"ఆ మార్గమేదో చూపి పుణ్యంకట్టుకోరా! నా కూతురుకోసం నేను ఏ పనైనా చేస్తాను"
"ముందు నువ్వు ఈ ఊరు వదులు."
"వదులుతాను!"
"పట్నం పద. ఏదైనా ఉద్యోగం చూసిపెడతాను. ఉద్యోగం దొరక్కపోయినా ఫర్వాలేదు. నలుగురు పిల్లల్ని ప్రోగు చేస్తాను. ట్యూషన్స్ చెప్పు!"
నిరుత్సాహపడిపోయాడు కృష్ణారావు "ట్యూషన్సా? చదివిందంతా మరచిపోయానురా! వాళ్ళకు చదువేం చెబుతాను?"
"కొత్తగా నేర్చుకోవాలంటే టైం పడుతుందిగాని, మరిచిపోయింది గుర్తుచేస్కోవడానికి పెద్ద శత్రువుండదు. నువ్వారోజుల్లో ఇక్కడి సెంటర్ కంతా స్కూల్ ఫైనల్ ఫస్టుగా వచ్చిన వాడివని మరిచిపోయావా?"
కోల్పోయిన ఆత్మ విశ్వాసం, ధైర్యం కృష్ణారావు ముఖంలోకి వచ్చాయి. అతడి కళ్ళు కృతజ్ఞతతో, ఉత్సాహంతో మెరిశాయి "నువ్వు.......నువ్వు అయిదు సంవత్సరాలముందు వచ్చివుంటే నేను ఇన్ని కష్టాలు పడేవాడిని కాదురా!" స్నేహితుడి చెయ్యి అందుకొని నొక్కాడు.
ఆ తరువాత వారంరోజులకు రంగనాధం తిరిగివచ్చి తండ్రీ కూతుళ్ళను వెంటబెట్టుకు బయల్దేరాడు.
3
కోమలమ్మ కాంపౌండ్ లో ఒక పోర్షన్ లో తన కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు రంగనాధం. తన స్నేహితుడికి ఏందారి చూపగలనా అని తల బ్రద్దలుకొట్టుకుంటున్న సమయంలో ప్రక్క పోర్షన్ కాళీగా కనిపించింది. వెంటనే అతడు ఆగదికి అడ్వాన్స్ ఇచ్చేసి, ఆ వీధిలోనే నాలుగైదు ఇళ్లు తిరిగి నలుగురు పిల్లల్ని సంపాదించి వెళ్లి కృష్ణారావుని, ఆయన కూతుర్నీ తీసుకు వచ్చాడు.
ఆ విధంగా కృష్ణారావు వీధిబడి ప్రారంభమైంది.
కోమలమ్మ కాంపౌండ్ లో చిన్న గేటుకు అటు ఇటుగా మొత్తం పది పోర్షన్ లు ఉన్నాయి. ఈ అయిదు పోర్షన్ లకు కలిపి పొడువుగా వరండా ఉంటుంది. ఆ వరండాలోనే కృష్ణారావు వీధి బడి నడుస్తోంది.
ఒకరోజున ఇంటి ఆమె కోమలమ్మతో పరిచయం చేసుకోడానికని కూతుర్ని చంకలో వేసుకొని ఆమె మేడ వైపు బయలు దేరాడు కృష్ణారావు.
ఈ కాంపౌండులోనే అద్దె ఇళ్ళకు దూరంగా చిన్నగా, అందంగా రెండంతస్తుల మేడ ఉంటుంది. అదే కోమలమ్మ బిల్డింగ్. ఆమెకు భర్తలేడు. ఓ పదేళ్ల కొడుకు మాత్రం ఉన్నాడు. ఆవిడ భర్తపోయిన రోజుల్లో ఓ వూరి కొంపలో పిడక లమ్ముకొనేదని, కడుపు కట్టుకుని గట్టి చేసిన డబ్బుతో గేదెలుకొని, పాల వ్యాపారం చేసి పెద్దదైందని అంటారు. ఇప్పుడు ఆమెకు ఓ పెద్దడైరీ ఫారమ్ ఓ ఏభై రిక్షాలు ఉన్నాయి. ఆవిడలో వ్యక్తమయ్యే ఠీవి, హుందాతనంచూస్తే ఒకప్పుడామె పిడక లమ్ముకొనేదంటే ఎవరూ నమ్మరు! ఓ కుర్చీలో తన స్థూలకాయం చేరవేసి వ్యవహారాలు నడుపుతూ ఆజ్ఞలు జారీచేస్తూ ఉంటుంది. ఆమె చేతిక్రింద అయిదారుగురు నౌకర్లు ఉన్నారు.
కృష్ణారావు కూతుర్ని క్రిందికి దించి వినయంగా నమస్కరించాడు. తనను పరిచయం చేసుకొన్నాడు.
కోమలమ్మ హుందాగా తల పంకించి, "మీ కూతురా ఈ అమ్మాయి? పేరేమిటి' అని అడిగింది.
"పారు......పారిజాత కుమారి."
"ఎంత చక్కనిపేరు! ఎంత అందమైన అమ్మాయి! పాపం, తల్లి చాలా చిన్నప్పుడే చనిపోయిందా?"
"ఏడాది పిల్ల ఉండగా పోయింది.....ఉన్న ఊరు అచ్చిరాక ఇలా పరదేశం వచ్చాను! మీ అందరి కృపాకటాక్షం లేకపోతే తల్లిలేని నా కూతుర్ని పెంచుకోలేను!"
హుందాగా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంది కోమలమ్మ.
వెనుకనుండి ఓ పదేళ్ళ కుర్రవాడు పారిజాత జడ పట్టి లాగి తల్లి దగ్గరికి పరిగెత్తుకువచ్చాడు. ఆ పిల్ల ఏడుపు లంకించుకొంది.
"ఏమిట్రా ఇప్పుడు నువ్వు చేసిన పని? వెధవా చూడు, ఆ పిల్ల ఎలా బెదిరిపోయి ఏడుస్తూందో? ఊరుకో, పాపా! ఏడవకు వీడు నా కొడుకండీ! ఉత్తకొంటెవాడు. ఉన్నది వీడొక్కడు కదాని గారాబం చేశాను. చెడిపోయాడు."
కృష్ణారావు కూతుర్ని చంకనెత్తుకుని "బాబు చాలా బాగున్నాడండీ! కొంటెతనం పిల్లలకు సహజమే. అది చెడి పోయిన దానికి గుర్తుకాదు. రేపటినుండి బాబును నా దగ్గర చదవడానికి పంపిస్తారా?" అని అడిగాడు.
"నిక్షేపంగా! కాని. ఉత్త అల్లరి పిల్లవాడు ఎలా దారికి తెస్తారో మిఇష్టం"