Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 32


    లలితమ్మగారు ఈ దృశ్యం చూడలేక రెండుచేతుల్తో ముఖాన్ని కప్పేసుకుంది.

 

    ఆశ బాధ భరించలేక, అవమానం ఎగజిమ్మగా "రాక్షసుడా నీకు హృదయం లేదూ?" అని అరిచింది.

 

    రాఘవరావు ఈ ప్రయోగంతో మరీ ఉన్మత్తుడైపోయి "ఆయ్! నన్ను ఎంత మాటపడితే అంత మాటంటావా? నీ దుమ్ములు విరగ్గొడతాను" అంటూ ఆమె తలను నొక్కిపట్టి వీపుమీద బలంగా గుద్దసాగాడు.

 

    తల్లిప్రాణం ఇహ ఒక్కక్షణంకూడా సహించలేకపోయింది. "ఆశా" అని అరుస్తూ ముందుకు రాబోయింది.

 

    సరిగ్గా ఆ సమయానికి శిక్షకుని భుజాన ఓ చెయ్యి వచ్చిపడింది. అతను ఉలికిపడి తల ప్రక్కకి త్రిప్పి చూసేటంతలో ఆ చెయ్యి అతన్ని రెక్కపుచ్చుకుని ఇవతలకి బలంగా లాగివేసింది.

 

    రాఘవరావు అచేతనుడై నిలబడి కోపంతో దహించుకుపోతూ, ఆయాసంతో వగరుస్తూ "ఎంత పొగరు నీకు? నామీదనే చెయ్యి చేసుకుంటావా?" అన్నాడు పెద్ద బావమరిదివైపు చూస్తూ.

 

    రామం కళ్ళు చింతనిప్పులు కక్కుతున్నాయి. అతనికి చెల్లెలు అంటే ఎడతెగని ఆపేక్ష. తమ ఇంట్లో దారుణంగా జరుగుతున్న ఈ హింసాకాండని చూసి అతని రక్తం ఉడికిపోయింది. "యింకా చెయ్యి చేసుకోందే! ఇది చూడు" అంటూ లాగి దవడ పగిలిపోయేటట్లు ఒక్కటి తగిలించాడు.

 

    రాఘవరావు కళ్ళు చీకట్లు క్రమ్మాయి. జీవితంలో ఒకర్ని తన్నటానికి ఒకరిచేత తినటానికి కూడ ఇదే మొదటిసారి. ఈ రెండు అనుభవాలుకూడా పాపం ఇదివరకు లేవు. అతనికి పరిస్థితి అర్థమయింది. తడబడే గొంతుకథో "నన్ను... ముందూ వెనకా లేకుండా... ఇంతపని చేస్తావా? చూడు నిన్ను ఏంచేస్తానో?" అనసాగాడు.

 

    'ఏడిశావ్" అంటూ రామం మరోసారి మీదకి రాబోతున్నాడు.

 

    అదే క్షణంలో రామాన్ని జుట్టు పట్టుకొని ఎవరో లాగినట్లయింది. ఏం జరిగిందీ అతనికి బోధపడేటంతలో విశ్వనాథంగారు అతని చెంపలమీద ఎడాపెడా వాయించేస్తూ "రౌడీ వెధవా! ఉచ్ఛమూ నీచమూ లేకుండా బావగారి మీద చేయి చేసుకుంటావట్రా? అంతా నీ యిష్టమే అనుకున్నావా?" అంటూ గర్జించసాగారు.

 

    రామం దెబ్బలు తింటూ తండ్రి ఉగ్రస్వరూపం విస్మయంగా చూశాడు. దీనంగా చూశాడు. బాధగా చూశాడు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తలవంచుకొని అక్కడ్నుంచి నెమ్మదిగా తన గదివైపు వెళ్ళిపోయాడు.

 

    సందర్భం గమనించి రాఘవరావు అరుస్తున్నాడు. "ఇంటి అల్లుడ్ని చావగొట్టి ఇలా మర్యాద చేస్తారా? నేనేం చేతగాని వాజమ్మననుకున్నారా? పరువునష్టం దావా వేస్తాను. మీ అందర్నీ జైలుకు పంపిస్తాను. విడాకులు ఇస్తాను. ఆఁ జాగ్రత్త..."

 

    విశ్వనాథంగారు అతని చేతులు రెండూ పుచ్చుకున్నాడు. "బాబూ! పొరపాటు జరిగిపోయింది. మా అందర్నీ క్షమించు. ఇహమీదట ఎప్పుడు ఇలాంటివి జరగవని వాగ్దానం చేస్తున్నాను. ఇదిగో నీ పెళ్ళాం. నీ యిష్టం వచ్చినట్లు చేసుకో" ఆయన కంఠం గాద్గదికమై వణికింది.

 

    అట్టే దబాయించాలని రాఘవరావుకు కూడా లేదు. మరీ తెగేదాకా లాగటం అతని అభిమతం కాదు. "రా" అన్నాడు భార్యవంక తిరిగి.

 

    "వెళ్ళు ఆశా!" అన్నారు విశ్వనాథంగారు తన గంభీరకంఠంతో.

 

    ఆశ తండ్రివంక ఒక్కచూపు చూసింది. కిక్కురుమనలేదు. అంతే పిల్లిలా నడుచుకుంటూ భర్తవెంట వెళ్లిపోయింది.

 

    విశ్వనాథంగారు భార్యవైపు చూశాడు. ఆమె ఉలుకూ పలుకూ లేకుండా ఇందాకటినుంచి శిలావిగ్రహంలా నిలబడిపోయింది. ఆయన ఆమెను సమీపించి "లలితా!" అన్నారు మెల్లగా.

 

    ఆమె ఈ జగత్తులోకి వచ్చింది. అంతా నిజం, నిజం. తను... తను... తనే అది!

 

    'ఏమిటి లలితా?" అంటున్నాడు భర్త.

 

    "ఏమండీ!" అని ఆమె ఆయన పాదాలమీద వాలిపోయి బిగ్గరగా ఏడ్చి వేసింది.


                                         10


    "ఆశా" అని పిలుస్తూ సుభద్ర మేడమీదికి వచ్చింది.

 

    చెల్లెలు కుర్చీలో దిగాలుగా కూర్చోవటం చూసి చకితురాలై "ఏమిటి ఆశా, అలా వున్నావు?" అనడిగింది దగ్గరికొచ్చి.

 

    "ఏమి లేదక్కయ్యా" అంది ఆశ మ్లానవదనాన్ని మరుగుపర్చుకుంటూ.

 

    "కాదు. ఏదో వుంది. నాకు చెప్పవూ?" అని అడిగింది చెల్లెలి చుబుకాన్ని పట్టుకుని బుజ్జగిస్తూ.

 

    ఓ క్షణం మౌనంగా వుండి ఆశ మంద్రస్వరంతో "ఆయన దగ్గరనుంచి ఉత్తరం వచ్చిందక్కయ్యా" అని చెప్పింది.

 

    "ఏం రాశాడు?"

 

    డ్రాయరు సొరుగులోంచి కవరు తీసి అక్క చేతికందించింది "నువ్వే చదువు."

 

    సుభద్ర నిరాకరిస్తూ "ఉహు! మీ ఆయన రాసింది నేను చదవకూడదు. సారాంశం చెప్పు, చాలు" అంది.

 

    "ఫర్వాలేదు. చదువక్కయ్యా! అందులో రహస్యాలేమీ లేవులే" అంటూ ఆశ వత్తిడి చేసింది.

 

    సుభద్ర తప్పనిసరియై ఉత్తరాన్ని వెలికితీసి చదివింది. కడుపులో దేవినట్లయింది. "ఎందుకలా రాశాడు? ఏం జరిగింది?" అని ప్రశ్నించింది అర్థంగాక.

 

    ఆశ నిట్టూర్చి "ఏమీ జరగక్కర్లేదక్కయ్యా! ఆయన తీరంతే. చాలావరకు అలవాటుపడిపోయాను. అయినా అప్పుడప్పుడూ బాధ కలుగుతూంటుంది. ఆపుకోలేని బాధ" అంది.

 

    సుభద్రకి హృదయం కరిగి నీరయింది. చెల్లెలి తల నిమురుతూ "బాధపడి చేసేదేముంది ఆశా? ఎన్ని ఆవేదనలు, ప్రళయాలు, అగ్నిచీలికలు సమకూడితే ఓ జీవితం?" అంది నిర్లిప్తంగా.

 Previous Page Next Page