.

    దాని గురించి పట్టించుకోనట్టు కృష్ణమూర్తి వెళ్ళి కారు ఎక్కాడు. ఆరుగంటలపాటు జరిగే ఆపరేషన్ అని, విహారి ప్రవల్లికలు వుండనవసరం లేదని చెప్పాడు డాక్టర్. పద్మాకర్ దగ్గర శలవు తీసుకుని విహారి ఇంటికి బయల్దేరాడు. అతడి మూడ్ సరీగ్గా లేదు. టెర్రరిస్టు బ్రతకాలి. బ్రతికితే అంతకన్నా కావాల్సింది లేదు.

    ....డాక్టర్ కృష్ణమూర్తి కారు ఆస్పత్రి మెట్లముందు ఆగింది. లోపలికి పొడవాటి వరండా... డ్రైవర్ డోరుతీసి పట్టుకున్నాడు. డాక్టర్ లోపలికి వెళ్ళబోతుంటే రిసెప్షనిస్టు, "సార్. మీకు ఫోన్" అంటూ అందించింది నమ్రతగా.

    "మీరీ ఆపరేషన్ పూర్తిచేస్తే, మీరూహించని నష్టాన్ని ఎదుర్కొనవలసివస్తుంది డాక్టర్. తర్వాత చింతించి లాభంలేదు" అట్నుంచి వినబడింది.

    "మీరెవరు?" సరిగ్గా రిసెప్షన్ దగ్గర కొచ్చేసరికి అందేటట్టు ఫోన్ చేసిన వారి కాలిక్యులేషన్ కి అబ్బురపడుతూ అడిగాడు.

    "మాక్కావలసిన పని చేయించుకోవడం కోసం కావాలంటే లక్షల కొద్దీ డబ్బుని, లక్షలమంది రక్తాన్ని వెదజల్లగలవాళ్ళం. మీకేది కావాలో నిర్ణయించుకోండి."

    "మా ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ లో రక్తం లేదు. మీరొచ్చి వెదజల్లితే సంతోషమే."

    "ఎగతాళి వద్దు డాక్టర్, చింతిస్తారు."

    "నా ప్రాణాలు ధారపోసైనా ఆ పేషెంట్ ని రక్షిస్తాను."

    "అటువంటి పక్షంలో ప్రాణంకన్నా విలువైనది వదులుకోవలసి వస్తుంది-" కృష్ణమూర్తి విసురుగా ఫోన్ పెట్టేశాడు.

    ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి విహారి తన ఇంటిలోకి ప్రవేశించాడు. కృష్ణమూర్తి ఆపరేషన్ థియేటర్ ముందున్న గదిలో గ్లవ్స్ తొడుక్కున్నాడు. ధియేటర్ ముందు ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నట్టు రెడ్ లైట్ వెలిగింది. ఆయన ధియేటర్ లోకి ప్రవేశించబోతుంటే నర్స్ ఫోన్ తీసుకొచ్చింది. "అర్జెంట్ అట సర్" అంటూ.

    ఆయన విసుగ్గా ఫోన్ తీసుకున్నాడు.

    "ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను. అయిదు నిమిషాల్లో పేషెంట్ చనిపోయినట్టు వార్త బయటకు రాకపోతే మీ కొడుకు పద్మాకర్ శవాన్ని అదే టేబుల్ మీద పోస్టుమార్టమ్ చేస్తారు మీ డాక్టర్లు."

    "షటప్" అని నర్స్ వైపు తిరిగి, "ఆపరేషన్ ధియేటర్ లోకి కూడా ఫోన్ లు తీసుకొచ్చి ఇచ్చే సంస్కృతిని మీరిప్పటినుంచీ నేర్చుకుంటున్నారు?" అడిగాడు.

    ఆమె వణికిపోతూ "సారీ డాక్టర్" అంది.

    ఆయన చేయి సాచేడు.

    అనెప్తటీస్టు 'రెడీ' అన్నట్టు తలూపాడు.

    ఆపరేషన్ ప్రారంభమైంది.


                                                  *    *    *


    "ఆఖరుసారి హెచ్చరిస్తున్నాను. అయిదు నిముషాల్లో పేషెంటు చనిపోయినట్టు వార్త బయటకు రాకపోతే మీ కొడుకు పద్మాకర్ శవాన్ని అదే టేబుల్ మీద పోస్టుమార్టం చేస్తారు మీ డాక్టర్లు-" అని ఫోన్ పెట్టేసి, మరో నెంబర్ కి ఫోన్ చేశాడు పరమేశ్వరం.

    "అయిదు నిముషాల్లో A-5 మరణించినట్టు ఆస్పత్రినుంచి వార్త బయటకు రాకపోతే ఆ డాక్టర్ కొడుకుని..." అంటూ సూచనలు ఇచ్చాడు.

    అట్నుంచి ఏదో ప్రశ్న.

    "అవును. అతని పేరు పద్మాకర్" అంటూ ఫోన్ పెట్టేస్తూ, గుమ్మం దగ్గర నిలబడిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు.

    ఎంతసేపట్నుంచి వున్నాడో తెలీదుగానీ గుమ్మం దగ్గర విహారి వున్నాడు. అతడి మొహం పాలిపోయి దిగ్భ్రమంతో నిండి వుంది... తను విన్న మాటలు నిజమా కాదా నమ్మలేనట్టు అతడి శరీరం కంపిస్తూంది.

    "నా...న్నా..." అన్నాడు వణికే స్వరంతో. "నాన్న" అన్న మాటకి అర్ధమే మారిపోయినట్టుంది ఆ సంబోధన! మొత్తం బోధపడినట్టుంది. సర్వం తెలిసినట్టుంది.

    లాయర్ పరమేశ్వరం! ఢిల్లీ...సుప్రీంకోర్టు... ప్రవల్లిక మాటలు... స్వామి కుడిభుజం... మూలస్థంభం... పరమేశ్వరం....

    తన తండ్రి.

    ఏదో అనబోయి ఆగిపోయాడు. అయిదు నిమిషాలే టైముంది తన స్నేహితుడిని బ్రతికించుకోవడానికి. శుష్క వాదనలకు సమయం లేదు.

    గాలిలా బయటకు దూసుకుపోయాడు. నాలుగు నిమిషాల్లో అతడి వాహనం పద్మాకర్ ఇంటిముందు కీచుమని శబ్దంచేస్తూ ఆగింది. లోపలికి పరుగెత్తాడు, పద్మాకర్ గదిలోకి వెళ్తూంటే నౌఖరు విన్నాడు. "చినబాబుగారు లేరు బాబూ. ఇప్పుడే ఏదో ఫోనొస్తే బయటకు వెళ్ళారు."

    షాక్ తగిలినట్టు అయింది.

    పద్మాకర్ శత్రువులు ట్రాప్ లోకి వెళ్ళిపోయాడు... ఎలా దీన్ని ఆపడం?

    క్షణాలు గడిచేకొద్దీ అతడి మనసులో భయం ఎక్కువవుతోంది. ఎక్కడినుంచి ఫోన్ వచ్చిందో తెలీదు. అతడు ఎటు వెళ్ళాడో తెలీదు. అన్యమనస్కంగా వచ్చి కారులో కూర్చుని, ఒక గమ్యం లేకుండా పోనివ్వసాగాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. చూస్తే ఆస్పత్రి ముందు వున్నాడు.

    పార్కింగ్ ప్లేస్ లో కారాపుచేసి, లోపలికి వెళ్ళాడు.

    లోపల వరండాలో ప్రవల్లిక నిలబడి థియేటర్ లోనుంచి రాబోయే వార్తకోసం ఎదురు చూస్తుంది. ఆపరేషన్ ప్రారంభమై అప్పటికే మూడు గంటలు అయివుంటుంది. ఆమె కళ్ళు చుట్టూ పరిసరాల్ని పరిశీలిస్తున్నాయి. ఒక ముఖ్య సాక్ష్యాధారం లోపల వుందని శత్రువులకు తెలుసు. వాళ్ళప్పుడే డాక్టరుని హెచ్చరించారు. ఆమె ప్రమాదం గ్రహించి వెంటనే ఆస్పత్రికి వచ్చేసింది. డాక్టరు తమ మాట వినలేదని వాళ్ళకు తెలిసిన మరుక్షణం, అప్రూవర్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.

    పోలీసుల సహాయం తీసుకోవడం ఆమె కిష్టంలేదు. విహారి మాటలు ఆమె మనసులో ఇంకా మెదులుతూ వున్నాయి. ఈ సాక్షిని తమ దగ్గిరే వుంచి, స్వామి ఆట కట్టించాలనుకుంటూంది. ఆమె ఆలోచనలలో వుండగానే విహారి లోపలికి వచ్చాడు.

    ఆమె అతడిని చూసి విస్మయంతో "అలా వున్నారేం?" అని అడిగింది.

    అతడు సమాధానం చెప్పకుండా ఆమె ముఖంలోకి చూశాడు. అతడి మనసంతా అదోలాటి కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. అది కృతజ్ఞత కూడా కాదు. దానికన్నా వేరే ఏదో...

    ఈమెకు తన తండ్రి ఎటువంటివాడో తెలుసు. వాళ్ళ జీవితాలకు అతడు ఎంతో ద్రోహం చేశాడు. అయినా తన ఆనందాన్ని పాడుచేయడం ఇష్టంలేక ఆ విషయం చెప్పలేదు. తన తండ్రి గురించి చెడుగా మాట్లాడలేదు...

    .... ఆమె మళ్ళీ ఏదో అడగబోతూ వుండగా ఆపరేషన్ థియేటర్ పైన ఎర్రలైటు ఆరిపోయింది. డాక్టరు దయానంద కృష్ణమూర్తి ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. బయట నిలబడ్డ ఇద్దరివైపు చూసి ఆపరేషన్ సజావుగా జరిగినట్టు తలూపాడు.

    వెనుకే పేషెంటు తాలూకు స్ట్రెచరు ఆపరేషన్ ధియేటర్ లోంచి బయటకు వస్తూంది.


                                                  *    *    *


    "అర్జెంటుగా రమ్మ"ని ఓ అమ్మాయి ఫోన్ చేస్తే పద్మాకర్ హడావుడిగా వచ్చేసేడేగానీ, అతడికి అక్కడెవరూ కనబడలేదు.

    ఎవరో అమ్మాయి.

    తనక్కూడా సునాదమాల లాంటి అమ్మాయెవరయినా ఫోన్ చేసిందేమోనని హడావుడిగా బయల్దేరాడు.

    పార్కు నిర్మానుష్యంగా వుంది. మిట్టమధ్యాహ్నం పన్నెండు కావస్తూంది. తననెవరో ఏడిపించాలనుకుని అతడు తిరిగి బయలుదేరాడు. దూరంగా ఎవరో దసరా వేషంలో పులి డాన్సు చేస్తున్నాడు.

    తనకి ఫోన్ చేసిన అమ్మాయి కంఠాన్ని ఇంతకుముందు ఎప్పుడయినా విన్నానా అని ఆలోచించసాగాడు. ఆలోచన్లతోనే మోటారు సైకిలు వేపు నడవసాగాడు. మరొక పులి వేషగాడు గేటు దగ్గిరున్నాడు.

    విజయదశమి దగ్గిర పడుతుందనుకున్నాడు అంతే తప్ప దగ్గిర పడుతూన్న మృత్యువుని చూసుకోలేదు. ఇద్దరు ముగ్గురయ్యారు. ముగ్గురు నలుగురయ్యారు. వికృతంగా డాన్స్ చేస్తూ దగ్గిర కొచ్చారు. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. అప్పటికే అతడికి అనుమానం రాలేదు. నవ్వుతూ జేబులోంచి పర్సు తీయబోయాడు. వెనుకనుంచి ఎవరో కత్తితో పొడిచారు. మోచేతి దగ్గర చీరుకుపోయింది. ఛివాలున వెనుకకి తిరిగాడు. మళ్ళీ కత్తి ఎత్తాడా వ్యక్తి. పద్మాకర్ వాడిని వెనక్కి తోశాడు. ఈ లోపున పక్కనుంచి ఎవరో డొక్కలో పొడిచారు. రక్తం జివ్వున చిమ్మింది. తూలిపోయాడు.... మరో పోటు.

 Previous Page Next Page