Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 35


    బిత్తరపోయిన దేవకి గభాల్న "కుసాయిగుడాలో" అంది. తప్పతాగి నిషాలో ఉన్న ప్లెమింగ్ డాన్స్ ఫ్లోర్ మీద కురికి దేవకి చెంప చెళ్ళుమనిపించాడు. మత్తులో - నిషాలో జోగుతూన్న ఆ హాల్లో కలవరం చెలరేగింది. కొందరు ప్లెమింగ్ ని, కొందరు భాగవతార్ ని పట్టుకుని అటూ - ఇటూ లాగడం మొదలుపెట్టారు.
    భాగవతార్ ని ఒప్పించి దేవకి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూన్నట్లు మృదుల చెప్పగానే ఆమెలో విశ్వాసం కలిగింది ప్లెమింగ్ కి. ఆమె కూడా తన వలలో పడిపోయినట్లే భావించుకున్నాడు. ఈ విషవలయంలోకి మృదులని ఈడ్వడం దేవకికంత ఇష్టంలేదు కాని ప్లెమింగ్ ఎదుట ఏమీ మాట్లాడలేక పోయింది. దేవకి అసహనం మృదుల కర్ధమైంది. జాలిగా నవ్వుకుంది. మృదుల తల్లిదండ్రులెంత గొప్పవారో- భాగవతార్ ఎంత గొప్పవాడో- తెలుసుకున్నాడు ప్లెమింగ్. మృదుల వచ్చి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాననగానే బంగారుపిచ్చుక వలలో పడుతోందని మురిసిపోయాడు. పార్టీ పేరుతో దేవకి, ప్లెమింగ్ లని సాగనంపి. అప్పుడు మహావీర్ కి ఫోన్ చేసింది మృదుల. ఇద్దరూ, ఇల్లులూ తోచే ఆ ప్రదేశానికొచ్చి కాంపౌండ్ గేట్ దగ్గిర ఘూర్ఖానికొట్టి కాళ్లూ చేతులు కట్టిపడేసి. లోపలికి జొరబడి నడివయసు నర్స్- కమ్ అటెండర్- కమ్- ఆయాని స్పృహ తప్పిపోయేలా చేసి- మంచానికి కట్టేసి, లాబ్ అనబడే లోపలి గదుల్లోకి ప్రవేశించారు. నాంచారమ్మ మామూలు పల్లెటూరి స్త్రీ కాదు. ఆవిడ పేరు నాంచారమ్మ కాదు. కరదీపిక సంఘంలో ఆవిడ ఏక్టి వర్కర్, పేరు సాగంధి, ఆమె స్వయంగా డాక్టరు. అందుకే ఈ పనికి ఆవిడని ఎన్నిక చేసింది లాయర్ యశోధరాదేవి. ఎంతో సాహసంతో ఇందుకు ఒప్పుకుంది డాక్టర్ సాగంధి. ప్లెమింగ్ స్క్రీనింగ్ ఎక్విప్ మెంట్ తో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నప్పుడే స్క్రీన్ మీది గ్రాఫ్ లో "ఎక్స్, వై" క్రోమోజోన్స్ గుర్తించి తన గర్భంలో వున్నది మగపిల్లవాడని తెలుసుకుంది. అయితే ప్లెమింగ్ "మీ గర్భంలో ఉన్నది ఆడపిల్ల. అబార్షన్ చెయ్యమంటారా??" అని అడగ్గానే, గతుక్కుమంది. తన మనసులో భావాలు బయటికి రానీయకుండా బాధగా, అమాయకంగా ముఖంపెట్టి, "సరే" అన్నట్లు తలూపింది. అమాయకంగా ఈ పులి గుహలోకి అడుగుపెట్టిన ఎందరో అమాయకులైన ఆడవాళ్ళను తల్చుకుని- గర్భంలో ఇంకా ఆకారం ఏర్పరచుకోకముందే ఆడపిల్ల ఒద్దనుకునే ఆడవాళ్ళు మానసిక దైన్యావస్థను తలచుకుని సహజంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సాగంధికి. అంచేత ఎక్కువగా నటించవలసిన అవసరం లేకపోయింది. "రెండు రోజుల్లో నీకు అబార్షన్ ఏర్పాటు చేస్తాను. ఏం బాధవుండదు. త్వరలోనే ఇంటికిళ్ళిపోవచ్చు." ధైర్యం చెపుతూన్నట్లు భుజంమీద చెయ్యివేసి తడుతూ చెప్పాడు ప్లెమింగ్ తెల్లగా వున్న ఆ చెయ్యి ఏదో బురదపాములా తోచింది సాగంధికి. జుగుప్సతో శరీరం జలదరించింది.
    అంతకుముందే పార్టీ ఏర్పాట్లన్నీ చేసేసి. ఇన్విటేషన్స్ కూడా పంచేసింది మృదుల. ఈ పార్టీ కారణంగానే అబార్షన్ ఒకరోజు పోస్టుపోన్ చేసుకోవలసి వచ్చింది ప్లెమింగ్.
    ఎగ్జయిట్ మెంట్ తో ఎదురు చూస్తూన్న సాగంధి, మృదుల మహావీర్ లు రాగానే వాళ్ళతో కలిసి గుహలాంటి లేబ్ లోకి ప్రవేశించింది. అక్కడడుగు పెట్టగానే డాక్టర్ సాగంధి కళ్ళు భయంతో - విభ్రాంతితో పెద్దవయ్యాయి. రకరకాల ఇన్ క్యూబేటర్స్ లో వివిధ దశల్లో ఉన్న మానవ గర్భస్థ పిండాలున్నాయి. కొన్ని సజీవంగా కదులుతున్నాయి. కొన్ని కదలిక లేకుండా ఉన్నాయి. శాశ్వతంగా ఆగిపోయి ఉండొచ్చు వాటి కదలిక. ఎంత దారుణం. ఇదా ఇతని ప్రయోగాలు. ఆ గదిలోని టేబిల్ పైన ప్లెమింగ్ రాసుకున్న నోట్చున్న ఫైల్సు ఉన్నాయి. అవి అటూ యిటూ తిరగేసి అతడు చేస్తూన్న ప్రయోగమేమిటో కొంతవరకూ ఊహించగలిగింది సాగంధి. అవన్నీ స్థిమితంగా చదవాలని- అవసరమైతే కోర్టులో సబ్మిట్ చెయ్యాలని మహావీర్ తెచ్చిన బ్రీఫ్ కేస్ లో  సర్దేసింది. తన ప్లాష్ కెమెరాతో ఆ లేబ్ లో అన్ని భాగాలని- ముఖ్యంగా గర్భస్థ పిండాలతో ఉన్న ఇన్ క్యూబేటర్స్ ని ఫోటోలు తీశాడు మహావీర్. పక్కగదిలోంచి దీనంగా కేక వినిపించింది. ఆ గది తలుపులు ఇటువేపునుంచి వేసివున్నాయి. మృదుల, సాగంధి తలుపులు తీసుకుని లోపలికెళ్ళారు. చీకటిగా ఉన్న ఆ గదిలో నల్గురాడవాళ్ళు బెడ్స్ మీద ఉన్నారు. ఇద్దరికి ఒంటిమీద తెలివిలేదు. చావు బతుకుల మధ్య ఉన్నట్లున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా నరకయాతన అనుభవిస్తూ దీనంగా అరుస్తున్నారు.
    గర్భంలో వున్న పిండాలను సజీవంగా తీసే ప్రయత్నంలో ప్లెమింగ్ తల్లి ప్రాణాలను లక్ష్యపెట్టలేదు. అందరికీ మేజర్ ఆపరేషన్ లే చేసాడు. అతి రహస్యంగా ప్రయివేట్ గా నడుపుకుంటూన్న ఆ క్లినిక్ లో అవసరమైనప్పుడు రక్తం ఎక్కించే సదుపాయాలు లేవు. ఆపరేషన్ జరిగిన తరువాత తీసుకోవలసిన పోస్ట్ ఆపరేటివ్ కేర్ - ఇయ్యవలసిన ఏంటీ బయటిక్ ఇంజెక్షన్స్ మొదలైన ఏర్పాట్లయినా సరిగ్గా ఉన్నాయో లేవో తెలియదు. ఇంతకుముందు ఇక్కడికొచ్చిన ఆడవాళ్ళు ఏమయ్యారో? వాళ్ళ విషయం యేం జరిగిందో - మృదులా వాళ్ళ ఊహకందలేదు. అప్పటికి మాత్రం నలుగురు ప్రాణాపాయదశలో ఉన్నారు మహావీర్ - మృదుల క్షణం ఆలస్యం చెయ్యకుండా బెడ్స్ మీదున్న అమ్మాయిలని చేతుల్లో ఎత్తుకెళ్ళి ఎలాగో కారు వెనక సీట్లో ఇద్దర్ని, కింద మరో ఇద్దర్నీ సర్దేసి తీసికెళ్ళి గవర్నమెంటు హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ఈలోగా సాగంధి అవసరమనుకున్న కాగితాలన్నీ బ్రీఫ్ కేస్ లో సర్ది, మరికొన్ని ఫోటోలు తీసింది. మృదులా మహావీర్ లు రాగానే డాక్టర్ సాగంధి "పేషంట్స్ ని హాస్పిటల్ లో చేర్చడంలో ప్రోబ్లమ్స్ ఏమీ రాలేదుకదా!!" అని అడిగింది.
    "జర్నలిస్టుగా నాకు మంచి పేరు వుంది. అక్కడి డాక్టర్స్ లో అయిదారుగురు నాకు బాగా తెలుసు. అంతేకాదు విషయమంతా నేను వాళ్ళకి వివరంగా చెప్పలేదు. వాళ్ళు అబార్షన్ కోసం ప్రయత్నించారని, ఏదో అవకతవక జరిగి వుంటుందని మాత్రమే చెప్పాను.వాళ్ళని మేమే చేర్ఫిస్తున్నట్లుగా, నేను- మృదుల రిజిస్టర్ లో సంతకాలు పెట్టాము. అంచేత పెద్ద గొడవలు లేకుండా అడ్మిట్ చెయ్యగలిగాము. వాళ్ళనెలాగైనా బతికించమని నాకు తెలిసిన డాక్టరుకి చెప్పాను. అందువల్ల అతనికి గొప్పపేరు రావచ్చని ఆశ పెట్టాను. నా మాటల్లో  అతనికి నమ్మకముంది, ప్రయత్నిస్తాడు తప్పకుండా."
    ముగ్గురూ ఆ యింట్లోంచి బయటపడి కారులో బయలుదేరారు. అప్పటికప్పుడు నెగెటివ్స్ డెవలప్ చేసే స్టూడియో దగ్గిర ఆగి పిల్మ్సు డెవలప్ చేయించాడు మహావీర్. ఫోటోలు కాపీలు ఒక సెట్ తన దగ్గిర పెట్టుకుని నెగిటివ్ తో సహా మరొకరెండు సెట్స్ సాగంధికప్పజెప్పాడు.
    "నేనిహ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా యీ వార్త ప్రెస్ కివ్వాలి. రాజభూషణం ఏ మాత్రం అలర్ట్ అయినా ఇదీ సాగనివ్వకపోవచ్చు. మీరిద్దరూ టాక్సీలో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళండి. మృదులగారూ! మీరు డాక్టర్ సాగంధిగార్ని బాంబే ప్లేన్ లో ఎక్కించి సోమనాధ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ దగ్గిరకి రండి. నేను అక్కడుంటాను."  
    టాక్సీని పిలిచి మృదులని, డాక్టర్ సాగంధిని టాక్సీ ఎక్కించి తను ఇంటికి బయలుదేరాడు. మహావీర్ ప్రెస్ కి మేటర్ రెడీ చెయ్యడానికి.
                                                                        *    *    *
    అటూ, ఇటూ రెండు చేతులు పట్టుకుని వెనక్కి లాగుతోన్న జనాన్ని విడిపించుకోడానికి ప్రయత్నించాడు భాగవతార్. అతనికి సాధ్యం కాలేదు. భరించలేక "నన్ను ఒదలండి. నా మృదుల ఆపదలో వుంది. రక్షించుకోవాలి." అని అరిచాడు. ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ఆ హాలు. చూడామణికి తన కాళ్ళకింద నేల కదిలినట్లయింది. రెండంగల్లో భాగవతార్ దగ్గిరకొచ్చి అతనిమీద తనకున్న కోపం మాట పూర్తిగా మర్చిపోయి, అతడి రెండుచేతులూ పట్టుకుని, "భాగవతార్ గారూ!! మృదుల ఆపదలో వుందా? ఎక్కడుంది? ఎలాంటి ఆపద? తొందరగా చెప్పండి. ఎలాగైనా కాపాడుకుంటాం." అంది చెమ్మగిల్లిన కళ్ళతో. భాగవతార్ బిక్కమొహంతో "నాకేం తెలియదు." అన్నాడు. చూడామణి రెచ్చిపోయింది. స్టయిల్ గా వేసుకున్న అతని కోటు కాలర్ రెండు చేతులతో పట్టుకుని గట్టిగా గుంజింది. 
    "తెలీదూ! నిజం చెప్పు నువ్వు తెలీదంటే విడిచిపెట్టడానికి నేను పాతకాలపు అమ్మమ్మనిగాను. బంగారు బొమ్మలాంటి పెద్దెనిమిదేళ్ళ అందమైన ఆడపిల్ల వరించి, పెళ్ళి చేసుకుంటే ఆనందించడానికి మారుగా ఒథేల్లో లాగా లేనిపోని కాంప్లెక్స్ పెంచుకుని అమ్మాయిని మానసికంగా హింసలు పెడ్తావా? చెప్పు ఎక్కడుందో నా కూతురు??" కేశవనాద్ అడ్డుపడి భాగవతార్ ని విడిపించాడు. అతడుకూడా బతిమాలుతున్న ధోరణిలోనే "అల్లుడుగారూ!! మీరిద్దరూ సుఖంగా ఉండాలనే మేం కోరుకునేది. అమ్మాయి అడిగిందనే మీరిస్తున్నట్లుగా ఈ పార్టీ అంతా అరేంజి చేశాను. మేమైనా మీరిద్దరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాంగాని, మీ కాపురం పాడుచెయ్యాలనుకుంటామా? మృదుల ఎక్కడుందో! ఏం జరిగిందో చెప్పండి" అన్నాడు.   

 Previous Page Next Page