సరిగ్గా అదే సమయంలో...
ఒకసారి అటూ ఇటూ దిక్కులు పరికించి చూసిన రాజారావు ఎవరూ తమను గమనించడంలేదన్న నిర్ధారణకు వచ్చాక తక్కిన ఇద్దరు అనుచరులతో మన్మథరావు ఇంటిద్వారాన్ని చేరాడు.
ఇక లోపల ప్రవేశించేవాడే...
"ఎవరు కావాలి?"
ఓ కంఠం వినిపించడంతో గిరుక్కున వెనక్కి తిరిగిన రాజారావు ముందు తొట్రుపడ్డాడు ఎదురుగా నిలబడ్డ మన్మథరావుని చూసి.
"ఆ... ఆనందరావు కావాలి" అప్పటికి తోచిన ఓ పేరును ఉచ్ఛరించాడు రాజారావు. "అదే టీచర్ గా పనిచేస్తుంటాడే!"
"ఇక్కడ అలాంటి పేరుగల వాళ్ళెవరూ లేరు."
"సారీ" అంటూ వెనుదిరిగిన రాజారావు అవకాశం తీసుకుని మన్మథరావుపై కలయబడితేనేం అనుకున్నాడుగాని ధైర్యం చాలలేదు.
ఇది సిటీకాదు జనం ప్రేక్షకుల్లా నిలబడటానికి.
అనవసరమైన రభసతో తన పథకం మొత్తం గంగపాలవుతుంది.
అప్పటికే ఇంట్లోకి ప్రవేశించిన మన్మథరావు నానీని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
ఇంటికి ఎలా రాగలిగాడూ అన్న ఆలోచనకన్నా ఏం జరిగిందీ తెలుసుకోవాలన్న ఉత్కంఠే అధికమౌతుంటే నానీని మరో గదిలోకి తీసుకువెళ్ళాడు.
ఆ ఉద్వేగంలో ఏదో అడిగిన అమ్మకంఠం సైతం వినిపించలేదు.
జరిగినదంతా చెప్పిన నానీ ఉత్తరాన్ని అందించాడు.
రెండుక్షణాలపాటు అక్షరాలవేపు నిర్నిమేషంగా చూశాడు.
పరీక్ష రాసిన విద్యార్థి పేపరులో నెంబరు చూసుకుంటున్నంత ఆతృత మన్మథరావులో.
"డియర్ మనూ!
'డియర్' అని ఎడ్రస్ చేయటానిక్కూడా ఎందుకంత జంకిపోయావు? ఎవరు కాదనగలరు అలనాటి మన చిలిపిముచ్చట్లని? నేను ఆటపట్టించినప్పుడల్లా ఉడుకుమోత్తనంగా అలిగే నీ రూపమే గుర్తుకొచ్చింది ఉత్తరం చదివి నంతసేపూ.
రచయితగా యింత ఎదిగిపోయిన నువ్వు ప్రాక్టికల్ గా ఎందుకాలోచించలేక పోయావో అర్థంకావడంలేదు.
చూడూ, నీ ప్రశ్నకి జవాబు చెప్పాలీ అంటే నా అలవాటు ప్రకారం ఆటపట్టించాలిగా.
ఒక చిన్న సమస్యనిస్తున్నాను. సృజనాత్మకమైన శక్తిగల మేదావివి కాబట్టి దానికి జవాబు చెప్పగలగాలి. కొంచెం కష్టమే కావచ్చు. కాని మరీ అసాధ్యం కాదు.
ప్రాచీన సాహిత్యంమీద నాకు తెగ మనసుందని నీకు తెలుసుగా. అందుకే ఓ గంటటైంలో నువ్వు జవాబు తెలుసుకుని మనం తరచూ కలుసుకునే వాళ్ళమే, మనపేర్లున్న మామిడిచెట్టు... అక్కడికి రావాలి. 'అప్రశిఖ' అంటే ఏమిటి?
నీకోసం సరిగ్గా పదకొండు గంటలకి వెయిట్ చేస్తుంటాను. తెలుసుకోకపోతే రానక్కరలేదు.
రతి"
పట్టలేని ఆనందం మన్మథరావులో. ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలని ఇంకా పదిలపరచుకుంటుందనిగాని, వాటిని గుర్తుచేసుకుంటూ ఈ మాత్రమైనా రెస్పాన్స్ ఇస్తుందనిగాని వూహించి వుండకపోవటంతో అమాంతం నానీని పైకిలేపి ముద్దు పెట్టుకున్నాడు.
వాచీ చూసుకున్నాడు. పదింపావు కావస్తూంది.
అంటే...
రాతిని కలుసుకోవడానికి కేవలం నలభై అయిదునిముషాల గడువు మాత్రమే వుంది.
'డియర్ మనూ' అంటూ రతి సంబోధించిన పద్ధతికి అతడి మనసు ఒక దివ్య హర్మ్యంలో విహరిస్తున్న అనుభూతికి లోనయింది.
ఒక సమస్యనిచ్చి మళ్ళీ ఆకతాయితనాన్ని ప్రదర్శించింది.
మరోసారి ఉత్తరాన్ని చదువుకున్నాడు.
తను వ్యక్తం చేసినంత ఊపు లేదుగాని ఏదో లాలిత్యం వుంది.
'అప్రశిఖ'
ముందెందుకో దానికి అర్థం వెదకడం అంత కష్టంగా తోచలేదు.
కాకపోతే ఆఖరి వాక్యమే కొద్దిగా చివుక్కుమనిపించింది.
'తెలుసుకోకపోతే రానక్కర్లేదు!'
ఇలాగే సరిగ్గా ఇదేరీతిలో తనకు ఆంక్షలు పెట్టేది బాల్యంలో. అసలు తను ఏ మాత్రం ఎదిగాడూ అంటే ఆమె అందించిన ఇలాంటి స్పూర్తితోనే కదూ!
వేగంగా శబ్దార్థచంద్రికని అందుకుని చూశాడు. అసలా పదమే లేదు. శబ్దరత్నాకరం మొదలుకొని వున్న నిఘంటువులన్నీ తిరగేశాడు. ఫలితం లేకపోవడంతో క్రమంగా టెన్షన్ ఉధృతమైపోయింది.
ఆస్తి అంతస్తుల్లో పోటీ పడలేకపోయినా కనీసం ప్రేమకోసం వున్న గడువులో ఇదన్నా సాధించాలి.
నానీ చూస్తున్నాడు తదేకంగా.
ఎందుకలా ఇక ఆపుకోలేకపోయిన నానీ "ఏంటంకుల్ వెదుకుతున్నావు?" అన్నాడు.
"బ్రతికించే మందు" గొణిగాడు ఆ పదాన్ని మననం చేసుకుంటూనే.
అవును. ఇన్ని నెలల తరువాత కలుసుకోబోతున్న తన ప్రియనేస్తం ప్రేమను శాశ్వతంగా బ్రతికించుకోవడానికిగాని చావుబ్రతుకుల మధ్య వూగిసలాడుతున్న అమ్మకి కొద్దిపాటి వూరటతో కొన్నాళ్లయినా బ్రతికించుకోవటానికిగాని మందదే...
అప్పటికే పదిహేను నిముషాలు గడిచిపోయాయి.
రతి ఎలాంటి మొండిఘటమో కూడా తెలిసిన మన్మథరావు ఉరి తప్పించుకోటానికి అతి ముఖ్యమైన చివరి సాక్షికోసం ఎదురుచూస్తున్నట్లు కంపించిపోతూ ఏదో గుర్తుకురాగా వేగంగా బయటికి నడిచాడు.
ఆ వూరి స్కూల్లో పనిచేసే తెలుగు పండిట్ ని కలుసుకుని అర్థమడిగాడు.
అతనూ తెలీదనగానే తొట్రుపడ్డాడు.
ఇంతకుమించి ఈ స్వప్నవ్యవధిలోనే జవాబు తెలుసుకునే అవకాశం లేదు.