Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 30


    బృహస్పతికి అతడు చెప్పబోయేది కొద్దికొద్దిగా అర్ధమవుతోంది. అయినా అనుమానం తీరక "ఇదంతా నీకెలా తెలిసింది?" అని అడిగాడు.

    "తన భర్త పునర్జన్మ గురించి తెలియగానే రత్నాబాయి మైమరచి పోయింది. ఊరు ఊరంతా ఈ విషయం చాటింది. నిధి ప్లాన్, డైరీలు, ఫోటోలు ట్రంక్ పెట్టెలో వేసుకుని నీ దగ్గరికి బయలుదేరింది. రత్నాబాయి నీ దగ్గరికి వచ్చిన విషయం నువ్వు కాదనలేవుగా? దానికి ఆవిడ శవమే సాక్ష్యం."

    బృహస్పతి మాట్లాడలేదు.

    "మా మనిషి నీ మీద కాల్పులు జరిపినప్పుడు, అక్కడి స్త్రీ శవం రత్నాబాయిది అని తెలియగానే నాకెందుకో అనుమానం వచ్చింది. ఆమె బయలుదేరిన చోట ఎంక్వయిరీ చేసాను. ఆమె అన్ని ఆధారాలతోనూ బయలుదేరిన విషయం పల్లెలో వాళ్ళు చెప్పారు. బృహస్పతీ! ఇది మా జీవన్మరణ సమస్య! ఆ నిధి ప్లాన్, డైరీలూ మాకు అప్పగించు. లేకపోతే నీ జీవనం, మరణంగా పరిణమిస్తుంది" అన్నాడు.

    "మీరు అడిగేవి ఏదీ నా దగ్గర లేవు. ఆ ట్రంక్ పెట్టెని నేను ముట్టుకోలేదు."

    "అదికూడా నేను ఎంక్వయిరీ చేసాను. ట్రంక్ పెట్టె ఖాళీగా వుంది" అన్నాడు సంకల్పనాథ్.

    "దానికి నేనేం చేయగలను?" అన్నాడు బృహస్పతి.

    "నీ గుండె లోతుల్లోంచి ఆ రహస్యాన్ని ఎలా బయటికి తియ్యాలో నాకు బాగా తెలుసు. టైమెంతయింది రాంభరత్?"

    "అయిదవడానికి ఒక నిముషం ఉంది."

    "టీ.వి. ఆన్ చెయ్!"

    రాంభరత్ టీ.వి. ఆన్ చేశాడు.

    "ఇప్పుడు మీరు 'ది రేప్' అనే నాటకాన్ని చూడబోతున్నారు" అనౌన్స్ మెంట్ వినబడింది.

    నాటకం ప్రారంభం కాబోతుండగా సంకల్పనాథ్ రే కంఠం దాన్ని డామినేట్ చేసింది. "నగరానికి పదిహేను కిలోమీటర్ల అవతల ఒక ధాబాని పెట్టావు మిస్టర్ బృహస్పతీ! ఈ రోజే ప్రారంభోత్సవం కూడా చేశావు. దాన్నొక పడగ్గదిగా మేము మార్చాం. స్టూడియోలో సెట్ వేసినట్టు బల్లలు దగ్గరగా జరిపాం. నీ చెల్లెలు ఒక తిఏ.వి. ఆర్టిస్ట్. ఆమె అభినయాన్ని మొత్తం ఆంధ్రదేశం అంతా చూడబోతోంది. పోతే అది అభినయం కాదు నిజమైన హింస....చిత్రహింస!"

    బృహస్పతికి అర్ధమైంది. "నో ...." అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు.

    సంకల్పనాథ్ రే బిగ్గరగా నవ్వాడు. "చరిత్రలో ఎవరూకనీ వినీ ఎరుగని అపురూపమైన సంఘటన బృహస్పతీ! నీ చెల్లెలు ఎలా రేప్ కాబడుతోందో కళ్ళారా చూడు. అంతేకాదు ఆంధ్ర దేశంలోని జనం అంతా దీన్ని చూస్తున్నారు. కానీ వాళ్ళు అది నాటకం అనుకుంటున్నారు. నిజంగా జరుగుతున్నది ఏమిటో నీ ఒక్కడికే తెలుసు. పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న నువ్వు ఈ దారుణాన్ని ఆపలేవు."

    బృహస్పతికి పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తోంది. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. "....నాకు తెలీదు.... ఆ డైరీల సంగతీ, నిధి సంగతీ నాకేమీ తెలీదు. దయచేసి నన్ను వదిలి పెట్టండి. నేను ఆడిన చిన్న అబద్ధాలకి నా చెల్లెలి జీవితాన్ని బలి చేయకండి. దాన్ని ఆపండి!"

    "దాన్ని ఆపుచేయడం చాలా సులభం బృహస్పతీ! వైర్ లెస్ లో నేనొక్కమాట చెపితే ఆ నాటకంలో మరో ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ రావాలా, యధాతథంగా కొనసాగాలా అన్నది నిర్ణయించవలసింది నువ్వే! సీన్ మారాలంటే నువ్వు సీక్రెట్లు చెప్పాలి."  

    టీ.వీ. లో హిమసమీర ఆర్తనాదాలు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయి. బృహస్పతి మోకాళ్ళ మీద కూలిపోయి, చేతుల్లో మొహం దాచుకుని రోదిస్తున్నాడు.

    పెద్ద శబ్దంతోఒక్కసారిగా టీ.వీ.లో వివిధ వాయిద్యాల సమ్మేళనం వినబడగానే బృహస్పతి అప్రయత్నంగా తలెత్తి చూశాడు. ఆ స్థితిలో కూడా స్క్రీన్ మీద ప్రత్యక్షం అయిన వ్యక్తిని చూసి, అతడు అప్రతిభుడయ్యాడు.

    ఆ వ్యక్తి హిమసమీర వలువలు వలుస్తున్నాడు. నాలుగు కెమేరాలు ఒకేసారి ఆ దృశ్యాన్ని షూట్ చేస్తుండగా ఆన్ లైన్ పద్ధతిలో ఒక్కొక్క దృశ్యం డిజాల్వ్ అవుతున్నాయి.

    ఆ వ్యక్తే తనపై హత్యాప్రయత్నం చేసినది!

    "అతడి పేరు దావూద్ హర్షద్. కేవలం నీ చెల్లెల్ని రేప్ చేయించడం కోసం ఢిల్లీ నుంచి పిలిపించాను. మనం ఏం చేసినా పెద్ద లెవెల్ లో చెయ్యాలి కదూ!" సంకల్పనాథ్ నవ్వాడు.

    బృహస్పతి కేవలం మొదటి మాట మాత్రమే విన్నాడు. దావూద్ హర్షద్ పేరు వినగానే అతడి వెన్ను జలదరించింది. అప్పటివరకూ అతడు దావూద్ చేసిన ఎన్నో ఘాతుకాలు కథలు కథలుగా చదివాడు. తనమీద హత్యాప్రయత్నం చేసింది భారతదేశపు నంబర్ వన్ మాఫియా లీడర్ అన్న విషయాన్ని అతడు జీర్ణించుకునే సమయం ఇవ్వకుండానే, హిమసమీర ఆఖరి ఆర్తనాదం అతడి కర్ణపుటాలకి సోకింది.

    "వెళ్ళు బృహస్పతీ! సమయం సరిగ్గా ఆరు అవడానికి ఐదు నిమిషాలు వుంది. అయిదు నిముషాల్లో అక్కడికి నువ్వు చేరుకోగలిగితే, చెల్లెల్ని రక్షించుకున్న హీరోవి అవుతావు. అదికూడా టెలికాస్ట్ చేస్తాం. ఆరయితే మాత్రం నాటకమూ, నీ చెల్లెలి శీలమూ" అని మళ్ళీ నవ్వి "పరిసమాప్తమవుతాయి అన్న పదం బావుంటుందా?" అన్నాడు.

    బృహస్పతి అతడి మాటలు పూర్తయ్యేవరకూ అక్కడ లేడు. గాలిలా బయటకు దూసుకుపోయాడు.

    పిచ్చివాడిలా రోడ్డుమీద పరుగెడుతున్న అతడిని చూసి జనం విస్తుపోయారు. అతడు దేనినీ పట్టించుకునే స్థితిలో లేడు. ఎంత వేగంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి అరగంట పట్టింది. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి థాంక్స్ చెప్పాలన్న స్పృహకూడా లేకుండా లోపలికి పరుగెత్తిన బృహస్పతి అక్కడ దృశ్యాన్ని చూసి శరాఘాతం తగిలిన వాడిలా కుప్పకూలిపోయాడు.

    పాకమధ్యలో హిమసమీర శరీరం దూలానికి వేలాడుతోంది.


                        18


    "బృహస్పతీ! జరిగినదేదో జరిగింది. అనవసరంగా దీని గురించి నువ్వు మనసు పాడుచేసుకోకు. మన అదృష్టం బావుంటే హిమసమీర బతుకుతుంది. మనకది చాలు!" ఓదారుస్తున్నాడు శ్రీహర్ష.

    "అది చాలా? ఎంత తేలిగ్గా చెప్పావురా! అదృష్టం బావుంటే హిమసమీర బతుకుతుందా? అది అదృష్టం కాదురా, దురదృష్టం!! రాష్ట్రంలో సగంమంది జనం నా చెల్లెలు శీలాన్నెలా కోల్పోయిందో ప్రత్యక్షంగా చూశారు. ఇక ఏ మొహం పెట్టుకుని అది బతుకుతుంది?"

    "అది నాటకం అనుకుంటారు ప్రేక్షకులు" అన్నాడు పక్కనున్న రావు. "....జరిగిందేదో మనం బయటికి చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది?"

    హాస్పిటల్ ముందు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. రావు మాటలకి బృహస్పతి విసురుగా తలెత్తి "తెలీదా? ఎందుకు తెలీదూ?" అని శ్రీహర్షని చూపిస్తూ "....ఈ జర్నలిస్టులు వూరుకుంటారా? సమీర ఆత్మహత్యా ప్రయత్నం గురించి చిలవలు పలవలు చేసి రాయరా?" అని కోపమూ, బాధామిళితమైన స్వరంతో అన్నాడు.

    అతడి మాటల్లో వాస్తవం వున్నట్లు శ్రీహర్ష సమాధానం చెప్పలేదు. ఈ పాటికే ఈ వార్త పత్రికా ప్రపంచంలోకి పాకి పోయి వుంటుందని అతడికి తెలుసు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడమే బృహస్పతి అనాలోచితంగా చేసిన తప్పు!

    అయితే శ్రీహర్ష ఆలోచిస్తున్నది ఈ విషయం గురించి కాదు. తర్వాత జరగవలసిన దాన్ని గురించి! జరిగినదంతా తల్చుకుంటే అతడి రక్తం సలసలా మరుగుతోంది.

    అప్పటివరకూ మౌనంగా వున్న బ్రహ్మానందం కల్పించుకుంటూ "మీరంతా ఈ విషయంపై ఎందుకంత తర్కిస్తున్నారో నాకు అర్ధంకావడంలేదు. ఆంధ్రదేశంలో సగంమంది చూసింది కేవలం నాటకాన్ని. అది వాస్తమని మనకితప్ప ఎవరికీ తెలీదు."

    "ఇప్పుడు తెలీదు. కాని నేను ఆ డైరీలూ, ఫోటోలూ ఇవ్వకపోతే ఈ వాస్తవాన్ని బయట పెడతానని సంకల్పనాథ్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. రేపు ఈ పాటికి నేను వాటిని అందజెయ్యకపోతే అతడు ఈ విషయాన్ని ఏదో విధంగా పేపర్లలో వచ్చేలా చేస్తానన్నాడు" తలవంచుకుని దీనంగా చెప్పాడు బృహస్పతి.

    వింటున్న శ్రోతలు ముగ్గురూ అచేతనులయ్యారు.

    బృహస్పతి కొనసాగించాడు- "నేను ఆడిన ఒక చిన్న నాటకంవల్ల నా చెల్లెలి జీవితం ఇలా నాశనం అయిపోయిందన్న విషయం తల్చుకుంటేనే, నేనింకా ఎందుకు బతికున్నానా అనిపిస్తోందిరా!"

    శ్రీహర్ష, బృహస్పతి భుజంమీద ఓదారుస్తున్నట్టు అనునయంగా చేయివేశాడు. స్నేహితుడి చేతిని మొహంమీద కప్పుకుని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ "అది చాలా అమాయకపుపిల్లరా! నీకు తెలీదు నా చెల్లెల్ని నేనెంత ప్రేమించానో..." అతడి మాటలు పూర్తవుతుండగా డాక్టరు లోపలినుంచి వచ్చాడు.

    "మిస్టర్ బృహస్పతీ! మీకు గుడ్ న్యూస్. మీ చెల్లెలు ప్రాణాపాయ స్థితినుంచి బయటపడింది. అదృష్టవశాత్తూ మెడ ఎముక విరగలేదు. అందుకే ఆ స్థితిలో పది నిముషాలున్నా ప్రాణం పోలేదు."

    స్నేహితులందరి మొహాలు కాస్త విచ్చుకున్నాయి. అంతలోనే బాంబ్ షెల్ లా డాక్టరు చెప్పాడు. "అయితే- కంఠం నాళాల మీద ఒత్తిడి కారణంగా ఆమె శాశ్వతంగా తన స్వరాన్ని కోల్పోయింది."

    అక్కడ నిశ్శబ్దం వ్యాపించింది."

    ఒక బలమైన దేశం తనకున్న మారణాయుధంతో మరో దేశం మీద దండెత్తి తన పవర్ నిరూపించుకోవాలని అనుకున్నప్పుడు బలయ్యేది ఆ చిన్న దేశంలోని ప్రజలే! దానికి ఉదాహరణగా చరిత్ర 'హిరోషిమా'నే ప్రపంచానికి రుజువుగా నిలిపింది. హిరోషిమా మీద అణుబాంబు పడ్డ తర్వాత కూడా బహుశా ఇటువంటి నిశ్శబ్దమే ఆ శ్మశానం మీద విషాదగీతం ఆలపించి ఉంటుంది.


                                          *    *    *


    హిమసమీర ఇంటికి తీసుకు వచ్చాక, ఆ సాయంత్రం శ్రీహర్ష బృహస్పతిని కలుసుకున్నాడు.

    "నేను చాలాసేపు నువ్వు చెప్పిన విషయమే ఆలోచించానురా! మనమే దావూద్ మీద స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే ఎలా వుంటుంది?"

    బృహస్పతి అయోమయంగా అతడి వేపు చూసి "ఏమిటి నువ్వు చెపుతున్నది?" అన్నాడు.

 Previous Page Next Page