అధ్యాయం - 3
అచ్చమ్మ చెప్పిన కథ :
ప్రమాదం అనేది ఎప్పుడు ఎటునుంచి వస్తుందో, దాని తీవ్రత ఎంత వుంటుందో ఎవరూ చెప్పలేరు. ఇంగ్లండ్ నుంచి అహల్య చేసిన ఫోన్ అటువంటి సంకేతాన్నే సూచించినట్లు అనిపించింది.
"శ్యామల ఇండియా బయల్దేరింది" అంది. అటునుంచి అహల్య కంఠం గాభరాగా ప్రతిధ్వనించింది.
"దేనికి?" అన్నాను.
"వాళ్ల నాన్నను చూడటానికట".
నాకు మొత్తం విషయం అర్థమైంది. ఎప్పుడోకప్పుడు ఈ చేదు నిజం బయటపడకపోదని, దీన్ని అహల్య ఎదుర్కోవలసి వస్తుందనీ నేను అనుకుంటూనే వున్నాను. అయితే అది ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. గత పాతికేళ్ళలో అహల్య మూడు, నాలుగుసార్లుకన్నా ఎక్కువ భారతదేశం రాలేదు.
శ్యామల రావటం అయితే ఇదే మొదటిసారి.
అహల్య భర్త కుటుంబం ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు. రిజర్వు బ్యాంకులో ఉద్యోగం రావడంతో అతడు తనుచేస్తున్న జాబ్ కి రాజీనామా చేసి లక్నోలోనో, అహమ్మదాబాద్ లోనో వుంటున్నాడని మాత్రం తెలుసు. వాళ్ళ అన్నయ్య పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన అల్లర్లలో మరణించాడు.
ఇరవై ఒకటో శతాబ్దపు ప్రారంభంలో బిజెపి అధికారంలోకి రాగానే రెండు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంది. భారతీయులందరికీ కాశ్మీర్ లో స్థిరాస్తులు సంపాదించుకునే హక్కునివ్వడం మొదటిది. అన్ని మతాల వారికీ ఒకే చట్టాన్ని అమలు జరపడమనేది రెండోది (కామన్ సివిల్ కోడ్).
దాంతో ఒక్కసారిగా భారతదేశం అగ్నిగోళంగా మారిపోయింది. అయితే ప్రభుత్వం ఉక్కుపాదంతో దాన్ని అణిచివేసింది. ప్రపంచంలోని చాలా దేశాల ఇస్లాం ఛాందసవాదుల తరఫున మిలిటెంట్లు దేశంలో ప్రవేశించి అల్లకల్లోలాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. యుద్ధప్రాతిపదికన భారతసైన్యం కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పి అక్కడ ఏ రాజకీయ నాయకుడుగానీ, ఉగ్రవాద సంస్థగానీ స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడే ప్రసక్తి లేకుండా చేసింది.
అయితే అందరూ అనుకున్నట్టు కాశ్మీర్ సమస్యవల్ల ఎక్కువ అల్లర్లు చెలరేగలేదు. ఉమ్మడి పౌరచట్టం ప్రవేశపెట్టడంవల్ల చెలరేగాయి. చాలా ఆశ్చర్యకరంగా- ఈ నిరసన పురుషుల నుంచి కాకుండా భారతదేశపు ముస్లిం స్త్రీల నుంచి వచ్చింది. చాలా విషయాల్లో హిందూమత చట్టం- ముస్లింలతో పోల్చుకుంటే, స్త్రీలకి ఎక్కువ రక్షణనిస్తుంది. అయినా కూడా స్త్రీలనుంచి ఎందుకింత నిరసన వ్యక్తమైందో ఎప్పటి ప్రధానికి కూడా అర్థమై వుండదు.
దీనికి ఉదాహరణగా దాదాపు పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని పేర్కొనవచ్చు. అప్పటి పాకిస్తాన్ ప్రధాని బేనజీర్ భుట్టో ఒక చిత్రమైన సమస్యలో ఇరుక్కుంది. జహాన్ మినా అనే పదిహేను సంవత్సరాల అమ్మాయిని ఆమె మామయ్య, బావ కలిసి రేప్ చేయగా ఆ విషయం ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ కోర్టు కేసు కొట్టివేసింది. కారణం చాలా చిన్నది- పాకిస్తాన్ చట్టం ప్రకారం రేప్ కేసులో నేరస్థుల్ని శిక్షించాలంటే దానికి 'మగ' సాక్షులు వుండాలి.
ఆ దేశంలో మరొక చట్టం కూడా వుంది. దాన్ని 'జినా ఆర్డినెన్స్' అంటారు. ఆ చట్టప్రకారం స్త్రీకి అక్రమ సంబంధం వున్నట్టు నిరూపణ అయితే శిక్ష పడుతుంది. జహాన్ మినా. రేప్ అయినట్టు (మగ) సాక్ష్యాలేమీ లేవు. కానీ అక్రమ సంబంధంపై ఆమెకి మూడు సంవత్సరాలు జైలు, పది కొరడా దెబ్బలు శిక్షగా విధించబడ్డాయి. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయమై గగ్గోలు పెట్టింది. గొప్ప స్త్రీ వాదియైన బేనజీర్ భుట్టో కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది.
భారతదేశంలో ఆ రోజుల్లో చెలరేగిన అల్లర్ల మూలంగా ఎంతో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. దుండగులు అహల్య బావగారి ఫ్యాక్టరీని తగులబెట్టారు. ఆయనతో సహా పదిమంది కార్మికులు కూడా ఆ ఫ్యాక్టరీ దహనంలో మరణించారు. తరువాత ఆ కుటుంబం ఎక్కడుందో వివరాలు తెలీదు. ఇప్పుడు అహల్య ఫోన్ లో చెప్పిన విషయం నన్ను అయోమయంలో పడేసింది. అహల్య భర్త ఎక్కడున్నాడో ఖచ్చితంగా నాకూ తెలీదు. ఇప్పుడు శ్యామల ఇక్కడికొస్తే ఆ అమ్మాయిని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలో, అవసరం లేదో కూడా అహల్య నాకు చెప్పలేదు. హడావుడిగా ఫోన్ పెట్టేసింది.
ఏర్ పోర్ట్ లో శ్యామలని కలుసుకుని నన్ను పరిచయం చేసుకున్నాను. ఆ అమ్మాయి మొహంలో చిరాకు, అసహనం, అదోలాంటి ఉక్రోషం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అయితే నా మీద వున్న గౌరవం వల్లనేమో వాటిని బయటికి ప్రదర్శించలేదు. నన్నక్కడ ఊహించకపోవడం వల్ల కాస్త ఆశ్చర్యపోయినట్టు మాత్రం కనిపించింది.
"నేనొస్తున్నట్టు నీకెలా తెలిసింది?" అనడిగింది.
"మీ అమ్మ ఫోన్ చేసింది" అన్నాను నవ్వుతూ.
తల్లి ప్రసక్తి వచ్చేసరికి ఆ అమ్మాయి మొహం వివర్ణమవడం గమనించాను. నేను మాట మారుస్తూ "నువ్వు మీ నాన్నగార్ని కలుసుకోవడానికి వస్తున్నావని చెప్పింది. కానీ ఆయనెక్కడున్నారో నాకు తెలీదు. పూర్వం పనిచేసిన బ్యాంక్ లో ఎంక్వైరీ చేస్తే బహుశా తెలుస్తుందనుకుంటాను" అన్నాను. నా ఉద్దేశం పరోక్షంగా "మనం మనం శత్రువులం కాము" అని చెప్పడం. కానీ ఆ అమ్మాయి నా మాటలు పట్టించుకోకుండా "మా నాన్నగారు ఎక్కడున్నారో నాకు తెలుసు" అంది విసురుగా. "ఆయన్ని కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను".
నేను ఆశ్చర్యంగా "ఆయనిక్కడున్నారా?" అనడిగాను.
శ్యామల వెటకారంగా "మీ ఇంటి మాజీ అల్లుడు మీ వూళ్ళోనే వున్నా మీకా విషయం తెలీదు. గొప్ప డిటాచ్ మెంట్" అంది.
నేనా విషయం రెట్టించదల్చుకోలేదు. రెట్టించినకొద్దీ ఆ అమ్మాయి అసహనాన్ని మరింత పెంచడమే తప్ప ఫలితమేమీ వుండదు.
"పద, ఇంటికెళ్దాం" అన్నాను బయటికి నడుస్తూ.
"ఎవరింటికి?" అని నేను సమాధానం చెప్పేలోగా "నేను మా ఇంటికి వెళ్తున్నాను. చట్టబద్ధమైన మా ఇంటికి!" అంటూ టాక్సీని పిలిచి నా కళ్ళముందే వెళ్ళిపోయింది.
* * *
నెమ్మదిగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ పడుకుని ఆలోచిస్తున్నాను. నా భర్త గాఢనిద్రలో వున్నాడు. నాకు మాటిమాటికి అహల్యతో టెలిఫోన్ సంభాషణ గుర్తొస్తోంది. నిజంగా మానసికంగా ఇది తనకి చాలా పెద్ద డెబ్బ. మన సిద్ధాంతాల్నీ, ప్రవర్తననీ దగ్గరవాళ్ళే అర్థం చేసుకోలేకపోతే అంతకన్నా వ్యధ మరేం వుంటుంది? అందులోనూ పాతిక సంవత్సరాలు పెంచి, పోషించి మొత్తం బాధ్యతనంతా భుజాలమీద వేసుకుని తీర్చిదిద్దిన తరువాత ఈ అమ్మాయి ఈ విధంగా చేయడం అహల్యకి ఎంత క్షోభ కలిగించి వుంటుందో ఊహించగలను. ఈ విధమైన వ్యధ కేవలం స్త్రీకే సృష్టించాడనుకుంటాను భగవంతుడు. శ్యామలకీ, సూర్యానికీ లండన్ కోర్టులో జరిగిన వాదోపవాదాలన్నీ పేపర్లో చదివాను. అందులో సూర్యమ్ ప్రవేశపెట్టిన సాక్షితో శ్యామల జరిపిన సంభాషణ నాకు గుర్తుంది. ఆ సాక్షి అన్నది- "హక్కులకోసం పోరాడాల్సి వస్తే సమాజంతో కాదు, భగవంతుడితో పోరాడాలి" అని.
అప్పుడు శ్యామల అన్నది కూడా "స్త్రీ వాదులందరూ సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని మీకెప్పుడూ అనిపించలేదా?"
"ఎలా పోరాడాలి" అని అడిగింది ఆ సాక్షి.
ఆ సాక్షి అమాయకంగా అడిగిన ప్రశ్నలో చాలా గొప్ప సత్యం కనపడింది నాకు. భగవంతుడు సృష్టించడంలోనే స్త్రీకి అన్యాయం చేశాడన్న విషయం ఎవరూ కాదనలేదు. కానీ కుందేలూ, జింకా కూడా తమ రక్షణ కోసం తమకి చాతనైన పరిథిలో తమ జీవితాన్ని కొనసాగించడం కోసం ప్రమాదాల్ని ఎదుర్కొంటూ మనుగడ కొనసాగిస్తాయే! మరి వాటికన్నా ఎక్కువ మేధస్సువున్న స్త్రీ, తన జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మలచుకోవడం కోసం ఎలా పోరాడాలో ఎందుకు ఆలోచించకూడదు?
నా భర్తకి మెలకువ వచ్చినట్టుంది. నా వైపు తిరిగి "ఏమిటింకా నిద్రపోలేదా?" అనడిగాడు.
"లేదు, శ్యామల గురించి ఆలోచిస్తున్నాను".
"ఇందులో ఆలోచించడానికేముంది? ఎప్పటికైనా జరుగుతున్నదనుకున్నదే కదా!"
"మీకేమీ బాధగా లేదా?"
"ఎందుకు?"
"మీ చెల్లెలు ఇంత క్షోభ అనుభవిస్తుంటే!"
"అహల్య క్షోభ అనుభవిస్తోందా? నేనలా అనుకోవడంలేదే!"
నేనేం విస్తుపోలేదు. ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నా భర్త సంగతి నాకు బాగా అర్థమైంది. ఆయన ప్రవర్తన పట్ల విస్తుపోవడమంతా పెళ్ళికి ముందే జరిగిపోయింది.
"మీరేం చెప్పదల్చుకున్నారో నా కర్థమైంది. ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించినా పాతికేళ్ళ క్రితం భర్తనీ, ఇప్పుడు కూతుర్నీ పోగొట్టుకునే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఒక స్త్రీగా నేనా బాధను అర్థం చేసుకోగలను".
"పురుషుడిగా నేనూ అర్థం చేసుకోగలను. అయితే నువ్వాలోచించనిదల్లా ఒక్క విషయమే! ఇప్పుడు జరిగినా, పాతిక సంవత్సరాల క్రితం జరిగినా అహల్య తన సంసారాన్ని కోల్పోవడమనేది మే తన బావగారితో సంబంధం పెట్టుకున్నప్పుడే జరిగింది. అది మానసిక సంబంధంతో ఆగి వుంటే ఈ ప్రపంచంలోని చాలా మంది స్త్రీల సంసారాల్లాగ సజావుగా సాగిపోయుండేది. ఎప్పుడైతే అది భౌతికమైందో- వాస్తవం పామై కాటేసింది".
నేను విస్తుపోయాను. నా భర్త మనసులో తన చెల్లెలి పట్ల ఇలాంటి భావాలున్నాయని ఇన్నేళ్ళ వరకూ నాకు తెలీదు. చప్పున లేచి కూచుని "మీరూ ఒక పురుషాహంకారిలా మాట్లాడుతున్నారు" అన్నాను. అన్న తర్వాత ఆయనకేమైనా కోపం వస్తుందేమోనని భయపడ్డాను. ఆయన నవ్వేస్తూ "కరెక్ట్ గా మన పెళ్ళికి సంవత్సరం ముందు ఇదే మాటన్నావు గుర్తుందా?" అన్నాడు. ఆ సంఘటన గుర్తొచ్చి కాస్త సిగ్గేసింది. ఆయన చేతిమీద చేయివేస్తూ "మీరెప్పుడూ నా కర్థంకారు. ఎప్పటికప్పుడు అర్థం చేసుకున్నాననుకుంటూంటాను. మళ్ళీ ఆ అభిప్రాయం తప్పనిపించేలా చేస్తారు" అన్నాను. "ఇందులో చిత్రమేమీలేదు. అనుభవం పెరుగుతున్నకొద్దీ అభిప్రాయాల్లో మార్పు రావడమేగా జీవితమంటే! అలాంటి మార్పు రాకపోతే జీవితం అక్కడితో ఆగిపోయినట్టేగా!"
"అంటే మీరు శ్యామల చర్యని సమర్థిస్తున్నారా? అలా తల్లిని వదిలేసి వచ్చేయడం కరెక్ట్ అంటున్నారా?"
"అహల్య చేసిందీ తప్పుకాదు. శ్యామల ఆలోచనా విధానమూ తప్పుకాదు. ఒకే గమ్యానికి రెండు వేరు వేరు దార్లుండవచ్చు కదా! అందుకే ప్రపంచంలోని స్త్రీలందరి తరుఫునా వాదించిన శ్యామల- చాలా మంది స్త్రీ వాదులు బలపర్చే తన తల్లి చర్యనే సమర్థించలేకపోయింది. దీన్ని బట్టే ఈ సమస్యా పరిష్కారంలో ఎన్ని పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలున్నాయో అర్థమవుతోంది కదా!" "మీరు చెప్పింది నాకేమీ అర్థంకావడంలేదు. అహల్య తప్పు చేసిందా? శ్యామల తప్పు చేసిందా?"