Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 34

    అక్షరాలన్నీ చిన్న చిన్న వృత్తాలతో పూర్తి చేయటం ఈ సంతకంలో కనబడుతుంది. అంతకుముందు ఉదాహరణలో చెప్పినట్టే సంతకాన్ని ఒక అడ్డుగీతతో కొట్టి వేయటం కూడా కనబడుతుంది. అడ్డగీత గురించి ముందే చర్చించాం కాబట్టి ఇప్పుడు సంతకంలో అక్షరాలు గుండ్రంగా పెట్టడం గురించి చర్చిద్దాం.

     అక్షరాలన్నీ గుండ్రంగా వ్రాసి వాటిని  గొలుసులా కలిపే వారు వాస్తవాన్ని గుర్తించలేని వారై వుంటారు. వీరు సదా కలల్లో తేలిపోతూ ఎవరో తమని ప్రేమించాలని, తమని వారికి మనస్పూర్తిగా అర్పించుకోవాలనే  ఊహలో వుంటారు.

     మిగతావారందరి కన్నా తాము ఒక రంగంలో  కానీ, ఆలోచనలోకానీ అధికుల మని వీరికి తెలుసు.  వీరు అవతలి వారికి ఆ విషయాన్ని చెప్పి వారిని తక్కువ చెయ్యటాన్ని ఇష్టపడరు.

     వీరిలో అందం వున్నా లేకపోయినా  ఆకర్షణ మాత్రం తప్పకుండా వుంటుంది. వీరిలో ఆత్మ విశ్వాసం, ధైర్యం తొణికిసలాడుతుంటాయి.
    అపజయాలు వీరిని కేవలం కొంతకాలం మాత్రమే అణగదొక్కగలవు.

    ముక్యగమనిక!

    ప్రతీసంతకాన్ని గ్రాఫాలజిస్ట్ లు విశ్లేషించగలరు. అయితే పైన  చెప్పిన ఎనిమిది ఉదాహరణల్లో ప్రపంచంలోని అన్ని సంతకాలు చేరవు. సంతకం బట్టి అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని విశ్లేషించవలసి వచ్చినప్పుడు ఆ సంతకాన్ని వేరువేరు రకాలుగా విడగొట్టాలి.  ఉదాహరణకి సంతంకోల కోణాలెక్కువ వున్నాయా, వృత్తాలెక్కువ వున్నాయా, అక్షరాలు కుడివైపుకి వంగి వున్నాయా లేక ఎడమ వైపుకి వంగి వున్నాయా, సంతకాన్ని మొత్తం చేసి  క్రింద గీత కొట్టి రెండు చుక్కలు పెట్టాడా లేక ఒక అడ్డగీతతో సంతకం మొత్తాన్ని కొట్టి వేశాడా లేక  సంతకం చూట్టూ  ఒక వృత్తం గీసి  సంతకాన్ని  అందులో నిలిపాడా లేక ఒక పెద్ద గీత గీసి సంతకాన్ని మొదలు పెట్టాడా అనేది నిర్ణయించుకోవాలి.

     పైన చెప్పిన చాప్టర్ లో ఒకే సంతకంలో మీకు అన్ని గుణగణాలు కనబడకపోవచ్చు. మీరు  పై విధంగా  సంతకాన్ని రకరకాల విభాగాలుగా విడగొట్టిన  తరువాత దానికి పైన చెప్పిన గుణగణాల్ని వర్తింపచేసుకోవాలి.

       
                                                       డూడ్లింగ్

    ఈ ప్రపంచంలో ఒక్కో మనిషి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని, ఒకరకం మనస్తత్వాన్ని కలిగి వుంటాడు. ఏ ఇద్దరి చేతి వ్రాతలో ఒకలా వుండనట్లే, ఏ ఇద్దరి మనస్తత్వాలూ ఒకలా వుండవు. కొంతమంది వయసుతోపాటు  మానసికంగా  ఎదుగుతారు. మరికొంతమంది వయసు పెరుగుతున్నా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి వుంటారు.

     ఒక్కొక్క అనుభవానికి ఒక్కో వ్యక్తి ఒకోలా  ప్రవర్తిస్తూ వుంటాడు. కొంతమంది చిన్న ఆనందాన్నీ, విషాదాన్ని కూడా విపరీతంగా బహిర్గతంగా చేస్తుంటారు. కొంతమంది ఎంత విషాదమొచ్చినా  తొణకరు. అలాగే ఆనందించవలసిన టైమ్ లో కూడా బిర్రబిగుసుకు పోయి రిజర్వ్ డ్ గా వుంటారు.

     ఏ వయసులో ఏ రకంగా  వుండాలీ అనేది ప్రతి మనిషీ తనకి తాను నిర్ణయించుకోవాలి. ఒక వయసొచ్చేక (నడివయసులో) హుందాతనం చాలా అవసరం.  అలాగే యవ్వనంలో వున్నప్పుడు రిజర్వ్ గాను, ఇంట్రావర్ట్ గానూ వుంటే చూసే వారికి అంత బాగోదు.

     సాదారణంగా మనిషి ఒంటరిగా వున్నప్పుడు అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతూ వుంటాయి. అనాలోచితంగా కొన్ని పనులు చేస్తుంటాడు. చేతిలో కలం వుంటే బొమ్మలు గీయటం, సంతకాలు  పెట్టడం, కాగితం మీద వృత్తాలు గీయటం - లాంటివి చేస్తుంటారు. మరికొందరు కాగితం లేకపోయినా సరే, బల్ల మీదో, గోడమీదో ఇలా గీస్తుంటారు.

 Previous Page Next Page