Previous Page Next Page 
నానీ పేజి 31


    మరో అరగంటలో బోధపడిపోయింది.

 

    ఈ నిర్ణయం యస్పీదికాదని, జిల్లాపరిషత్ చైర్మన్ రాష్ట్ర హోం మినిష్టర్ ని ఇన్ ఫ్లూయెన్స్ చేసి ఇదంతా చేయించాడని...

 

    పాండురంగారావుగారు నిస్సహాయతని ప్రకటించిన మరుక్షణం ఎక్కువగా ఉద్రేకపడింది హరిత.

 

    "యశస్వి" సాలోచనగా చూస్తూ అంది. "ఇక న్యాయాన్ని రక్షించడమే మనిషి ధ్యేయమైనప్పుడు దానికి పోలీసాఫీసర్ కానక్కరలేదు. నిజాయితీగల యీ దేశ పౌరుడైతే చాలు."

 

    సరిగ్గా ఆ వాక్యమే యశస్విని తట్టి లేపింది.

 

    ఏ ఆలోచన మెరుపులా అతన్ని తట్టిలేపిందో వెంటనే స్టేషన్ కి బయలుదేరాడు.

 

    "సర్!" రఘునాథరావుముందు సేల్యూట్ చేసి నిలబడ్డ యశస్విని రెప్ప వాల్చకుండా చూశారాయన.

 

    అప్పటికే ఎడ్జార్నమెంట్ గురించి తెలిసింది. యిప్పుడు అతడు అయిష్టంగా ఎదురుచూస్తున్నాడు రాబోతున్న ట్రాన్స్ ఫరార్డర్ గురించి. "యస్."

 

    "మీ అనుభవంముందు నేను చాలా చిన్నవాడ్ని."

 

    రఘునాథరావు నిశ్శబ్దంగా చూస్తున్నాడు.

 

    "నేను ఒక న్యాయంకోసం నిలబడే మనిషినని మీరొక్కరు అంగీకరిస్తే చాలు."

 

    "ఐ హేవ్ గాట్ సఫిషియంట్ బిలీఫ్ ఇన్ యూ."

 

    "మరికొన్ని గంటల్లో నేను ట్రాన్స్ ఫర్ ఆర్డరు తీసుకుని తీరాలి."

 

    "ఆఫ్ కోర్స్..." వెనుక ఎలాంటి బలమైన శక్తి వున్నదీ అప్పటికి ఆయన గ్రహించేశారు.

 

    "సో" ఓ క్షణం ఆగేడు. " మీరు నాకు ఓ పదిరోజులు సెలవు గ్రాంటు చేయండి."

 

    "దేనికి?"

 

    "నేను కోర్టులో గడువుకోరింది పదిరోజులే కాబట్టి..."

 

    "దానివలన ఉపయోగం."

 

    "ప్రస్తుతానికి నేను ట్రాన్స్ ఫర్ ఆర్డర్ తీసుకోవాల్సిన అగత్యం వుండదు. ఫైల్ నా ఆధీనంలోనే వుంటుంది."

 

    "కాని..." ఏం ఆశించి యశస్వి ఇదంతా మాట్లాడుతున్నదీ ఆయనకి అర్థంకాలేదు. "నువ్వు సెలవులో ఉన్నంతమాత్రాన ఈ కేసునెలా డీల్ చెయ్యగలననుకుంటున్నావు."

 

    "ఒక బాధ్యతగల పౌరుడిగా."

 

    నిశ్చేష్టుడై వింటున్నాడాయన.

 

    "క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 43 ప్రకారం కార్నిజబుల్ అఫెన్స్ చేసిన ఏ పౌరుడినైనా అరెస్ట్ చేసే హక్కు సామాన్య పౌరుడికి వుందని మనచట్టం నిర్దేశించిన న్యాయమే కాబట్టి నేను ఒక పౌరుడిగా యీ కేస్ డీల్ చేస్తాను."

 

    తన అనుభవంలో ఇంత మొండిగా వ్యవహరించే ఒక్క పోలీసాఫీసర్ నూ చూసే అవకాశం దక్కని రఘునాథరావు గొంతు తడారినట్టయి గ్లాసులో నీళ్ళు తాగాడు.

 

    ఆ క్షణాన డిపార్ట్ మెంట్ గర్వించదగ్గ నిజమైన పోలీసాఫీసర్ ను చూస్తున్నాడాయన.

 

    "సర్! చేయి మాఫియాగ్యాంగుల్ని పట్టి బంధించడంకన్నా ఒక పోలీసాఫీసర్ గా ఒక్క నానీని నేను దక్కించుకుంటే చాలు. ఈ దేశానికి ఐన్ స్టీన్నో లేక శంకరాచార్యనో మిగిల్చినవాడినవుతాను."

 

    బాధగా తలవంచుకున్నాడు. "అసలు నానీకేమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యుణ్ని నేనే అన్న ఆలోచన నన్నెంత కలవరపెడుతున్నదీ మీరూహించలేరు."

 

    నెమ్మదిగా పైకిలేచిన రఘునాథరావు యశస్విని సమీపించి ఆప్యాయంగా భుజాలపై చేతులు వేశాడు.

 

    "ప్రొసీడ్... మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. కమాన్... వెంటనే లీవ్ అప్లయ్ చేయండి."

 

    మరో అయిదునిముషాలల్లో అన్నిపనులూ చకచకా పూర్తి అయిపోయాయి.

 

    స్టేషన్ వదిలి వెళ్ళేముందు నానీ కనిపించటం లేదంటూ చంద్రం ఇచ్చిన నానీఫోటోని కాపీలుతీసి అన్ని పోలీస్ స్టేషన్లకీ అఫీషియల్ గా పంపే ఏర్పాటు చేసి వుంటే కథ మరోలా వుండేది. అసలు అంత దూరం ఆలోచించకపోవడమే యశస్వి చేసిన పొరపాటు.

 

    టైం చూసుకున్నాడు. ఇంకా మిగిలింది తొమ్మిదిన్నరరోజులు గడువు.

 

    యశస్వి కదిలాడు తన పోరాటపు తొలిఘట్టానికి సమాయత్తమవుతూ...

 

                                          *    *    *

 

    "అనేక పాదసేవ

    ప్రసుప్తవ్య మమ

    శిఖం అక్రమ్య

    ఖడ్గేణనోపహతః"

 

    శ్లోకాన్ని చెప్పిన మన్మథరావు ఓ క్షణం ఆగి "శ్లోకంలోని ప్రతిపాదపు మొదటి అక్షరం కలిపితే అప్రశిఖ అవుతుంది" అన్నాడు చెట్టుకి చేరగిలబడి తననే గమనిస్తున్న రతిని చూస్తూ...

 

    "గుడ్" అభినందించింది రతి "ఇంత స్వల్పవ్యవధిలో ఈ జవాబునెలా సాధించావు మనూ."

 

    తనతో తీసుకొచ్చిన నానీని దగ్గరకు తీసుకుని "ఈ చిన్నవయసులో ఇలాంటి శ్లోకాన్ని ఎలా కంఠస్థం చేయగలిగావు" అడిగింది విస్మయంగా.

 

    "తాతయ్య చెప్పాడు. ఇదేకాదు నర్సరీరైమ్మన్నా సరే టీచరు ఒకసారి చెప్పగానే వచ్చేస్తుంది నాకు."

 

    "అంటే జగన్నాధరాయలు వంశం వాడివేమో..."

 

    "కాదు మా తాతయ్య విశ్వేశ్వరశాస్త్రి మనవడన్నమాట."

 

    "మరి అర్థంకూడా తెలుసా?"

 

    "పూర్తిగా తెలీదుకాని ఆ కథ తెలుసు. ఎందుకంటే తాతయ్య కథలాగే ఎవరికో చెబుతుంటే విన్నానన్నమాట."

 

    "నువ్వు చెప్పగలవన్నమాట" అంది 'అన్నమాట' అనే నానీ ఊతపదాన్ని అనుకరిస్తూ.

 

    'ఓ' గర్వంగా ఓసారి తాతయ్యని గుర్తు చేసుకున్నాడు. "ఇద్దరు మంచి ఫ్రెండ్సన్నమాట. ఒక ఊరికి చెందినవాళ్ళు. ఒకడు బాగా తెలివితో ఎన్నో బహుమతులు గెల్చుకుని ఒక్క బహుమతీ రాని తెలివితక్కువ స్నేహితుడితో వూరికొస్తున్నారట. అప్పుడేమో తోవలో ఓ అడవొస్తే తెలివైన ఫ్రెండున్నాడుగా ఆయన నిద్రపోయాడు. అసూయతో రెండోవాడు ఆయన్ను చంపి బహుమతులన్నీ తీసుకుని ఊరొచ్చేస్తాడు. చచ్చిపోయిన వాడి నాన్నుంటాడుగా అతనితో మరేమో మీ అబ్బాయిని సింహం చంపేసిందీ అని అబద్ధంకూడా చెబితే ఆయన అసలు నమ్మలేదన్నమాట. పోనీ చచ్చిపోయేటప్పుడు ఏమన్నా అన్నాడా అంటే 'అప్రశిఖ' అన్నాడూ అని చెప్పాడుట. భోజరాజుకి ఫిర్యాదుచేస్తే ఆ పదానికి ఎవరూ అర్థం చెప్పకపోతే అప్పుడు కాళిదాసు లేడూ! ఆయనో పెద్దకవన్నమాట. ఆయన్ని అడిగాడట. ఆయన దేవీభక్తుడుగా. ఆలోచించి చెప్పాడట ఈ శ్లోకాన్ని" ఓ క్షణం ఆగాడు అలుపు తీర్చుకోడానికన్నట్టుగా. "నాకు శ్లోకమంతటికీ అర్థం తెలీదుగాని తనను స్నేహితుడిలా చంపాడని అందులో వుందట."

 Previous Page Next Page