"సిద్ధమే" అని గొణిగాడు రవి.
"ఎన్నాళ్ళు ఇలా కాలాన్ని వ్యర్థం చేస్తావు? ఓసారి మరదల్ని కళ్ళారా చూసుకోవాలని మీ చిన్నక్క ఉబలాటపడుతోందని నీకు తెలియదా?"
"నన్నేం చేయమంటావో చెప్పు అలాగే నడుచుకుంటాను."
"రైల్లో ఆనాడు ఈసంగతి ప్రస్తావించాక తిరిగి ఇదే అనుకుంటాను ఆ ప్రసక్తిలోకి ప్రవేసించటం. ఏ ఆడదైనా కృంగి కృశించి, అలమటించి పోతూ వుందంటే ఆ ఉసురు నీకే తగులుతుంది."
"నేనందుకే ఉపేక్షిస్తున్నానని అనుకోనా?" అని రవి తలవంచి ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.
"అనుకోను. ఇలాచేసి నువ్వేం సుఖాల్నీ బావుకోలేవు."
ఆమె చాలా దృఢనిశ్చియురాలై వచ్చిందని అతను గ్రహించటానికి ఎక్కువసేపు పట్టలేదు. విషణ్ణవదనంతో "నువ్వదే వాంఛించినట్లయితే నేనూ ఏ క్షణంలోనైనా సిద్ధమే" అన్నాడు. "కానీ, నా ప్రార్థన ఒకటి వుంది."
"చెప్పు నాయనా! చిన్నక్కదగ్గర సంకోచం దేనికి?"
"నాకు మరో జీవితంలోకి ప్రవేశించాలంటే భయంగా వుంది. సరే సిగ్గు పూర్తిగా విడిచేశాను. నేనుచాలా అసహ్యమూ, నీచమూ అయిన పనిని చేశానని నువ్వు గుర్తించావు. ఈ పరిస్థితుల్లో నాకు వివాహమయాక సుఖమూ, శాంతీ ఏమీ లభ్యంకాదని నువ్వు ఊహించలేకపోయావు. 'నా' అన్నవాళ్ళని నేను ఎవరిని చూసి మురిసిపోతుంటానో వారికి వక్రంగా దూరం కావాల్సి వస్తుందన్న భయ సంక్షోభాల్ని అరికట్టుకోలేదు. నువ్వు నన్ను క్షమిస్తే ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. ఆ భవిష్యత్ కంటే ఇదే మెరుగ్గా సరిపెట్టుకున్నాను నేను. ఎల్లప్పుడూ దీన్నే కాంక్షిస్తున్నాను."
పిచ్చివాడా! నువ్వు శాశ్వతమైనదని దేన్నిగురించీ భ్రమ చెందబోకు. ఏదయితే "నీ" అనుకుని అమందానందంలో మునిగిపోతున్నావో అది ఒక మంటలవలయం. అవి ఆరినా, మింటికి ఎగసినా ఫలితం ఒకటే. నేటికి మీ చిన్నక్క ఏదో సాధించింది. కానీ దాన్నిగురించి నువ్వేమీ తెలుసుకోవద్దు. వింటున్నావా?"
రవి అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతి అక్షరం పొల్లుపోకుండా ఆలకిస్తున్నాడు. తల ఊపాడు.
"ఆఖరుకి ఇది ఓ అంటరాని వస్తువు అయింది. ఇహ ఉత్తేజపరచీ, ఉద్రేకపరచీ ఎవరూ దేన్నీ సమీపించలేరు. ఏ ప్రేమ, అనురాగం, ఏ స్వార్ధం దీన్ని సమ్మోహితురాలిగా చేసుకోలేదు. ఆమె పరాజితురాలు, జీవన్మృతురాలు. శోకమంటావా? అమృతప్రాయంగా స్వీకరిస్తుంది. సంతోషమో? తృణీకరించడానికి వెనుదియ్యదు. సజీవ తరంగాలు ఏమయినా కానీ, ఈ మోడయిన జీవితంలోని జీవజంత్రధ్వనులను మ్రోయించలేవు. నోటిమాటలూ, నిష్కల్మ హృదయాలూ ఏ ఆశలూ చివురింపజేయలేవు. ఒకానొక కర్తవ్యమే వీటన్నిటినీ మించిన ఆవేశంతో వెంబడించి వుండకపోతే ఈ ఇసుకరేణువు గాలి దుమారంతో ఎప్పుడో అంతరిక్షంలోకి ఎగిరిపోయి వుండేది. ఎందుకు ఇవన్నీ చెబుతుందని తెల్లబోతున్నావా? ఇంతకంటే విపులీకరించి చెప్పలేను కాబట్టి. ఎందుకు ఇంత హఠాత్తుగా ఉపక్రమించిందని ఆశ్చర్యన్వితుడౌతున్నావా? ఇంతకంటే శుభసమయం లేదుకాబట్టి. నీ ప్రశాంతమైన నిద్ర నా నిర్ణయానికి ఓ ఇనుపపోత పోసింది. కానీ ఇహముందు ఏం జరిగినా నువ్వు గగ్గోలు పడవద్దు. నీ పెళ్ళిప్రయత్నాలన్నీ ముగించుకుని తిరిగిరావటానికి, మద్రాసు పోవటానికీ ఈరాత్రే నువ్వు ఉద్యుక్తుడవు కాకపోతే చిన్నక్కను మరి చూడలేవు" అని ఆమె నిర్లక్ష్యస్వరూపిణిగా, శాంతభావినిగా, నెమ్మదిగా కదిలి వెళ్లిపోసాగింది.
జిత హృదయుడైన తమ్ముడు నిశ్చేష్టుడై కదలికలేని రాతిబొమ్మవలె నిరీక్షించని ఈ స్తబ్ద వాతావరణానికి స్తంభీభూతుడై రెప్పవాల్చక మెలికలు తిరిగిపోతున్న చూపుల్నిమాత్రం నిర్విరామంగా ప్రసరిస్తూ మిగిలిపోయాడు. చివరకు ఆమె గుమ్మందాటి అలానే ప్రాణంలేని ఓ రూపం ఒక అతీతమైన శక్తికి లోబడి తన ప్రమేయంలేకుండా కదిలి వెళ్ళిపోతున్నట్లు నడచిపోతూ ఆగిపోగా ఎలానో చైతన్యావస్థలోకి ప్రవేశించి "చిన్నక్కా!" అని అస్పష్టస్వరంతో మూలిగాడు.
ఆమె నెమ్మదిగా ఆగింది. వెనుదిరగకుండానే "ఏం? కానీ ఈ విషయమై నీవు నన్నేమీ ప్రశ్నించకూడదు. మరుక్షణంనుంచీ మానవరూపంలో భ్రమ కలిగించినట్లు నేను మామూలుగా ప్రవర్తించినా నీవేమీ అబ్బురపాటు ప్రదర్శించకూడదు."
ఆమె ఇహ ఆగలేదు. మనిషి లేని నీడ నడచినట్లు మెల్లగా సాగిపోయింది.
నిర్విణ్ణుడై, అప్రతిభుడై రవి చాలాసేపు ఉండిపోయాడు. ఏం జరిగింది? వెన్నెల హృదయంతప్ప ఏమీ కానివారి దగ్గర్నుంచి ఎటువంటి దారుణ దుమారాన్ని కలిగించే కఠిన విషయాలు వినవలసివచ్చింది? తాను ఎంతటి దురదృష్టవంతుడు? ఇంకా బ్రతికివుండి ఆలోచిస్తున్నాడు.
అతనిలో హఠాత్తుగా సంచలనం ఉత్పన్నమైంది. తనకేమీ తెలియదని ఆమె అనుకుంది. కానీ ఆమె మాటల్లో తొణికిసలాడుతున్న ప్రతి అంతరార్ధం తన జ్ఞానం వాతపడకుండా అవతలకు దాటిపోలేదు. ఇందులో అగోచరం, నూతనం ఏమీలేదు. అతని తప్తహృదయం జంకించబడింది.
ఒక్కసారిగా అతనిలో ఆవేశం ఉప్పొంగింది. దబదబ లేచి ఆమె సమక్షంలోకి పోయి "చిన్నక్కా! నాకేం తెలియదని నువ్వనుకుంటున్నావు గానీ నీగురించి నాకు సర్వస్వం తెలుసమ్మా! ఇంకా అలా వ్యధ చెందుతావు దేనికి?" అని ఎలుగెత్తి చాటుదామనుకున్నాడు. లేచి నిలబడ్డాడు. కానీ ఇంతలోనే "ఏమి చేస్తున్నావో తెలుసునా?" అని ఎవరో వెనుకనుండి కర్కశస్వరంతో గర్జించినట్లయింది. లజ్జితుడై తిరిగి కూర్చున్నాడు. ఇహ అతని ఆశలన్నీ అడుగంటాయి. ఎప్పుడూ ఈ ప్రసక్తి తనముందు తీసుకురాకూడదని ఆమె నిరాఘంటంగా శాసించింది. దానికి తిరుగులేదు. అది అమోఘవచనం. ఈనాటికి ఆమె ఈ ఆకస్మికాగమనంలోని ఆంతర్యం బోధపడుతోంది. అబ్బా! ఇది ఎంతటి దారుణబాధ! కానీ ఈ పరిస్థితులలోనే ఒక ఆంక్షకు లోబడి తాను గృహస్థుడు కావాలి. చివరికి అనుకున్న పరిధుల్ని కూడా దాటిపోయిన ఈ దుర్దినాన తొలిసారిగా ద్వితీయ జీవితరాగాన్ని ఆలపించడానికి ఉద్యుక్తుడౌతున్నాడు.
చాలాసేపటికి కేశవులు వచ్చి "అయ్యా కాఫీ!" అన్నాడు.
"అక్కడ పెట్టి వెళ్ళు."
కేశవులు ఆ పని నిర్వర్తించి అక్కడినుండి వెళ్ళిపోతుంటే "చూడూ!" అని ఆపాడు.