2
ఒక్కొక్క బస్సు వచ్చి బస్ స్టాప్ దగ్గర ఆగకుండా ఒక ఫర్లాంగు దూరం ముందుకుపోయి ఆగి, దిగవలసిన వాళ్ళని దింపేసి, ఎక్కవలసిన వాళ్ళు ఎక్కకుండానే పారిపోతుంది. ఇదివరలో అయితే బస్ అలా కొంచెం ముందుకు పోయి ఆగినా రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్నట్లు పరుగెట్టి పోయి, ఆ బస్ ఎలాగో అందుకుని, పద్మవ్యూహాన్ని ఛేదించుకొంటున్నట్లుగా బస్ లో ప్రవేశించి అతికష్టం మీద బస్ రాడ్ పట్టుకొని గుంపు మధ్య ఉక్కిరి బిక్కిరై పోతూ నిలబడి ఇంటికి చేరుకునేది. ఇప్పుడలా చెయ్యలేదు. ఎలాగో పరుగుపెట్ట గలిగినా ఈ చేత్తో ఆ గుంపు మధ్య జొరబడలేదు, రాడ్ పట్టుకుని నిలబడనూ లేదు. గడియారపు ముళ్ళు తిరిగిపోతున్న కొద్దీ తులసికి దిగులు ఎక్కువకాసాగింది. తన ఇల్లు చాలా దూరం. అద్దె తక్కువకు దొరుకుతుందని ఎక్కడో మారుమూల అద్దెకు తీసుకున్నారు. అంతదూరం ఆటోకి ఆరురూపాయలకి తక్కువకాదు. అంతేకాదు_ ఆ మారుమూల ప్రదేశానికి ఆటోవాడు అసలు రానంటాడు. వచ్చినా మీటర్ చార్జి పుచ్చుకోడు. పైన ఇంకా ఇవ్వాలంటాడు. తన పర్స్ లో మొత్తం ఉన్నదంతా పదిరూపాయలు. దానితోనే ఈనెలంతా గడవాలి. పై నెలలు ఎలా గడుస్తాయో, అది తరువాత మాట! ఎన్నెన్ని కార్లో! ఎంత దర్జాగా ప్రయాణం చేస్తున్నారు, ఆ కార్లల్లో మనుషులు! ఏ ఒక్క కారయినా కాస్త తనను ఎక్కించుకొని ఇంటిముందు దింపెయ్యకూడదూ?
తులసి ముందు కారాగింది. తులసి ఉలికిపడి ఆశ్చర్యంగా చూసింది. కారు దిగకుండానే కిటికీలోంచి తల బయటపెట్టి "హలో తులసీ! ఇంకా ఇక్కడున్నారేం? ఇప్పటివరకూ ఆఫీస్ లో పనిచేస్తున్నారా?" అని అడిగాడు కృష్ణారావు.
కృష్ణారావును చూడగానే తులసి కనుబొమలు అప్రయత్నంగా ముడిపడ్డాయి. కృష్ణారావు అది గమనించి "సారీ! మీకు ఇబ్బంది కలిగిస్తున్నానా? వెళ్తాను" అన్నాడు.
తులసి తడబడుతూ "నో! నో! అదేం లేదు. ఇంతవరకూ బస్ దొరక్క చచ్చినట్టు ఇక్కడ నిలబడ్డాను. ఇప్పుడు నేను ఆఫీసులో పనిచెయ్యటంలేదని నిజంగా మీకు తెలియదా?" అంది.
"తెలుసనుకోండి. కానీ, ఇప్పటివరకూ ఇక్కడ ఇలా నిలబడి వుంటే...."
"ఏం చెయ్యను? కొంచెం ఖాళీగా ఏ బస్ అయినా బస్ స్టాప్ దగ్గిర ఆగేసరికి ఏ రాత్రి అవుతుందో?"
"మీకు అభ్యంతరం లేకపోతే, నేను మీ యింటిదగ్గిర డ్రాప్ చేస్తాను."
తులసి ఒక్కక్షణమే సందేహించింది. అంతకంటే ఎక్కువగా ఆలోచించటానికి అప్పట్లో తులసికి ఏ మాత్రమూ ఓపికలేదు. గంటన్నర నుంచీ నిలబడి, నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. మానసికంగా ఆందోళన_ శారీరకంగా అలసట. తులసిలో ఏ శక్తులూ పనిచెయ్యటంలేదు. "థేంక్స్!" అంటూ కారు దగ్గరకు వచ్చింది. కృష్ణారావు వెనక తలుపు తెరిచాడు. అతడు ముందు తలుపు తెరిచి తన పక్కన కూచోమని ఆహ్వానిస్తాడనుకొన్న తులసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం చూసి కృష్ణారావు అల్లరిగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూడగానే తులసి గతుక్కుమని పైటకొంగు వంటినిండా కప్పుకుని, తలదించుకుని వెనక సీట్లో వచ్చి కూర్చుంది. ముందునుంచి వెనక్కు వంగి చెయ్యిచాపి డోర్ గట్టిగా వేసాడు కృష్ణారావు.
కారు స్టార్ట్ చేసి వెనక్కు చూడకుండానే "ఎలా వుంది మీ చెయ్యి?" అని అడిగాడు.
ఎందుకో కృష్ణారావు తనతో సానుభూతి చూపిస్తూ మాట్లాడటం చాలా కష్టంగా వుంది తులసికి.
"పరవాలేదు. ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే నయం కావచ్చు."
"అశ్రద్ధ చేయకుండా తొందరగా నయం చేసుకోండి. ఈ సెక్షన్ లో కాకపోతే మరొక సెక్షన్ లో వేసుకుంటాడు. మిమ్మల్ని సూర్యం..."
సూర్యం ప్రస్తావన రాగానే మనసు మరింత కలత పడింది తులసికి. ప్రస్తుతం సూర్యనే తనను ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆ సంగతి కృష్ణారావుకీ తెలుసు.
"మీకు అభ్యంతరం లేకపోతే ముందుగా రిట్జ్ హోటల్ కు వెళ్దాం" వెనక్కు తిరిగి చూడకుండానే అన్నాడు కృష్ణారావు.
"రిట్జ్ హోటల్ కా?" గొంతు తడారిపోతుండగా భయంగా అంది తులసి.
వెనక్కు తిరిగి తులసి ముఖంలోకి చూసి వెనుకటిలాగే అల్లరిగా నవ్వాడు కృష్ణారావు.
"అక్కడ నా ఫ్రెండ్ నాకోసం వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశాడు. అతణ్ణి కూడా కారులో ఎక్కించుకుని, యెక్కడ దింపమంటాడో అక్కడ దింపేసి, మిమల్ని మీ ఇంటి దగ్గిర దింపేస్తాను."