Previous Page Next Page 
నానీ పేజి 33


    సరిగ్గా అప్పుడే ఓ చేయి బలంగా నానీ  పెదవుల్ని మూసింది.

 

    ఉలిక్కిపడుతూ తల పైకెత్తి చూశాడు.

 

    రాజారావుతోపాటు ఇద్దరు దృఢకాయలు అప్పటికే నానీని పైకెత్తుతున్నారు.

 

    గింజుకున్నాడు కాని మూలుగు సైతం వినిపించకుండా చేతుల్ని మరింత గట్టిగా బిగించారు.

 

    తెలిసిపోయింది నానీకి అవే తన చివరి క్షణాలని.

 

    బ్రతికించే మందిస్తానన్న అంకుల్ ఇంకా తేరుకోకపోవడం నానీ చేసుకున్న దురదృష్టం.

 

    అప్పటికే నానీని వందడుగుల దూరం మోసుకుపోయారు.

 

    మరో రెండు నిముషాలు జాప్యమైతే నానీ ఊపిరి ఆగిపోయేదే. కాని రాజారావు పెనుగులాడుతున్న నానీని సరిగ్గా పట్టుకోడానికన్నట్టు కొద్దిగా చేతిని సడలించాడు.

 

    అంతే...

 

    ఆ అవకాశం జారవిడుచుకోలేదు నానీ.

 

    'అంకుల్' అంటూ గట్టిగా అరిచాడు.

 

    ఆ ఆక్రందనకి మామిడితోపులోని నిశ్శబ్దం చెదిరి అప్పుడు దూరంగా కూర్చున్న మన్మథరావుని తట్టిలేపింది.

 

    ఉన్మాదిలా మారిన రాజారావు నానీని నేలపైకి విసిరి కంఠాన్ని బిగించి పట్టుకున్నాడు. ఇక అరిచే అవకాశమివ్వకుండా నానీ కథ ముగించాలని.

 

    నానీ కళ్ళు తేలేస్తున్నాడు.

 

    అప్పుడు వినిపించింది 'దబ్'మన్న చప్పుడు.

 

    రాజారావు పక్కకు పడిపోయాడు.

 

    కొన్నిక్షణాల క్రితం ఓటమి కలిగించిన విసుగో లేక వికారాన్ని మిగిల్చిన శృంగారరసంలోంచి పుట్టుకొచ్చిన రౌద్రమో ఇప్పుడు మన్మథరావు రుద్రమూర్తిగా మారి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు.

 

    ఇప్పుడా ముగ్గురు వ్యక్తులకీ మన్మథరావుని ఎదుర్కొనడం సమస్యగా మారింది.

 

    ఓ చెట్టుచాటున చేరిన నానీ 'అంకుల్'ని, అతడ్ని నేలకూల్చాలని రాజారావు ముఠా చేస్తున్న ప్రయత్నాన్ని భయంగా చూస్తున్నాడు.

 

    మూడునిముషాలపాటు సాగింది ఆ పోరాటం.

 

    క్రమంగా మన్మథరావు అలసిపోతున్నాడు.  

 

    ఆ విషయాన్ని ముందుగా గ్రహించింది నానీ.

 

    ఒకవేళ అంకుల్ ఓడిపోతే ఆ తర్వాత జరగబోయేదేమిటో గ్రహించగలిగిన నానీ వెంటనే పరుగెత్తాడు.

 

    కళ్ళలో నీటిపొరలు పేరుకుపోతుంటే తోవ సరిగ్గా కనిపించడంలేదు.

 

    ముళ్ళతో కాళ్ళు గీసుకుపోతున్నాయి.

 

    ఎండుటాకులు అతని పాదాలక్రింద నలిగిపోతూ చిత్రంగా శబ్ధం చేస్తున్నాయి.

 

    ప్రాణభీతితో పరుగెత్తుతూనే గమనించాడు తనను ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి వెంటాడుతున్న నిజాన్ని.

 

    "అ...మ్మా"

 

    అలాంటప్పుడు ఏ పాట పాడుకోవాలో చెప్పని అమ్మను గుర్తుచేసుకుంటూ ఆక్రందన చేయబోయాడుగాని అదీ గొంతులోనే సమాధైపోయింది.

 

    అప్పటికే ప్రత్యర్థి చాలా చేరువగా వచ్చేశాడు.

 

    ఈసారి అరవలేదు.

 

    అరిచే సత్తువలేనట్టు స్పృహతప్పిపోతూ నేలపై పడిపోయాడు.

 

    భారంగా రెప్పలు మూస్తున్న నానీకి తెలీదు తను అడవిలాంటి ప్రదేశాన్ని దాటి ఓ తార్రోడ్డుపైకి వచ్చిన విషయం.

 

    ఓ 'జీప్' కీచుమంటూ ఆగింది అతడికభిముఖంగా.

 

    నానిని అందుకోబోయిన రాజారావు అనుచరుడు వేగంగా వెనక్కి పరుగెత్తి తక్కిన ఇద్దరు వ్యక్తులతోపాటు చెట్లవెనక నక్కేశాడు.

 

    పోలీస్ యూనిఫాంలో వున్న వ్యక్తి జీప్ లోనుంచి దూకి తోటలోకి పరుగెత్తబోయాడు కాని "ఆగు" అన్న అరుపుతో ఆగిపోయాడు.

 

    అలా ఆదేశించింది జీప్ వెనుక కారులో వున్న వ్యక్తి.

 

    ఆయన...

 

    హైదరాబాద్ నుంచి అంతకుముందే 'గనికొండ' గ్రామాన్ని చేరి అక్కడ అగ్రకులాలవారి దమననీతికి బలైన హరిజన కుటుంబాలను పరామర్శించి మృతులపేర్న నష్టపరిహారాన్ని చెల్లిస్తామని, న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చి సమీప పట్టణంలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి తిరిగివెళుతున్న అగ్రకులానికి చెందిన హోంమినిష్టర్ అప్పారావు.

 

    "పాపం" నానీని చూస్తూ అన్నాడు అప్పారావు. "హరిజనుల కక్షసాధింపుకు గురైన ఓ అగ్రకులానికి చెందిన పసికందు."

 

    ఆ స్టేట్ మెంట్ ని విన్న 'ఎస్పీ' నిజమా అన్నట్టుగా చూశాడు మంత్రిగారి మాటల్ని మననం చేసుకుంటూ.

 

    "ఎంతైనా నా నియోజకవర్గం... ఆబాలగోపాలం అంతా నాకు పరిచితులే అయినప్పుడు గోపాలం కొడుకుని నేను గుర్తుపట్టలేనా... ఆ కుటుంబంలో మిగిలింది వీడొక్కడే... జీప్ లో చేర్చండి" అన్నాడు సాలోచనగా.

 

    మరో అరగంటలో టౌన్ లో ఏర్పాటు చేయబడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీడ్ని అడ్డంపెట్టుకునే నా కులాన్ని రక్షించుకోవాలి అనుకుంటూ కారెక్కాడు.

 

    "మొన్న గనికొండ గ్రామంలో జరిగిన మారణహోమంలో కొందరు హరిజనులు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవమే. మరికొంతమంది గాయపడి గ్రామాన్ని వదిలిపెట్టి పారిపోయిన మాటా నిజమే అని ఒప్పుకుంటూ అసలు అగ్రకులాలవారు మాత్రం సుఖంగా వున్నారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. లేదూ అన్న సత్యాన్ని సోదాహరణంగా మీకు చూపాలని ప్రయత్నంలో నా కళ్ళముందే ప్రాణాలు కోల్పోయే స్థితిలో నాచేత రక్షించబడిన గోపాలం కొడుకును ఇప్పుడు మీముందుకు రప్పిస్తున్నాను. అయితే ఒక్క షరతు... పసివాడు తన కుటుంబమంతా ఎంత రాక్షసంగా కడతేరిపోయిందో కళ్లారా చూసివుండడంతో కాస్త మనస్థిమితాన్ని తప్పివున్నాడు కాబట్టి కంగారు పెట్టొద్దని మనవి చేస్తున్నాను" మాంచి ఉద్వేగంతో మాట్లాడిన అప్పారావు తన టేబుల్ కి అభిముఖంగా ఆసీనులైవున్న పత్రికా విలేఖర్లను చూసి గట్టిగా నిట్టూర్చాడు.

 

    వెంటనే పి.ఎ.ని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు.

 

    "ఆ కుర్రాడింకా లేవలేదండి" పి.ఎ. గొంతు గుసగుసలాడింది.

 Previous Page Next Page